అంబేద్కర్ మార్గం: జనసేన వలంటీర్లు ఎలా ఉండాలంటే…?!

December 3, 2018 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

ఓ గొప్ప మార్పు రావాలి. అందుకు తొలి అడుగు పడింది. డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు వర్గాల అభ్యున్నతి దిశగా తొలి భానుడు ఉదయించాడు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మాకూ ఓ జీవితం కావాలి అంటూ జనసైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కవాతు చేస్తోంది. అవినీతి లేని సమాజం కోసం తపిస్తోంది. కదిలి పవన్ వెంట నడుస్తోంది. జనసేన పార్టీ సుమున్నత లక్ష్యాలతో బడుగు జన సమూహాలను పార్టీ కదిలిస్తోంది. ఇపుడు ఎక్కడ చూసినా జన సైనికులు వేలాది, లక్షలాదిగా ఉన్నారు. మరింత సమున్నతంగా పవన్ కళ్యాణ్ తన లక్ష్యాలను సాధించాలంటే జన సైనికులు అనేక విషయాలను తెలుసుకోవాల్సి ఉంది. జనసేన కొత్త తరం నాయకులను కూడా తయారు చేయబోతున్నది. మీలో కూడా నాయకులు రావాలి. అందుకు ఇది తప్పకుండా ఉపకరిస్తుంది.

డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో పవన్ సైనికులను నడిపిస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ లేబర్ పార్టీని నిర్వహించినపుడు పార్టీ సభ్యులు ఎంత క్రమశిక్షణతో ఉండాలో చెప్పారు. శ్యామసుందర్ ఉన్నమతి రాసిన ఆ వ్యాసం తెలుగు అనువాదం మీకు ఇక్కడ ఇస్తున్నాము. జన సైనికులందరూ దీనిని తప్పకుండా చదవాల్సిందిగా మనవి. – ఎడిటర్

“పరిపూర్ణ వ్యక్తిత్వం గల మనిషిని నేను” –డాక్టర్ అంబేద్కర్

డాక్టర్ అంబేద్కర్.. మేధో విప్లవకారుడే కాదు.. గొప్ప దార్శనికత ఉన్న క్రమశిక్షణ గల సైనికుడు. ఆయన నిర్వహించిన ఉద్యమాలు విజయవంతం కావడానికి ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అణగారిన వర్గాల్లో క్రమశిక్షణ ఎంత ముఖ్యమన్నది స్ఫూర్తిదాయకమైన, ఉత్తేజితమైన తన ప్రసంగాల్లో చేర్చారు. 1938 నవంబరు 7వ తేదీన ముంబయి నగరంలో పారిశ్రామిక వివాదాల బిల్లుకు వ్యతిరేకంగా లేబర్ పార్టీ ఒక సమ్మె చేసినపుడు ఆయన ఒక ప్రసంగం చేశారు. ఆ రోజు కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. సమ్మెపై విచారణ కమిటీ వేశారు. లేబర్ పార్టీ కార్యకర్తలు, పార్టీ సైనికులపై విచారణ కమిటీ కొన్ని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ, డాక్టర్ అంబేద్కర్ 1939 జనవరి 8వ తేదీన ముంబయి కామ్గర్ మైదానంలో జరిగిన స్వచ్ఛంద సైనికుల సమావేశంలో అద్భుతమైన ప్రసంగం చేశారు. 2,500 మంది స్వచ్ఛంద కార్యకర్తలు, 20 వేల మంది పార్టీ అనుచరులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బ్రిటీష్ కాలంలో మెహర్ సమాజం పాటించిన క్రమశిక్షణ, నిజాయితీ గురించి అంబేద్కర్ మాట్లాడారు. ఆయన ప్రసంగం పాఠం చూడండి.

అంబేద్కర్ ఇలా అన్నారు:

“కమిటీ ఇంకా తన విచారణను కొనసాగిస్తున్నందున కోర్టు ధిక్కారం అవుతుందని అది పరిశీలిస్తున్న సాక్ష్యాలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లడం లేదు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి చెందిన స్వచ్ఛంద కార్యకర్తల స్వభావం, వాళ్ల సంప్రదాయాల గురించి ప్రపంచం దృష్టికి తెస్తాను. సాక్ష్యాల రూపంలో కమిటీ ముందుకు ప్రతి రోజూ వస్తున్న ఆరోపణలు విషంతో నిండి ఉన్నాయి. స్వచ్ఛంద కార్యకర్తల పటాలం గురించి రెండే రెండు సంఘటనలు మీ దృష్టికి తెస్తాను. అవి వారిని ప్రశంసల్లో ముంచెత్తుతాయి. ఈ ప్రసంశలు కేవలం స్నేహతులు, సానుభూతిపరుల నుంచే కాదు.. కాంగ్రెసు అధినేతల నుంచి కూడా వస్తాయి. బాంబే శాసనభ ముందుకు మంత్రుల జీతాలను నిర్ణయించే అంశం వచ్చినపుడు బాంబే ప్రధానమంత్రి ఖేర్ మాట్లాడుతూ… ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్వచ్ఛంద కార్యకర్తల నిస్వార్థ సేవలనూ, త్యాగాలనూ, క్రమశిక్షణ గురించి మెచ్చుకున్నారు. ఈ కార్యకర్తలు జీతాలు లేకుండా పని చేస్తున్నపుడు… మంత్రులకు నెలకు రూ.500 ఇస్తే సరిపోతుందని ఖేర్ ప్రతిపాదించారు.

సర్ధార్ గుర్తింపు

ప్రొవిన్షియల్ ఎన్నికలు అయిన తర్వాత పూణేలో జరిగిన బహిరంగ సభ కూడా మరొక సందర్భం. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్వచ్ఛంద కార్యకర్తల పటాలం (volunteer corps of the Independent Labour party) పై ప్రశంసలు కురిపించింది మరెవరో కాదు.. సాక్షాత్తూ సర్ధార్ వల్లభాయ్ పటేల్. పటేల్ ఏమన్నారంటే… ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ, ఒక పద్ధతిలో సమయానుకూలంగా చేసే పనులు, ఎరుక కలిగిన బాధ్యత… ఇవన్నీ చూస్తే, కాంగ్రెస్ స్వచ్ఛంద కార్యకర్తలకు ఏ స్థాయిలోనూ వారితో పోలిక లేదు. కాంగ్రెసు పార్టీకిగానీ, జనబాహుళ్యానికి గానీ ఉపయోగపడతాయని భావిస్తే… వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని అన్నారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలు చేసిన సేవలూ, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో వారు చూపిన అంకితభావం తాను ముచ్చటపడ్డానని కూడా మరో మాట అన్నారు.

నిజాయితీని ప్రజల్లోకి వెళ్లనివ్వండి

మెహర్ సమాజం నుంచి దాదాపు 90 మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు. వీళ్లు చేసిన ప్రజా సేవలకు ప్రజల ఎలాంటి గుర్తింపు ఉంది? వీరు అందించిన సేవలకు మించి చేసినట్లుగా మరెవరూ కూడా చెప్పుకోలేరు. బ్రిటీష్ పాలన పాదుకున్న తర్వాత, ప్రతి గ్రామం నుంచి భూమి శిస్తు వసూలు చేసి జిల్లా కేంద్రాలకు అప్పగించే బాధ్యతలను ప్రత్యేకంగా మెహర్ సమాజానికే అప్పగించారు. ఈ డబ్బులు వందలు, వేల రూపాయల్లో ప్రతి ఏటా వచ్చేవి. దీనికి సంబంధించి మెహర్లు తమ బాధ్యతలను ఎలా నెరవేర్చారు?

వారిలో పేదరికం ఉంది, బాధలు ఉన్నాయి. అయినా, ఈ విషయం నేను చెప్పడానికి గర్విస్తున్నాను. గత 150, 200 సంవత్సరాలుగా వారు ఈ పని చేస్తున్నా ఎక్కడా ఒక్క తప్పు చేయలేదు. దుర్వినియోగం చేయలేదు. ఏ ఒక్క మెహర్ కూడా డబ్బు పరంగా తప్పు చేయలేదు.

ఆర్థాకలితో ఉన్న మెహర్లు… తమ చినిగిపోయిన తమ ధోవతులూ, చీరల్లోనే శిస్తు డబ్బులు పెట్టుకుని మైళ్ల కొద్దీ నడిచి… వాటిని జిల్లా కేంద్రాలకు చేరవేసేవారు. ఎక్కడా సొంత లాభం చూసుకోలేదు. ఇవన్నీ చూస్తే… వారిపై అభిమానం తప్ప మరొక ఆలోచన రాదు. ఆధునిక భారత చరిత్రలో వెలుగు చూడని అద్భుతమిది.

ఎంతో బాధ్యతో కూడిన మనుషులే మెహర్ సమాజం నుంచి వచ్చారు. అయితే ఇపుడు వారిపైనే ప్రభుత్వ విచారణ కమిటీ ఎదుట అభాండాలు వేస్తున్నారు. ఆరోపణలు చేస్తున్నారు. వీటిని నమ్మలా లేక, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్వచ్ఛంద కార్యకర్తలను నమ్మలా అన్న విషయాన్ని ప్రజల న్యాయ విచక్షణకే వదిలివేస్తున్నాను.

లేబర్ పార్టీ కార్యకర్తల్లో ఎక్కువ మంది అనేక ఏళ్లుగా సైన్యంలో పని చేసిన వారే. చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు కాదు. గుండాగిరీలు చేసే, మోసాలు చేసే దుర్వర్తనులు కాదు. సాక్షులు పేర్కొన్న దురాగతాలు చేసే మనుషులా వీళ్లు?

స్వచ్ఛంద కార్యకర్తల పుట్టుక

అణగారిన వర్గాల మానవ హక్కుల కోసం చేస్తున్న పోరాటం.. మహద్ సత్యాగ్రహం సందర్భంగా ఈ స్వచ్ఛంద కార్యకర్తలు వచ్చారు. చెరువు నుండి నీళ్లు తీసుకోకునే హక్కుల కోసమే ఈ ఉద్యమం పరిమితం కాలేదు. అణగారిన వర్గాల హక్కులను దాటి ఈ ఉద్యమ ప్రభావం విస్తరించింది. అలాగే, అణగారిని వర్గాలకు దేవాలయాల్లో ప్రవేశం కావాలంటూ నాసిక్ లో జరిగిన సత్యాగ్రహం కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. సమానత్వాన్ని తెచ్చుకునే ముందు మనం వంద యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి యుద్ధంలో మీరు ముందుండి నడిచే పటాలం కావాలి. రోడ్లను శుభ్రం చేయడం, నదులపై వంతెనలు కట్టడం, పర్వతాలు ఉన్నపుడు సొరంగాలను తవ్వుకోవడం, గుట్టలను చదును చేసుకోవడం, అడవులను నరికి మార్గాలను చేసుకోవడం వంటివన్నీ ముఖ్యమే. ఎందుకంటే.. యుద్ధ రంగానికి మీ తర్వాత వచ్చే సైనికుల కోసం మీరు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టాలి.

హంగూ ఆర్భాటాలు లేని జీవితం

మీ విధుల్ని మీరు నిర్వర్తించాలంటే… మీరు సమున్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. మానవత్వం ఉన్న మనిషి అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా సమాజంలో అందరూ మీవైపు చూడాలి. ఒకవేళ మీకు చెడు అలవాట్లు ఉంటే వాటిని వదిలివేయండి. తాగుడు, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండండి. నిరాడంబరంగా ఉండాలి. కర్తవ్యం పట్ల గట్టిగా ఉండండి. ప్రవర్తన విషయంలో పూర్తి క్రమశిక్షణ అవసరం. వంద మందిలో… మీరు ఒకరు కాదని గుర్తించండి. మీరు యోధులు. వంద మందిలో ఒకడుగా ఉండటానికీ, యోధుగా ఉండటానికీ తేడా స్పష్టం. సుశిక్షుతులైన, క్రమశిక్షణ కలిగిన డజను మంది ఉంటే… వారు వేలాది మందిని ప్రభావితం చేయగలరని గుర్తించండి. సాధారణ ప్రజానీకానికీ, మీకూ అదే తేడా’’

ఇదీ అంబేద్కర్ మహాశయుడు చేసిన ప్రసంగం. ఈ ప్రసంగం నుంచి ఎవరైనా స్ఫూర్తిని పొందవచ్చు. జన సైనికులు కూడా అంబేద్కర్ చెప్పిన బాటలో నడుస్తారని ఆశిస్తూ…
– న్యూస్ ఆఫ్ 9 సంపాదక బృందం.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *