2019: బాబు- 3 బాంబులు- 120 సీట్లు

December 23, 2018 | News Of 9

                         ముసుగులో మూడు డిజైన్లు

2019 Babu - 3 Bombs - 120 Seats

చంద్రబాబు నాయుడు తెలివితేటలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసుకోవడానికి ఈ నాలుగు మాటలు చాలు. చంద్రబాబును అపర చాణుక్యుడంటూ తెలుగు పత్రికలు కీర్తించేది ఈ కారణాలతోనే.

‘‘సమర్ధంగా పరిపాలించడంలోగానీ, అక్రమంగా డబ్బు సంపాదించడంలోగానీ, శత్రువుల గొంతు నులిమేయడంలోగానీ అన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు… దేశ రాజధానిలో ఉన్న నాయకులతో సరి సమాన స్థాయి ఆయనది. ఢిల్లీతో సంబంధం లేకుండా ఆయన తన పరిపాలనను నిర్వహించుకోగల సత్తా ఉంది. కొత్తగా నేర్చుకోవాల్సినవి ఈ కోస్తా ఆంధ్రా పాలకునికి ఏమీ లేవు. పరిపాలనగానీ, వాణిజ్యంగానీ, నేరాలు చేయడంగానీ దేని కోసం కూడా ఆయన, ఆయన వెనుక ఉన్నవారు ఢిల్లీ వెళ్లాల్సిన పని లేదు’’

– చంద్రబాబు గురించి ఒక వామపక్ష మేథావి చెప్పిన మాటలు.

 

 ఈ ధరిత్రిని తల్లకిందులు చేసైనా… 2019  ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని మళ్లీ తన ఉక్కు పిడికిలిలో ఉంచుకోవడం కోస్తాంధ్ర ధనిక వర్గ పాలకులకూ, వారి పార్టీ తెలుగుదేశానికీ, వారి ప్రతినిధి చంద్రబాబునాయుడుకి తప్పదు.

అధికారంలోకి రావడంపై చంద్రబాబు 100 శాతం ధీమాతో ఉన్నట్లు విశాఖలో జరిగిన సమావేశంలో ఆయన చెప్పిన మాటలు తేటతెల్లం చేస్తున్నాయి.తెదేపా నేత కేసినేని నాని 120 సీట్లు ఖాయమని భరోసాగా చెబుతున్నారు. తెలుగుదేశం నేతలకు ఆ ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?

ఆ గ్రాండ్ డిజైన్ పేరు ఇది: బాబు- 3 బాంబులు- 120 సీట్లు… ఈ ‘‘ముసుగు’’ రాజకీయాల ముసుగు తొలగిస్తే…? చదవండి ‘‘న్యూస్ ఆఫ్ 9’’ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం!!  

 అసలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను బయటకు కనిపించే అంశాలతో అర్థం చేసుకోవడం అసాధ్యం. చీకటి మాటున జరిగే ‘‘ముసుగు’’ రాజకీయాల గురించి తెలిస్తే.. రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ‘‘కుట్ర కుట్ర’’ అన్న పాట తలవంచుకుంటుంది.

బాబు- బాంబు- 1

చంద్రబాబానాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే మండిపోతుంది అన్నదే బాహ్య ప్రపంచానికి తెలిసింది. కానీ బాహ్య ప్రపంచానికి తెలియనిది ఏమంటే.. వాళ్లిద్దరూ ఒకరికొకరు తెర వెనుక సహకరించుకుంటారు. ప్రజల దృష్టిలో మాత్రమే వారు బద్ధ రాజకీయ శత్రువులుగా నటిస్తున్నారు. ఓటుకు నోటు కేసు ముందుకు వెళ్లకపోవడంతో దీనిపై చాలా మందికి అనుమానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరూ పగలను వదిలేసి సఖ్యతగా ఉన్నారన్న కథనాలూ వచ్చాయి. అయతే రూఢిగా బయటపడలేదు. అయితే… 2015 నాటి ఓటుకు నోటు కేసు పునర్విచారణ చేయాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశించడంతో మళ్లీ కేసు బయటకు వచ్చింది. చంద్రబాబును ఈ కేసు నుంచి బయటపడకుండా కేసీఆర్ చూస్తాడని రెండు రాష్ట్రాల్లో ఉన్న చంద్రబాబు వ్యతిరేకులు గట్టిగా ఆశించారు. ఇప్పటికీ ఆశిస్తున్నారు. అయితే వారి ఆశలు ఎప్పటికీ నెరవేరే అవకాశం అయితే లేదు. ఏసీబీ కేసులో కీలక పాత్ర పోషించిన అధికారి బి.శివధర్ రెడ్డి ని ఇంటిలిజన్స్ నుంచి బదలీ చేయడం వెనుక చంద్రబాబుకు మేలు చేసేందుకే అన్న వాదన ఉంది. తర్వాత వి.నవీన్ చంద్  అనే ప్రొమోటీ ఐపీఎస్ అధికారిని తేవడం కూడా అందుకేనన్న చెబుతారు. ఓటుకు నోటు కేసు తర్వాత ఇద్దరు సీఎంలు ఒకరి పీక మరొకరు కోసేసుకుంటారేమో అన్నంత యుద్ధం జరిగింది. ఆ సమయంలో జగన్ కేసీఆర్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. 2015 నాటికి ఓటుకు నోటు కేసు గురించి కేసీఆర్ మాట్లాడటం మానుకున్నారు. చంద్రబాబు దగ్గర వరకూ కేసు వచ్చేసరికి పూర్తిగా ఆగిపోయింది. చంద్రబాబు గొంతు కూడా ఫోరెన్సిక్ పరీక్షలో సరిపోలిందని అనధికారిక సమాచారం. అయినా కేసు అక్కడే ఆగిపోయింది. తర్వాత వచ్చిన ఇంటిలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్… చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. తర్వాత కాలంలో ఇద్దరూ శత్రుత్వాలను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వచ్చారు.. కేసీఆర్ చేసిన యాగానికి బాబు వచ్చారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. వీళ్లిద్దరూ కూడా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో… చంద్రబాబు సామాజిక వర్గం ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిని  కాపాడుకోవడం చంద్రబాబుకు అవసరం.  కేసీఆర్ వాటి జోలికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపైన ఉంది. ఒక పెద్ద వ్యాపారవేత్త వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు సమాచారం.

కేసీఆర్- చంద్రబాబుల మధ్య సఖ్యతకు మరో కారణం జగన్!

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సీఎం కాకుండా అడ్డుకోవాలన్నది కోస్తాంధ్ర కమ్మవారి లక్ష్యం. జగన్ ఆంధ్రాలో ముఖ్యమంత్రి కాకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా భావిస్తున్నారు. దీనికి కారణం.. ఒక వేళ జగన్ ఆంధ్రలో సీఎం అయితే.. తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం మరింత బలపడుతుంది. కేసీఆర్ కు సొంత సామాజిక వర్గం సంఖ్యాపరంగా చాలా తక్కువ కాబట్టి… కేసీఆర్ పోరాటం ఇక్కడున్న రెడ్డి సామాజిక వర్గంపైననే ఉంటుంది. అలా రెడ్డి సామాజిక వర్గాన్ని అధికారానికి దూరంగా ఉంచాలంటే అక్కడ చంద్రబాబు సీఎం కావడం కేసీఆర్ కు ఇబ్బందిలేని వ్యవహారం. చంద్రబాబు తోక ఆడించే ప్రశ్నే లేదు. చంద్రబాబు సామాజిక వర్గం ఆస్తులున్నాయి… పైగా ఓటుకు నోటు కేసు బూచిని ఇంకా కొన్నేళ్లు వాడుకునే వీలు ఎటూ ఉన్నది. శత్రవుకు శత్రువు మిత్రుడు కాబట్టి… కేసీఆర్, చంద్రబాబు అలా దగ్గరయ్యేందుకు ఒకరి అవసరాలు ఒకిరికి ముఖ్యమయ్యాయి. కేసీఆర్ భయపడినట్లుగానే… రెడ్డి సామాజిక వర్గం అధికారం కోసం రాష్ట్ర విభజన తర్వాత నుంచీ పూర్తి అసహనంతో ఎదురుచూస్తున్నది. కనీసం ఆంధ్రలో జగన్ సీఎం అయినా.. మళ్లీ ఒక వెలుగు వెలుగవచ్చిన తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్ పైన ఆశలు పెట్టుకున్న మాట వాస్తవం. తెలంగాణలో వైఎస్సార్సీపీ పోటీ చేసే యోచన లేనట్లుగా ఉన్నా.. రేపు ఏమవుతుందోనన్న భయం కేసీఆర్ కి ఉంది. ఒకవేళ ఆంధ్రాలో జగన్ సీఎం అయితే… ఖచ్ఛితంగా తెలంగాణలో వైఎస్సార్సీపీ బలమైన పార్టీగా అడుగుపెడుతుందనడంలో సందేహం లేదు. మొన్నటికి మొన్న తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. రెడ్డి సామాజిక వర్గానికి తగినన్ని సీట్లు ఇచ్చి, మంత్రి పదవులు ఇస్తే, కొంత వరకూ ఆ వర్గాన్ని సంతృప్తి పరచవచ్చు. తెలంగాణలో తెరాసను సవాలు చేయగల దమ్మూ, ధైర్యం, ఆర్థిక వెసులుబాటు ఉన్నది రెడ్డి సామాజిక వర్గానికే. అందువల్ల సుదీర్ఘకాలంలో చంద్రబాబు కంటే జగన్ నుంచే.. కేసీఆర్ కుగానీ, తెరాసాకు గానీ సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో తెలుగుదేశం.. ఉండటం ఎప్పుడూ కేసీఆర్ కు లాభమే. మొన్న తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు వచ్చి ప్రచారం చెయ్యడం వల్ల తెలంగాణ సెంటిమెంటు రగిలింది. మామూలుగా అయితే.. తెరాసకు 40 సీట్లు వస్తాయన్న అంచనాలు సరైనవే. వాస్తవం కూడా అలాగే ఉంది. తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అయితే మిగిలిన 48 సీట్లూ తెలంగాణ సెంటిమెంటుకు వల్ల సంపాదించినవే. చంద్రబాబును చూసి… కసికొద్దీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ బెటర్ అనుకున్నారు. సరిగ్గా తెరాస, తెదేపా ‘‘ముసుగు’’ వ్యూహం కూడా ఇదే. ప్రజల్ని తాము అనుకున్నట్లుగా మరల్చగలిగారు. కేసీఆర్ గండం తప్పడమే కాదు.. వెను తిరిగి చూడనంత మెజారిటీతో ప్రజలు గెలిపించారు. కేసీఆర్ కు ఇంత భారీ గెలుపును సాధించి పెట్టిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇవ్వకుండా కేసీఆర్ ఎందుకుంటారు? ఇస్తానని గెలిచిన వెంటనే చెప్పేశారు కూడా. దీనిని ప్రజలు అర్థం చేసుకున్నది వేరొకలా. చంద్రబాబును నష్టపరచడానికి కేసీఆర్ కూడా వెళతారు. తప్పేమిటి అని బాహ్య ప్రపంచం అనుకుంటుంది. అంత వరకూ ఓకే. కేసీఆర్ ఆంధ్రవెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఏమి అవుతుంది? ఆంధ్రా సెంటిమెంటు రగులుతుంది. యల్లో మీడియా ఇతోధికంగా దీనికి వేదికను అందిస్తుంది. ఆంధ్రా ప్రజలు పోలింగ్ దగ్గరకు వచ్చే సమయానికి ఊగిపోతారు. చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లు కూడా ఊగిపోతారు. సరిగ్గా తెలంగాణ ఎన్నికల్లో చేసిన ‘‘ముసుగు’’ ప్రయోగమే అక్కడా జరుగుతుంది. జనాలకు పూనకాలు వస్తాయి. తెలుగుదేశం అయితే బెటర్… అనుకుంటారు. తెలుగుదేశం పార్టీకి తర్వాత 2019 ఎన్నికల్లో 120 సీట్లు వస్తాయని చంద్రబాబు ప్రస్తుత అంచనా. పత్రికలు చదివి, టీవీలూ చూసి చంద్రబాబు పని అయిపోయిందని అనుకుంటున్నారు చాలా మంది. చంద్రబాబును సాధారణ గల్లీ నాయకుడు అని మీరు అనుకుంటే… ఈ కథనంలో ఉన్న తొలి వాక్యాలను మరోసారి చదువుకోండి. చంద్రబాబు సానూభూతి కార్డును గట్టిగా ప్రయోగిస్తారు. ‘తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేస్తే రెండు సీట్లే ఇచ్చారు. మరి కేసీఆర్ ఇక్కడ మనకు అన్యాయం చేయడానికి వచ్చారు. ఆంధ్రోళ్లు అంటూ మనల్ని తిట్టిన నాయకుడు చెప్పినట్లే జగన్ కు ఓట్లు వేస్తారా తమ్ముళ్లూ’’ అని అడుగుతారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఒక అయిదేళ్లు ప్రభుత్వాన్ని అందిస్తే చేతిలో 10 లక్షల కోట్లు ఉంటాయి. 5 తర్వాత సంగతి తర్వాత. ఇదీ తెలుగుదేశం తీరు. ఈ పార్టీ అనే కాదు.. పెట్టుబడిదారీ రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ ఇలాగే ఉంటాయి.

ఒకసారి హిట్లర్… జర్మనీ పార్లమెంటుకు కోడిని తెచ్చి… దాని ఈకలన్నీ పీకేశారట. మొత్తం ఈకలు పీకడంతో అది కుయ్యో మొర్రో అంది. తర్వాత దాన్ని పిలిచి నాలుగు గింజలు పడేస్తే… వచ్చి తిన్నదట. ఇదీ ప్రజల పరిస్థితి అని హిట్లర్ చెప్పాడట. ప్రజల్ని ఎంత హింసించినా… చివర్లో నాలుగు మంచి పనులు చేస్తే పడి ఉంటారు అని హిట్లర్ ప్రజల సైకాలజీని చిన్న ఉదాహరణలో చెప్పేశాడు. రాజకీయ నాయకులు, పార్టీలూ ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తున్నాయని అనుకోవడం కూడా సరికాదు. మనకు మనమే పిచ్చివాళ్లం అవుతున్నాం.

(తెలుగు జనంపై టీడీపీ సెంటిమెంటు బాంబు? :పార్ట్ 02)

https://www.telugu.newsof9.com/tdps-sentiment-bomb-for-2019-elections/

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *