70 ఏళ్ల ఊడిగానికి మూలాలు ఎక్కడ?

January 29, 2019 | News Of 9

రాజకీయాల్లో 10 శాతం వారు ఇస్తారు. వారివి ఇచ్చే చేతులు.

90 శాతం వారు పుచ్చుకుంటారు. మనవి పుచ్చుకునే చేతులు.

90 శాతంగా ఉన్న కాపులూ, బీసీలూ, ఎస్సీలూ, ముస్లింలు ఎప్పుడూ సీట్ల కోసం పడిగాపులు కాస్తారు… కానీ రావు. వస్తాయో రావో చెప్పలేం. కానీ..

10 శాతం వారికి సీట్లు వెదుక్కుంటూ వస్తాయి… ఎందుకు?

10 శాతం వారికి ముఖ్యమంత్రి పదవులు వెదుక్కొంటూ వస్తాయి? ఎందుకు?

10 శాతం వారు ప్రధానిని సవాలు చేయగలుగుతారు? ఎందుకు?

10 శాతం వారికి తలచుకుంటే అవార్డులు వస్తాయి… ఎందుకు?

10 శాతం వారికి ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి.. ఎందుకు?

10 శాతం వారికి చదువులు ఎక్కువగా ఉంటాయి… ఎందుకు?

10 శాతం వారికి పరిశ్రమలను ప్రభుత్వాలు కట్టబెడతాయి… ఎందుకు?

10 శాతం రేపు దేశాన్ని పాలించాలని చూస్తోంది. ఎందుకు?

90 శాతం ప్రజలు బానిసలుగా ఉండిపోయారు.. ఎందుకు?

10 శాతం వారిని వ్యతిరేకించాలంటే

90 శాతం వారు భయపడతారు… ఎందుకు?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం.. ‘కర్మ’ అనో, దేవుడి శాపం అనో మీరు భావిస్తే.. ఇది మీ కోసం ఉద్దేశించినది కాదు. మీరు చదవనక్కర్లేదు. సామాజిక పరమైన వెనుకబాటు తనానికి అసలు కారణాలు ఏవో ఉండి ఉంటాయనీ, ఒక గ్రాండ్ డిజైన్ ప్రకారమే సమాజాన్ని కుల శక్తులు నడిపిస్తున్నయనీ, మీరు గ్రహించదలచితే.. ఇది ఖచ్చితంగా మీ కోసం.

 (న్యూస్ ఆఫ్ 9)

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగడానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? మిగిలిన కులాలన్నీ ఓటు యంత్రాలుగా ఎందుకు మిగిలిపోయాయి? దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటే… నేటి తరం రాజకీయాల్లో ఏం చేయాలన్నది బోధపడుతుంది. సమకాలీన మీడియా సంస్థలేవీ కూడా ఈ దిశగా ఆలోచన చేయవు. ఆయా వర్గాల చేతిలోనే మీడియా ఉన్నందున బడుగు, బలహీన వర్గాలు ఇపుడు రాజ్యాధికారానికి దూరంగా ఎందుకు ఉన్నాయన్న విషయాన్ని బయటకు చెప్పడానికి నిరాకరిస్తాయి. పైగా రాజకీయాలను నేడు శాసిస్తున్న వర్గాలు కులం గురించి మాట్లాడితే.. తప్పు పడతాయి. మాట్లాడిన వారిపై కుల ముద్ర వేస్తాయి. స్వలాభమే ఇందుకు కారణం. బడుగు బలహీన వర్గాలు ఎప్పటికీ వారు విసిరిన పిండి బిస్కెట్లు మాత్రమే బడుగు వర్గాలు తినాలనీ, తాము మాత్రం బంగారు బిస్కెట్లు తింటామనీ ఆలోచన చేస్తాయి. దోపిడీకి అసలు మూలాలు ఎక్కడ ఉన్నదీ తెలుసుకుంటే బడుగు వర్గాలు ప్రాయాణించాల్సిన మార్గం స్పష్టంగా కనిపిస్తుంది.

కులం గోడల్ని బద్దలు కొట్టేందుకు మీ కోసం అసలు నిజాల్ని తవ్వి తీస్తున్నది న్యూస్ ఆఫ్ 9. ఓపిగ్గా చదవండి. సమానత్వాన్ని కాంక్షించే వారంతా చదవాల్సిన సిరీస్ ఇది.

ఆంగ్లేయుల పరిపాలనలో అనేక చేదు అనుభవాలు ఉన్నా… ఒక ఆంగ్లేయుడిని ఇక్కడి ప్రజలు గౌరవించడం అరుదైన విషయం. ఇరిగేషన్ ఇంజినీరు సర్ ఆర్ధర్ థామస్ కాటన్…(1803-99) ఈ అరుదైన ఆంగ్లేయుడు. కోస్తా జిల్లాల్లో (ఏపీ) ప్రజలు కాటన్ ను దేవుడుగా కొలుస్తారు. వరి, చెరకు పొలాల్లో నేటికీ కాటన్ విగ్రహాలు కనిపించడం అరుదేమీ కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలో కాటన్ రెడ్డి పాలెం అనే ఒక ఊరు కూడా ఆయన పేరుపై ఉంది. తణుకు పట్టణంలో నన్నయ్య భట్టారకుడి విగ్రహం పక్కనే గుర్రంపై ఉన్న ఆర్ధర్ కాటన్ కాంస్య విగ్రహం ఉంది. నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ 1980ల్లో రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత… కాటన్ దొరకు మరింత ప్రాధాన్యం పెరిగింది. రాజమండ్రికి సమీపంలోని ధవళేశ్వరం వద్ద వందల ఏళ్ల కిందట.. గోదావరిపై కాటన్ కట్టిన ఆనకట్ట ఉంది. దీనికి సమీపంలోనే కాటన్ దొర మ్యూజియం ఉంది. దీనిని 21 ఫిబ్రవరి 1988లో ఎన్టీరామారావు ఆవిష్కరించారు. హైదరాబాదు ట్యాంకుబండ్ పై పెట్టిన విగ్రహాల్లోనూ కాటన్ దొర విగ్రహానికి చోటు దక్కింది.

1850 వరకూ… కోస్తాజిల్లాలైన తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరుల్లో వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థ ప్రకృతి వైపరీత్యాలపై ఆధారపడి ఉండేది. నదుల నీటిని పొలాలకు వినియోగించుకునే వ్యవస్థలేక పోవడంతో నదికి ఇరువైపులా ఉన్న పొలాలు ముంపునకు గురయ్యేవి. అధిక వర్షాలు, లేకపోతే కరవు ఈ ప్రాంతాల్ని పీడించేవి. 1820-21, 1853-54 మధ్యకాలంలో రాజమండ్రి జిల్లాకు కేవలం 7 ఏళ్లు మాత్రమే పంటలు సరిగా పండాయి. 9 ఏళ్లు సాధారణ పరిస్థితులు ఉండగా, మిగిలినవి వరదలు, లేదంటే కరవు ఉండేది. 21 ఏళ్ల కాలంలో రాజమండ్రి జనాభా 1842-43 నాటికి 7.38 లక్షల నుంచి 5.61 లక్షలకు తగ్గిపోయింది. 1833లో పెద్ద కరవు వచ్చింది. కరవు మొదలైనపుడు 5 లక్షలున్న జనాభా కరవు పోయేనాటికి 3 లక్షలకు తగ్గిపోయింది.

ప్రజలు చనిపోవడంతోపాటు, కరువుకాటకాల వల్ల బ్రిటీషు ప్రభుత్వానికి పన్నుల ఆదాయం కూడా తగ్గిపోయింది. రాజమండ్రి నుంచి 1821లో రూ.18.6 లక్షలున్న ఆదాయం, 1838 నాటికి రూ.13.7 లక్షలకు పడిపోయింది. 1842కి రూ.15.1 లక్షలుగా నమోదైంది.

కాటన్… మెడ్రాస్ ఇంజినీర్స్ కార్ప్స్ లో కెప్టెనుగా ఉన్నారు. రాజమండ్రి జిల్లా ప్రస్తుత పరిస్థితి, మెరుగుదలకు ఏం చేయాలన్నదానిపై నివేదిక ఇవ్వాల్సిందిగా బ్రిటీష్ ప్రభుత్వం 1844 ఆగస్టు నెలలో కాటన్ ను కోరింది. తర్వాత జరిగింది అంతా పెద్ద చరిత్రే. ధవళేశ్వరం గ్రామం వద్ద గోదావరి ఆరు కిలోమీటర్ల వెడల్పులో ప్రవహిస్తుంది. ఇక్కడే కాటన్ ఆనకట్ట కట్టారు. గోదావరి నీటిని ఇక్కడి ఆపి.. కాల్వల ద్వారా రేగడి నేలలున్న పంట పొలాలకు నీళ్లను మళ్లించారు. వృధాగా సముద్రంలోకి పోయే గోదావరి నీటిని డబ్బుగా మార్చే ప్రక్రియగా కాటన్ దీనిని అభివర్ణించారు. 1847-1852 మధ్యకాలంలో ఈ ఆనకట్ట నిర్మించారు. కృష్ణానదిపై బెజవాడ వద్ద కూడా ఇలాంటి ఆనకట్ట కట్టాలని కాటన్ ప్రతిపాదించారు. 1852లో ప్రారంభించి 1855లో దీనిని కూడా పూర్తి చేశారు. ఫలితాలు అద్భతం. ఆనకట్ట లేనపుడు రాజమండ్రి ధాన్యాన్ని దిగుమతి చేసుకునేది. దిగుమతి విలువ 1843-44లో రూ.4.42 లక్షలు. 1875-76 వచ్చే సరికి అది 6.01 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. తినడానికీ, విత్తనానికీ కలిపి అప్పటకి 3.37 లక్షల టన్నులే అవసరం ఉంది.

1821-23 నుంచి 1842-43 నాటికి జిల్లా జనాభా పావు వంతు తగ్గిపోయినా… ధాన్యం ఉత్పత్తి మాత్రం 5.61 లక్షల టన్నుల నుంచి 1891 నాటికి 20.78 లక్షల టన్నులకు ఉత్పత్తి పెరిగింది. బ్రిటీష్ ప్రభుత్వం చాలా సంతోషించింది. ఎందుకంటే పన్ను ఆదాయం రూ.17.25 లక్షల (1843-44) నుంచి రూ.70.95 లక్షల (1894-95)కు పెరిగింది.

ఈ రకమైన మార్పు కృష్ణాజిల్లాలో కూడా వచ్చింది. 1875లో మొత్తం ధాన్యం దిగుబడిలో 57 శాతం ఇక్కడ నుంచి రావడం ప్రారంభం అయింది. కాటన్ ఆనకట్ట కట్టిన 150 ఏళ్ల తర్వాత.. కోస్తా జిల్లాలు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ధాన్యాగారాలుగా మారిపోయాయి. ఏపీ ( ఏపీ అంటే ఉమ్మడి రాష్ట్రంగా చదువుకోవాలి)లో మొత్తం దిగుబడుల్లో.. వరి, మిరపలో 49 శాతం, చెరకులో 39 శాతం, పత్తిలో 33 శాతం ఈ నాలుగు జిల్లాల నుంచే వస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం.. మొత్తం విస్తీర్ణంలో ఈ నాలుగు  జిల్లాలు కేవలం 14 శాతం ఉన్నాయి. మొత్తం జనాభాలో 23 శాతంగా ఉన్నారు. వర్షాధార పంటలుకాస్తా… సాలీనా రెండు పంటలు (ఖరీఫ్, రబీ) రావడం మొదలైంది.

కాటన్ దొర వల్ల అత్యధికంగా లబ్ది పొందింది  కోస్తా జిల్లాల్లోని కమ్మ సామాజిక రైతులే. మద్రాసు గవర్నర్ సర్ ఎం.ఇ. గ్రాంట్ డఫ్ విజయవాడకు వచ్చినపుడు… ఈ సామాజిక వర్గంలో మాటకారులైన కొందరు ఆయన్ను కలిసి.. మా కోసం ఇంత మేలు చేసిన బ్రిటీషు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కమ్మవాళ్లు 5 శాతంగా ఉన్నారు. ఎక్కువ మంది కోస్తాజిల్లాల్లోనే ఉన్నారు. 1921 జనాభా లెక్కల ప్రకారం కృష్ణాలో 25.8 శాతం, గుంటూరులో 36 శాతం, నెల్లూరులో 12.5 శాతం, అవిభాజ్య గోదావరి జిల్లాలో 6.4 శాతంగా ఉన్నారు. భారీ ఎత్తున వ్యవసాయాన్ని విస్తరించారు. ఎక్కువ భూములున్న సామాజిక వర్గం కూడా ఇదే.

గోదావరి డెల్టాలో కాపు సామాజిక వర్గం సంఖ్యలో ఎక్కువగా ఉన్నా… కమ్మవాళ్ల దగ్గర్నే ఎక్కువ భూములు ఉన్నాయి. ఇరిగేషన్ సౌకర్యం వచ్చే వరకూ.. మద్రాసు ప్రెసిడెన్సీలోని మెట్ట ప్రాంత రైతుల్నీ, డెల్టా రైతుల్నీ విడిగా చెప్పడానికి ఉండేది కాదు.

పంటలు పండని జిల్లాల్లో 1900 సంవత్సరంలో ఏటా గరిష్ఠంగా రూ.10 కట్టించుకునేవారు. 70 శాతం ఇందుకోసమే పట్టాలు ఇచ్చేవారు. సరాసరి చూస్తే రూ.4 పన్నుగా ఉండేది. నీటి సౌకర్యం ఉన్న గోదావరి డెల్టాలో 4 శాతం పొలాలకు మాత్రమే రూ.10 లోపు శిస్తు ఉండేది. 62 శాతం పొలాలకు రూ.30 నుంచి రూ.250 వరకూ ఉండేది.వీళ్లు మాత్రం పన్ను తాకిడికి గగ్గోలు పెట్టేవారు. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతం వాళ్లు రూ.36 నుంచి రూ.70 చెల్లించేవారు. ధనికులని కాదు కానీ… ఎక్కువ మొత్తాన్నే చెల్లించేవారు. కాటన్ కట్టిన ఆనకట్టలు.. పెద్ద విప్లవాన్నే తెచ్చిపెట్టాయి. ఇది కోస్తాంధ్రలోని కమ్మ రైతుల ఎదుగుదలకు ఉపకరించింది. రైత్వారీ రెవిన్యూ సెటిల్మెంట్లు, ఎక్కువ దిగుబడులు, వారిలో ఉన్న వ్యాపార దృక్ఫథం ఇందుకు తోడయ్యాయి. అమారకం వ్యవస్థ (జమిందారుల ద్వారా పన్నుల వసూలు) విధానంలో గ్రామాలను మొత్తంగా జమిందారులకు బ్రిటీష్ ప్రభుత్వం అప్పగించింది.  రైత్వారీ వ్యవస్థ పాదుకుంటున్న దశ. కాల్వలు కూడా వచ్చాయి. తర్వాత… ప్రభుత్వం రైతు నుంచే వసూలు చేయడం ప్రారంభించింది. రైతుకు పట్టాలు ఇచ్చారు. రెవిన్యూ ఎంత కట్టాలన్నది మాత్రం ఏకరూపక విధానంలోనే ఉండేది.

రేటు విధానంలో ఉండటం వల్ల ఎక్కువ దిగుబడి కోసం రైతులు ప్రయత్నించేవారు. తర్వాత ఎక్కువ ధర పలికే పంటల్ని పండించేందుకు కూడా ప్రోత్సహం లభించేది. డెల్టా ప్రాంతంలో జొన్నలు, బజ్రాలు పండించేవారు గానీ… వరి, చెరకు ఎక్కువ ధర రావడం వల్ల తృణ ధాన్యాల ఉత్పత్తి క్రమేపీ పడిపోయింది. మెట్ట ప్రాంతాల్లో పత్తి, మిరప, పొగాకు, నూనెగింజల సాగు పెరిగింది. దీనివల్ల రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం (మసులీపట్నం), గుంటూరు, తెనాలి వ్యాపార కేంద్రాలుగా ఎదిగాయి. రైతులు ఈ ప్రాంతాల్లో తమ ఉత్పత్తులను విక్రయించుకునేవారు. కృష్ణానది దిగువున ఉన్న పెద్దగంజాం నుంచి దక్షణ ఆర్కాటు బ్యాక్ వాటర్స్ ను కలుపుతూ కోరమాండల్ తీరం వెంబడి 420 కిలోమీటర్ల పొడవులో ఉన్న బకింగ్ హామ్ కాల్వ డెల్టా రైతులకు వరంగా మారింది. మద్రాసు, తమిళనాడు జిల్లాల్లో ధాన్యం మార్కెట్లు రావడానికి ఉపకరించింది.

కాకినాడ ఓడరేవు నుంచి ధాన్యం ఎగుమతులు భారీగా జరిగేవి. కోస్తా జిల్లాలకు రైల్వే లైను కావాలని 1860 తొలి నాళ్లలో ప్రముఖ రైతులు, వ్యాపారులు, కోకనాడ (కాకినాడ) ఛాంబర్ ఆప్ కామర్స్ డిమాండు చేశాయి. 1890లు వచ్చేసరికి రైల్వే లైన్లు వచ్చాయి. కాటన్ ఆనకట్ట…రైత్వారీ శిస్తుల వివరాలను 1903 డిసెంబరు 17నాటి బోర్డ్ ఆఫ్ రెవిన్యూ నివేదికలో చూడొచ్చు. బెజవాడలో ధాన్యం కేంద్రంలో రైతులందరూ కలిసి… ధాన్యం ధరను నిర్ణయించేవారు. శాంపిళ్లు కూడా ఉండేవి. మద్రాసు నుంచి వచ్చిన కమీషన్ వ్యాపారులు, బాంబే ఏజంట్లు, పూణే కంపెనీలు ధాన్యం కొనుగోలు చేసేవారు. బెజవాడ, మసులీపట్నం, మద్రాసు, సికిందరాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్ణయించిన ధరలే తెనాలిలో అమల్లో ఉండేవి. ఇక్కడ ధాన్యం కొన్నవారుగానీ, లేదా ధాన్యాన్ని కొన్న ధనిక రైతులుగానీ.. మరింత రేటు వచ్చే వరకూ ధాన్యాన్ని నిల్వ చేసుకునేవారు. ధర పెరిగిన తర్వాత తెనాలికి తెచ్చేవారు. ధాన్యం ధర ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడికి ఎగుమతి చేసేవారు.

(మిగతా పార్టు-02లో)

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *