అజేయ సైనికుడు… పవన్ కళ్యాణ్!!

April 12, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేక కథనం)

‘‘ఆయన గాయపడిన సింహం…  మే 23 ఫలితాలు చూడండి’’ ఈ మాట అన్నది ఎవరో కాదు… ఎంతో పరిణతి ఉన్న ఎస్పీవై రెడ్డిగారు. అవును… పవన్ కళ్యాణ్ గాయపడిన సింహం.

సొంత మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆధిపత్య వర్గాలు రెండూ కలిసిపోయి ప్రజారాజ్యం పార్టీని వెన్నుపోటు పొడిచాయి. కమ్మసామాజిక వర్గం చివరి క్షణంలో టిక్కెట్లు అమ్ముకున్నారని ప్రచారం చెయ్యగా, సొంత మనుషులను వలలో వేసుకుని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలిపివెయ్యడంలో మరో వర్గం విజయం సాధించింది. పోయిన చోటే మళ్లీ వెదుక్కోవాలి. అది వీరుల లక్షణం. సమాజానికి మేలు చేద్దామని వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని అశక్తుడిని చేయడంలో ఈ సమాజం విజయం సాధించింది. అది తాత్కాలికమే… అని నిరూపించదలచుకున్నాడు ఒక తమ్ముడు. పేరు పవన్ కళ్యాణ్.

చిరంజీవి తమ్ముడే కదా పవన్ కళ్యాణ్.. ఆ ఆఫ్టరాల్ అనుకున్నారు. కానీ ఆయన మనసులో వెన్నుపోటు రగిలించిన అగ్గి కణకణమంటూ మండుతూనే ఉన్నది. నమ్మిన వారినే అక్కున చేర్చుకున్నాడు. ప్రపంచంలోని రాజకీయ సిద్ధాంతాలన్నీ చదువుకున్నాడు. రాజకీయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. సలహాలు చెబుతామంటూ పంచన చేరే ప్రయత్నాలు జరిగాయి. వారికి గేట్లు మూసేశాడు. 2009 నాటి ‘‘మెగా’’ అన్యాయం గురించి మెగా బ్రదర్స్ కంటే ఎక్కువగా బాధపడేవాళ్లు ఎవరుంటారు?

 నీవు నేర్పిన విద్యయే…

90 శాతం కులాలు రాజకీయ అధికారానికి ఆమడ దూరంలో ఉన్నాయి. ‘‘సామాజిక న్యాయం’’… ఒక ప్రణాళిక ప్రకారమే జనసేన పార్టీని నడిపించాడు. 21వ శతాబ్దంలో యువత సంఖ్యే ఎక్కువ. వారి భాషలోనే మాట్లాడాడు. వారి బాధల్ని స్వయంగా పంచుకున్నాడు. ప్రశ్నించేవాడు లేకపోతే మరో 100 ఏళ్లు సమాజం ఇలానే ఉంటుందని, డబ్బున్న వర్గాల ఆధిపత్యాన్ని బద్ధలు కొట్టేయాలని సంకల్పం పెట్టుకున్నాడు. వ్యూహాత్మకంగానే 2014లో తెలుగుదేశానికి ఒక అవకాశం ఇచ్చాడు. దానిని తెలుగుదేశం సద్వినియోగం చేసుకుని ఉండాల్సింది. కానీ అది దాని సహజ లక్షణాలను మార్చుకోలేదు. ఎప్పటిలాగానే పార్టీకి చెందిన పెట్టుబడిదారులకు కొమ్ము కాసింది. కొత్త రాజధాని రూపంలో వారికి డబ్బులు మాత్రమే కనిపించాయి. కోట్లు కుమ్మేసుకున్నారు. ‘‘తెలుగుదేశం అవినీతికి పాల్పడుతుందని నాకు తెలియకేమీ కాదు’’ అని పవన్ కళ్యాణ్ ఒక సభలో చెప్పాడు. తప్పు చేసేవాడిని నాలుగు తన్నాలంటే… వాడు తప్పు చేస్తున్నాడని అందరి ముందూ నిరూపించాలి. అందుకు ఒక అవకాశం ఇవ్వాలి. అదే చేశాడు పవన్ కళ్యాణ్. కుక్కతోక వంకర అన్నట్లు తెలుగుదేశం తప్పులపై తప్పులు చేసుకుంటూ వెళ్లిపోయి ప్రజల ముందు దోషిలా నిలబడింది. చోటా మోటా నేతలు గొణిగినా… పవన్ కళ్యాణ్ దాడిని తిప్పికొట్టే సాహసం చేయలేకపోయారు. అలా చేయాలంటే వారికి తగినంత నైతిక బలం కావాలి. నైతికంగా వారిని అష్టదిగ్బంధంలో ఉంచాడు. మరి పవన్ కళ్యాణ్ కు రాజకీయం తెలియదు అని చెప్పగలమా? రేపు 90 శాతం మందికి రాజకీయ ఫలాల్ని అందించాలంటే ఇంతకు మించిన వ్యూహం లేదు. ఇందుకోసం 5 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఆయన నిరీక్షణకు బలహీన వర్గాల తరఫున వెనవేల దండాలు!!

ప్రచారాన్ని కూడా ఒక వ్యూహం ప్రకారం నడిపించాడు. ముందు ప్రజల సమస్యలను ఎత్తుకున్నాడు. రాష్ట్రంలో జర్నలిస్టులు తాబేదార్లుగా మారిపోయిన పరిస్థితుల్లో (కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో మాదిరిగా) తానే జర్నలిస్టుగా అవతరించాడు (భలే చేస్తున్నాడే అనుకుంటూ నేను ముచ్చటపడిపోయాను). అనేక సమస్యల్ని ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రజల దృష్టికి తెచ్చాడు. ఉద్ధానం సమస్యతో అందుకు శ్రీకారం చుట్టాడు. ప్రజా సమస్యలతో నిండిపోయిన ఆయన ప్రసంగాలు క్రమేపీ.. ఎన్నికలు సమీస్తున్న వేళ… అసలు ఆయుధాల్ని సంధించాడు. రెండు కుటుంబాలే… ఎప్పుడూ అధికారంలో ఉంటాయా? వారి కుటుంబాల్లోనే ‘‘పొలిటికల్ డీఎన్ఏ’’ ఉంటుందా అని ప్రశ్నించాడు. అవును… నిజమే కదా… నారా, వైఎస్ కుటుంబాల సొంతమా రాజకీయం అన్న భావన కిందిస్థాయి వరకూ వెళ్లిపోయింది. ‘‘కులాల కలయిక’’ అన్న జనసేన పార్టీ తొలి సిద్ధాంతం అర్థం కావాల్సిన వాళ్లకు అర్థమైంది. ఆధిపత్య కులాల్లో చదువుకున్న యువతను కూడా ఇది నచ్చింది. ‘‘కమ్మవాళ్లు మంచివాళ్లేనండి… రాజకీయాల్లో ఉన్న కమ్మవారి వల్లనే మాకు చెడ్డపేరు వస్తోంది’’ అంటూ ఒక యువకుడు ‘‘న్యూస్ ఆఫ్ 9’’ వెబ్ సైటుకు లేఖ రాశాడు. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. రాజకీయంగా పైమెట్టులో ఉన్న ఆధిపత్యకులాలు దుష్ప్రచారానికి తెరతీశాయి. కత్తి మహేష్, శ్రీరెడ్డిలాంటి వారిని పవన్ కళ్యాణ్ పై ప్రయోగించాయి. పవన్ కళ్యాణ్ తల్లిని సైతం దూషించేలా చేశారు.

లక్ష్యసాధన వైపు దూసుకుపోయే హీరోని విలన్లు అడ్డుకుంటారు. అది సహజంగా సమాజంలో జరిగేదే. దానికీ పవన్ కళ్యాణ్ వెరవలేదు. ప్రజల ఎదుట తన హృదయాన్ని ఆవిష్కరించాడు. తనలో ఒక రాజకీయవేత్త ఉన్నాడని అనేకసార్లు చెప్పాడు. తనను సినిమా హీరోగా చూడవద్దని, సెల్ఫీల కోసం అడగవద్దని అనునయించాడు. తనకు నటించడం చిరాకు అని చెప్పాడు. నిజం చెప్పాలంటే… అతన్ని గుడ్డిగానైనా నమ్మి ఉన్నది, ఆయన వెంట పరుగులు తీసింది జన సైనికులే. ఈ సామాజిక విప్లవానికి పవన్ కళ్యాణ్ ను ఒక అజేయ సైనికుడుగా వెన్నుదన్నుగా నిలిచింది వారే. వారికి ఈ తెలుగు సమాజం రుణపడి ఉంటుంది. ఈ విషయాన్ని ఆయన అనేక సభల్లో కూడా చెప్పాడు. పవన్ తన ప్రచారంలో ప్రసంగాలు చేసింది చాలా తక్కువ. మనసులో మాటల్నే పంచుకున్నాడు. సీఎం సీఎం అంటూ అరుస్తుంటే… ప్లీజ్ చెప్పేది వినండి… నేను మార్పు కోసం వచ్చాను అంటూ నచ్చచెప్పాడు. రోడ్డుమీదనే రాజకీయ పాఠశాలల్ని నడిపించాడు. తన తల్లి పొగ గొట్టం ఊదుతూ వంట చేయలేకపోవడం తనకు తెలుసు అని చెప్పాడు. కన్నీటి విలువ, ఆకలి విలుత తనకు తెలుసు అని చెప్పాడు. సొంత మనుషులతో పంచుకున్నట్లు.. తన జీవితంలో ఉన్న అనుభవాలను, తనేమిటన్నది ప్రజల ముందు ఉంచాడు. జన సైనికులకు ఇపుడు ఆయన గురించి తెలియని విషయం లేదు. అంతా తెరిచిన పుస్తకం.

వేష భాషల్లో తిరుగులేని స్వరూపం

కాశీ తువ్వాలును ధరించడం ద్వారా తాను మీలో ఒకడినే అన్న స్పృహ కలిగించాడు. అమెరికాలో ప్రసంగాలు చేస్తున్నా… ‘‘కాశీ తువ్వాలు’’ ఆయన మెడలోనే ఉంది. సూట్లూ, బుట్లూ వేసుకున్న ఎన్నారైలు కూడా కాశీ తువ్వాలును ధరించడం ఒక గొప్ప గౌరవంగా భావించారు. తెలుగు నాట… జన సైనికుడు అని చెప్పుకోవడమే గౌరవ వాచకం అయిపోయింది. ఒక విప్లవాకారుడుగా ఖాకీ దుస్తులు ధరించినా చివరకు తెల్లటి ధోవతీలో స్థిరపడ్డాడు. చంద్రబాబు దుస్తుల్లోగానీ, జగన్ రెడ్డి దుస్తుల్లోగానీ తెలుగుదనం లేదు. రాజకీయం ఈ రెండు పార్టీలకు ఒక భోగం. జనసేనకు అవసరం. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ధోవతీలోనే పాదయాత్ర చేసి విజయం సాధించారన్న విషయాన్ని మర్చిపోరాదు. మాటలోనూ, వేషంలోనూ తెలుగుదనం ఉండటం చాలా ముఖ్యం. ఆ పంచెకట్టుడు కూడా కలిసివచ్చింది. మాటల్లోనూ స్వచ్ఛత, వేషంలోనూ స్వచ్ఛత. తెలుగు ఆత్మగౌరవం కోసం పంచెకట్టినట్లు చెప్పాడు.

ఆసేతు హిమాచలం అన్నట్లుగా…

మంగళగిరిలో పార్టీ ఆవిర్భావ సభ తర్వాత.. అనుకున్న విధంగానే… తెలుగుదేశం పార్టీ జీరో అయిపోయింది. నిజానికి ప్రతిపక్షంలో ఉన్నది వైసీపీ అయినా చట్టసభలో ప్రాతినిధ్యంలేని ‘‘జనసేన’’ ప్రజల దృష్టిలో నిజమైన ప్రతిపక్షంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంటే తెలుగు ప్రజలు నిబిడాశ్చర్యంతో ఆయనకు నీరాజనాలు పట్టారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా జన ప్రవాహం. చామంతి పూల వర్షం. మహా అయితే గోదావరి జిల్లాల్లోనే అన్నారు.. రాయలసీమలోనూ బ్రహ్మరథం పట్టడం ఎవరికీ మింగుడుపడలేదు. కనీవినీ ఎరుగని స్థాయిలో ధవళేశ్వరం కవాతు జన సైనికుల్లో కొండంత విశ్వాసాన్ని అందించింది.

యువత, ఆడపడుచులు ఆయన మాటల్లో స్వచ్ఛతను అర్థం చేసుకున్నారు. ఇక మారాల్సింది పెద్దలే. పెద్దలు మారతారా? అనుమానమే. టీవీలు, పత్రికలూ చూసి అభిప్రాయాన్ని ఏర్పురుచుకునే వయసులో వారున్నారు. పవన్ కళ్యాణ్ కు ఓటేస్తానన్న ఒక వృద్ధురాలిని ఎందుకు అని అడిగితే.. ‘‘ఏమో.. ఆ అబ్బాయి మాటలు గుండెకు తగులుతున్నాయి’’ అని చెప్పింది. స్వచ్ఛతను అందరూ ఆదరిస్తారు. అదే జరిగింది. ఆడపడుచులు ఎప్పుడో జనసేనవైపు మరలిపోయారు.

ప్రజల నాడి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందు వారి గుండెల్లో జ్వలించే స్థాయిలో అభిప్రాయాలు ఉన్నాయా అని తెలుసుకోవాలి. జనసేన గురించి అలాంటి అభిప్రాయాలు ఉన్నాయని గుర్తించిన సమయంలోనే ప్రజల్లో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైందని 5 నెలల కిందటే ‘‘న్యూస్ ఆఫ్ 9’’ రాసింది. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 81 శాతం పోలింగ్ జరిగింది అంటేనే… అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను అది సూచన. అందులో సందేహం లేదు. ఈ ఓటింగ్ మొత్తం ప్రతిపక్షంలో ఉన్న జగన్ కి చెందాలి. వైసీపీకి చెందాలి. కానీ వైసీపీ మొదటి నుంచీ తప్పులు చేస్తూ వస్తోంది. తనపై అవినీతి కేసులు ఉన్న మాట అటుంచితే.. విపక్ష నేతగా వారు ప్రజా సమస్యలపై ఉద్యమించింది లేదు. కేవలం అధికారంలోకి రావడమే ప్రథమ లక్ష్యంగా వారి వ్యూహాలు సాగిపోయాయి. రాష్ట్రాన్ని విభజించిన తెరాసతో సయోధ్య- వైసీపీకి ప్రతికూలమైన అంశం. ఎన్నికల ముందు రోజు కూడా తెరాసతో  స్నేహం ఉన్నట్లు ప్రజలకు అర్థమైంది. రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ ను ఆంధ్ర ప్రజలకు ఎన్నటికీ ఆదరించలేరు. బాబు తిట్టినపుడు మాత్రమే వారు కేసీఆర్ ను మెచ్చుకున్నారు. అంత వరకే.

తెరాస స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పడం ఏమిటి? దానిపై తెరాస రకరకాలుగా మాట్లాడింది. పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్.. టీవీ 9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తెలంగాణలో మేం పోటీ చేస్తే ఉత్తమ్ కుమార్ వంటి వాళ్లు గెలవరని, ఆంధ్రలో గెలిచిన తర్వాత ఇక్కడ గురించి ఆలోచిస్తామని బహిరంగంగా చెప్పడం కూడా వ్యూహాత్మక తప్పిదమే. రెడ్లు బలంగా ఉన్న తెలంగాణలో జగన్ ఇక్కడకు వస్తే… తెరాసను మట్టికరిపించడం తేలిక. 2 శాతం కంటే తక్కువగా ఉన్న వెలమ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాన్ని తనకు ప్రమాదంలేనంత దూరంలో ఉంచే ప్రయత్నమే చేస్తుంది. అందుకే జగన్ కు మద్దతు ఉన్నట్లుగా తెరాస ప్రవర్తించింది. తెలంగాణలో కూడా రెడ్లకు తగినన్ని కార్పొరేషన్లు ఇచ్చి వారిని సంతృప్తికరమైన స్థితిలో, ప్రమాదంలేనంత దూరంలో ఉంచుతున్నది. కాంగ్రెసులో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని పార్టీలోకి లాగేసింది. శత్రవును బయట ఉంచడం కంటే లోపల ఉంచితే ఏమీ చేయలేరన్న వ్యూహం కేసీఆర్ ది. వైసీపీనీ, జగన్ ను ఈ విషయంలో తప్పు దారి పట్టించేందుకు తగినంత మంది కమ్మ సామాజిక వర్గం వైసీపీలో చేరింది. అధికారం కోసం ఎన్టీఆర్ వంటి పెద్ద మనిషిని కుర్చీలో నుంచి లాగేసిన ఈ వర్గం… జగన్ వైపు ఎలా నిలబడుతుంది? జగన్ దానిని ఎలా నమ్మారన్నది అర్థం కాదు.

ఆటలో అరటిపండు అనుకున్నారు

పవన్ కళ్యాణ్ ఎలాగూ అధికారంలోకి రాలేడన్నదే ఆధిపత్య రాజకీయ సామాజిక వర్గాల్లో ఎక్కువ మంది అభిప్రాయం. ఏదో ఆటలో అరటిపండు అని భావించారు. 2009లో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రలో 53 సీట్లు మాత్రమే వచ్చాయి. పవన్  కళ్యాణ్ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన తర్వాత 104 సీట్లు గెలుచుకున్నది తెలుగుదేశం. 2014లో వైసీపీకీ, టీడీపీకి వచ్చిన ఓట్లు శాతంలో తేడా (2 శాతంలోపు)ను మాత్రమే పవన్ కళ్యాణ్ కి ఉన్న శక్తి అని భ్రమపడ్డారు. నిజానికి పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలకూ సమదూరంలో ఉన్నారు. తెలుగుదేశంపై వ్యతిరేకత లేనట్లుగా పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో వ్యవహరించి ఉండొచ్చు. అవును. ఆయన ఎదుర్కొంటున్నది 70 ఏళ్ల ఆధిపత్యాన్ని!! ఒకేసారి రెండు ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకం అని తెలిస్తే… పురిట్లోనే చంపేస్తారు. ప్రజారాజ్యం అనుభవం ఇంకా మర్చిపోలేదు. వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే రాజకీయం చేయలేం. దగ్గరగా ఉన్నట్లే ఉండాలి… మన రాజకీయం మనం చెయ్యాలి. రాజకీయంలో జాలీ, దయా అన్న పదాలకు చోటు లేదు. మనం జాలిపడితే రేపు మనపై మనమే జాలి పడాలి. ఒకసారి దెబ్బతిన్నాం. మళ్లీ దెబ్బతింటే మన మొహంపై ఉమ్మివేయడం ఖాయం. చేతిలో మీడియా అనే ఆయుధం లేదు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కోసం పని చేస్తున్నాడని, ప్యాకేజీ తీసుకున్నాడని చదువుకున్న వాళ్లు కూడా భ్రమపడే స్థాయిలో తెలుగు మీడియాను జనంపైకి వదిలారు. ధవళేశ్వరం కవాతు తర్వాత పవన్ కళ్యాణ్ ను వారు ఏమాత్రం ఉపేక్షంచరాదని నిర్ణయించుకున్నారు. ‘‘2014లో పవన్ మద్దతు తీసుకుని మేం పవన్ కళ్యాణ్ ను హీరోని చేశామేమే’’ అని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక పెద్దాయన బాధపడ్డారు. అంటే పవన్ వారిని ఎంతగా భయపెట్టిందీ అర్థం చేసుకోవచ్చు. బాబు పీఠం కదిలిపోవడం వారికి సుతరామూ నచ్చదు.

ఆ గాయం మర్చిపోలేదు

పవన్ కళ్యాణ్ ప్రయాణంలో ప్రజారాజ్యం అనే ఒక వెన్నుపోటు ఉందని అందరూ మర్చిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు. ఒక మంచి మనిషి (చిరంజీవి) వస్తే ఆయన్ని వమ్ము చేశారని ఎన్నికల ప్రచారం చివరి దశలో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు పవన్ కళ్యాణ్.

ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ప్రయాణాన్ని గమనిస్తే… ఎస్పీవై రెడ్డిగారు అన్నట్లు ఆయన ఒక గాయపడిన సింహం. అందుకే వ్యూహాత్మకంగా ఆధిపత్య రాజకీయాలకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. చిరంజీవిగానీ, నాగబాబుగానీ, పవన్ కళ్యాణ్ గానీ… మొత్తంగా మెగా ఫ్యామిలీ- అణగారిన వర్గాలను పైకితేవాలన్న విషయంలో కంకణబద్ధులై ఉన్నారు. అందుకు తిట్లు తిన్నారు. అవమానాలు భరించారు. అనవసరంగా వారు ఎవరి జోలికీ వెళ్లలేదు. ఎన్నడూ విలేకరుల సమావేశాలు పెట్టి ఎవరినీ కించపరిచిన ప్రయత్నం లేదు. కారణం.. వారి కుటుంబంలో నడమంత్రపు సిరిలేదు. ఎక్కడి నుంచి వచ్చారన్నది వారు మర్చిపోలేదు. మోహన్ బాబు వంటి వారు ఎన్నిసార్లు నోరు పారేసుకున్నారో తెలిసిందే. నమ్మి అవకాశాలు అందిపుచ్చుకున్న వారు సైతం తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టారు. అందుకే వారు ఎవరినీ అంత తేలికగా నమ్మడం లేదు. తప్పు మనదే.

సామాజిక న్యాయమే వారి లక్ష్యం

ఆధిపత్య కులాలకు చెందిన వారు మెగా బ్రదర్స్ చెబుతున్న ‘‘సామాజిక న్యాయం’’ అంటే ఏమిటో అర్థం కావడం లేదు అంటుంటారు. దళితులకు 21 సీట్లు ‘‘జనసేన’’ కేటాయించినపుడు కూడా వారికి సామాజిక న్యాయం అంటే ఏమిటో అర్థం కాలేదు. బీఎస్సీతో పొత్తు పెట్టుకుని, తనకు నచ్చిన వామపక్షాలతో పొత్తు పెట్టుకుని జనసేన మంచి పని చేసింది. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు రాజకీయం తెలియదు అని ఎవరైనా అనగలరా?

రేపు ఆయన ముఖ్యమంత్రి అయతే.. ‘‘జనసేన’’ గాలివాటంగా అధికారంలోకి వచ్చింది అని ఆధిపత్య కులాలకు చెందిన మీడియా రాసుకుంటుంది. (మే 24వ తేదీ పత్రికలు చూద్దాం).

అది గాలివాటం కాదు అని తెలియాంటే… ఊడిగం చేయడం మానేయాలి. అప్పుడే వాస్తవం కళ్లకు కడుతుంది. ఎన్నికల్లో సంస్కరణలు రావాలనీ, డబ్బు పంచరాదని, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఈనాడు వంటి మీడియా సంస్థలు దశాబ్దాలుగా సంపాదకీయాలు రాశాయి. జనసేన రూపంలో ఆ అవకాశం వచ్చినా.. మళ్లీ పాత పార్టీల చంకలోనే దూరిపోయింది మన మీడియా. ఇది వివక్ష కాదా…?  ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిజంగా మంచి జరగాలని మన మీడియా కోరుకున్న సందర్భం ఒక్కటీ లేదు. తెలుగు మీడియా వల్ల తెలుగు ప్రజలకు జరిగిన లాభం హళ్లికి హళ్లి.. సున్నాకు సున్నా.

నిజమైన ప్రతిపక్షం జనసేన

ప్రతిపక్షంగా వైసీపీ వైఫల్యాన్ని ఎండగట్టడంలో ‘‘జనసేన’’ విజయం సాధించింది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతిధిగా వ్యవహరించడంలో వైసీపీ వైఫల్యాన్ని పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక్క ఎమ్మెల్యే, కౌన్సిలర్ కూడా లేకుండా తాను సమస్యలను పరిష్కరిస్తున్నపుడు మీరెందుకు చేయలేదు అని ప్రశ్నించాడు. ఇది కూడా ప్రజల్లోకి భారీగా వెళ్లిపోయింది. అవకాశం ఉన్నపుడు చేయకుండా రేపు సీఎం అయ్యాక చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా మిగిలిపోయింది. కేవలం సీఎం కావడమే తన లక్ష్యం అన్నట్లు జగన్ పాదయాత్రలు సాగిపోయాయి. ప్రజల సమస్యల కోసమే ఉన్నాననీ, వారి కోసం పోరాటం చేస్తాననీ చెప్పకుండా… తాను చనిపోయిన తర్వాత కూడా ప్రజలు తనను గుర్తుంచుకోవాలనీ, అందుకే సీఎం కాదలచుకున్నాననీ జగన్ చెప్పడం వైసీపీ శిబిరంలోని వ్యూహకర్తల లోపం.

వైసీపీ నమ్మకాలు వేరు..

డబ్బులు పంచడం ద్వారా, మీడియా ప్రచారం ద్వారా సీఎం కావడం తేలికేనని వైసీపీ నమ్మింది. వైసీపీలో ఉన్న నేతలు కూడా మరో చోట అవకాశం లేక చేరినవారే కావడం మరో లోపం. అనేక మంది కమ్మవారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీకి నిజమైన ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విషయాన్ని తేటతెల్లంగా చెప్పారు. అటువాళ్లు ఇటు, ఇటు వాళ్లు అటూ వెళ్లిపోతున్నారని ఇదే రకంగా ప్రత్యామ్నాయం అవుతుందని ప్రశ్నించారు. మార్పు రావాలని దాని కోసం ఎదురు చూస్తున్నానని పరోక్షంగా జనసేనకు ఆయన మద్దతు పలికారు.

కష్టాల్లో ఉన్నవారికి సాయం దొరుకుతుంది

సామాజిక న్యాయం కోసం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయాణం… పాత తెలుగు సినిమాల్లో ఉండే హీరో పాత్రను గుర్తుకు తెస్తుంది. నిజజీవితం కూడా ఇలాగే ఉంటుంది. హీరో ప్రయాణాన్ని విలన్లు అడ్డుకుంటారు. దొంగ దెబ్బ తీసి హీరోని ఏ మొసలికో ఆహారంగా వేస్తారు. పీడా పోతుందని అనుకుంటారు. ఏ దేవదూతో ప్రత్యక్షమై వరం ఇస్తుంది. అది మాతృమూర్తి మాయావతి కావచ్చు… మరొకరు కావచ్చు.. పీడా పోయిందని అనుకున్న హీరో వచ్చేస్తాడు. అంతిమ విజయం హీరోనే వరిస్తుంది. 2019 ఎన్నికల కథ ఇందుకు భిన్నమేమీ కాదు. అమరావతి రాజ్యంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. హీరో ‘‘మెగా’’ విజయంతో శుభం కార్డు పడుతుంది. మే 23న మరోసారి మాట్లాడుకుందాం!!

చివరిగా ఒక మాట..

జనసేన  గెలుపు అనేక రికార్డుల్ని బద్ధలు కొట్టడం ఖాయం. ఒక గొప్ప వక్తగా,  మార్పు తెచ్చిన రాజకీయ నాయకుడుగా, సామాజిక మార్పు తెచ్చిన సంస్కర్తగా, మీడియా మద్దతులేకపోయినా సోషల్ మీడియా వేదికగా పోరాటం చేసిన యోధుడుగా… ఇలా ఎన్నో రికార్డుల్ని బద్ధలు కొట్టడాన్ని మే 23 తర్వాత మీరు చూస్తారు. కాకపోతే ఈ 40 రోజులు జన సైనికులకు క్షణమొక యుగం!!

– శ్రీనివాసరావు

 

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *