జనసేనను చంపే ప్రయత్నాలేనా..?

August 10, 2019 | News Of 9


జనసేనను చంపడమే లక్ష్యంగా కొన్ని వర్గాలు తీవ్రంగా పనిచేస్తున్నాయా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమనిపిస్తుంది. ఎన్నికల్లో భారీ అపజయాన్ని చవిచూసిన జనసేన ఇప్పుడిప్పుడే భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. కానీ కొందరు మాత్రం ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో జనసేన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఏం జరిగినా అదేదో పెద్ద ప్రమాదం అన్నట్లు కథలు అల్లేసి దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. నిన్నటికి నిన్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు కొన్ని వార్తా సంస్థలు వార్తలు ప్రచురించేశాయి. ఇలా పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే ఆయన ఇవన్నీ రూమర్స్ అనీ అవి చూసి తనే అవాక్కయ్యాననీ ట్విట్టర్ లోనూ, ఫేస్ బుక్ లోనూ స్పందించారు. ఆయన తనకు తానుగా ప్రకటించకుండానే కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడం పట్ల ఆయన మండిపడ్డారు. తనకు పార్టీ మారే ఆలోచనేం లేదని స్పష్టం చేశారు..

అయితే ఇలా వాళ్లు ఎందుకు చేస్తారనేది చాలామంది కార్యకర్తలకు అర్థం కాలేదు. నిజానికి నిప్పులేనిదే పొగరాదని జనం నమ్మాలనేది వారి వ్యూహం. అయితే ఆ నిప్పు పార్టీలో రాజుకున్నది కాదు ప్రత్యర్థులు రాజేసినదేనన్నది పవన్ అభిమానుల వాదన. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం ఈరోజు మొదలయింది కాదు. ఏరోజైతే ఎన్నికల్లో జనసేన ప్రభావం గట్టిగా ఉందని తమకు సంకేతాలు వచ్చాయో ఆరోజే ప్రారంభించారు. పార్టీ అంతర్గత విషయాలనుంచి అన్ని అంశాల్లోనూ తమకు నచ్చినట్లు ఊహాకథనాలను వ్యూహాత్మకంగా వ్యాప్తి చేయడం మొదలు పెట్టారు. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనను పరాజయం పాలు చేయడంలో వారు అనుకున్నది సాధించారనే చెప్పాలి. దానికి తోడు కార్యకర్తలను సమన్వయ పరచడంలో స్థానిక నాయకత్వం విఫలం చెందడం కూడా ఘోర వైఫల్యానికి మరో కారణం. ఒకటి రెండు కాదు అనేక కోణాల్లో ఏవిధంగా జనసేనను నిర్వీర్యం చెయ్యడానికి ప్రయత్నించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అస్సలు సంబంధమే లేనివాళ్లు కూడా వచ్చి తమకు అన్యాయం జరగడానికి అన్నిటి కన్నా పెద్ద కారణం పవన్ కళ్యాణ్ అన్నంతగా రెచ్చిపోయి ప్రసంగాలు, వ్యాఖ్యానాలు చేసేశారు. ఇలా.. ఎలా వీలైతే అలా పవన్ ప్రతిష్టను దిగజార్చడమే తమ తక్షణ కర్తవ్యంగా భావించారు.
ఎవరెవరో ఏవేవే రంగాలకు చెందిన వ్యక్తులు అకస్మాత్తుగా తెరపైకి వచ్చి జనసేన మీద, అధినేత పవన్ కళ్యాణ్ మీద మాటల దాడి చేసేశారు. ఇదెలా ఉండేదంటే ఏ కారణం లేకుండా ఊరికే గొడవ పెట్టుకుని అవతలి వ్యక్తిని రోడ్డుమీదకు లాగాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపించేది. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ది చాలా ప్రత్యేకమైన ఇమేజ్. దానికి సినిమాల జయాపజయాలతో పనిలేదు. దేశవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు పవన్ ప్రభంజనం చూసి ఆశ్చర్యానికి లోనయ్యారంటే అతిశయోక్తి కాదు. అదే ఆయన ప్రత్యర్ధులకు కంటి మీద కునుకు లేకుండా చేసేది. ఎలాగైనా అతని ప్రభను తగ్గించాలని తమకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించడం మొదలుపెట్టారు. టీడీపీతో ఇప్పటికీ జనసేన కలిసే వుందని ప్రచారం చేసి ఎన్నికల్లో ఓటింగ్ ను తగ్గించడంలో కృతకృత్యులయ్యారు కూడా. టీడీపీ వారు కూడా దాన్ని ఖండించకుండా తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేయడం కొసమెరుపు.

ఇది ఎన్నికలతోనూ, ఫలితాతోనూ ఆగలేదు. రిజల్ట్ అనంతరం కూడా జనసేనకు సంబంధించిన ఏ విషయాన్నీ వదలకుండా నిర్విరామంగా కృషి చేశారు, చేస్తున్నారు. ఇందులో మరో కోణమూ లేకపోలేదు. పవన్ వస్తే తమ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తాడని భావించే వాళ్లంతా ఇలాంటి ప్రయత్నాలు చేశారు, చేయించారు. ఇకపైనా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రశ్నించడం కోసం వచ్చాడు. ప్రశ్నిస్తాడనీ, మార్పు తెస్తాడనీ ప్రజలందరూ నమ్మకపోవచ్చు కానీ ఆయన ప్రత్యర్థులు నమ్మారు. అందుకే పవన్ పార్టీ ఉండకూడదని ఆ దిశగా తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు. జనసైనికులు ఇలాంటి పుకార్లు నమ్మకుండా పార్తీకి అండగా నిలిస్తే ఎందరు రాక్షస ప్రయత్నాలు చేసినా విజయం సాధిస్తారు. తమ ప్రయోజనాలకోసం స్వార్థపరులు సృష్టించే వలయాల్లో చిక్కుకుంటే లక్ష్య సాధన ఆలస్యం అవుతుందనేది నిజం. పవన్ సినిమాలో డైలాగ్ “రావడం కాస్త ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా” ఇది కాస్త తొందరగా జరగాలంటే మాత్రం కార్యకర్తలు మరింత గట్టి సంకల్పంతో ముందుకు సాగాలి.

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *