రిథమిక్ జిమ్నాస్టిక్స్.. ఆశా కిరణం అనన్య!!

May 20, 2019 | News Of 9
previous arrow
next arrow
Slider

 

  • దేశవిదేశాల్లో అనేక పతకాలు ఆమె సొంతం
  • తాజాగా రష్యాలో రెండు పతకాల కైవశం
  • రికార్డులతో దూసుకుపోతున్న కృష్ణాజిల్లా క్రీడాకారిణి
  • ఒలింపిక్స్ లక్ష్యంతో అలుపెరగని పోరాటం

(న్యూస్ ఆఫ్ 9)

రిథమిక్ జిమ్నాస్టిక్స్ రంగంలో మెరుపులు మెరిపిస్తున్న క్రీడాకారిణి గరికపాటి అనన్య. రష్యాతోపాటు దేశవిదేశాల్లో అనేక సంవత్సరాలుగా గోల్డ్ మెడల్స్ సాధిస్తూ ఈ క్రీడలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న కృష్ణాజిల్లాకు చెందిన అనన్య క్రీడాకారిణిగా అందరి మన్ననలనూ అందుకుంటున్నది. రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో శిక్షణకు సంబంధించి ఎలాంటి అవకాశాలూ తెలుగు రాష్ట్రాల్లో లేవు. అయినా ఇవేవీ తనకు అడ్డంకి కాలేదు. తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో ఈ చిన్నారి అనేక పోటీల్లో పాల్గొంటూ వెళ్లిన ప్రతి దేశంలోనూ మెడల్స్ గెలుచుకుంటూ వస్తోంది. మచిలీపట్నం సమీపంలోని పెనుమల్లి అనన్య స్వగ్రామం. కేవలం ఈ ఆట కోసమే హైదరాబాదులో ఉంటూ తర్ఫీదు పొందుతున్నది. ప్రత్యేకంగా ఇక్కడ కోచులు లేకపోయినా శిక్షణ కోసం ప్రతి ఏడాదీ ఆమె రష్యా వెళుతున్నది. అక్కడ అందించిన శిక్షణతో హైదరాబాదులోని స్టేడియాల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూ బంగారు పతకాలను సాధించడం అందరికీ సాధ్యమయ్యే విషయమేమీ కాదు. ఎంతో దీక్ష, కఠినమైన పట్టుదల ఉంటే తప్ప ఇతరులకు సాధ్యంకాని ఈ క్రీడను ఎంచుకుంది అనన్య. చిన్నతనంలో పాఠశాల స్థాయిలో జరిగిన పోటీల్లో ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో పతకాలు సాధించింది. అక్కడ మొదలైన ఆసక్తి అక్కడితోనే ఆగిపోకుండా విదేశాలకు వెళ్లి పతకాలు సాధించే స్థాయికి చేరుకోవడం ప్రశంసార్హం. సౌకర్యాలుగానీ, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగానీ లేని స్థితిలో మీ అమ్మాయిని ఈ రంగం వైపు ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించగా… ‘‘అనన్యకు ఈ ఆట అంటే ప్రాణం. ఆమెకు అత్యంత ఆసక్తి ఉన్న క్రీడలో ఆమెను ప్రోత్సహించకుండా ఎందుకు ఉండాలి. ఈ కారణంతో కష్టనష్టాలున్నా అనన్యను ప్రోత్సహిస్తున్నాం’’ అని అన్నారు అనన్య తండ్రి గరికపాటి శ్రీధర్. తండ్రి శ్రీధర్ ఒకప్పుడు సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు. ప్రజాసేవ చేయాలన్న తపనతో ఆయన జనసేన పార్టీలో చేరి సేవలు అందిస్తున్నారు. తల్లి హైదరాబాదులో కంటి వ్యైద్యురాలుగా పని చేస్తున్నారు.

అనన్య ప్రతి ఏడాదీ… రష్యా వెళుతుంది. అక్కడే ఉండి 15 రోజులపాటు రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో ఆన్నా అనే క్రీడాకారిణి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నది. తాజాగా రష్యాలో జరిగిన రెండు పోటీల్లో పాల్గొని రెండు పతకాలను గెలుచుకున్నది. పెంచా కప్ లో బంగారు పతకాన్నీ, శాల్యూట్ కప్ లో రజత పతకాన్నీ ఆమె సొంతం చేసుకున్నది. ‘‘ఓవరాల్ హానర్’’ అవార్డును కూడా సాధించడం విశేషం. గతంలో లండన్, సింగపూర్, ఉజ్బెకిస్థాన్, దుబాయ్ లలో జరిగిన పోటీల్లో కూడా ఆమె అనేక పతకాలను గెలుచుకున్నది. ప్రస్తుతం ఈ చిన్నారి పదో తరగతి పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా… అలాంటిదేమీ లేదనీ, పాపకున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తామే ఖర్చులన్నీ భరిస్తున్నామని, విదేశాల్లో ఆడేందుకు ప్రభుత్వ క్రీడా సంస్థల నుంచి అనుమతులు వస్తే అది అదృష్టమని ‘‘న్యూస్ ఆఫ్ 9’’తో శ్రీధర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అనన్య రష్యాలో ఉన్నది. ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకమే లక్ష్యంగా చిన్నారి అనన్య శ్రమిస్తోంది. అనన్య తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలని, ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించాలని, ఎన్నో రికార్డులను సృష్టించాలని, క్రీడాకారిణిగా దేశానికి పేరు తేవాలని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ కోరుకుంటున్నది. 

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *