ప్రాంతీయ పార్టీలతో కలిపి జాతీయ పార్టీ: కేసీఆర్

December 11, 2018 | News Of 9

KCR | telugu.newsof9.com

  • రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉండాలి
  • చట్టాలు చేసుకునే హక్కులు కూడా ఉండాలి
  • దేశం ప్రజల్ని ఏకం చేస్తాం, నాయకుల్ని కాదు
  • దేశంలోని రైతుల కోసం పని చేయబోతున్నాం
  • కొత్త ఆర్థిక విధానాలను రూపొందిస్తున్నాం
  • త్వరలో ప్రజలకు పూర్తి వివరాలు

హైదరాబాద్: మారుతున్న కాలాన్ని బట్టి… తెలివైన రాజకీయ పార్టీలు తమను తాము మలచుకుంటాయి. ఎప్పటికప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవి కూడా ఉన్నతంగా మారుతుంటాయి. తిరుగులేని మెజారిటీతో తెరాస పార్టీకి మరోసారి ప్రజలు అధికారాన్ని అందించిన తర్వాత అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విలేకరులతో మాట్లాడిన తీరు ముచ్చటగొలిపింది. ఒక్క తెలంగాణ అనే కాకుండా ఆయన అందరి ప్రజల కోసం అన్నట్లు చాలా విశాల దృక్ఫథంతో మాట్లాడారు.

దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిన విధానం, రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం, దేశాభివృద్ధినీ, ప్రజల అభ్యున్నతినీ గాలికి వదిలి భాజపా, కాంగ్రెసు పార్టీలు దుమ్మెత్తిపోసుకోవడం… అన్న అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేసే ప్రస్థానంలో తెలంగాణ ఇక ముందు ఉండబోతున్నదంటూ వెల్లడించారు. కేవలం విమర్శలతో కాలక్షేపం చేసే పరిస్థితిలేదని, ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేయాల్సిన సమయం ఇదేనని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయనేం మాట్లాడారంటే…

ప్రాంతీయ పార్టీలతో కలసి జాతీయస్థాయి పార్టీ

భాజపాయేతర, కాంగ్రెసేతర పార్టీ ఒకటి రావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాంతీయ పార్టీలను కలుపుకుని సంయుక్తంగా ఒక జాతీయపార్టీని ఏర్పాటు చేస్తామని, దేశం మొత్తానికీ ఒక గొప్ప ఆర్థిక విధానం కావాలని, ఒక వ్యవసాయ విధానం కావాలని వీటిని రూపొందించే పనిలో ఉన్నామని అన్నారు. పార్టీలను కలపడం అన్నది ఒక సిగ్గుమాలిన వ్యవహారమని, దేశ ప్రజలందరినీ కలపడమే చేయాల్సిన పని అని అన్నారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ఒక దిక్సూచి కాబోతున్నదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నవి రొటీన్ గా జరిగేవేనని, అందువల్ల ఉపయోగం లేదన్నారు. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే, 30 వేల టీఎంసీల నీటిని కూడా  వాడుకోలేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. ఉత్పాదన దారుణంగా తగ్గిపోయిందని అన్నారు. దేశంలో 15 కోట్ల మంది రైతులు ఉన్నారని, వారంతా కష్టాల్లో ఉన్నారని అన్నారు. తెలంగాణ రైతుల కోసం ప్రారంభించిన పెట్టుబడి పథకానికి అశోక్ గులాటీ మెచ్చుకుంటూ ఒక వ్యాసం రాశారని అన్నారు. దేశంలో ఉన్న 70 నుంచి 80 మంది ఆర్థికవేత్తలతో మాట్లాడుతున్నామన్నారు. తెరాస దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని, దేశం ఉండాల్సిన విధంగా లేనపుడు మౌనంగా ఉండటం సరికాదన్నారు.

ఇపుడున్న చౌకబారు, చెత్త రాజకీయాలు పోవాలని అన్నారు. కేసీఆర్ ఉన్నది అందుకు కాదని అన్నారు. ‘‘దేశంలో ప్రజల్ని కలపాలి. రాజకీయ ఆలోచనలను కలపాలి’’ అని అన్నారు. భారతదేశం కులాలుగా మతాలుగా విడిపోయి ఉందని అన్నారు. ఇవి ఉన్నంత వరకూ భయంలేదని చైనా నింపాదిగా ఉందని గుర్తు చేశారు. 3 రాష్ట్రాల్లో కాంగ్రెసు గెలిచిందని, అక్కడ మరో ప్రత్యామ్నాయంలేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని అన్నారు. స్వాంతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిని మంచినీళ్లు, సాగునీళ్లు ఇవ్వలేనందుకు సిగ్గుపడాలని అన్నారు. కబుర్లు చెప్పి జబ్బలు చరుచుకోవడం కాదని ఎద్దేవా చేశారు. త్వరలోనే దేశంలో గుణాత్మకమైన మార్పును మీరు చూడబోతున్నారని అన్నారు. దేశంలోని నవరత్న కంపెనీల వద్ద 9.5 లక్షల కోట్లు ఉన్నా, వాటిని వాడుకునే యంత్రాంగం మనకు లేదని, ఇది చాలా విచారించాల్సిన విషయమని అన్నారు. భారత ప్రభుత్వాన్ని ఆ రెండు పార్టీలే నడపడం కంటే చెత్త విషయం మరొకటి లేదన్నారు. ‘‘దేశంలో ఏం జరుగుతోంది? 50 శాతం రిజర్వేషన్లు పెరగకూడదని చెప్పడానికి సుప్రీం ఎవరు? ఇంత పెద్ద దేశానికి ఒకటే కోర్టు చెప్పిన తీర్పును దేశమంతా అమలు చేసేస్తారా? మరొకటి.. దీనిని పార్లమెంటులో మార్చాలి. ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకునే స్థాయికి ప్రభుత్వాలు ఎదగాలి. భాజపా, కాంగ్రెసు గోరోజనం ముందు పోవాలి. అమెరికాలో రాష్ట్రాలు తమకు అవసరమైన చట్టాలు చేసుకుంటాయి. పరిస్థితులు మారాలి’’ అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి పెరగాలి. సమస్య ఉంది. దానికి సర్జరీ అసవరం. తప్పదు. మూర్ఖులు మాత్రమే నేను చేప్పేదానితో అంగీకరించకపోవచ్చు’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *