ఒకరిపై ఒకరు ఫేక్ రికార్డింగ్స్… దొందూ దొందే!!

April 11, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

ముఖ్యమంత్రి చంద్రబాబు భయపెట్టినట్లు అల్లర్లు ఏమీ జరగకపోవడం ఒకింత ఊరట. అయితే… అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా ఒకరిపై ఒకరు ‘‘ఫేక్ ఫోన్ కాల్’’ రికార్డుల్ని సృష్టించి బయటకు వదులుతూ ఓటర్లలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. నటుడు శివాజీ పది కోట్లు తీసుకున్నాడనీ, వైసీపీపై మొత్తం 8 రికార్డింగ్స్ తయారు చేసినట్లు వచ్చిన రికార్డింగ్ కూడా ఫేక్ అనే అనిపిస్తోంది. విజయసాయిరెడ్డి స్పీచ్ గా వచ్చినది కూడా ఫేక్ అయి ఉంటుంది. వైసీపీపైన ఇలా ఫేక్ రికార్డింగ్స్ సృష్టించినట్లు చెప్పడం ద్వారా టీడీపీని డిఫెన్స్ లోకి నెట్టేందుకు వైసీపీ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.వైసీపీగానీ, టీడీపీగానీ… ఇలాంటి కుయుక్తులూ, పన్నాగాలూ పన్నడంలో దిట్ట. రెండు పార్టీలకూ బలమైన మీడియా వ్యవస్థలూ, పత్రికలూ ఉండటంతోపాటు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. వైసీపీ ప్రతి నియోజక వర్గానికి రూ.10 కోట్లు ఖర్చుపెట్టినట్లు వైసీపీ నేతలతో దగ్గర సంబంధాలున్న వ్యక్తుల సంభాషణల ద్వారా తెలుస్తున్నది. 175 నియోజక వర్గాల అభ్యర్ధులకు వైసీపీ నుంచి నిధులు ఎప్పుడో తరలిపోయినట్లు సమాచారం. అలాగే టీడీపీ కూడా నియోజకవర్గానికి రూ.10 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. 175 నియోజక వర్గాలకు మొత్తం రూ.3,500 కోట్లుపైగానే ఖర్చు పెట్టి ఉంటారు.తెలుగు మీడియా అనేక సందర్భాల్లో ఎన్నికల్లో డబ్బులు వాడకం పెరిగిపోయిందనీ, ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయిందనీ నీతులు పదే పదే చెప్పే మీడియా సంస్థల కంటికి… సారా ప్యాకెట్లు పంచకుండా, ఓటర్లను డబ్బులతో కొనకుండా స్వచ్ఛమైన రాజకీయాలకు తొలి పునాది రాళ్లు అందించిన జనసేన పార్టీ మంచితనం వాళ్ల కంటికి కనిపించడం లేదు. డబ్బులు పంచుతున్న పార్టీల కంటే జనసేన లక్ష రెట్లు నయం అన్న మాట మీడియా నోట రాలేదు. ఎందుకుంటే… అంతా గూడుపుఠాణీ. మీడియాలో ఎన్నికల సంస్కరణల గురించి ‘‘ఈనాడు’’ దినపత్రిక అది ప్రారంభమైన రోజు నుంచీ రాస్తూనే ఉంది. కానీ జనసేన పార్టీ గురించి అది రాసింది లేదు.ఎన్నికల్లో డబ్బులు పంచుతూ, రాజకీయ సభలకు మద్యాన్ని పంచుతూ… ఎమ్మెల్యేలను డబ్బుకు కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన, నేటికీ చేస్తున్న పెట్టుబడిదారీ పార్టీలకే… మీడియా సంస్థలు కొమ్ముకాస్తున్నాయి. ఈ ఎన్నికల పుణ్యమా అని ఎంత డబ్బు చేసుకున్నామా అన్నదే తప్ప… సమాజంలో ఒక మార్పు కోసం వచ్చిన జనసేన గురించి రెండు మంచి మాటలు మీడియా సంస్థలు చెప్పలేకపోయాయి.పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న రెండు చోట్ల నుంచీ ఓడిపోతారని… ఆధిపత్య వర్గాలకు చెందిన వారు చెబుతున్నారు. దానినే ప్రచారంలో పెడుతున్నారు. కానీ జనసేన ప్రజల గుండెల్లో ఉందని, ప్రత్యర్ధుల గుండెల్లో గునపాలు దించుతుందని వారికి అర్థంకాలేదు. ఆ రెండు కుటుంబాల కాకుండా… వచ్చిన మూడో వ్యక్తిపై ఎంత చులకన భావం? ఎన్నో వందల సంవత్సరాలుగా దళితులు ఎదుర్కొన్న అంటరానితనం వంటిదే ఇపుడు కనిపిస్తోంది. ‘‘రాజకీయ అంటరానితనం’’. ఈ మాటకు అర్థం. గత ఆ రెండు కుటుంబాల నుంచి రాజకీయాలు రావడాన్ని మాత్రమే ఆధిపత్య వర్గాలు సమర్ధిస్తున్నాయి. మూడో వ్యక్తికి కులాన్ని అంటగడుతున్నారు. జరుగుతున్న దాష్టీకాన్ని పవన్ కళ్యాణ్ ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలు కొట్టారు. చంద్రబాబుకు కులం అంటదు… జగన్ రెడ్డికి కులం అంటదు.. కానీ మూడో వ్యక్తికి మాత్రం కులం వచ్చేస్తుంది. మూడో వ్యక్తి పెట్టిన పార్టీకి కూడా కులం వచ్చేస్తుంది. సాక్షాత్తూ ఒక పార్టీ అధ్యక్షుడు ఈ మాట చెప్పడం అంటే… అది సమాజానికే అవమానం. దీనికి ఆయన పేరు పెట్టలేదుగానీ… ‘‘న్యూస్ ఆఫ్ 9’’ ఈ వివక్షను ‘‘రాజకీయ అంటరానితనం’’గా భావిస్తోంది.నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మార్పు దిశగా ప్రజలు ఓటు వేస్తారని, మంచితనాన్ని గెలిపిస్తారని, కుట్రలూ, కుయుక్తులతో ఒకరిపై ఒకరు నీచంగా ఆరోపణలు చేసుకుంటున్న టీడీపీ, వైసీపీలను పక్కన పెడతారనీ, జనసేనను హృదయానికి హత్తుకుంటారని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ భావిస్తున్నది.ఇప్పటికైనా… తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలనీ, మార్పునకు ప్రజలు పట్టం కడతారని ఆశిద్దాం…!!

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *