సర్క్యులర్ ఎనాలిసిస్: 2019 మాదే అని జనసేన రాసి పెట్టుకోవచ్చు..!!

February 21, 2019 | News Of 9

360 Degree Analysis: 2019 is for JanaSena.. one can write on the wall | telugu.newsof9.com

 • 2019 ఏపీ ఎన్నికలు… ఊహాగానాలూ… వాస్తవాలు

(న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేక కథనం)

2019 ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ఎన్నికల్లో జనసేన బోణీ కొడుతోంది… బోణీ కాదు.. ఒక ప్రభంజనాన్ని సృష్టించే దిశగా పయనిస్తోంది. అవినీతి పెచ్చరిల్లిపోయి సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సరికొత్త రాజకీయం రావాలని అందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కానీ… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లను – జనసేన సాధిస్తుందా? జనసేనకు 4 నుంచి 5 సీట్లు రావచ్చని తొలుత చెప్పిన ప్రత్యర్ధులే నేడు 33 సీట్లు వస్తాయన్న అంచనాకు అంతర్గతంగా వస్తున్నారు. జన సైనికులు మాత్రం ఎప్పుడూ అధినేతపై పూర్తి నమ్మకంతోనే ఉన్నారు. అది మామూలు నమ్మకం కాదు… హిమాలయ శిఖరమంత. ప్రత్యర్ధులు జనసేనకు బలం లేదని బయటకు మాట్లాడుతున్నా… నిజానికి లోలోన వాళ్లు గుండె చిక్కబట్టుకుని తిరుగుతున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్లు అనేక వరాలను ప్రకటించి ఓటర్లను మభ్యపెట్టి వారిని వంచించాలని చూస్తోంది. మరోవైపు పవన్ ను ఆకర్షించి.. పబ్బం గడుపుకుందామని తెలుగుదేశం నేతలు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగానే చెప్పారు. తెలుగుదేశం చేసిన కుయుక్తులపై జనసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తెలుగుదేశం అన్నా, వైసీపీ అన్నా జనసేన కార్యకర్తలు తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ ధోరణి సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం, వైసీపీ వైఫల్యాలపై అధినేత పవన్ తరహాలోనే జన సైనికులు తీవ్రస్థాయిలో మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. ఎన్నెన్నో ఆధారాలను సంపాదించి స్వయంగా ప్రత్యర్ధుల లోపాల్ని ఎండగడుతున్నారు. కేవలం మాటలు, తిట్లు అన్నది కాకుండా, సైద్ధాంతికంగా జన సైనికులు పోరాటం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ‘‘మేం అనేక స్కూళ్లు కట్టించాం’’ అంటూ సోషల్ మీడియాలో చెప్పిన తెలుగుదేశం ఎన్నారై వ్యక్తికి… ఆంధ్రాలో స్కూళ్ల వాస్తవ పరిస్థితిని వివరించే వీడియోలను సాక్ష్యాంగా చూపించారు. చేసేది లేక.. తెలుగుదేశం అభిమాని ఊరుకున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు తిరుగులేని సమాధానాలు చెబుతూ జన సైనికులు దూకుడుపై ఉన్నారు.

జనసేన అధికారంలోకి రావాలన్నది.. ప్రతి ఒక్క జన సైనికుడి హృదయ స్పందన. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకూ వారు సోషల్ మీడియాలో కనిపించడానికి కారణం కూడా ఇదే. తెలుగుదేశం, వైసీపీలను కాదని, ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన అవతరించింది. ఇదే అందరి ఆశలకూ పునాది. కుళ్లు రాజకీయాలకు దూరంగా ఉందామనీ, అధికారం రావడం ఆలస్యమైనా ఫర్వాలేదని పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా అనేక మందికి నచ్చింది. కొడితే కుంభస్థలం బద్ధలైపోవాలన్న పవన్ కళ్యాణ్ మాటలు నేటికీ తమ చెవుల్లో మారుమోగుతున్నాయని జన సైనికులు చెబుతూ ఉంటారు.

తెలుగుదేశానికి నిద్రలేని రాత్రులు- వైసీపీ బిందాజ్

తెలుగుదేశం నిద్రపట్టని రాత్రులను గడుపుతుండగా… వైసీపీలో ఎలాంటి భయాలూ లేవు. జగన్మోహన్ రెడ్డి 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత పార్టీ ధైర్యం పెరిగిందన్నది నిజమే. ఏ పార్టీకయినా అలాంటి ఆశలు ఉండటం సహజం. వైసీపీలోకి తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు క్యూలు కట్టినట్లుగా చేరిపోవడం, ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గం వారు వచ్చి చేరుతుండటం… వైసీపీకి ఎక్కడ లేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఈ సారి జగన్ సీఎం కావడం ఖాయం అని ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. కానీ వాస్తవం వేరుగా ఉంటుందని క్షేత్ర స్థాయి పరిస్థితులు సూచిస్తున్నాయి.

జనసేనకు తూకం రాళ్లు ఎక్కడ?

జనసేన కార్యకర్తలు…పోరాట దృక్ఫథాన్ని అలవరుచుకున్నారు. ఎక్కడా వారిని నిస్తేజం ఆవరించడం లేదు. ఎక్కడికక్కడ కార్యకర్తలు వారికై వారు పనులు పురమాయించుకుంటున్నారు. ‘‘పార్టీ నాకేం ఇస్తుంది’’ అన్నది మనసులో కూడా లేదు. ‘‘మీ మీ ప్రాంతాల్లో ఆటోలపై జనసేన పోస్టర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి’’ అంటూ వారు మెసేజీలు పంపుకుంటున్నారు. వినూత్న తరహాలో జనసేన సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. విశాఖకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ కి చెందిన ఇద్దరు కుర్రాళ్లు… రైళ్లలో జనసేన సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు.

అయితే… జనసేన అభిమానుల్లో ఉండే చదువుకున్నవారు మ్యాజిక్ ఫిగర్ దాటతామా అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్ని సీట్లు రావచ్చో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన కార్యకర్తలకు అయినా, ప్రత్యర్ధి పార్టీలకయినా, పోలింగ్ సరళిని అంచనా వేసే సంస్థలకయినా… పవన్ కళ్యాణ్ సభలకూ, కవాతులకూ హాజరవుతున్న భారీ జన సందోహాన్ని చూసి అంచనా వేసుకోవడం మినహా, జనసేనను అంచనా వేసేందుకు తూకం రాళ్లు లేవు. బయటకు వెళ్లి సర్వే చేస్తే ఎవరూ నిజాలు చెప్పడం లేదు. అంతర్గతంగా జనసేనకే ఓటు వేస్తాం అని నిర్ణయించుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ గ్రామాల్లో వారు జనసేనకు ఓటు వేస్తామని బహిరంగంగా చెప్పడం లేదు. దీనికి కారణాలు… తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ ప్రాంతాల్లో పోలీసు, పార్టీ మనుషులతో నిఘా పెట్టడమే. తెలుగుదేశం అయితే… ఇపుడిస్తున్న స్కీముల నుంచి ఇతర పార్టీల వారిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నది. అందుకే వారంతా గుంభనంగా ఉన్నారు. ‘‘ఎన్నికలు రానివ్వండి.. ఎవరికి ఓటు వేయాలో మాకు తెలుసు. జనసేన జండాలు పెట్టుకుని తిరగడం ఎందుకు? పరిస్థితులు బాగోలేదు. మేం గుంభనంగానే ఉంటాం’’ అని ఒక హార్డ్ కోర్ జనసేన అభిమాని ‘‘న్యూస్ ఆఫ్ 9’’తో అన్నారు. జనసేనపై ఉన్న ప్రేమ నిగూఢంగా ప్రజల్లో దాగి ఉంది. బయటకు ఎంతో నమ్మకం ఉన్న వారు అడిగితే తప్ప… ప్రజలు ఎవరికి ఓటు వేసేది చెప్పడం లేదు. దీనికి కారణం… ప్రజారాజ్యం రూపంలో ఒకసారి దెబ్బతిని ఉండటమే.

క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎలా ఉన్నా… జనసేనకు మ్యాజిక్ ఫిగర్ (88) రాకపోతే ఏమిటి అన్న ప్రశ్న ఒకటి కనిపించకుండానే అందరి ముందూ ఉంది.

మొన్నటి వరకూ 4 లేదా 5 సీట్లు వస్తాయి… అంతే అన్న తెలుగుదేశం పార్టీ ఈ మధ్య రహస్యంగా ఒక సర్వే చేయించుకున్నది. ఈ సర్వేలో తేలింది ఏమంటే- జనసేనకు 33 సీట్లు రానున్నట్లు ఆ సర్వే సమాచారం అని తెలుగుదేశం ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొన్నటి వరకూ 4 లేదా 5 సీట్లు మాత్రమే అని తెలుగుదేశం వర్గాలు ఊరూ వాడా ప్రచారం చేశాయి. జనసేన పార్టీకి కావాల్సినంత మెజారిటీ వస్తుందని, కాలం గడిచే కొద్దీ… పరిస్థితి మారిపోతుందని ‘న్యూస్ ఆఫ్ 9’’ భావిస్తున్నది. 4 సీట్లు 33 కాగాలేనిది… 33 సీట్లు 88 కావని ఎందుకు అనుకోవాలి? 100 సీట్లు రావచ్చని అందరూ గ్రహించే సమయం ఒకటి వస్తుంది. అప్పుడు అందరూ నమ్మవచ్చును కూడా. కీడెంచి మేలెంచడం మంచిది. 88 కూడా రావని భావిస్తే పరిస్థితి ఏమిటి? జనసేన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? ఆ సమయంలో జనసేన వ్యూహం ఎలా ఉండొచ్చు? జనసేనకు 80 సీట్లు వస్తే మిగిలిన ఇద్దరికీ కలిపి 95 సీట్లు వస్తాయని అనుకుందాం.

ఈ పరిస్థితి ఆసక్తికరం. వైసీపీ, టీడీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అన్నది ప్రశ్న. ఎన్నికల అనంతరం ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్నది ఆలోచిద్దాం. జనసేనతో సంబంధం లేకుండా వైసీపీ-టీడీపీలు పొత్తుకు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే… చంద్రబాబు సామాజిక వర్గం వారు అనేక మంది ఇపుడు వైసీపీలో చేరుతున్నారు. ప్రభుత్వంలో చెరి రెండున్నర సంవత్సరాలు పాలన చేద్దాం అన్న అంగీకారానికి ఈ రెండు పార్టీలూ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత 70 ఏళ్లుగా ఈ రెండు పార్టీలే రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయి.

సినీ నటుడు బాలకృష్ణ హత్య కేసులో ఇరుక్కున్న సమయంలో ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకు బాగానే సహకరించారు. కీలక సమయాల్లో ఈ రెండు సామాజిక వర్గాలూ బాగానే సహకరించుకునే పాత అలవాటు ఉన్నది. పాత అలవాట్లు అంత తేలికగా పోవు. అది రేపన్న రోజున కొనసాగవచ్చు. ఎన్నికల గోదాలో పడి ఈ రెండు పార్టీలే ఇపుడు ఒకరికొకరు దెబ్బ తీసుకోవడానికీ, రాజకీయంగా అంతం చేసుకోవడానికీ ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. ఒకవేళ వైసీపీ-టీడీపీ కలిసిన పక్షంలో ప్రతిపక్షంగా జనసేన ఉభయుల ఆటలను సాగనివ్వదన్నది అన్నది ఖాయం. ఇద్దరినీ ఉతికి ఆరేయడానికి ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉంటారు. అవసరం అయితే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించే వరకూ జనసేన వేచి ఉంటుంది.

ఒకవేళ, టీడీపీ, వైసీపీ కలవడానికి ఇష్టపడకపోయిన పరిస్థితిలో ఏమవుతుంది? తెలుగుదేశంతోగానీ, వైసీపీతోగానీ ఎన్నికల అనంతర పొత్తుతో.. జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే..?

కేంద్రంలోని భాజపా ఇందుకు సహకరిస్తుందని జనసేననూ, వైసీపీని దగ్గర చేయడానికి భాజపా ప్రయత్నం చేస్తుందని, చంద్రబాబును అధికారానికి దూరంగా ఉంచడానికే భాజపా ఇష్టపడుతుందన్న ఒక వాదన బలంగా ప్రజల్లో ఇప్పటికే ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడానికి కారణం… జగన్ పై ఉన్న కేసులే ప్రధాన కారణం. అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే తప్పులు ఎక్కువ చేస్తుంది. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీని కూడా వైసీపీ కంటే భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ చాకిరేవు పెడుతున్నారు.

జగన్ తో కాదు అనుకుంటే గుడ్డిలో మెల్ల అన్నట్లు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక్కటే మిగిలిన మార్గం. ఈ అంశాన్ని కొద్ది సేపు తర్వాత చర్చిద్దాం. తానే సీఎంగా ఉంటే తెలుగుదేశం మద్దతు ఇచ్చినా వారి ఆటలు సాగవు కాబట్టి… పవన్ ఒక ఛాన్సు తీసుకోవవచ్చు. జనసేన ఒకసారి ప్రభుత్వంలో ఉండి.. ఎన్నికలు వచ్చినా ఫర్వాలేదు. 6 నెలలున్నా… జనసేన ప్రభుత్వ సత్తా ఏమిటన్నది పవన్ ప్రజలకు చూపించగలుగుతారు.

ఇప్పుడు ఆంధ్రా ఓటర్ల మనసులో ఏమి ఉండి ఉంటుంది?

ప్రజల అంచనాలను లెక్క తీసుకుంటే తెలుగు దేశం పార్టీ ప్రజల అభిమానాన్ని కోల్పోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పడానికి కారణాలు ఏమిటి? తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందన్న భయాలతో అనేక మంది వైసీపీవైపు రావడమే. ఎందుకైనా మంచిదన్న కారణంతో చంద్రబాబు సామాజిక వర్గం కూడా వైసీపీలోకి క్యూ కట్టింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ అధిపత్యానికి ఢోకా ఉండరాదన్నది వారి ములాల్లోనే ఉంది.

వైసీపీ గెలుపుపై బిందాజ్ గా ఉండటం వెనుక ఉన్న కారణాలను విశ్లేషణ చేద్దాం. వైసీపీ పార్టీకి ప్రధానమైన పెట్టుబడి – వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన. గద్దలను కొట్టి కాకులకు పెట్టినట్లు కొంత మంది పేదలకు వైఎస్ సాయం చేసినా… వైఎస్ హయాంలో జరిగిన అవినీతి కేసులు నేటికీ జగన్మోహన్ రెడ్డిని వేధిస్తున్నాయి. మరొకటి… వైఎస్ చనిపోయి దాదాపు 9 సంవత్సరాలు అవుతోంది. ఇంతకాలం తర్వాత వైఎస్ పేరు చెబితే జనం ఓట్లు వేస్తారా? ఆయనపై ప్రజల్లో ఇంకా అభిమానం చెక్కుచెదరకుండా ఉంటుందా అన్నది అనుమానమే. ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకూ ఆ వ్యక్తి తాలూకూ ఆరాధన ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ బొమ్మను చూపించి… ఓట్లు కొల్లగొట్టేయవచ్చని ఆలోచించడం ఎలా నిరుపయోగమైందో, వైఎస్ ఫోటో చూపించి అధికారాన్ని తెచ్చుకోవచ్చని వైసీపీ భావించడం అంతే తప్పు.

ప్రియాంకా గాంధీని చూపించి అధికారం కోసం కాంగ్రెసు కలలు కంటున్నట్లే ఇదీనూ. నిజానికి ప్రియాంకా ఎప్పుడో రాజకీయాల్లోకి రావాల్సింది. కానీ ఆ సమయంలో ఆమెను దూరంగా ఉంచారు. రాజకీయాలకు టైమింగ్ చాలా ముఖ్యం. ఈతరం యువత.. ప్రియాంకాలో ఇందిరాగాంధీని చూడలేరు. ఇందిర ఈ తరానికి తెలియనే తెలియదు. అందుకే గాంధీ కుటుంబంపై కొత్త తరంలో ఎలాంటి గుడ్డి ప్రేమలూ లేవు. అందువల్ల వైఎస్ గానీ, ఎన్టీఆర్ ఫోటోలుగానీ, ఇందిరాగాంధీ ఫోటోలుగానీ ఈనాడు పని చేయవు. ఇందులో సందేహం లేదు. మా పార్టీ గెలిచిపోతుందని వైసీపీ శ్రేణులు బిందాజ్ గా ఉండటానికి ప్రధాన కారణం… సచ్ఛీలత లేని నేతల కప్పదాట్లు, జగన్ పాదయాత్ర. వైఎస్ అనుబంధం ప్రజలతో నేటికీ కొనసాగితే ‘‘యాత్ర’’ సినిమా సూపర్ డూపర్ హిట్టు కొట్టి ఉండాలి. (అలాగే తెలుగుదేశం ప్రయోగించిన కథానాయకుడు సినిమా కూడా). అధికార దండాన్ని కొట్టివేసేందుకు జరిగిన ఈ రెండు ప్రయోగాలూ విఫలం అయ్యాయి. అంటే ప్రజలు అప్రమత్తంగానే ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

టీడీపీ పుట్టి మునిగిపోతున్నదని భావించిన నేతలంతా… జనసేనలోకి రాలేరు. సామాజిక వర్గంతో సంబంధం లేకుండా శీలం లేని వారు రానక్కర్లేదని పవన్ బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఇక మిగిలిన అవకాశం వైసీపీనే. మరి నేతలు ఎక్కువ మంది వైసీపీలోకి వస్తున్నందున అది వైసీపీకి లాభిస్తుందని కూడా అనుకోవచ్చు కదా. కానీ అది అసాధ్యం.

మూడు ఫొటోలు- ఒక ఓటు

Self goal by Jagan U-turns by CBN Advantage Pawan Kalyan in Andhra? | telugu.newsof9.com

ఎందుకంటే.. రేపు జరగబోయే ఎన్నికలు మూడు ఫోటోలపైనే జరుగుతాయి. పవన్ కళ్యాణ్. చంద్రబాబు.. జగన్. ఈ ముగ్గురి వ్యక్తిత్వాలూ, వారి నడక, నడత అన్నింటినీ ప్రజలు అంచనా వేసుకుంటున్నారు. ఆయా పార్టీల సిద్ధాంతాలను కాస్త పెద్ద వయసు వారు అంచనా వేసుకుంటారు. యువత మాత్రం ఈ మూడు ఫోటోలే చూస్తారు. అలా చూస్తే ఎక్కువ మంది మొగ్గు చూపడానికి ఉన్న అవకాశం పవన్ కళ్యాణ్ ఒక్కరే. అంటే జనసేనకు మాత్రమే గెలుపు అవకాశాలు ఉంటాయని ఈ విశ్లేషణ చెబుతున్నది.

బీఎస్పీ విధానం… జనసేనకు మార్గం

బహుజన సమాజ్ పార్టీ తొలిసారి అధికారానికి ఎలా వచ్చింది? అప్పుడు బీఎస్పీ వ్యూహం ఎలా ఉండింది అన్నది తెలుసుకోవడం ఆసక్తికరం. యూపీలో ఉన్న 425 సీట్లలో 1993లో బీఎస్పీకి 67 సీట్లు, బాజపాకి 164 సీట్లు వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీకి 109 సీట్లు వచ్చాయి. మాయావతి మద్దతుతో ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ములాయం సీఎంగా అయ్యారుగానీ మాయావతి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం ఒక సంవత్సరం, 181 రోజులు మాత్రమే మనుగడలో ఉంది. 1995లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ మద్దుతుతో మాయవతి సీఎం అయ్యారు. నిజానికి బీఎస్పీ మనువాద సిద్ధాంతానికి (హిందూత్వ) వ్యతిరేకంగా పోరాడిన రాజకీయ పార్టీ. మరి భాజపాతో పొత్తు ఎలా పెట్టుకుంది?

దీనికి కాన్షీరాం చెప్పిన సమాధానం- రాజకీయ వ్యూహం. భాజపా మద్దతుతోనే 1995లో మళ్లీ మాయావతి సీఎం అయ్యారు కానీ పూర్తికాలం ప్రభుత్వం కొనసాగలేదు. 1997లో మళ్లీ ఆమె భాజపా మద్దతు తీసుకుని సీఎం అయ్యారు. పొత్తు ఈ సారి మరీ విచిత్రంగా ఉంది. చెరి ఆరు నెలలపాటు ప్రభుత్వాన్ని నడపాలన్నది ఒప్పందం. తొలిసారి బీఎస్పీ 2007లో 403 (2000లో..డీలిమిటేషన్ తర్వాత సీట్లు తగ్గాయి) సీట్లకు గాను 206 సీట్లను సాధించుకుని పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అది పూర్తికాలం 5 ఏళ్లపాటు అధికారంలో ఉండటం, అది కూడా యూపీలో అదే తొలిసారి కావడం విచిత్రం. నాలుగుసార్లు యూపీకి సీఎం అయిన ఘనతను సాధించిన హెచ్ ఎన్ బహుగుణ, ఎన్డీ తివారీల సరసన కూడా ఆమె చేరారు. జనసేన 88 వచ్చినా, అంతకు తగ్గినా… మొత్తానికి పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో అనేక రికార్డుల్ని బద్ధలు కొట్టే అవకాశాలే ఎక్కువ.

నోట్: డియర్ రీడర్స్, మీ వ్యాఖ్యలూ, అభిప్రాయాలనూ ఈ స్టోరీ కింద ఉన్న కామెంట్ బాక్సులో రాయవచ్చు.

Other Articles

2 Comments

 1. 2019 తరవాత ycp పార్టీ మనుగడలో ఉండాలంటే ఈసారి ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలో ఉండితీరాలి..
  జగన్ cm అయ్యినా అవ్వకపోయినా ఆ పార్టీని నమ్ముకున్న నాయకులకి, కార్యకర్తలకి అధికారం మాత్రం చాలా చాలా అవసరం…
  రేపు హంగే వస్తే
  జగన్ నేనే cm అవ్వాలి అని మొంకుపట్టు పట్టుకు కూర్చుంటే మాత్రం
  CBN చెలరేగిపోతాడు..
  తన అంగ ఆర్ధిక బలంతో దేశ ప్రధానినే డిసైడ్ చెయ్యాలని చూస్తున్న CBN & co కి ycp MLA లని handle చెయ్యడం పెద్ద కష్టమేమి కాదు..
  so జగన్ తన G వాపు చూపెట్టకుండా కర్నాటక కాంగ్రెస్ ని follow అయ్యిపోవడమే…

 2. జనసేన అధికారంలోకి రాకుండా ఇద్దరూ (చీడిపి+వైచీపి) ఖచ్చితంగా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తారు.చేస్తున్నారు.. చేయబోతున్నారు.
  అయితే నువ్వు లేదా నేను అని బాబోరు-జలగన్ మధ్య క్విడ్ ఫోక్రో ఒప్పందం….ఇది నిజమని చెప్పటానికి ఎన్నో ఆధారాలు… ఉదాహరణకు రోజంతా తిట్టుకొనేటట్లు నటించే ఈ పార్టీల వారు కలసి వ్యాపారాలు చేయటం లేదా? కలసి కమీషన్లు పంచుకోవడం లేదా? అధికారం కూడా అంతే.
  10 లక్షల కోట్ల బడ్జెట్ (5.సం.) కార్పొరేట్ కంపెనీలు అయిన ఈ పార్టీలు వదులుకుంటాయా? సమస్యే లేదు.

  ఈ దొంగ పార్టీల,బడా కాంట్రాక్టర్ల,వ్యాపారుల,మీడియా (ప్రింట్+టివి), కుల పెద్దల,వ్యాపారుల ముసుగులో ఉన్న సినిమావాళ్ళ (కాసుల కక్కుర్తి కూడా),అవినీతిపరుల ఇలా అందరి టార్గెట్ పవన్ కళ్యాణ్ మాత్రమే.

  వీరందరికీ ఒకటే భయం…పవన్ వస్తే ఆయన తినడు…ఎవరినీ తిననివ్వడు…ప్రజల డబ్బు ప్రజలకే పంచుతాడు.ఇప్పటి వరకు అధికారానికి,అభివృద్ధికి దూరంగా ఉన్న 90శాతం వర్గాలకు అన్ని అందుబాటులోకి తెచ్చి అందలం ఎక్కిస్తాడు.కుల,మత రహిత సమాజానికి కృషి చేస్తాడు…..తద్వారా తమకు (ఈ పార్టీల లాంటి కంపెనీలకు) శాశ్వతంగా ప్రజలు బహిష్కరిస్తారని వణుకుతూ, భయం భయంగా కొత్త, కొత్త కుట్రలకు తెరతీస్తున్నారు.
  కావున 90 శాతం ఉన్న వివిధ వర్గాల ప్రజలు ఈ కుట్రలన్నీ భగ్నం చేసి జననేతకు అండగా నిలిచి, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని గట్టిగా కోరుకుని….గాజుగ్లాసు గుర్తును గెలిపించి మిమ్మల్ని మీరు గెలుచుకోండి…మీ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దుకోండి.

  జైహింద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *