ఆ పాపం…చంద్రబాబు ప్రభుత్వానిదే!!

February 25, 2019 | News Of 9

సత్యం వధ... ధర్మం చెర..!!

 • బొప్పాయి తోట విడిదిగా పోలీసుల హల్ చల్
 • వచ్చింది వీఐపీ రక్షణ కోసం.. చేసిన పని వేరు
 • చెట్ల కిందనే పడక, పేకాట… స్టేకులు రాసుకున్న కాగితాలు
 • అదేమని ప్రశ్నించిన రైతు కోటయ్య
 • ఉదయమే కోటయ్యపై చెయ్యెత్తిన యడ్లపాడు ఎస్ఐ
 • పోలీసు జులుం నుంచి కాపాడమని అడిగినా చేతులెత్తేసిన పెద్దలు
 • పోలీసు దెబ్బలకు రైతన్న నేలకూలింది తన బొప్పాయి తోటలోనే
 • పోలీసుల్ని అడ్డుకోవడమే రైతన్న చేసిన నేరం
 • నిజాన్ని కప్పిపెట్టేందుకే పెద్దల ప్రయత్నం
 • నిస్సహాయ స్థితిలో కోటయ్య కుటుంబం
 • బొప్పాయి తోట చెప్పిన అసలు నిజాలు
 • రైతు మృతిపై ‘‘న్యూస్ ఆఫ్ 9’’ క్షేత్రస్థాయి పరిశోధన

(న్యూస్ ఆఫ్ 9)

చుట్టూ కొండలు… ఆహ్లాదకరమైన వాతావరణం.. మధ్యలో అన్నీ పొలాలు.. ఆ పొలాలకు ఆనుకుని ఓ 500 గడపలున్న చిన్న గ్రామం- పుట్టకోట. దీనికున్న మరో పేరు కొత్తపాలెం. చీకూ చింతాలేని పల్లె.. ప్రకృతి ఒడిలో నాలుగు గింజలు పండించుకుని పొట్ట పోసుకునే కుటుంబాలే ఎక్కువ. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల పాలన కింద ఉన్న ‘‘కొండవీడు’’ సంస్థానం ఉన్న కొండగుట్టల దిగువన ఉన్నదే ఈ పుట్టకోట.

ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉన్న ఈ పుట్టకోట గ్రామం… నాలుగైదు రోజుల కిందట హఠాత్తుగా వార్తల్లో నిలిచింది. కారణం.. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులు.. ఓ రైతు ప్రాణాల్ని నిర్దాక్షిణ్యంగా కాటేయడమే. వాళ్ల కిరాతకానికి ఒక బక్క రైతు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైతే రాజు… రైతే మా దేవుడు అని చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వ హయాంలోనే… అదీ ఏపీ సీఎం చంద్రబాబు.. కొండవీడుకు వస్తున్న సందర్భంలో.. పుట్టకోటకు చెందిన కోటయ్య పోలీసుల ముష్ఠి ఘాతాలకు బలైపోవడం విషాదం.

కోటయ్య మృతదేహం: బుగ్గల్లో వాపును చూడవచ్చు 

తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం పోలీసులను వెనుకేసుకుని వస్తున్నది. రైతు హత్యను… ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఏకంగా ప్రభుత్వమే దన్నుగా నిలిచింది. చావు బతుకుల్లో ఉన్న రైతును కాపాడేందుకు ప్రయత్నించామే తప్ప ఇందులో తమ తప్పు ఏమీ లేదని పోలీసులు చెప్పగా… ‘‘అంతేగా.. అంతేగా’’ అంటూ ఏపీ ప్రభుత్వం తలూపుతున్నది. రైతు ఆత్మహత్యగా చిత్రీకరించడంలో భాగంగా పోలీసులు విడుదల చేసిన వీడియో కూడా అందిరినీ తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నంగానే మిగిలింది. పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదని భావిస్తుంది. కానీ దాని మూతికున్న మీసాలు నిజం చెబుతాయి.

కోటయ్య విషయంలో..  తెలుగు మీడియా తన సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరించింది. ఏ ఒక్క మీడియా కూడా కోటయ్య విషయంలో న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించలేదన్నది వాస్తవం. పోలీసులు చెప్పిందీ, రాజకీయ నాయకులు చెప్పిందీ, తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందీ.. యథాతధంగా రాసుకున్నారు పత్రికా విలేకరులు. అదే పత్రికల్లో వచ్చింది. టీవీలు కూడా ఈ భిన్న వాదనలనే ప్రసారం చేశాయి. ప్రభుత్వం, పోలీసులూ కలిసి.. ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టించాయి. నిజాలకు ఉప్పు పాతర వేసి అయోమయాన్ని సృష్టించడం, అదే తరహాలో రాజకీయాలు చేయడం తెలుగుదేశం ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అన్నది తెలిసిందే.

ఇంతకీ రైతు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక పోలీసులు చంపేశారా? అసలు నిజం ఏమిటన్నది ఇద్దరికి స్పష్టంగా తెలుసు. ఒకరు పోలీసులు. రెండు టీడీపీ ప్రభుత్వం. కానీ ఈ రెండూ కుమ్మక్కయి ‘‘రైతు ఆత్మహత్య’’ అన్న కథనే వినిపిస్తున్నాయి. దానినే మీడియాలో ప్రముఖంగా వచ్చేలా జాగ్రత్తపడ్డారు. అసలు నిజం చెప్పడానికి కోటయ్య ఇపుడు జీవించిలేడు. నిజాలు తెలుసుకునే మార్గం ఏమిటి? దుర్ఘటన జరిగిన ప్రాంతానికి స్వయంగా వెళ్లడమే. అందుకే ‘‘న్యూస్ ఆఫ్ 9’’ స్వయంగా పుట్టకోట గ్రామాన్ని సందర్శించింది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో ఈ గ్రామం ఉంది.

ఊళ్లోకి ప్రవేశించే ముందే… ఒక యువకుడు కనిపిస్తే రైతు ఎలా చనిపోయాడని అడిగాం. ‘‘ఏమోనండి. పోలీసులేమో ముందు ఆత్మహత్య అన్నారు. తర్వాత ఒత్తిడితో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చిందని చెబుతున్నారు. గ్రామస్థులేమో పోలీసులే చంపేశారని అంటున్నారు’’ అని అన్నాడు. పుట్టకోటకు కిలోమీటరు దూరం దాటి వాస్తవాలు తెలియడం లేదు. గ్రామస్థులకు ఏం జరిగిందన్నది పూర్తిగా అవగాహన ఉంది. సరేనని గ్రామంలోకి ప్రవేశించి అసలు విషయాన్ని కూపీ లాగేందుకు ప్రయత్నించాం. మేం తెలుసుకున్న విషయాలను బట్టి వాస్తవాలు ఇలా ఉన్నాయి. కోటయ్య (పూర్తి పేరు పిట్టల కోటేశ్వరరావు). మొత్తం 14 ఎకరాల పొలం. దీని అసలు యజమాని వెంగళరెడ్డి. పోలీసులు ఆగం చేస్తున్నారని చెప్పినపుడు మొదటి రోజున… ‘‘పోలీసులకు పొలం ఎందుకు ఇచ్చావు’’ అంటూ వెంగళరెడ్డి కోటయ్యను మందలించారట. 

అసలు కథ ఇదీ…!!

ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో సీఎం ప్రోగ్రాం ఉంది, పొలం వద్ద పోలీసు కంట్రోలు రూమ్ పెడుతున్నామని, అందుకు మీ అనుమతి కావాలంటూ యడ్లపాడు ఎస్ఐ శ్రీనివాస్ రైతు కోటయ్యను సంప్రదించారు. బొప్పాయి తోటకు పక్కనే రోడ్డు పక్కగా అర ఎకరం ఖాళీగా ఉందని, అది వాడుకోవచ్చని కోటయ్య చెప్పాడు. అయితే అనుకున్నట్లుగా సీఎం ప్రోగ్రాం 9, 10 తేదీల్లో జరగలేదు. 17, 18 తేదీలకు అది వాయిదా పడింది. అయితే వాయిదా గురించిగానీ, దేని గురించీ కోటయ్యను పోలీసులు సంప్రదించలేదు. 16వ తేదీన పొలంలో పోలీసులు టెంట్లు వేసుకున్నారు. 300 నుంచి 400 మంది పోలీసులు కోటయ్య తోటలో విడిది (విడిది అనడానికి కారణం ఉంది) చేశారు. వీళ్లు తోటను నాశనం చేస్తారేమో అన్న భయంతో కోటయ్య తన భార్యను పొలానికి కాపలా పెట్టాడు. బొప్పాయిలు ఇవ్వాల్సిందిగా పోలీసులు అడిగితే… డబ్బులు ఇచ్చి తీసుకోవాలని కోటయ్య భార్య ఖరాకండిగా చెప్పింది ‘‘పగలనకా, రాత్రనకా కష్టపడి పొలం చేసుకుంటున్నాం. ఊరికే ఎలా ఇవ్వగలం చెప్పండి’’ అని కోటయ్య భార్య మాతో అన్నది. డబ్బులు ఇస్తేనే అని కోటయ్య భార్య అనడంతో ‘‘సీఎం గారు ఈ పొలం మాకు ఇచ్చారు. మేం పోలీసోళ్లం. డబ్బులు ఎలా ఇస్తాం’’ అంటూ పోలీసులు తమదైన శైలిలో చెప్పారు. ఎండ వేడిమి విపరీతంగా ఉండటంతో పోలీసులు బొప్పాయి తోటలోనే ఆకుల్ని నేలపై పరుచుకుని పడుకున్నారు. ఈ పొట్టి బొప్పాయి చెట్లు ఆకులు తొలగిస్తే అవి చచ్చిపోతాయి. కాయలు కూడా పాడైపోతాయి. పంట వేసినవాడికి మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. దీనిని కూడా కోటయ్య దంపతులు చూశారు. పోలీసుల్ని దంపతులు వ్యతిరేకించారు. ఆ రోజు అక్కడితో ఘర్షణ సద్దుమణిగింది. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాలని కోటయ్య మనసులో ఉంది.

బొప్పాయి తోటలో విధ్వంసం: పోలీసుల దాష్టీకానికి కూలిన ఈ చెట్లే ఉదాహరణ 

17వ తేదీ అర్థరాత్రి మంత్రి పత్తిపాటి పుల్లారావు పోలీసులు విడిది చేసిన పొలంలో అటూ ఇటు కలియ దిరుగుతుంటే… విషయం తెలుసుకుని కోటయ్య అక్కడికి వెళ్లారు. మంత్రిగారి దగ్గరకు సహజంగానే పోలీసులు వెళ్లనివ్వరు. మంత్రి కూడా మాట్లాడే ప్రయత్నం చేయకుండా ఇంటికి వెళ్లిపోయారు. 18 ఉదయం నుంచి అసలు కథ మొదలైంది. కోటయ్య వాళ్లు వారి పొలంలోనే ఎద్దుల్ని కట్టేస్తుంటారు. వాటిని నీళ్లు పెట్టడానికి కోటయ్య పొలం దగ్గరకు వెళ్లాడు. పొలం దగ్గర సీను మారిపోయింది. పోలీసులు వాడుకోవడానికి కోటయ్య అనుమతించింది కేవలం రోడ్డు పక్కగా ఉన్న పంటలేని అర ఎకరం స్థలం మాత్రమే. ఈ స్థలం దాటి ముందుకు వస్తే… కనకాంబరం చేను, బొప్పాయి తోట పక్కపక్కనే ముందుకు విస్తరించి ఉంటాయి.

కుడివైపున్న ఖాళీ స్థలమే.. పోలీసులు ఉండటానికి కోటయ్య అనుమతించిన ప్రాంతం. ఎడమవైపున్నది కనకాంబరం చేను. దీనిని కూడా వాహనాలతో తొక్కించేశారు. ఈ చేను కూడా ధ్వంసం అయింది. 

కోటయ్య వచ్చే సరికి ఆయన గుండె తరుక్కుపోయింది. ‘‘మీకు ఇచ్చిన స్థలంలో కాకుండా ఇదంతా ఏమిటి?’’ అంటూ కోటయ్య పోలీసులను గట్టిగానే గొడవ పడ్డాడు. వెళ్లి మంత్రికి చెప్పుకోమన్నారు పోలీసులు. అందుకు కోటయ్య అంత అవసరం తనకు లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశాడు. ‘‘ఏమనుకుంటున్నావ్.. ఇది సీఎం ప్రోగ్రాం’’ అంటూ ఎస్ఐ శ్రీనివాస్ చెయ్యెత్తాడు కోటయ్య మీదకు. కోటయ్యకు పరిస్థితి అర్థమైంది. అప్పటికి సమయం ఉదయం 6.30 అవుతోంది. 7.30 కల్లా ఇంటికి వచ్చి ఊళ్లో పెద్ద మనుషులకు జరిగింది చెప్పి..మళ్లీ పోలీసులను ప్రశ్నించేందుకు సిద్ధం అవుతున్నాడు. పెద్ద మనుషుల్ని వెంట బెట్టుకురమ్మని కొడుకు ఆంజనేయుల్ని నిద్రలేపి మరీ చెప్పాడు.  

స్థానికంగా ఉన్న బాబూరావు అనే తెలుగుదేశం నేతను కలిసి విషయం చెప్పి…తర్వాత పొలం దగ్గరకు వెళ్లాడు. 11.40-12.00 గంటల మధ్యలో కోటయ్య కొడుకు… ఆంజనేయులుకు, వాళ్ల పాలేరు పున్నారావు ఫోన్ చేసి… ‘‘నాన్న పురుగు మందు తాగాడు’’ అని చెప్పాడు. ఇంతకు మించి అతను ఏమీ చెప్పలేదు. పున్నారావు గ్రామంలో ఉన్న శివాలయం దగ్గరకు వచ్చి ఫోన్ చేయడంపై కోటయ్య కొడుకు ఆంజనేయులు అనుమానం పడ్డాడు. పురుగుమందు తాగితే… పొలం నుంచే ఫోన్ చేయాలి కదా..  శివాలయం వద్దకు వచ్చి ఫోన్ చేయడం ఏమిటి అని ఆంజినేయుల మనసు కీడు శంకించింది. ఆంజనేయులును పొలం లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఏడుస్తుంటే చివరికి అనుమతించారు. అలా పొలంలోపలికి అడుగు పెట్టగానే కోటయ్యను ఒక కరెంటు డిపార్టుమెంటు వాహనంలో వేసుకుని పోలీసులు ఇతనికి ఎదురు వచ్చారు. సరే, అలాగే తండ్రిని తీసుకుని ఫిరంగిపురంలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరకు వెళ్లి చూపించారు. (పోలీసులు తమ వాహనంలో వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్లలేదు. ఆంజనేయులే తీసుకెళ్లడం గమనార్హం).  ‘‘కోటయ్య పురుగు మందు తాగలేదు. కానీ చచ్చిపోయాడు. ఏమైందో చూసుకోండి’’ అంటూ డాక్టర్ చెప్పాడు. పున్నారావుకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అయింది.

విషయం గ్రామస్థులకు అర్థమైపోయి వారంతా కలిసి ఎస్ఐ ఉన్న పోలీసు జీపును చుట్టుముట్టేశారు. పోలీసు వాహనంలోనే పాలేరు పున్నారావు ప్రత్యక్షమయ్యాడు. ‘‘పోలీసులు నన్ను జీపులో కూర్చోబెట్టారు’’ అన్నమాట తప్ప పున్నారావు ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం కూడా పున్నారావు పోలీసుల సమక్షంలోనే ఉన్నాడని సమాచారం. అతని ఇంటికి మేం వెళ్లినపుడు.. ఇంటికి తాళం వేసి ఉంది. గత కొద్ది రోజులుగా అతని ఆచూకీ లభించకపోవడం, పోలీసుల దగ్గరే ఉన్నాడని చెప్పడం… ఇవన్నీ చూస్తుంటే, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పున్నారావును ఎవరికీ అందుబాటులో లేకుండా పోలీసులు ఎందుకు దాచిపెట్టినట్లు…? పోలీసుల వల్లనే కోటయ్య చనిపోయాడని జరిగిన సంఘటనలన్నీ చెబుతున్నాయి.

సాక్షి మాయం: పాలేరు పున్నారావు ఇల్లు… గత కొన్ని రోజులుగా తాళం వేసి ఉన్నది. మనిషి కనిపించుట లేదు. 

కోటయ్య మృత దేహాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత… ఇంటి చుట్టూ సివిల్ దుస్తుల్లో పోలీసులు దిగిపోయారు. దీనిని పెద్దది చేయవద్దని తెలుగుదేశం నేతలు కోటయ్య కుటుంబానికి నచ్చ చెబుతున్నారు. పోలీసుల తరఫు నుంచి 2 లక్షలు ఇస్తామని చెప్పినట్లు ఆంజినేయులు చెప్పాడు. త్వరగా కార్యక్రమాలన్నీ చేసుకోవాలని కూడా ‘‘పెద్దలు’’ చెప్పారు. కోటయ్య ముఖం వాచిపోయి ఉందనీ, బుగ్గలు రెండూ ఉబ్బిపోయి ఉండటాన్ని చూసి… తన అనుమానాలు నిజమేనని, పోలీసులే కొట్టి చంపేశారనీ ఆంజనేయులుకు అర్థమైంది. పురుగు మందు తాగలేదని ఆర్ఎంపీ డాక్టర్  చెప్పాడు. నోట్లో నురగ లేదు. బుగ్గలు మాత్రం వాచిపోయి ఉన్నాయి. ఛాతీ దగ్గర కూడా వాపు కనిపిస్తోంది. ఖచ్చితంగా పోలీసులు కొట్టి చంపేశారని ఆంజనేయులు నిర్ధారణకు వచ్చాడు.

కోటయ్య ఇంటికి తెలుగుదేశం మంత్రి పత్తిపాటి పుల్లారావు వచ్చారు. బాధిత కుటుంబానికి ఆయన రెండు అవకాశాలు ఇచ్చారు. పోస్టుమార్టం చేయించుకోవచ్చనీ, లేదంటే అలాంటి అవసరం లేకుండా కూడా తాను చూస్తానని మంత్రి పుల్లారావు ఆంజనేయులుకు చెప్పారు. మంత్రి పుల్లారావు సమక్షంలోనే… పాలేరు పున్నారావు మీడియా ముందు మాట్లాడుతూ ‘‘కోటయ్య పురుగు మందు తాగాడు’’ అని చెప్పేశాడు. మంత్రులూ, ప్రభుత్వం అందరి కథనం ఇలాగే ఉంది. ఒక పథకం ప్రకారమే కోటయ్య హత్యను ఆత్మహత్యగా చిత్రించేందుకు ‘‘పెద్దలు’’ అందరూ ప్రయత్నించారు.

పోలీసుల వినోదానికి… బొప్పాయి తోట జూదశాలగా మారింది 

బొప్పాయి తోటకు వెళ్లి… అక్కడున్న పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రయత్నించాం. బొప్పాయి తోటలో చాలా చోట్ల బొప్పాయి కాయలు కోసి కిందపడేసి ఉన్నాయి. రోడ్డుకు అభిముఖంగా బొప్పాయి తోటలోకి వెళ్లి చూడగా… అక్కడ బొప్పాయి ఆకులు పరుచుకుని పోలీసులు పడుకున్న ఆనవాళ్లు ఎండిన ఆకుల రూపంలో ఇంకా అక్కడే ఉన్నాయి.  పోలీసులు చేసిన నిర్వాకం కూడా కళ్లకు కట్టినట్లు అక్కడ కనిపిస్తోంది. వాళ్లు పేకాట ఆడుకున్న కార్డులు ఉన్నాయి. రమ్మీ ఆడుకుంటూ స్టేక్స్ నమోదు చేసుకున్న కార్డు ముక్కలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల చెట్లను వేళ్లతో పెకలించి ఉన్నాయి. పోలీసులు కూర్చున్న దగ్గర.. ఒక బలమైన బొప్పాయి చెట్టు సగానికి విరిగిపోయి ఉంది. బహుశా కోటయ్యతో జరిగిన ఘర్షణలో కోటయ్య ఈ చెట్టుపై పడిపోవడం వల్ల ఆ చెట్టు విరిగిపోయి ఉండొచ్చు. ఇంతబలమైన చెట్టు విరిగిపోయిదంటే.. ఇక్కడే గొడవ ఏ స్థాయిలో జరిగి ఉంటుందని ఆంజనేయులు అనుమానం వ్యక్తం చేశాడు. ఇక్కడే నాన్న చనిపోయి ఉంటాడని అన్నాడు. రోడ్డుకు అభిముఖంగా బొప్పాయి తోట దాటితే కొద్ది దూరంలో కొండలు వస్తాయి. ఆ కొండలకూ బొప్పాయి తోటకీ మధ్య ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం చివరలో ఒక వేప చెట్టు ఉంది. పోలీసులు కోటయ్యను ఆస్పత్రికి తీసుకుపోతున్నట్లు వీడియో తీసింది కొండలకూ… బొప్పాయి తోటకూ మధ్య ఉన్న ఖాళీలోనే. కోటయ్య మృతదేహాన్ని మోసుకుంటూ పోలీసులు పరుగు తీస్తున్నది ఈ ఖాళీ ప్రాంతంలోనేన్నది. బొప్పాయి తోటలో వీడియో తియ్యడానికి అవకాశం తక్కువ. అందుకే మృతదేహాన్ని బొప్పాయి తోట వెనుక ప్రాంతానికి తెచ్చి వీడియో తీసినట్లు అర్థం అవుతున్నది. 

పోలీసులు కోటయ్య మృతదేహంతో పరుగు తీసిన ప్రాంతం ఈ బొప్పాయి తోట వెనుక ఉంది. కోటయ్య చనిపోయింది బొప్పాయి తోట లోపల. (టీవీల్లో చూపించిన ఫోటోని మేం తీసిన ఫోటో దగ్గర పెట్టి చూశాం (కుడివైపున). ఖచ్చితంగా పోలీసులు పరుగు పెట్టింది ఇక్కడే. 

అయిందేదో అయిపోయిందని పోలీసులు చెప్పడాన్ని చూస్తే పోలీసులు ఆవేశంలో కోటయ్యను గట్టిగా కొట్టినట్లు అర్థం అవుతున్నది. కోటయ్య ముఖం వాచిపోయి ఉండటం… ఇవన్నీ కూడా పోలీసులు దౌర్జన్యం చేసినట్లు తెలిసిపోతున్నది. కోటయ్య బుగ్గలు ఉబ్బి ఉండటాన్ని మృతదేహం ఫోటోలో చూడొచ్చు.

వీఐపీల (సీఎం) రక్షణ కోసం వచ్చిన పోలీసులు పేకాట ఆడుకోవడం ఏమిటన్నది గమనించాల్సిన విషయం. వచ్చిన పని ఏమిటి? వీళ్లు చేసింది ఏమిటి? మరి మద్యం కూడా తీసుకున్నారేమో తెలియదు. దీనికి సంబంధించిన ఆనవాళ్లేమీ అక్కడ కనిపించలేదు. నల్లటి క్యారీ బ్యాగు ఒకటి మాత్రం కనిపించింది. సీసాలు మాత్రం ఏమీ లేవు.

పోస్టు మార్టం చేయించేందుకే… ఆంజనేయులు ఇష్టపడటంతో కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఒత్తిడి వల్లనే కోటయ్య చనిపోయినట్లు రిపోర్టు వచ్చినట్లు అంటున్నారు. దీనిని పోలీసులతో ధ్రువీకరించుకోలేదు. అయితే… కోటయ్య క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడని, దీనిని ఒక సమస్యగా చేయడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. కోటయ్యకు ప్రస్తుతం ఎలాంటి అప్పులు కూడా లేవు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపించడం లేదు. అయితే 25వ తేదీ వరకూ పోస్టుమార్టం రిపోర్టు వచ్చిందని ఒకసారి, రాలేదని మరోసారి పోలీసులు చెబుతున్నారుగానీ… ఎలాంటి రిపోర్టునూ పోలీసులు ఇవ్వడం లేదు. 

ముందు రోజు నుంచీ పోలీసులు బొప్పాయి తోటను ఇష్టం వచ్చినట్లు వాడుకోవడంపై కోటయ్య పోలీసులను అడ్డుకుంటూనే ఉన్నాడన్నది సుస్పష్టం. దీంతో పోలీసులే అతిగా స్పందించి దాడి చేసి ఉంటారన్నది నిర్వివాదాంశం. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పాలేరు పున్నారావును పోలీసులు తమ సంరక్షణలోనే ఉంచుకోవడం, పున్నారావు ఇంటికి తాళం వేసి ఉండటం కూడా అసలు వాస్తవాలు బయటకు రాకూడదన్న భావం ఇటు పోలీసుల్లోనూ, అటు ప్రభుత్వంలోనూ కనిపిస్తోంది.

కోటయ్య మృతి తర్వాత… అక్కడకు వచ్చిన రాజకీయ పార్టీలు వైఎస్సార్సీపీ, జనసేన మాత్రమే. వైఎస్సార్సీపీ కోటయ్య కుటుంబానికి 6 లక్షల రూపాయలు ఇవ్వగా, జనసేన నేత రావెల కిషోర్ బాబు లక్ష రూపాయలు అందించారు. ఎవరు ముందు వచ్చారు… ఎవరు వెనుక వచ్చారన్నది ముఖ్యం కాదు. తమకు కావాల్సింది సానుభూతి కాదనీ, కోటయ్య మృతిపై అసలు నిజాలను వెలికి తియ్యాలని అతని కుటుంబం కోరుతున్నది. ఆత్మహత్యకు సంబంధించి… పురుగు మందులు ఇంట్లోగానీ, తోటలోగానీ నిల్వ చేయలేదని ఆంజనేయులు స్పష్టం చేశాడు. పోలీసులు కావాలనే… ఆత్మహత్య డ్రామాను సృష్టించారని, అసలు దోషుల్ని పట్టుకోవాలని కోటయ్య కుమారుడు ఆంజనేయులు డిమాండు చేస్తున్నాడు.

చట్టం నేరస్థులకు చుట్టమా…?

అనుకోని విధంగా పోలీసులు దాడి చేయడం, ఆ దాడిలో కోటయ్య చనిపోవడం బహుశా యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న. కోటయ్య మృతిని రివర్స్ లో ఆలోచిద్దాం. కోటయ్య కొడితే- కానిస్టేబులు చనిపోయాడని అనుకుందాం. కోటయ్యను అరెస్టు చేయకుండా ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని పోలీసులు అతన్ని వదిలి వేస్తారా? ప్రభుత్వం అతన్ని వదిలివేస్తుందా? ఇవీ సభ్య సమాజం ముందున్న ప్రశ్నలు. రాజ్యాంగం ప్రకారం చట్టం అందరికీ ఒకేలా వర్తించాలి కదా!!

కోటయ్య మృతిని జీర్ణించుకోవడానికీ, ఈ షాక్ నుంచి తేరుకోవడానికీ కోటయ్య కుటుంబానికి అనేక ఏళ్లు పడుతుంది. కానీ… ప్రజలు 3 రోజుల్లోనే మర్చిపోయారు. కోటయ్య సామాన్య రైతు.  అదీ కౌలు రైతు. అతని ప్రాణానికి ఏం విలువ లేదని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించి చేతులు దులుపుకున్నది. కోటయ్య చనిపోవడానికి కారణమైన ఈ వ్యవస్థపై ప్రస్తుత సమాజం పోరాటం చేస్తుందా? కోటయ్య నిజానికి వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని సమాచారం. తిరునాళ్ల సమయంలో అతను ప్రభలు కూడా కట్టేవాడని చెప్పారు. అసలు ఆ ఊరిలో వైఎస్సార్సీపీ ఉండటానికి కారణం కూడా కోటయ్య అనే తెలుస్తోంది. పార్టీ సానుభూతి పరుడా కాదా అన్నది అప్రస్తుతం. కోటయ్య అన్నింటికన్నా ముందు బడుగు కౌలు రైతు. అతను ఏ పార్టీ అయితే నేమి? రాజకీయ పార్టీల నేతలు ప్రస్తుతం రాజకీయ ప్రచారంలో తలమునకలు అయిపోతున్నాయి. ఏపీలో ఒక పేద రైతు… చనిపోతే అది మీడియాకు గానీ, పార్టీలకు గానీ పట్టకపోవడం విషాదం. జనసేన పార్టీ నిజనిర్ధారణ కమిటీని వేసింది. హుటుహుటిన రావెల  కిషోర్ బాబు పుట్టకోటకు వెళ్లారు. ‘‘మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ… కోటయ్యను పోలీసులే చంపివేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ‘‘న్యూస్ ఆఫ్ 9’’తో అన్నారు. జనసేన తరఫున ఆయన లక్ష రూపాయలు రైతు కుటుంబానికి అందించారు. వైఎస్సార్సీపీ కూడా రూ.6 లక్షలు అందించింది. 

రైతు పేరు చెబితే ప్రాణాలు ఇచ్చేస్తాం అని చెప్పే రాజకీయ పార్టీలు నిజంగా కోటయ్య అనే రైతు కోసం ఏం చేస్తున్నాయి? కనీసం కోటయ్య మృతిపై గుంటూరు జిల్లా కేంద్రంలో కూడా ఎవరూ పట్టనట్లే ఉన్నారు. ఎప్పటిలాగానే రోజులు గడిచిపోతున్నాయి. ప్రజలకు అసలు నిజం ఇదీ అని చెప్పే మీడియా కూడా లేకపోవడం వల్ల ప్రజల్లో ఒక రకమైన స్తబ్ధత నెలకుని ఉంది. కొన్నాళ్లకు పోలీసులు కూడా కేసు మూసేస్తారు. కోటయ్యది ఆత్మహత్య అన్నదే బహుశా అధికారికంగా నమోదు అవుతుంది. సీఎం కార్యక్రమానికి వచ్చిన పోలీసులు చేసిన అతి వల్లనే… కోటయ్య చనిపోయినట్లు అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి.

ప్రజల మాన ప్రాణాలకు పూచీకత్తుగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల తరఫున నిలబడినప్పుడు నిజం ఎవరు చెబుతారన్నదే ప్రశ్న. పోలీసుల పొంతనలేని సమాధానాలూ, పున్నారావు కనిపించకుండా పోవడం, పోలీసులు పేకాట ఆడుకున్న బొప్పాయి తోటలో విరిగిపోయిన చెట్లు, కిందపడిన కాయలూ, కొద్ది దూరంలో ఉన్న కొండవీటి కొండలూ కోటయ్య అన్యాయంగా చనిపోవడంపై మౌనంగా రోదిస్తూ ఉంటాయి.

అందరికీ అన్నం పెట్టే రైతు ప్రాణానికే దిక్కులేనపుడు.. రైతన్నల జీవితాలను బాగు చేసేస్తాం అన్న రాజకీయ పార్టీల మాటలకు అర్థం ఉందని అనుకోవడం పెద్ద భ్రమ కాగలదు. పార్టీలకు ఎన్నికల్లో గెలవడం ముఖ్యం, రైతు చనిపోతే దానివల్ల ఓట్లు రాలవు కదా.. ఓట్లు వస్తాయంటే మళ్లీ ఇంకోసారి వస్తారు. చావ లేక బతికున్న రైతులకు వాగ్దానాలు చెయ్యడానికి పార్టీలు పరుగులు తీస్తున్నాయి. మనం ఒక పెద్ద అబద్ధంలో జీవిస్తున్నాం. మీరెప్పుడైనా కొండవీడుకు వెళితే.. ఓ రైతు, అతనితోపాటు ఓ చేదు నిజం సమాధి అయిపోయన ప్రాంతం ఇదే అని.. ఓ కన్నీటి చుక్క రాల్చండి. అమ్మలా..ఈ సమాజానికి అన్నం పెడుతున్న రైతన్న ప్రాణాలు తోడేసింది మళ్లీ ఈ సమాజమే!!

కొసమెరుపు: విజయవాడకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు కోటయ్య మృతిపై మాట్లాడుతూ… ‘‘గోదావరి పుష్కరాల సమయంలోనే 30 మంది చచ్చిపోతే ఏమీ కాలేదు.. ఒక రైతు చనిపోతే ఏం అవుతుంది? ఈ ప్రభుత్వం ఇంతే’’ అని నిట్టూర్చాడు.

Other Articles

3 Comments

 1. Great article and investigation.truly appreciate your efforts and concern towards these people . This may happen sometime later to common people like us.this needs to be taken as serous

 2. I’ve been exploring for a little for any high-quality articles or blog posts on this kind of space . Exploring in Yahoo I ultimately stumbled upon this web site. Studying this information So i’m glad to convey that I have an incredibly excellent uncanny feeling I found out exactly what I needed. I so much indubitably will make certain to do not forget this web site and give it a look regularly.

 3. I’d have to examine with you here. Which is not one thing I usually do! I take pleasure in reading a post that may make folks think. Additionally, thanks for permitting me to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *