బడుగు బతుకుల్లో తొలి పొద్దు!!

February 8, 2019 | News Of 9

Pawan | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేక కథనం)

అనంత విశ్వం…

విశ్వంలో సూర్యమండలం…

సూర్యమండలంలో భూమి…

భూమిపై ఒక చుక్క. ఈ చుక్క మీరు కావచ్చు. నేను కావచ్చు. ఎవరైనా కావచ్చు.

మాతృగర్భంలో అనంతమైన చీకట్ల నుంచి ఈ భూమ్మీదకు తొలి ప్రయాణం ‘‘మీలో నేను ఒకడిని’ అన్న కేకతో ప్రారంభం అవుతుంది. చుట్టూ… కన్ను తెరిచి తేరిపార చూడలేనంత వెలుగు.. బహుశా తనలాంటి రూపంలోనే కొంతమంది. వీళ్లెవరు? ఈ చుట్టూ ఉన్నదేమిటి? అన్న ప్రశ్నతో సంఘర్షణ మొదలవుతుంది. ఈ సంఘర్షణే జీవితాంతం వెంటాడుతుంది. ప్రపంచం కొంత అర్థమైనట్లే ఉన్నా…‘‘నేను ఎవరిని?’’ అన్న ప్రశ్నకు సమాధానం తెలియడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. తెలిసిన తర్వాత తనకూ, ఈ ప్రపంచానికీ ఉన్న బంధం ఏమిటి అన్న మరో ప్రశ్న.. మరొక సంఘర్షణ. ఈ సంఘర్షణ వలయాలను దాటుకుంటూ సమాధానాలు తెలియక మళ్లీ చీకటిలో కలిసిపోతారెందరో. కానీ ఈ సంక్లిష్ట మనో సంఘర్షణను అధిగమించి.. అనంతమైన వెలుగువైపే ఇక నా ప్రయాణం అని ‘‘ఒక మనిషి’’ నిర్ణయించుకుంటాడు. ఇలా నిర్ణయించుకున్న వారు కారణజన్ములు అవుతారు. మనం మహాత్ములు అనేది అలాంటి వారినే!!

***

అలా అనంత విశ్వం నుంచి ఒక చిన్న చుక్క ‘భావపురి’లో కళ్లు విప్పింది. భావనారాయణ గుడి ఉన్నందున దీనిని భావిపురి అని పిలిచేవారు. స్వాతంత్ర్యభావాలు పురివిప్పిన నేల. గాంధీ మహాత్ముని పాదస్పర్శతో పులకించిన నేల. 1971 సెప్టెంబరు 02న ఒక ఉద్యమ బాలుడు ఆ నేల తల్లి ఒడిలో ప్రభవించాడు.

***

అనగా అనగా కథలతో బాల్యం మొదలవుతుంది. ఊహ వచ్చిన దగ్గర నుంచీ అమ్మ చెప్పే కథల్లో నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తాం. అందుకే అనగా అనగా కథలు మానవ చరిత్రలో ఒక ముఖ్యఘట్టంగా ఉంటాయి. వయసు మీరినా వీటి ప్రభావం అనంతంగా సాగుతుంది. ఈనాడు మనం సినిమాలు ఇష్టంగా చూడటానికి మూలాలు ఇక్కడే ఉన్నాయి. మానవేతిహాసంలో నేటికీ కల్పిత కథలదే అగ్రతాంబూలం. ఒక హీరో ఉంటాడు. అతనికి ఒక లక్ష్యం ఉంటుంది. అది మనసు దోచిన ప్రియురాలు కావచ్చు. సమాజాన్ని పట్టి పీడించే రాక్షసుడు కావచ్చు. చెడుపై మంచి చేసే పోరాటం. చివరికి హీరోనే గెలుస్తాడు. ప్రియురాలిని రక్షిస్తాడు. లేదా ప్రజల్ని పీల్చిపిప్పి చేసే రాక్షసుడు పీడ విరగడ అవుతుంది. అందరం హమ్మయ్య అనుకుంటాం. మధ్యలో హీరో చనిపోయేంత పరిస్థితి వస్తుంది. ఏ దేవకన్యనో వస్తుంది. హీరోకి ఒక వరం ఇస్తుంది. తేలికగా రాక్షసుడి ఉండే ప్రాంతానికి హీరో వెళ్లగలుగుతాడు. ఇప్పుడు ఏం జరుగుంది? లక్ష్యాన్ని సాధించకుండానే హీరో చనిపోతాడేమో అని ప్రేక్షకులు (కథ వినేవారు) భయపడతారు. చివరికి హీరోనే గెలుస్తాడు. హమ్మయ్య అని ప్రేక్షకులు అనుకుంటారు. సినిమా కథల అంతస్సూత్రం ఇదే. మంచిపై చెడు గెలవాలని ఎవరం కోరుకోం. ఈ భూమ్మీదకు వచ్చిన ప్రతి మనిషి కథలో ఒక కథ ఉంటుంది. ఒక కష్టం ఉంటుంది. ప్రపంచంలోని అన్ని పురాణ కథలూ ఇలాగే ఉంటాయిని తొలుత గుర్తించిన వ్యక్తి అరిస్టాటిల్. తర్వాత దీని మీద సుదీర్ఘమైన పరిశోధన చేసిన జోసెఫ్ క్యాంప్ బెల్ ‘‘ది హీరో విత్ ఏ ధౌజండ్ ఫేసెస్’’ ఒక సిద్ధాంత గ్రంథం కూడా రాశారు.

సినిమాని తక్కువగా అంచనా వేయరాదు. ఆ అనగా అనగా కథలకు ఆధునిక రూపమే సినిమా. సినిమాయే జీవితం కూడా అవుతుందన్నది మనం అంత తేలికగా గుర్తించని మరో మేలుకొలుపు. చూడండి. ప్రతి జీవితంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. మంచి చెడులూ ఉంటాయి. మనిషి ప్రయాణం మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సినిమా హీరో చేసే ప్రయాణంలాగనే ఉంటుంది. మీరు చేయాలనుకన్న పనుల్ని అడ్డుకునే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. చివరికి విజయం సాధిస్తే జీవితంలో మీరు హీరో అవుతారు. కొన్నిసార్లు చెడు గెలుస్తుంది. కానీ తాత్కాలికమే. మళ్లీ పోరాటం సాగిపోతుంది. గెలిచే వరకూ. ఇదీ లక్షల సంవత్సరాల్లో సుదీర్ఘంగా జరిగిన మానవ ప్రయాణం చెప్పిన జీవిత సత్యం.

***

భావిపురిలో అదే నేటి బాపట్లలో పుట్టిన కళ్యాణ్ జీవన యానం కూడా ఇంతే ఉంటుంది కదా. మెగాస్టార్ తమ్ముడైన కళ్యాణ్ కు చిన్నతనం నుంచీ అన్నీ ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబమే అయినా పెద్ద లోటు లేదు. కానీ ఈ ‘‘నేనెవరిని?’’ అన్న ప్రశ్న అందరినీ వేధించినట్లే కళ్యాణ్ ను వేధించింది. జీవితంలో మరో పెద్ద తికమక- సమయం. అది కనిపించదు. కానీ కరిగిపోతుంది. ప్రయాణం ఎటువెళుతున్నదో తెలియదు. ఇవన్నీ బుద్ధిజీవులం కనుక మనుషులకే ఉంటాయి. 

ఏది నీతి? ఏది కాదు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి యుక్త వయసులో. చుట్టూ ఉన్న ప్రపంచంలో 99 శాతం మందికి ఇవన్నీ ఉంటాయికానీ… చాలా మంది కాల ప్రభావానికి లొంగిపోతారు. కొందరు లొంగరు. కల్యాణ్ జీవితంలో కూడా అదే జరిగింది. అందరిలా కళాశాలకు వెళ్లినా ఆ చదువులు ఎక్కలేదు. వైరుధ్యం… పుస్తకాల్లో ఒకటి ఉంటుంది. బయట ప్రపంచం మరోలా ఉంటుంది. సంఘర్షణ. అంత:పురంలో ఉన్న రాజకుమారుడికి అన్నీ ఉంటాయి. కానీ.. తన ప్రశ్నలకూ, సంఘర్షణలకూ సమాధానాలు దొరకవు. కళ్యాణ్ కూడా ఈ సమాధానాల కోసం కాలేజీకి గుడ్ బై కొట్టేశాడు. కథలో హీరో ప్రయాణంలాగానే.. కళ్యాణ్ జీవితంలో కూడా అన్వేషణ మొదలైంది. అనేక పుస్తకాలు చదివాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. ఆత్మస్థైర్యం అయితే వచ్చింది. కానీ సమాజానికి సంబంధించిన సంఘర్షణ అలాగే ఉంది. యోగ నేర్చుకోవడానికి తిరుపతికి  వెళ్లాడు.

***

పి.గన్నవరం బహిరంగ సభలో ఆయన ప్రసంగం ఎలా ఉందో చూద్దాం…

‘‘వీళ్లు ప్రజల మధ్య కులం, మతం, ప్రాంతం అంటూ చిచ్చు రేపుతున్నారు. వాళ్ల స్వార్థం కోసమే చేస్తున్నారు. వాళ్లకి అభివృద్ధి చేసే వక్తిలేక, దోపిడీకి అలవాటుపడి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. మానవత్వంతో చూస్తే కులం, మతం, ప్రాంతం ఏవీ కనిపించవు’’ అన్నాడు. భూమిని దోచుకుందామనుకున్న వాళ్లు ఎవరూ మిగల్లేదు. పురాణాల్లో రాక్షసుల నుంచి ఈనాటి కాలం వరకూ అలాంటి వాళ్లు చింతకాయల్లా రాలిపోతారు’’ అంటూ స్వామీజీ చెప్పిన మాటల్లోనే తన ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాడు.

‘‘తెలుగుదేశం నేతల్లా కడుపులో విషం దాచుకుని, నాలుకపై తేనె పూసుకుని మాట్లాడటం నాకు చాతకాదు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. అందరికీ ఉద్యోగాలు రావాలంటే,అవినీతిని ముందు తరిమేయాలి. ఖనిజాలను అమ్మేసుకుంటారా? ప్రకృతిని ధ్వంసం చేస్తారా?.. యువతకు 25 కిలోల బియ్యం ఇవ్వడం కంటే 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వాలి.అందుకోసం పని చేయాలి’’ అని అన్నారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచీ ఇప్పటి వరకూ రెండే రెండు కుటుంబాలు పరిపాలన చేశాయి. మర్యాదగా మాట్లాడుతున్నాం కానీ,జేబులో బాంబులు పెట్టుకుని తిరుగుతున్నాం’’ అని నిప్పులు కురిపించారు. ‘‘దౌర్జన్యం చేసే వ్యాపారవేత్తలు చింతకాయల్లా రాలిపోతారు. వారికి మద్దతుగా ఉన్నవారు దీపావళి టపాకాయల్లా పేలిపోతారు’’ అని తాటాల్లాంటి మాటల్ని వాడారు. ‘‘ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టు.. కడుపు నిండి తేన్పులు వచ్చే వాడికి కాదు’’ అన్నది గొలగమూడి వెంకయ్య స్వామిజీ చెప్పిన మంచి మాట. దీని ప్రభావం పవన్ కళ్యాణ్ పై ఉండి ఉంటుంది.

ఈ ఆవేశం… మొత్తం పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలను చూసి తట్టుకోలేక గుండెల్లో నుంచి ఉబికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది.

***

తిరుపతి నుంచి తిరిగి వచ్చేశాడు. ఏం చేయాలో తెలియదు. అన్న, మెగాస్టార్ చిరంజీవి- సినిమాలు ట్రై చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారు. సినిమాల్లోకి వెళితే కొత్త జీవితం ఉంటుందేమో… లేక తనలో సుడులు తిరుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయోమో అని భావించారు కళ్యాణ్. చెప్పలేం. ప్రపంచంలో లెక్కకు మిక్కిలి భాషల్లోకి అనువాదమైన పుస్తకం. ది ఆల్కెమీ. బ్రెజిలియన్ రచయిత పాల్ కొయిలో రాశారు. అందులో అంటారు… ‘‘నీ లక్ష్యంవైపే నీ ప్రయాణం సాగుతుంది. అది నీకు తెలియదు. అందుకు సంబంధించిన శుభ శకునాలు మాత్రం నీకు కనిపిస్తాయి’’ అంటాడు పాల్ కొయిలో. అవును. ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనుభవంలో ఉంటుంది. కొన్నిసార్లు గుర్తిస్తాం. కొన్నిసార్లు గుర్తించలేం. అప్పుడు ఫలానా అవకాశం వచ్చింది కానీ నేను గుర్తించలేదు అని మనం చాలాసార్లు అనుకునేది అందుకే. అందుకే పవన్ కళ్యాణ్ వెదుకుతున్నాడు. సినిమాలు చేశారు. తాను అనుకున్నట్లే వెండి తెరపై కథను కూడా నడిపించాడు. అందుకే చాలా మంది పవన్ కళ్యణ్ కు తిక్క అన్నారు. అవును. ఈ ప్రపంచంలో మనిషి చేసే వెదుకులాట… అన్వేషణ ఇతరులకు తిక్కలాగానూ, పిచ్చిలాగానూ కనిపించకపోతే మీరు 99శాతంలో ఒకరుగా మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్ అరుదైన ఒ ఒక్క శాతంలో ఉన్నారు. సినిమాల్లో హీరో ఉంటాడు. అనేకమైన సమస్యల్ని చిటెకెలో పరిష్కరించినట్లు చూపిస్తారు. అవి కథలుగానే మిగిలిపోతున్నాయి కానీ… వాటి ప్రభావం సమాజంలోని సమస్యలను ఏమీ ప్రభావితం చేయడం లేదు. ఇది కాదనేది ఆయనకు అర్ధమైపోయింది. తాకట్టులో భారతదేశం దగ్గర నుంచీ మార్టిన్ లూధర్ కింగ్ వరకూ అనేక మంది జీవితానుభవాలను తనలో నింపుకున్నారు. అనగా అనగా కథలు చెబితే ఈ సమాజం మారదనేది అర్థమైంది. కరుడు గట్టిన ఈ సమాజాన్ని మార్చాలంటే రాజకీయాలే పరిష్కారం అని అర్థమైంది. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. తర్వాత కథ మన అందరికీ తెలిసిందే!!

(పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పిన సంఘటనలు, సినిమా సిద్ధాంతాల అధ్యయనం, నా జీవితానుభవాల ఆధారంగా ఒక యోధుడి మానసిక సంఘర్షణనీ, ప్రయాణాన్నీ మీకు చెప్పేందుకు చేసిన ప్రయత్నమే ఈ కథనం)

గుగ్గిళ్ల శ్రీనివాసరావు

ప్రధాన సంపాదకుడు, న్యూస్ ఆఫ్ 9

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *