పులీ మేక జూదం… ఇదో ‘‘తెలుగు’’బలి సినిమా!!

February 1, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

నరేంద్ర మోడీ- నారా చంద్రబాబు
పక్కింటి వాళ్లు కాదు..
బావాబామ్మరుదులు కాదు…
అన్నదమ్ములు అంతకంటే కాదు..
మరి వీళ్లిద్దరి మధ్యా ఏం జరిగింది?
తనను చూసి ఆయన ఓర్వలేకపోతున్నారనీ, అందుకే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. అలాగే ఆంధ్ర రాష్ట్రం అంటే జాతీయ పార్టీ భాజపాకి కోపం అని కూడా అన్నారు. ఒక దేశ ప్రధానికి ఒక చిన్న రాష్ట్రంపై కోపం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రధానినీ, ప్రధాని పదవిలో ఉన్న నరేంద్రమోడీనీ, 20కిపైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా నేతృత్వంలోని ఏన్డీఏనీ ఎందుకు తూర్పారపడుతున్నారు?
స్నేహం ఉందా అంటే ఇద్దరి మధ్యా స్నేహం కూడా లేదు. వీటన్నింటికీ మించిన కారణం ఇద్దరి మధ్యా ఏదో ఉండి ఉండాలి. లేదంటే ఇంత బాహాటంగా చంద్రబాబు ఎందుకు ఆక్రోశిస్తున్నారు? బిల్ క్లింటన్ అంత వాడిని మిస్టర్ అని సంబోధించినా… మోడీని సర్ సర్ సర్ అని అనేక మార్లు బతిమాలుకున్నానని అన్నారు. తనకంటే జూనియరే అయినా నరేంద్ర మోడీని తానెంతో గౌరవించానని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో స్వర తీవ్రతను పెంచి మరీ మాట్లాడారు. ఇంతలా మోడీ-బాబుల మధ్య ఘర్షణకు బలమైన కారణం ఏమై ఉంటుంది?

సాధారణ ప్రజానీకానికి తెలిసిన రాజకీయాలు ఒక మేరకే. పత్రికల్లో, టీవీల్లో బహిరంగంగా వచ్చిన విషయాల వరకే అవగాహన ఉంటుంది. నిజానికి ఒక వ్యక్తి సీఎం కావాలా లేదా, ఎన్నికల్లో ఎవరు గెలవాలి అన్న విషయాలను పార్టీ అధినేతలు ప్రకటించే సంక్షేమ వరాలు ప్రభావితం చెయ్యవు. తెర వెనుక, చీకటి మాటున ఉండి కనీసం ఎన్నికల్లో క్యూలో నిలబడి ఓట్లు కూడా వేయని చీకటి ప్రపంచం రారాజులు తీసుకునే నిర్ణయాలే అసలు సీఎంలను నిర్ణయిస్తాయి.
డీమానిటైజేషన్ నిర్ణయం ప్రధాని నరేంద్రమోడీనే తీసుకున్నాడని అందరూ అనుకుంటారు. కానీ ఆ నిర్ణయం తీసుకున్నది ఇద్దరు అంబానీ సోదరులు, అదానీ కంపెనీ సీఈవో, మోడీ, అమిత్ షా. ఈ నలుగురు అనుకున్న తర్వాతనే కరెన్సీ రద్దు నిర్ణయం జరిగింది. సీఎంలైనా, పీఎంలైనా దేశాన్ని పరోక్షంగా శాసించే వర్గాలు కొన్ని ఉంటాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాత మొదలైన కమ్మ సామాజిక వర్గం ఇంతై వటుడింతై అన్నట్లుగా కోట్లకు పడగలెత్తింది. ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం రాకతో… ఈ సామాజిక వర్గం అపరిమితమైన ఆస్తులతో.. రాజకీయాలను తన గుప్పిట పెట్టుకున్నది. జాతీయ స్థాయిలో నేడు ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు తోడ్పాటు దీని వెనుక ఎంతో ఉన్నది. అప్రతిహతంగా పెరిగిపోతున్న అవినీతి సొమ్ములతో కమ్మ సామాజిక వర్గం గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా వేలు పెట్టడాన్ని గుర్తించిన భాజపా ఒక్కసారిగా దిద్దిబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. వెంటనే సొంత పార్టీలో సీనియర్ నేత అయిన వెంకయ్య నాయుడును రాజకీయాల్లో చక్రం తిప్పకుండా ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టాడు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. అందుకు వెంకయ్య విముఖత వ్యక్తం చేసినా… పర్యవసనాలకు సిద్ధమవుతారా అన్నంత వరకూ వెళ్లడంతో వెంకయ్య తగ్గినట్లున్నారు. తెర వెనుక ఇంత పెద్ద ఘర్షణ జరిగింది. వెంకయ్యను ఉపరాష్ట్రపతిని చేయడంతోనే ఆంధ్రలో ఉన్న కమ్మ సామాజిక వర్గం కంగుతిన్నది. ఇదేమిటి ఇలా జరుగుతోందని ఆశ్చర్యపోయినా… తేరుకున్న జరుగుతున్నదేమిటో అర్థం చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వెదుకున్నారు. భాజపా అక్కడితో ఊరుకోకుండా బనియా రాజకీయాలు ఎంత బలంగా ఉంటాయన్నది చంద్రబాబుకు తద్వారా కమ్మ పారిశ్రామికవేత్తలకు రుచి చూపించింది.

ఒకవైపు తెలంగాణ నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని కోదాడ బయటకు గెంటివేశారన్న అక్కసు ఉండనే ఉంది. సరే, కొత్త రాజధాని నిర్మాణం వారికి కొత్త కలల్ని రేపింది. లక్షల కోట్ల వ్యయంతో నిర్మాణాలూ, పోలవరం ప్రాజక్టులూ, కాంట్రాక్టులూ… ఇవన్నీ బాంగారు బాతుగుడ్డులా కనిపించాయి. వీటిని తినడానికి సిద్దంగా ఉన్న దశలో భాజపా కొరడా తీసింది. సుజనా చౌదరి, 100కు పైగా కంపెనీలు ఉన్న నవయుగ విశ్వేశ్వరరావు, సీఎం రమేష్ వంటి వారిపై ఈడీని, ఐటీ అధికారాలను ప్రయోగించింది. ఒక్కసారిగా కమ్మ పారిశ్రామికవేత్తలకు చెమటలు పట్టించింది. ఇపుడు దేశంలో బనియాలదే రాజ్యం. వారిదే హవా. ఏ సీఎంలయినా… వారిని కాదని చేసేదేమీ లేదు. వెంకయ్యనాయుడు పుణ్యమా అని భాజపాతో అంటకాగిన భాజపా ఒక్క రాత్రిలో శత్రువు అయిపోయింది. ఇక భాజపాపై దుమ్మెత్తిపోయడం తప్ప చంద్రబాబు ముందు మరో మార్గం లేదు. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘ఉన్న ఒక్క వెంకయ్య నాయుడుని రాష్ట్రపతిని చేసేశారు… అంతా అక్కసు. ఏం మమ్మల్ని జైల్లో పెడతారా?’’ అంటూ చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక్కడాన్ని గుర్తు చేసుకోండి.

బయట ప్రజలకు ఇదంతా భాజపా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్లుగా చంద్రబాబు చెబుతారు. మా కమ్మవారిని పక్కన పెడుతున్నారు… ప్రాజక్టులు ఇవ్వడం లేదు అని చెప్పలేరు కదా. అందుకే ఆంధ్ర ప్రదేశ్ అంటే భాజపా ఓర్చుకోలేక పోతున్నదని అంటున్నారు. తాను ఆంధ్ర జాతి కోసం కష్టపడుతున్నానని, కాళ్లు పట్టుకోలేదుకానీ ఆ స్థాయిలో కష్టపడుతున్నానని చెప్పుకున్నారు. అంతర్గతం ఆయన కష్టపడుతున్నది తన సామాజిక వర్గం కోసమేనన్నది అందరికీ తెలియదు. ఇస్తానన్న లక్ష కోట్లు ఇచ్చేస్తే మా పనులు మేం చేసుకుంటాం కదా అన్నది చంద్రబాబు ఆక్రోశం. మేం ఏమైనా చేసుకుంటాం. నువ్వెవరివి అడగటానికి అన్నది కూడా ఆయన మాటల్లో ఉంది. ఇచ్చిన డబ్బులకు లెక్క చెప్పవయ్యా మగడా అంటే… ఫెడరల్ స్ఫూర్తి అంటారు. తెలుగు వారి ఆత్మగౌరవం అంటారు. డబ్బు ఇన్ని నాటకాలు ఆడిస్తుంది. కోడల్ని తిట్టాలనుకున్న అత్త డైరెక్టుగా తిట్టదు కదా. లోలోన కసి పెట్టుకుంటుంది. అంట్లు కడగమని అంటేనే మీ ఆవిడ ఏడ్చిందిరా అని కొడుక్కు చెబుతుంది. ఈ గొడవంతా ఈ బాపతు. లోలోన కక్షలు, కసి ఉంటాయి. నరేంద్ర మోడీగానీ, చంద్ర బాబుగానీ బయటపడరు.

లక్ష కోట్లు ఇచ్చేస్తే బనియాలకు ఏమైనా ఇబ్బందులు వస్తాయన్నది నరేంద్రమోడీ భయం. వీళ్లను తొక్కి పెట్టి ఉంచాలన్నదే ఆయన ఉద్దేశం. రేపు 2019లో ప్రభుత్వం మారిపోతే చక్కగా ఆ డబ్బులు ఇచ్చేస్తారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ సీఎం అయితే… లక్షకు ఇంకో లక్ష వేసి మోడీ ఇస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చుట్టూ కాంట్రాక్టర్ల వ్యవస్థ లేదు. ఎంత ఇచ్చినా… అది ప్రజలకు చేరుతుందన్న నమ్మకం. బాబుకు స్వప్రయోజనాలకు అందకుండా చేయడమే అసలు లక్ష్యం.

ఇపుడు చెప్పండి… ఆంధ్రకు కేంద్రం ఇవ్వాల్సిన మొత్తం డబ్బును ఇచ్చేసి ఉంటే… ఈ పాటికే పంపకాలు పూర్తయిపోయి ఉండేవి. ఆంధ్ర ప్రజలు తిట్టుకున్నా… తిట్టుకోకపోయినా భాజపాకి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం.. చంద్రబాబు.. ఆయన వెనుక ఉన్న పారిశ్రామికవేత్తలు. డబ్బు రాకపోవడానికి తానే లేదా తామే కారణం అయినా.. చంద్రబాబు పదే పదే నిందిస్తున్నది భాజపాని.

నరేంద్ర మోడీ కోస్తాంధ్ర కమ్మవారిని జీరో చేయడానికి ప్రయత్నించాడు కనుక.. చంద్రబాబు అండ్ కో వారికి ఉన్న అవకాశం ఒక్క కాంగ్రెసు మాత్రమే. 30 ఏళ్లుగా తిట్టుకున్నా… 10 జన్ పథ్ కు వెళ్లి మొక్కక తప్పలేదు. చివరికి సామాజిక వర్గం ప్రయోజనాల కోసం కాంగ్రెసు కౌగిలించుకోక తప్పలేదు చంద్రబాబుకు. ఇలా జరుగుతోందని ప్రధాన మీడియాలో ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఆ ఛానెళ్లకు కూడా నాలుగైదు బిస్కెట్లు అందకపోవు కదా. ఎవరి స్వలాభం వారిది అయింది. ఇక్కడ తెలుగు ప్రజల ప్రయోజనాలు ఎవరికీ పట్టడం లేదు. పట్టించుకుంటున్నది జనసేన ఒక్కటే.

100 మచ్చలున్న రాజకీయ పార్టీలను వదిలేసి… పాల లాంటి తెలుపుతో వచ్చిన జనసేనకు మచ్చలేమైనా ఉన్నాయోమోనని కొందరు స్థన శల్య పరీక్ష చేస్తున్నారు. పవన్ మీద కోపం ఏమంటే.. ఆయన ‘‘తినడు.. తిననివ్వడు’’ అన్నదే తెలుగుదేశం ఆక్రోశం. మాట్లాడితే ప్రజల కోసం అంటాడు అన్నది ఆయనపై అంతర్గత ఆరోపణ.

గుజరాత్ పారిశ్రామిక దిగ్గజం… అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రియమైన స్నేహితుడు. 1982లో ఎవరికీ తెలియని అదానీ 2019కల్లా దేశంలో టాప్ 10 అపర కుబేరుల్లో ఒకరు అయ్యారు. మొన్న లోకేష్ ఆయన్ను స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆహ్వానించారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడితో ఆయన విశాఖలో డేటా సెంటర్ పెట్టుకుంటున్నారు. చంద్రబాబు-నరేంద్రమోడీలు నేటికీ బద్ధ శత్రవులుగా ఇంకా కొనసాగుతున్నారా అన్నది అనుమానం. ఇద్దరికీ గౌతం అదానీ కాంప్రమైజ్ చేసి చేసి ఉండొచ్చు కూడా. అయితే ఇపుడు మాత్రం బాహ్య ప్రపంచానికి పాత శత్రవులుగానే నటిస్తున్నారు. లేదా కనిపిస్తున్నారు.

ఎన్నికలు దగ్గరపడిపోయాయి కాబట్టి.. బయటకు ఏదో ఒకటి తిట్టుకున్నా… ఈ పులీ మేక జూదంలో గెలుపు ఎవరిదో చూసుకున్న తర్వాత అంగీకారాలు-సర్దుబాట్లు ఉంటాయి. అప్పటి వరకూ మీరు కూడా టీవీల్లో, పత్రికల్లో వచ్చే, నేతలు చెప్పే ఆరోపణలు చూసుకుంటూ… ‘‘అంతేగా… అంతేగా’’ అంటూ చప్పట్లు కొడుతూ తెలుగు తమ్ముళ్లను ప్రోత్సహించండి.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *