తండ్రీ కొడుకుల ప్రభుత్వం పోవడం ఖాయం: ప్రధాని మోడీ

February 10, 2019 | News Of 9

  • తండ్రీ కుమారుడి ప్రభుత్వం పోవడం ఖాయం
  • అవినీతి రహిత పాలనను ప్రజలు కోరుకుంటున్నారు
  • రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు
  • కుమారుడి ఎదుగుదల కోసమే ఆయన పాకులాట
  • అధికారం కోసం ఎవరితోనైనా జత కడతారు
  • గుంటూరు ‘ప్రజా చైతన్య సభ’లో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

ఆంధ్ర ప్రజలారా మేల్కొనండి.. ఫొటోలు తీయించుకునేందుకు, పార్టీని బాగు చేసుకునేందుకే చంద్రబాబు దిల్లీ వస్తున్నారు. మేం భాజపా కార్యకర్తల చందాలతో ఇక్కడ సభ నిర్వహిస్తే.. ఆయన ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు తీసుకుని దీక్ష చేస్తున్నారు. ఈ ఖర్చులపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి ఆయన దిల్లీకి రావాలి.ప్రియమైన సోదర సోదరీమణులారా.. పాఠశాలలో ఉపాధ్యాయులు ఏదైనా మాట చెప్పేందుకు ముందుకు పిలిచి ఆ తరువాత ‘గో బ్యాక్‌’.. మీ స్థానంలోకి వెళ్లి కూర్చో అంటారు. అలాగే ఇక్కడ నా రాకకు వ్యతిరేకంగా తెదేపావారు గో బ్యాక్‌ అంటున్నారు. వారికి నా ధన్యవాదాలు. మళ్లీ వెళ్లి దిల్లీ పీఠంపై కూర్చో అని స్వాగతం పలికారు.

అమరావతి: రాష్ట్రాభివృద్ధిని విస్మరించి తన కుమారుడు లోకేష్‌ రాజకీయ ఎదుగుదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించారని భారత ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన చంద్రబాబు తనకు తానే యూ టర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పేదలకు కొత్త పథకాలు తెస్తానని హామీలు ఇచ్చి మోదీ పథకాలకు స్టిక్కర్లు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. గుంటూరు నగర శివారులో ఆదివారం భాజపా ఏర్పాటుచేసిన ‘ప్రజా చైతన్య సభ’లో ప్రధాని మోదీ చంద్రబాబే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

అధికారం కోసం ఎవరితోనైనా జతకట్టే చంద్రబాబుకు ప్రస్తుతం ఓటమి భయం పట్టుకుందన్నారు. మహా కూటమి అపవిత్ర కలయిక అని అన్నారు. రాజకీయ స్వార్థం కోసమే మహా కూటమితో బాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. మహాకల్తీ కూటమిలో చంద్రబాబు చేరారని, ఎన్టీఆర్‌ను అవమానించిన కాంగ్రెస్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటారని  నిలదీశారు. తనకన్నా సీనియర్‌ అని పదేపదే చెప్పే చంద్రబాబు తన సీనియార్టీతో ఏం సాధించారో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. ఏపీలో తండ్రీ కుమారుడి రాజకీయం త్వరలోనే అంతం కాబోతోందని జోస్యం చెప్పారు. ప్రజా చైతన్య సభ వేదికపైకి ఆదివారం ఉదయం 11.25 నిమిషాలకు చేరుకున్న మోదీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తరువాత  ప్రసంగించారు. 11.40కు ప్రారంభమైన మోదీ ప్రసంగం 12.40 నిమిషాలకు ముగిసింది. ఆయన ప్రసంగం ఆద్యంతం హావభావాలతో సాగింది. మోదీ హిందీ ప్రసంగాన్ని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలుగులోనికి అనువాదం చేశారు.

ఒక పెద్ద అబద్ధపు ప్రచారానికి గుంటూరు నుంచి స్వస్తి పలకదలుచుకున్నా

ఏపీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని కేంద్రం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. ‘‘ఒక పెద్ద అబద్ధపు ప్రచారానికి గుంటూరు నుంచి స్వస్తి పలకదలుచుకున్నా. గడచిన 55 నెలల్లో ఏపీ అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఎలాంటి లోటూ చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సక్రమంగా ఖర్చు చేయడంలేదు. ప్రత్యేక హోదాకంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. ఏపీని విభజించిన సమయంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అప్పుడు కాంగ్రెస్‌ స్వలాభం కోసమే విభజన చేసింది. అలాంటి ఆ పార్టీతో చంద్రబాబు జతకట్టారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాతో ఎంత లాభం కలుగుతుందో ప్రత్యేక ప్యాకేజీ కింద అన్ని నిధులు వచ్చేలా చేశాం. ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారు.

మా చిత్తశుద్ధికి నిదర్శనాలివి…

విభజన చట్టంలో ఇచ్చిన ప్రతీహామీపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందుకు నిదర్శనమే తిరుపతిలో ఐఐటీ, అనంతపురంలో సెంట్రల్‌ వర్సిటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్‌ వంటి 11 ఉన్నత విద్యాసంస్థల్లో 10 ప్రారంభమయ్యాయి. విశాఖ – చెన్నె పారిశ్రామిక కారిడార్‌, మూడు విమానాశ్రయాల విస్తరణ, మెట్రో, అమరావతితో అనుసంధాన రవాణ ప్రాజెక్టులు, 8 భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో 6 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైపోయాయి. విభజన చట్టప్రకారం ఈ ప్రాజెక్టులను పదేళ్ల వ్యవధిలో ఏర్పాటు చేయొచ్చు. కానీ మేం అయిదేళ్లలోపే ఎక్కువశాతం పనులను ప్రారంభించాం. రాష్ట్రాల్లో ఉండే సమస్యలు నాకు తెలుసు, ఎందుకంటే ఇలాంటి సమస్యలను చాలాకాలం పాటు ముఖ్యమంత్రిగా నేనూ ఎదుర్కొన్నాను. అందువల్లే రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి నష్టం జరగరాదని 2014లో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాను. మీకు భరోసానిస్తున్నా ఏపీ అభివృద్ధికి మా వంతు కృషి చిత్తశుద్ధితో కొనసాగుతూనే ఉంటుంది.

అమరావతి నుంచి పోలవరం వరకూ సీఎం సొంత ఆస్తులు పెంచుకునే యత్నం

 లోకేష్‌ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదని అన్నారు. అవును అది నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. కానీ అమరావతి నుంచి పోలవరం వరకూ తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. కేవలం దేశ సంపదను పెంచడం కోసమే ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. సొంత పిల్లల ఆస్తులు పెంచుకోవడం కాదు. దేశ బిడ్డల అభ్యున్నతి కోసం కృషి జరగాలి. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి వాస్తవాలను వదలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్థం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్థం.

ఎన్టీఆర్‌కు గౌరవం ఇస్తున్నారా!

 ప్రజలారా మీరే చెప్పండి.. ఎన్టీఆర్‌ వారసత్వాన్ని తీసుకున్నాయన ఎన్టీఆర్‌ కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా? ఎన్టీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తామని హామీ ఇచ్చారా లేదా? ఈ రోజు ఆయన ఎన్టీఆర్‌కు గౌరవమిస్తున్నారా? సోదర సోదరీమణులారా మీకీ విషయం అర్థమవుతోంది. కానీ ఆయనలాంటి సీనియర్‌ నాయకుడికి ఎందుకు అర్థం కావడం లేదు! పార్టీ చరిత్రనే ఆయన మరిచిపోయేంతటి ఒత్తిడి ఏం వచ్చింది? ఇదంతా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దిల్లీలోని వారసత్వ వంశపారంపర్య అహంకార కుటుంబం, రాష్ట్రాల్లోని నేతలను ఎప్పుడు అగౌరవపరుస్తూ ఉంటుంది. ఆ అవమానం చూసిన తరువాతే ఎన్టీఆర్‌ ఏపీకి కాంగ్రెస్‌ నుంచి విముక్తి కల్పించాలనుకున్నారు. అందువల్లే తెదేపా ఆవిర్భవించింది. కానీ.. ఈరోజు ఆ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కోవాల్సిన తెదేపా అధినేత అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్‌ అని ఎన్టీఆర్‌ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అదే కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు. ఇది చూసిన ఎన్టీఆర్‌ ఆత్మ ఎంత ఘోషిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

మహా కూటమి క్లబ్‌

దేశాన్ని ఎవరైతే ఇంతకాలం పొగలో మగ్గేలా వదిలేశారో వాళ్లు ఇప్పుడు దేశంలో అబద్ధాల పొగను వ్యాపింపజేయడంలో నిమగ్నమయ్యారు. మహా కూటమి పేరుతో ఆట ఆడుతున్నారు. ఇక్కడి ముఖ్యమంత్రి కూడా ఏపీ అభివృద్ధిని మరచిపోయి మోదీని తిట్టే పనిలో మునిగిపోయారు. మహా కూటమి క్లబ్‌లో మీ ముఖ్యమంత్రి చేరడానికి కారణం స్వార్థ రాజకీయాలను కాపాడుకునేందుకే. దాదాపు ప్రతీ ఒక్కరూ పేదలకు, దేశానికి ద్రోహం చేసిన ఆరోపణలపై చట్టం కత్తి వేలాడుతున్నవారే.

మోదీ కోసం తిట్లన్నీ దాచిపెట్టి…

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఒక గొప్ప సంస్కృతి, సంస్కారాన్ని చూసిన దేశంలో ప్రతీ పిల్లాడూ ఏపీని ఉన్నతంగా భావిస్తాడు. కానీ కొన్ని నెలల కిందట నుంచి చంద్రబాబు వాడుతున్న భాష.. నిఘంటువులో ఎన్ని తిట్లున్నాయో వాటన్నింటినీ మోదీ కోసం రిజర్వు చేశారు. ప్రతీరోజూ ఒక కొత్త తిట్టు, ఇదేనా ఆంధ్ర సంస్కారం? రాష్ట్రంలోని కోట్లాదిమంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకెక్కడిది బాబు గారూ? మీ తండ్రీ కొడుకుల ప్రభుత్వం గురించి… కొన్ని నెలల నుంచి మీరంటున్న మాటల గురించి తెలిసినా నేను మౌనంగా ఉన్నా, నా నోటికి తాళం పెట్టుకున్నా, ఒక్క మాటా అనలేదు. మీ తిట్లు, అభియోగాలను ఆంధ్ర ప్రజలు విశ్వసించలేదు. అందువల్లే ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో నాపై ప్రేమను చూపుతూ వచ్చారు. తండ్రీ కొడుకుల ప్రభుత్వం పోవడం ఖాయం. అవినీతి పాలన పోవడం ఖాయం. ఆంధ్రలో అవినీతి రహిత పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత అది రానుంది. జై ఆంధ్రా.. జై ఆంధ్రా.. జై ఆంధ్రా.. భారత్‌ మాతాకి జై.. భారత్‌ మాతాకి జై’’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.  ప్రధాని గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాఫ్టర్‌ ద్వారా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో హెలికాఫ్టర్‌ ద్వారా మళ్లీ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. వేదికను అలంకరించిన వారిలో పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు, హరిబాబు, సీనియర్‌ నేతలు మురళీధరన్‌, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కృష్ణంరాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, మాణిక్యాలరావు, ఎమ్మెల్సీలు మాధవ్‌, సోము వీర్రాజు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

తెలుగులో మోదీ

ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు శుభాకాంక్షలు.. పద్మభూషణ్‌, దళిత రత్న, కవి కోకిల గుర్రం జాషువా… మహాకవి తిక్కన జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం. జాతి నిర్మాణంలో గుంటూరుకు ప్రత్యేకస్థానం ఉంది. ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. స్వాతంత్య్ర సేనాని వావిలాల గోపాలకృష్ణయ్య, నాయుడమ్మ లాంటి అందరికీ నమస్సులు తెలియజేసుకుంటున్నా..’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.

అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ఆక్స్‌ ఫర్డ్‌

గుంటూరులోనే ఉన్న అమరావతి ఆధ్యాత్మికతకు కేంద్రం. ఇది నయా భారత్‌కు ఉజ్వల కేంద్రమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘హృదయ్‌’ పథకం కింద అమరావతిని వారసత్వ నగరంగా ప్రకటించింది. ఇదిక్కడి పురాతన సంస్కృతిని కాపాడేందుకు ఉపయోగపడుతుంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ ‘ఆక్స్‌ఫర్డ్‌’ అంటారు. ఎక్కడెక్కడి నుంచో యువత భవిష్యత్‌ ఆశలను నెరవేర్చుకునేందుకు ఇక్కడకి వస్తుంటుంది. ప్రత్యేకించి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్న యువతకు నా శుభాకాంక్షలు. ఈ నగరం, జిల్లా పురాణ సంస్కృతికి ప్రతీక. కొత్త భారత్‌ ఆకాంక్షలకు కేంద్రంగా మారే అర్హత గుంటూరుకు ఉంది.

లెక్కలు అడుగుతున్నాననే..

ప్రజలారా ఈ ముఖ్యమంత్రికి ఓ సమస్య ఉంది. గతంలో దిల్లీలో లెక్కలు చెప్పే అవసరం ఆయనకు ఉండేదే కాదు. మీతో మాట్లాడుతున్న ఈ చౌకీదార్‌ ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ను లెక్కలు అడుగుతోంది. ఏపీ వృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన ప్రతీ పైసాకు లెక్క చెప్పమంటోంది. ఇలా అడుగుతుంటే ఆయన గజగజలాడుతున్నారు. నన్ను చూస్తే భయపడిపోతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

భాజపా కార్యకర్తల చందా సొమ్ముతోనే ఈ సభ

వేదికపై ఉన్న కన్నా లక్ష్మీనారాయణను చూసి.. లక్ష్మీనారాయణగారు ఈ సభ ఖర్చు ఎవరు పెడుతున్నారు అని ప్రధాని అడిగారు. ప్రతీ రూపాయి భాజపా కార్యకర్తలది అని కన్నా సమాధానం చెప్పారు. ‘ఇదే తేడా.. ఇక్కడే ఒక చిన్న గదిలో ప్రభుత్వ కార్యక్రమం చేశా. తర్వాత ఈ పెద్ద కార్యక్రమం భాజపా కార్యకర్తలు చెమటోడ్చి సంపాదించిన డబ్బులో నుంచి ఇచ్చిన చందాలతో చేస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు.

ఈ నల్ల బెలూన్లు మా సభకు దిష్టి చుక్క

మన దేశంలో ఒక సంప్రదాయం ఉంది. శుభ కార్యం సమయంలో ఇంట్లోని ముఖ్యలకు దిష్టి తగలకుండా నల్ల చుక్క పెడతారు. ఈ రోజు మా సభకు దిష్టి తగలకుండా అలాగే నల్ల బెలూన్లను వదిలినందుకు చంద్రబాబుకి, ఆయన కుమారుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

చంద్రబాబు సీనియరే…

నాకు ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రికి ఏమైంది. ఆయన నా కంటే చాలా సీనియర్‌నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది?

‘మీరు(చంద్రబాబు) సీనియర్‌, అందువల్లే మీకు గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు.

అవును మీరు సీనియర్‌… కూటములు, మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో..ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో..

ఆంధ్ర ప్రజల కలలను వమ్ము చేయడంలో.. నీరు గార్చడంలో… ఇలా అన్నింట్లో మీరు సీనియరే.

నేనైతే ఈ విషయాల్లో సీనియర్‌ను కానే కాదు.

చంద్రబాబును భయపెడుతున్న సత్యాలివి

సత్యాన్ని ఎదుర్కోలేకనే లోకేష్‌ తండ్రి తన పార్టీ సిద్ధాంతాలను కాదని కాంగ్రెస్‌తో వెళ్తున్నారు. ఆయన భయపడుతున్న సత్యాలను చెప్పేందుకు ముందుకు వచ్చా!

(1) ఆయన ఎప్పుడూ రెండోసారి ఎన్నికల్లో గెలవలేదు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి భయం ఆయనకు పట్టుకుంది.

(2) తన కుమారుడిని రాజకీయాల్లో ఎదిగేలా చేయడం.

(3) సొంత సంపద సృష్టి.

(4) ఈ సమయంలో మీ (చౌకీదార్‌) కాపలాదారునైన  నేను ఆయనకు నిద్రలేకుండా చేశాను. ఈ నాలుగు సత్యాలతో భయపడిపోతున్నారు.

(బాగానే రాసినందున.. ఈనాడు దినపత్రిక ప్రచురించిన మోడీ ప్రసంగం రిపోర్టు యథాతథంగా) 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *