2019 ప్రశ్న: పేదల స్వర్గమా? కాంట్రాక్టర్ల రాజ్యమా?

December 22, 2018 | News Of 9

Q of 2019: Peoples’ state? Or contractors state? | news of 9

శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిందని సామెత. ఇపుడు జాతీయ స్థాయిలో కాంగ్రెసు పరిస్థితి ఇలాగే ఉంది. మొన్నటి వరకూ రాఫెల్ యుద్ధ విమానాల  కొనుగోలులో నరేంద్ర మోడీ రిలయన్స్ కంపెనీకి లబ్ది చేకూర్చారంటూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద దుమారమే లేపారు. తాజాగా… బోయింగ్, ఎయిర్ బస్ విమానాల కొనుగోలులో కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడంపై అమెరికా ప్రభుత్వం విచారణ చేపట్టింది. దీనిని ఫ్రాన్స్ పత్రిక ఒకటి బహిర్గతం చేయడంతో కాంగ్రెసు ఇరకాటంలో పడింది. దీనిపై మన ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. విషయం ఏమంటే… ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ అని మనకు రెండు విమానయాన సంస్థలు ఉండేవి. వాటి రెండింటినీ యూపీఏ హయాంలో ఒక సంస్థగా కలిపేశారు. అయితే, అప్పట్లో 111 బోయింగ్,  ఎయిర్ బస్ విమానాలను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగిందని అమెరికా హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. లంచాలుగా వచ్చిన డబ్బు భారతదేశంలోని స్వచ్ఛంద సంస్థలకు చేరిందన్నది అభియోగం. ఈ ఎన్జీవోలను కొందరు మధ్యవర్తులు సృష్టించి, ఎయిర్ బస్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)కి చెందిన సంస్థల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములను స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)లకు మళ్లించారని తేలింది. భారత్, మలేసియా, ఇతర ఆసియా దేశాలకు ఈ డబ్బు చేరినట్లు అమెరికా భావిస్తోంది. ఎయిర్ బస్ నుంచి వచ్చిన సొమ్ముల్ని దుర్వినియోగం చేసినట్లు దీపక్ తల్వార్ అనే కార్పొరేట్ లాబీయిస్ట్ పేరు బయటకు వచ్చింది. తల్వార్ పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ రెండింటినీ ఒకే సంస్థగా కలిపినపుడు యూపీఏ-1 అధికారంలో ఉంది. ప్రఫుల్ పటేల్ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. బోయింగ్, ఎయిర్ బస్ ల నుంచి కొన్న విమానాల ఖరీదు రూ.70 వేల కోట్లుగా ఉంది.

ఏ పార్టీ చూసినా.. ఏమున్నది గర్వకారణం?

కాంగ్రెసు పార్టీ తీరు ఆది నుంచీ ఇందుకు భిన్నమేమీ కాదు. ఒకే పార్టీ వందేళ్లుగా పాతుకుపోయి ఉండటం వల్లనే ఇలాంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెసులో మంత్రులను ఒక చూడండి. అందరూ వ్యాపారులూ, కోటీశ్వరులే ఉంటారు. తమ తమ వ్యాపార సంస్థల లాబీయింగ్ చేసుకునేందుకు, పోలవరం వంటి లక్షల కోట్ల కాంట్రాక్టులు సంపాదించుకునేందుకే వారు పార్టీల్లో చేరుతున్నారు. కాంగ్రెసు పార్టీ టిక్కెట్లను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కొనుకున్నారు. కొనుక్కుంటున్నారు. అధికారమే పరమావధిగా డబ్బులను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయగలిగిన వారినే కాంగ్రెసు పార్టీ ఆదరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి.సుబ్బరామిరెడ్డి… ఇలా ఈ రోజుకీ కోట్లకు పడగలెత్తిన కాంట్రాక్టర్లే కాంగ్రెసు పార్టీ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చలామణీలో ఉన్నారు. అక్కడక్కడా ఎస్సీలకు సీట్లు ఇవ్వడం ద్వారా కొంత వరకూ కాంగ్రెసు పార్టీ నిమ్న వర్గాలకు దేవుడులా కనిపించినా, నిజానికి బడా కాంట్రాక్టర్ల వ్యవస్థను పోషించింది కాంగ్రెసు పార్టీనే. ఈ దుష్ట సంస్కృతిని 30 అడుగుల లోతున భూమిలో పాతిపెడతానంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది కానీ, తెలుగుదేశం కూడా కాంట్రాక్టర్లు (అప్పట్లో వారి పరిస్థితి), పారిశ్రామిక వేత్తలకే (ఇపుడు స్థాయి పెరిగింది కదా) పెద్దపీట వేసింది. కాంగ్రెసులోనూ, తెలుగుదేశంలోనూ 4, 6 శాతంగా ఉన్న కాంట్రాక్టర్లే నేడు పారిశ్రామిక వేత్తలుగా కొత్త అవతారాల్లో రాజకీయాలను శాసిస్తున్నారు.

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో తెలుగుదేశం నేతలకు తాజాగా చెడినందునే… తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాంగ్రెసుతో చేతులు కలిపారు. ఈ రెండు పార్టీలూ తొలి నుంచీ బడా పారిశ్రామికవేత్తలూ, కాంట్రాక్టర్లకు వత్తాసు పలికినందునే… తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలూ పాలూ, నీళ్లలా నేడు కలిసి పని చేయగలుగుతున్నాయి. మేనిఫెస్టోల ద్వారా తమకు మేలు జరుగుతుందేమోనని ధనిక వర్గాలు ఎదురుచూడాల్సిన పనిలేదు. ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు ఆయా ధనిక వర్గాలు కోట్లాది రూపాయల్ని ఈ రెండు పార్టీలకూ సమకూర్చుతున్నాయి. గెలిచిన తర్వాత అంతకు పది రెట్లు ఆయా వర్గాలు పిండుకుంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో… ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ,  ఓట్లను కొల్లగొడుతూ తెర వెనుక లోపాయికారీగా బడా కాంట్రాక్టర్ల కోసం పని చేస్తున్న కాంగ్రెసు గానీ, తెలుగుదేశం పార్టీలు కానీ- ఒకే తానులో ముక్కలని అర్థమవుతూనే ఉంది. నిమ్న బడుగు వర్గాలకు ఎముకలు విసిరేసి తాము మాంసం ముక్కలు తింటున్న చందంగా ఉంది. ఈ బడా పార్టీల దాష్టీకాన్ని, తెర వెనుక వ్యాపారాలనూ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగినివ్వనంటూ జనసేన పార్టీ కొత్త సంకల్పంతో ముందుకు వచ్చింది.  కాంగ్రెసు అధిష్ఠానంతో పొసగక, బయటకు వచ్చిన వైఎస్సార్సీపీ తొలి నుంచీ అవినీతిలో కూరుకుపోయి కోర్టు కేసుల్ని ఎదుర్కొంటున్నది. జగన్ సీఎం కుమారుడు కాకపోయి ఉంటే…  ఈ రోజున ఆయన ఉన్న ఆర్థిక స్థితి.. మరెవ్వరికైనా సాధ్యమా? ఒకవైపు అవినీతి కేసుల్ని ఎదుర్కొంటూనే… మరోవైపు నీతిమంతమైన పాలనను అందిస్తానని జగన్ చెబుతున్నారు. అదెలా సాధ్యం?

గత 70 ఏళ్లుగా రెండే సామాజక వర్గాలు సీఎం కుర్చీని అంటిపెట్టుకుని ఉన్నాయి. అధికారంలో పాతుకుపోయి ఉన్నాయి. మళ్లీ ఆ రెండే సామాజిక వర్గాలు అధికారం కోసం నువ్వా, నేనా అని కొట్టుకుంటూ ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయి. ఆ రెండు సామాజిక వర్గాలే నేటి సమాజంలో పారిశ్రామికవేత్తలుగా చలామణీలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలకూ ఓట్లను కొనేందుకు కోట్లాది రూపాయలు అందుబాటులో ఉన్నాయి. వేలాది ఎకరాలను ఎస్ఈజెడ్ ల రూపంలో వారే చెరపట్టి ఉన్నారు.

మరి ప్రస్తుత రాజకీయాలు మారాల్సిన అవసరం లేదా అన్నది సభ్యసమాజంలో ఉన్న ప్రశ్న. మంచి రోజులు రావాలని కోరుకుంటున్నది మాత్రం దళిత,  బడుగు బలహీన వర్గాలు మాత్రమే. ఉద్యోగాలు లేక, భవిష్యత్తుకు భరోసా లేక.. ప్రభుత్వాలు అందించే చిన్న చిన్న బహుమతులతో సరిపెట్టుకుంటున్నాయి.  రాజ్యాధికారానికి దూరంగా ఉన్న 90 శాతం సామాజక వర్గాలు… తమనకు పార్టీ లేదని కొందరు, పార్టీ ఉన్నా డబ్బులు లేవని కొందరు బలహీన స్వరంతో మాట్లాడుతున్నారు. కానీ ఈ 90 శాతం ప్రజలు ఒకే గొడుగు కిందకు రాగలిగితే… ఒక ఉద్యమం సాధ్యం అవుతుంది. 70 ఏళ్లుగా సాగుతున్న దోపిడీకి తెరపడుతుంది. కావాల్సిందల్లా సంకల్పం మాత్రమే. ఇపుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ ఒకటే ఈ రకమైన దళిత, బహుజన సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళుతున్నది.

70 ఏళ్లుగా దోచుకుంటున్న ధనిక వర్గాలు… అంబేద్కర్ విగ్రహాలకు దండలు వేస్తాయి. పింఛన్లు ఇస్తానంటాయి. స్కాలర్ షిప్పులను ఇస్తానంటాయి. ఆ ఒక్క సీఎం కుర్చీ మాత్రం మాకే అంటాయి? ఎందుకు? 2 లక్షల కోట్లు సీఎంగా ఒక్కరి చేతిలోకి వస్తాయని బలహీన వర్గాలంటే వారికే బాగా తెలుసు. మేనిఫెస్టోల్లో చెప్పినట్లు మాకు ఏమీ ఇవ్వనక్కర్లేదు.. మాకు సీఎం కుర్చీ ఇవ్వండి.. చాలు అని అడగండి. అప్పుడు వారి ముఖంలో ఫీలింగ్స్ చూడండి. ‘‘సీఎం కుర్చీ ఇవ్వండి’’ అని చంద్రబాబునే అడగండి.. సరే అని అంటారేమో చూడండి.

దోపిడీని గుర్తించడం ఒకటి… దోపిడీని ఆపడం రెండోది.

ఇవి జరగాలంటే…అవినీతితో కుళ్లిపోయిన తెలుగుదేశం, కాంగ్రెసు, కాంగ్రెసు నుంచి పుట్టిన వైఎస్సార్సీపీల వల్ల కాదు. వల్లకాదు అని కాదు.. అవినీతికి పాల్పడేవే అవి కాబట్టి, వాటికి దూరంగా ఆయా పార్టీలను ఎలా ఊహించగలం?

ఓట్లను అమ్ముకోకుండా… దళిత బడుగు, బలహీన వర్గాలన్నీ కూడా ఒక గొడుగు కిందకు వచ్చి… 70 ఏళ్ల చరిత్రను మారుద్దాం అని ఒకసారి అనుకోండి. ప్రత్యామ్నాయం మీ కళ్ల ముందే ఉంది. మార్పులేని జీవితం మురికి నీళ్లున్న చెరువులాంటిది. కొత్త నీరు రావడం మంచిది. 25  కిలోల బియ్యం వద్దు… 25 ఏళ్ల భవిష్యత్తు కావాలని యువత చక్కగా తమ మనోగతాన్ని వ్యక్తం చేస్తున్నది. నాయకుల వైపు చూడటం మానేద్దాం. వాళ్లెందుకు ఇంకా దోచుకోవడానికా? అని ధైర్యం చెప్పుకోండి. ప్రజలే ప్రభువులు.. ప్రజలే నాయకులు. మీలోనే కొత్త తరం నాయకులు వస్తారు. మీ పిల్లల్లోనే కొత్త తరం నేతలు ఉంటారు. ఆలోచించాల్సిన తరుణమిదే. 2019 కొత్త సంవత్సరం 70 ఏళ్ల దోపిడీని సమాధి చేయడానికి బడుగు, బలహీన, దళిత వర్గాలకు రాజ్యాధికారాన్ని అందివ్వడానికీ ఉద్యమిద్దాం..!! 2019 అందుకు నాంది పలకాలని ఆశిద్దాం!!

Other Articles

2 Comments

  1. Hi
    I am not sure you observed your site or not. It is annoying while reading. Both sides it is covering the matter. If this continued hits will be reduced. Just check

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *