ఆసరాలేని ఓ దీపం ఆరిపోయింది!!

March 16, 2019 | News Of 9

 

The Story of a family that Taken Life Self

       (న్యూస్ ఆఫ్ 9)

చీకటి పడే వేళ.. నాగరాజు బస్సు దిగాడు. ఊళ్లో అంతా చిమ్మ చీకటిగా ఉంది. వీధి దీపాలు దేదీప్యమానంగా వెలుగిపోతున్నాయి. ఎప్పుడూ ఊరు అంతగా వెలిగిపోతున్నట్లు నాగరాజుకు కనిపించలేదు. ఏడాదిలోనే ఊరు ఇంతగా మారిపోయిందా అని మనసులోనే అనుకుని ఇంటిదారి పట్టాడు. బస్సు దిగిన రామాలయం దగ్గర నుంచి కిలో మీటరు లోపలికి నడిస్తే.. అక్కడే అన్నదమ్ముల ఇళ్లు కూడా ఉన్నాయి.

కుటుంబాన్ని వదిలి ఏడాది దాటిపోయింది. పరుగు పరుగున నాగరాజు భార్య వచ్చి తలుపు తీసింది. పిల్లలు నిద్రలో ఏదో కలవరిస్తూ ఉన్నట్లున్నారు. ‘‘లేపవద్దులేవే.. నిద్రపోనివ్వు’’ అన్నాడు భార్యతో. చెంబుతో నీళ్లు ఇస్తే కాళ్లు కడుక్కుని… మిగిలిన కాసిని గొంతులో పోసుకున్నాడు. కూరేమీ చెయ్యలేదు. నువ్వు వస్తావని అనుకోలే. గుళ్లో పంతులు గారు కొబ్బరి చిప్పలు రెండు ఇచ్చారు. ఇంట్లో సరుకులు నిండికున్నాయి. పిల్లలకు మజ్జానం కూడా అన్నం పెట్టలేదు. పులార చేసి పెట్టాలే. ఇందాకే.. పంతులు గారు కనిపించి ఇదుగో స్వామి వారి ప్రసాదం తల్లీ అన్నాడుగానీ… ఆయనికి తెల్వదా..గుళ్లో ఆ నల్ల రాయికిగానీ తెల్వదా…వద్దన్నా కొద్దీ కొడుకో కొడుకో అంటూ… ఇదిగో ఇద్దరి ముండల్ని ఇచ్చావ్.. చావలేక బతుకుతున్నా.. ఇది మాత్రం నీకు చాతనవును. సంసారం సాకడం మాత్రం తెల్వదు అంటూ విసుక్కుంది. ఊళ్లో అందరికీ తెల్సులే నీ సంగతి.. అంటూ కొబ్బరి పచ్చడి కాస్త వేసి… అన్నం పళ్లెం పెట్టి తినమని విసిరికొట్టింది. విసిరికొట్టనైతే కొట్టింది కానీ.. ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు జల జల కారిపోతున్నాయి. ఇదిగో… ‘‘ధనా’’ మనకీ మంచి రోజులు వస్తాయే, ఏడ్వకు అంటూ పిల్లల దగ్గరకు వెళ్లాడు. ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. ఇద్దరూ తలలూ నిమిరి.. అన్నం దగ్గర కూర్చుకున్నాడుగానీ.. ముద్ద దిగడం లేదు.

నాగరాజు ఇంటర్ వరకే చదువుకున్నాడు. వాళ్ల కుటుంబాల్లో అందరూ కిరణా వ్యాపారమే. కానీ ఎందుకో ఉన్న ఊళ్లో వ్యాపారం నడవలేదు. అప్పులు కూడా ఎక్కువ అయ్యాయి. పెళ్లి చేసుకున్నాడు.. జీవితం అంటే ఏమిటో తెలిసే నాటికే పిల్లలు పుట్టేశారు. తెలియకుండానే సంసారం నెత్తినపడింది. కమీషను వ్యాపారంలో డబ్బులు నాలుగు మిగులుతున్నాయని తెలిసి… అది చేద్దామని అనుకున్నాడుగానీ కుదర్లేదు. అందుకే బెంగళూరు వెళ్లి డబ్బు బాగా సంపాదించి ఇద్దరు కూతుళ్లనూ బాగా చదివించి మంచిగా పెళ్లిళ్లు కూడా చెయ్యాలని అనుకున్నాడు. ఆ లక్ష్యంతోనే బెంగళూరు వెళ్లాడుగానీ… అక్కడ కూడా విధి వెక్కిరించింది. ఎలాగూ గొంతు పెగలదీసుకుని ఉన్న విషయం చెప్పడంతో ధన ఘొల్లుమంది. పిల్లలు కూడా లేచారు. నాన్నా అంటూ ఇద్దరూ వచ్చి తండ్రికి చుట్టుకుపోయారు. నాగరాజు కళ్లు నిప్పులవుతున్నాయి. వెలుతురు పెద్దగా లేనందున పిల్లలు గుర్తుపట్టలేదు. గబగబా అన్నం కలిపి… ధనాకీ, పిల్లలిద్దరికీ తినిపించాడు. ముగ్గురికీ అన్నం కలిపి ముద్దలు తినిపించాడు. నాగరాజు అలా చేయడం అదే మొదటిసారి.

తెల్లవారింది. తలుపులు తియ్యలేదు. చట్టుపక్కల అమ్మలక్కలంతా వచ్చి తలుపులు తీసి చూశారు. అంతా అయిపోయిందమ్మా… అంటూ ఓ ముసలావిడ ఇంట్లో నుంచి పరుగున బయటకు వచ్చింది.

సచ్చినోడు… సంసారం సాకలేక నాగా రాజుగాడు ఏం చేశాడో చూశావా… ఆడూ ఎండ్రిన్ తాగాడు… ఆడితోపాటు ఆళ్లనీ చంపేశాడు అంటూ కళ్లు ఒత్తుకున్నది. ఈ వార్త అల్లీపురం గ్రామం మొత్తం క్షణాల్లో పాకేసింది. ఊరు కన్నీరు మున్నీరయింది. రామాయం పంతులు గారు కూడా అక్కడకు వచ్చారు. ‘‘ఆడ పిల్లలయినా బంగారం. ఇద్దరూ పట్టు పరికిణీలు కట్టుకుని గెంతుతూ రామాలయం దగ్గరకు వచ్చేవారు. రోజూ సామివారి కోసం వచ్చేవారు’’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు. గుండె దిటవు చేసుకుని… ముగ్గురినీ… తూర్పవైపున ఉన్న గోరీలవైపు మోసుకుపోతున్నారు గ్రామస్థులు.

రామాలయం దగ్గర ఒక ఆటో ఆగి ఉంది.

‘‘చంద్రన్న కానుక… ఇంత చేస్తున్న మనిషికి ఓటేయడం.. మన రుణం కాదు.. మన బాధ్యత’’ అంటూ ప్రకటన వస్తోంది మైకులో…’’

(ప్రకాశంజిల్లా కొమరవోలు మండలం అల్లీనగరంగ్రామంలో ఆర్ధిక బాధలు తాళలేక శనివారం ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. చచ్చిపోవడం తప్ప మరో మార్గంలేదు అనుకున్న వారి కోసం వల్లకాడు తప్ప.. ఊరు, ప్రభుత్వం, సమాజం ఎవరూ స్పందించరా..? చనిపోవాల్సిన అవసరం లేదు అని ఈ సమాజం నాగరాజు లాంటి అభాగ్యులకు ఆసరా ఇవ్వలేదా? ప్రపంచం సుఖశాంతులతో ఉన్నట్లుగా… ఏమీ జరగలేదన్నట్లుగా.. రాజకీయ పార్టీలన్నీ ఓట్ల కోసం వలలు తీసుకుని జీపుల్లో కార్లలో హెలికాప్టర్లలో తెగ తిరుగుతున్నాయి. నేతలు ఎవరైనా కనిపిస్తే నాగరాజు గురించి ఓ మాట మీరైనా చెప్పండి).

నోటు: సంఘటన నిజమే. ఇలా జరిగి ఉండొచ్చన్నది నా ఊహ. అల్లీపురం వెళితే ఇలాంటి కథే తారసపడవచ్చు.

శ్రీనివాసరావు

ప్రధాన సంపాదకుడు

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *