నిశ్శబ్ద విప్లవ తరంగం… జనసేన!!

March 11, 2019 | News Of 9

Image may contain: 8 people, child

                                (న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేకం)

ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రా ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న ఉత్కంఠే ప్రతి క్షణం అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జనసేనను తొలుత కనీసంగా ప్రస్తావించని సర్వేలు, జాతీయ ఛానెళ్లు ఇపుడు గొంతు సవరించుకున్నాయి. ఆంధ్ర ఎన్నికల్లో ఇపుడు జనసేన బలమైన ఫ్యాక్టర్ గా అవతరించిందని చెప్పడం ప్రారంభించాయి.

ఒక బలమైన వేవ్ ప్రజల్లో ఉన్నపుడు దానిని స్థానికులు తప్ప ఇతరులు గుర్తించడానికి అవకాశాలు తక్కువ. అందులోకి అధికార తెలుగుదేశం పార్టీ డేగ కళ్లతో అందరినీ గమనిస్తోంది. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నందున… అది త్వరగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా.. దానిని తన ప్రజలపైనే ప్రయోగించి ఓటర్లుగా వారి మనసులో ఏముందే తెలుసుకునేందుకు అధికార యంత్రాంగాన్నీ, పోలీసుల్నీ వినియోగిస్తోంది.

మచిలీపట్నంలో నేను కొందరిని అడగినపుడు వారు ఇదే చెప్పారు. జనసేన, వైసీపీ సానుభూతిపరుల్ని అది వేటాడుతోందని, స్థానిక నేతలు కూడా అనుక్షణం సమాచారాన్ని సేకరిస్తున్నారని, గమనిస్తున్నారనీ చెప్పారు. ఇది ఆరు నెలల కిందట నుంచీ చాప కింద నీరులా బాగా ఎక్కువ అయింది. తెలుగుదేశం సానుభూతిపరులు కాదని తెలిస్తే… వారికి ఎలాంటి ప్రభుత్వ సాయం అందకుండా నట్లూ, బోల్టులూ బిగించేస్తూ వస్తోంది. అందువల్ల చాలా మంది వైసీపీ అనో, జనసేన అనో చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు. భయపడి.. స్థానిక తెలుగుదేశం నేతలతో సఖ్యతగా మసలుకుంటున్నారు. దీనిని బట్టి అధికార పార్టీ ఏ స్థాయిలో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉందని చెప్పడానికి సందేహం అక్కర్లేదు.

వైసీపీకి లేని ఒక కొత్త సమస్య గ్రామాల్లో జనసేన సానుభూతిపరులకు ఉంది. ప్రజారాజ్యం ఓటమి వారిని ఇంకా వెంటాడుతున్నది. జనసేనకు ఓటు వేద్దామని అనుకుంటున్నాం అని అనగానే… ఎదుటివారు ‘ప్రజారాజ్యం’ పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. ‘‘అన్న చేశాడు… ఇక తమ్ముడు చేస్తాడు’’ అన్న డైలాగ్ వెంటనే పడిపోతున్నది. ఇదే మాట ‘‘న్యూస్ ఆఫ్ 9’’ దగ్గర కూడా అనేక మంది అన్నారని చెప్పడానికి మేం సంకోచించడం లేదు. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటానికి ఎవరైనా మన గతాన్ని ఉపయోగించుకుంటారు. ఇది మనుషుల్లో మాత్రమే ఉండే లక్షణం. ప్రజారాజ్యం అనే వీరుడిని కుట్రదారులు దొంగదెబ్బ తీశారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ‘‘న్యూస్ ఆఫ్ 9’’ ప్రారంభమైన వెంటనే ప్రజారాజ్యాన్ని కూల్చేందుకు చీకటి మాటున ఏం జరిగిందీ ప్రజలకు వెల్లడించాం (నగ్నసత్యాలు: మెగా బ్రదర్స్ పై మీడియా ఎందుకు విషం కక్కుతుంది?). అసలు విషయాలు తెలుసుకుని చాలా మంది పాఠకులు ఆశ్చర్యపోయారు. మెగా స్టార్ చిరంజీవి ఎంత ఇబ్బంది పడ్డారోకదా అని వ్య చెందారు. నిజానికి ఆయన మెగా త్యాగమే చేశారు. తప్పదు. ఎందరో త్యాగాలు చేస్తేనే గానీ చరిత్రను మార్చడం కష్టం. 70 ఏళ్ల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడం అంటే.. చైనా గోడను ఒక్క దెబ్బకు కూల్చివేయాలన్న సాహసం. సింహం కూడా దెబ్బ కొట్టే ముందు ఒక అడుగు వెనక్కివేస్తుంది. అది వెనక్కి వెళ్లిపోయిందనే అందరూ అనుకున్నారు. జనసేన రూపంలో ఎన్నికల గోదాలోకి మళ్లీ గర్జిస్తూ వచ్చేసింది. బంతిని ఎంత గట్టిగా గోడకేసి కొడతామో అంతే వేగంతో వెనక్కి తన్నుకు వస్తుందని అన్నది న్యూటన్ మూడో సిద్ధాంతం. ఫిజిక్స్ ఎప్పుడూ తప్పుకాదు. అదే జరిగింది.

ఎవరైనా జావగారిపోకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందులోనే విజయం ఉంది. మహ్మద్ ఘోరీ 17 సార్లు ఓడినా చివరికి గెలుపు చేతికి చిక్కింది!! కులాల పరంగా కూడా విశ్లేషణ తప్పదు. కేవలం 10 శాతంగా ఉన్న డబ్బున్న మారాజులే ఇప్పటికే రాజకీయాలను తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. 90 శాతం మంది రాజకీయ అధికారానికి దూరంగానే ఉన్నారు. అయితే… ఈ 90 శాతం మందికీ రాజకీయ అధికారాన్ని రుచి చూపించాలంటే.. ప్రస్తుతం 26 నుంచి 28 శాతంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఈ ప్రయత్నం చేయాలని చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు చెబుతుండేవారు. కానీ ఎవరూ పిల్లి మెడలో గంటకట్ట లేకపోయారు. బడుగు బలహీన వర్గాల్లో ఐక్యత రాకుండా  డబ్బున్న 4 శాతం కమ్మ సామాజిక వర్గం, 6 శాతం రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడూ పేదల ప్రయత్నాలను  అడ్డుకుంటూనే తృణమో ఫణమో పడేసి కాపులను, మరి ఇతర చిన్న కులాలను ఎదగకుండా విజయవంతంగా అడ్డుకున్నాయి.

ఈ పరిస్థితి నేడు పూర్తిగా మారిపోయింది. కమ్మ సామాజిక వర్గం వారు ఎప్పుడూ తెలుగుదేశానికి తప్ప.. మరో పార్టీకి ఓటు వేసే వారు కాదు. 2018లో తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు.. కాంగ్రెసుతో కలిసి పోటీ చేసినపుడు కమ్మ సామాజిక వర్గం వారు తొలిసారి కాంగ్రెసుకు ఓటు వేశారు. ఒక కమ్మసామాజిక వర్గానికి చెందిన శాస్త్రవేత్త మాతో ఇలా అన్నారు. ‘‘జీవితంలో నేను ఎప్పుడూ కాంగ్రెసుకు ఓటు వేయలేదు. కానీ ఇపుడు వేస్తున్నాను, తప్పనిసరి పరిస్థితి’’ అని అన్నారు. జీవితంలో కూడా కాంగ్రెసుకు ఓటు వేయని వ్యక్తి, విద్యాధికుడూ, శాస్త్రవేత్త కూడా అయిన ఆయన… రాజకీయంగా తన నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారో చూడండి. ఆయనకు పెద్దగా కులపరమైన భావన కూడా లేదు. కానీ రాజకీయంగా చంద్రబాబును బలోపేతం చేయాలన్న బలమైన కోరిక అది. అనేక పరిశ్రమలను తెస్తాడనీ, అందరికీ మంచి చేస్తాడనీ ఆయన నమ్ముతారు. రోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతి  పేపర్లు చూస్తూ… యల్లో టీవీ ఛానెళ్లను చూస్తుంటే మనకు ప్రపంచంలో చంద్రబాబు లాంటి గొప్ప నేత ఎక్కడా దొరకడని మెదడులో ముద్ర పడిపోతుంది. అది మీడియా సృష్టించే ఒక కృత్రిమ భావన. శాస్త్రవేత్తలే.. ఇలాంటి భావనలో ఉంటే సామాన్యుల సంగతి ఏమిటి? పాత్రికేయులుగా ఎవరి కుట్రలు ఏమిటో మాకు తెలుస్తుంది. 90 శాతం మంది అవకాశాలు లేక ఎలాంటి దీనస్థితిలో ఉన్నదీ తెలుస్తుంది. దీనిని ఇక్కడితో వదిలేద్దాం.

2018 తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు మొత్తం ఒక ఎత్తు. మొన్న కూకట్ పల్లి నియోజకవర్గం ఎన్నిక మాత్రం మరో ఎత్తు. ఏప్రిల్ 11 నాటి ఆంధ్రా ఎన్నికల్లో తిరిగి ‘‘కూకట్ పల్లి’’ పునరావృతం కాబోతున్నదని మాత్రం స్పష్టంగా చెప్పగలం. చంద్రబాబును ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కాపులూ, బీసీలూ, ముస్లింలు ఏక మొత్తంగా గట్టిగా ప్రయత్నించాయి. యుద్ధ ప్రాతిపదికన ఏకీకృతం అయ్యాయి. కూకట్ పల్లిలో 60 వేల వరకూ కాపుల ఓట్లు ఉన్నాయి. కొందరు కాపు నేతలు విజయవాడ వెళ్లి ‘‘సుహాసినికి మేం సాయం చేస్తాం’’ అంటూ ప్యాకేజీలు తెచ్చుకున్నారు. అయినా మెజారిటీ ప్రజల ఆకాంక్షే చివరికి గెలిచింది. తెరాస అభ్యర్ధి కృష్ణారావుకే ఓట్లు వేసి ఆయన్ను గెలిపించారు. కాపు నేతలు సమర్ధించకపోయినా… చంద్రబాబును ఏమైనా సరే ఓడించాలన్న కృతనిశ్చయంతో బడుగు వర్గాలన్నీ పని చేశాయి. తేలికగా గెలిచేద్దాం అనుకున్న కూకట్ పల్లి ఎన్నిక చంద్రబాబుకు చుక్కలు చూపించింది. చాణుక్య తెలివి తేటలు కూడా ఇక్కడ చతికిలపడ్డాయి.

పేదల రాజ్యం తేవడానికి జనసేన ప్రయత్నిస్తుండగా, కొందరు దీనిని ఇష్టపడకుండా బడాబాబుల పంచనే మేం బతుకుతాం అన్నట్లుగా కొందరు నేతల తీరు ఉన్నది. బ్రిటీష్ దొరలు మన భారతదేశాన్ని పాలించినపుడు స్వయంగా మన నల్ల దొరలే వెళ్లి తెల్ల దొరల కాళ్ల దగ్గర పడి ఉండేవారు. వారికి అవసరమైన సేవలు చేస్తూ వాళ్లిచ్చిన బక్షీస్ తీసుకుంటూ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందాన బతికేవారు. జనసేనను ఈ రోజున అనేక మంది ఇంకా ఒక  సాధారణ రాజకీయ పార్టీగానే చూడటం దుర్మార్గం. అదొక ‘‘విప్లవమార్గం’’ అని అర్థం చేసుకోవడంలో ఇంకా కొందరికి అనుమానాలు ఉన్నాయి. డబ్బున్న వారికి బుద్ధి చెప్పి… పేదల రాజ్యం తెస్తానని అంటుంటే ఇంకా బడుగు వర్గాల వారు భూస్వామ్య పార్టీల పంచన చేరి.. వారి బూట్లు తుడవడం పేదల కడుపు కొట్టడమే. పేదలకు సేవ చేస్తామని చెప్పే ఈ కపట నాటక సూత్రధారులు తమ సొంత ప్రయోజనాలనే చూసుకుంటున్నారు తప్ప… నిజంగా వారు పేదల పక్షాన నిలబడటం లేదని గ్రహించండి. ఓడిపోతామేమో అన్న భయం వారికి లోలోన ఉండవచ్చు. పోరాడి ఓడిపోవడంలో కూడా ఆనందమే ఉంది. ఊడిగం చేయడంలో ఆనందం ఏముంది?

కులపరమైన దౌర్జన్యం, డబ్బూ.. ఇన్నాళ్లూ 90 శాతం మందిని రాజ్యాధికారానికి దూరంగా ఉంచింది. అదే కులాభిజాత్యాన్నీ, డబ్బు రాజకీయాలనీ కూకటివేళ్లతో పెకలించాల్సిన బాధ్యతను జనసేన తీసుకుంది. దానికి ఓటమి భయం లేదు. ఒకటే లక్ష్యం. డబ్బున్న వారి రాజకీయాలు పోవాలి.. పేదవాడికి కిరీట ధారణ చెయ్యాలి. ఇదే 90 శాతం మంది కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ అనే యోధుడి లక్ష్యం. భూస్వామ్య పార్టీల తరఫున నిలబడి వారి పంచన చేరిన రాజకీయ నేతలు స్వపర కులమన్నది లేకుండా వారికి బుద్ధి చెప్పాల్సిన తరుణమిదే. ఒక చారిత్రక విజయాన్ని వాళ్లు కోల్పోతున్న విషయాన్ని తెలియజేయండి. అలాంటి నేతల్ని ప్రశ్నించండి. నిలదీయండి. భూస్వామ్య పార్టీల్లో ఉండి.. మీరు పేదలకు చేసే సేవలు ఏమిటో అడగండి. పేదల పక్షాన నిలబడని వాళ్లు ద్రోహులే.. అందులో సందేహం ఏముంది? స్వలాభమే ముఖ్యమనుకున్న నేతలకు బుద్ధి చెప్పండి. మళ్లీ వాళ్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చూడండి. మరోసారి వాళ్లు జనసేనలోకి వస్తానన్నా గేట్లు మూసివేయండి. కాపులూ, బీసీలూ, ముస్లింలూ అందరూ జనసేనకు అండగా నిలబడుతున్నారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలతో సహా, అన్ని కులాల వారూ కలిసిపోయి జనసేనకు అండగా నిలబడ్డారు. అభ్యదయ వాదులూ, ముఖ్యంగా సమసమాజాన్ని కాంక్షిస్తున్న యువత.. పవన్ వెంట పరుగులు తీస్తోంది. అగ్రకులాల్లో చదువుకున్న ఈ వర్గాలకు చెందిన ఆధునిక యువత సమానత్వాన్ని కోరుకుంటున్నది. పవన్ కళ్యాణ్ ఒక్కడే… సమానత్వాన్ని తేలగడనీ, అందరికీ మేలు జరగాలని కులాలకు అతీతంగా ఈ ఆధునిక తరం మొత్తం ముక్త కంఠంతో కోరుకుంటున్నది. అవును. సమానత్వం రావాలి. కులాలకు అతీతంగా అందరికీ అవకాశాలు రావాలి. 21 వ శతాబ్దంలో కూడా కులపిచ్చిని పెట్టుకుని, ఇన్నాళ్లూ సాగిన దాష్టీకాలు పోవాలి. చిన్న పెద్దా తేడా లేకుండా ఆకలిగొన్న ప్రతివాడికీ అన్నం లభించాలి. చదువుకున్న ప్రతి యువతకు ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా ఉద్యోగం లభించాలి. రైతన్న బాగుండాలి. గుంటూరులో రైతన్నను పోలీసులు పొట్టనబెట్టుకుంటే నేటి రాజకీయ నాయకులు అందరూ నిజాలకు ఉప్పుపాతర వేశారు. అదే రైతు.. పోలీసును చంపివేసి ఉంటే ఈ పాటికి ఆ రైతన్నను జైల్లో పడేసి తన్నేవారు. ఒకరికి ఒక న్యాయం. మరొకరికి మరొక న్యాయం ఎన్నాళ్లు?

వచ్చేదంతా డేటా యుగం. సమాచారమే ముఖ్యం. ప్రజల సమాచారం భద్రంగా ఉండాలంటే… నీతి నిజాయితీగా పాలన చేసే వారు కావాలి. కుళ్లిపోయిన రాజకీయాల నుంచి వచ్చిన నేతల కంటే ఈనాటి యువత బాగా చదువుకున్నారు. వారి కంటే మించిన రాజకీయ నేతలు ఎక్కడ లభిస్తారు? కులాల కలయిక ద్వారా కుల రహిత సమాజాన్ని ఈ నాటి యువత మాత్రమే నిర్మించగలదు. అందుకు పవన్ కళ్యాణ్ బాసటగా ఉన్నారు. అందులో సందేహం లేదు. జనసేనకు రాజ్యాధికారాన్ని అందించడం ద్వారా తెలుగు ప్రజలు ఒక సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడతారని, ఓ సరికొత్త ప్రపంచాన్ని నిర్మిస్తారని  ‘‘న్యూస్ ఆఫ్ 9’’ బలంగా విశ్వసిస్తున్నది.

Other Articles

4 Comments

  1. After I originally left a comment I seem to have clicked the -Notify me
    when new comments are added- checkbox and now whenever a comment is
    added I recieve 4 emails with the exact same comment.
    Is there a way you are able to remove me from
    that service? Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *