కానుకలు మీకు!!.. రాజ దండం మాకు!!

February 5, 2019 | News Of 9

CBN | telugu.newsof9.com

  • డబ్బులు పంచుతున్న తెదేపా ప్రభుత్వం
  • చంద్రబాబు పేరుతో పాటలూ, సంకీర్తనలు
  • బడుగులచే కాళ్లకు మొక్కడాలు  
  • డ్వాక్రా మహిళలకు చీర, జాకెట్టు
  • పించను లబ్దిదారులకు ఆఫీసుల్లో భోజనాలు
  • సొంతకులం అధికారులకు పదోన్నతులు
  • అధికార యంత్రాంగం మొత్తం పార్టీ పనిలోనే
  • ప్రజాస్వామ్యానికి ఉప్పుపాతర
  • ఎక్కడ చూసినా రాచరికపు పోకడలు

అమరావతి:‘‘వచ్చే ఎన్నికల్లో మీ ప్రభుత్వం రాకపోతే మేం పెట్టుబడులు పెట్టడం కష్టం… మాకు నమ్మకం లేదు’’ అంటూ పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి వస్తోందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే పెట్టుబడుల సంగతి చెప్పారా…? లేక సొంత పార్టీకి అనుబంధంగా ఉన్న పెట్టుబడిదారులే చంద్రబాబుతో ఈ మాటలు చెప్పారా? ఏదిఏమైనా… చంద్రబాబుపై కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన కోటీశ్వరుల పెట్టుబడిదారుల ఆశల్నీ ఆయనపైనే అన్నది ముమ్మాటికీ నిజం. అందుకే చంద్రబాబు డబ్బులు ధారాళంగా ఖర్చు చేసేస్తున్నారు. ఏ స్థాయికి దిగజారిపోయేందుకు కూడా ఆయన వెనకాడం లేదు. సంక్షేమం పేరుతో ఆయన ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. అంటే ‘‘క్యాష్ ఫర్ ఓట్’’ పథకమే ఇది.

ఒకప్పుడు… ఓట్ల కోసం పోలింగ్ బూతులపై బాంబులు వేసేవారు. ఓటర్లను భీతావహం చేసి ఓట్లను ఏకమొత్తంగా రిగ్గింగు చేసేసుకునేవారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి పోయింది. తర్వాత… ఓటర్లకు డబ్బులు ఇవ్వడం. సారా ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే ఓట్లు వేసే రోజులు కూడా పోయాయి. ఓటుకు 2 వేల నుంచి 5 వేలు అడుగుతున్నారు. దీంతో పోలింగ్ ఖర్చు తడిసి మోపెడైపోయింది. డబ్బును రవాణా చేయడం కూడా రిస్కు వ్యవహారం అయిపోయింది. అందుకే చంద్రబాబు తెలివిగా… సంక్షేమం పేరుతో ప్రజా ధనాన్ని ఓటర్లకు పంచేస్తున్నారు. ఇది రెండు రకాలుగా తెలుగుదేశం వారికి కలిసివచ్చింది. అధికారంలో ఉండటం వల్ల సంక్షేమం పేరుతో ప్రజల డబ్బులే వారికి ఇవ్వవచ్చు. ఎన్నికల సంఘం నుంచి కూడా దీనికి అభ్యంతరం ఉండదు. పైగా కూడబెట్టుకున్న నల్లడబ్బు అలాగే ఇంట్లో మూలుగుతూ ఉంటుంది. ఇది కూడా పెట్టుబడిదారీ పార్టీల ప్రజాప్రతినిధులకు కలిసివచ్చే అంశమే. అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం… రాబోయే ఎన్నికల్లో గెలవడానికి ప్రజల సొమ్మునే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నది. ఎవరైనా అడిగితే పేదవారికి సాయం చేయవద్దా అని చెప్పేందుకు చేతిలో ఒక ఆయుధం ఉంది.

చంద్రబాబు పించను రెట్టింపు చేశారు. డ్వాక్రా గ్రూపునకు రూ.10 వేలు, ఇవికాక మహిళలకు చీరె, జాకెట్టు పంచుతున్నారు. నిజానికి మీకు గుర్తుంటే ఇవన్నీ అనధికారికంగా పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లకు పంచడం గత ఎన్నికల్లో గుర్తుండే ఉంటుంది.

పించన్ల పంపిణీ నిరాఘంటంగా సాగుతున్నది. ఇది ఫిబ్రవరి 8వ తేదీ వరకూ కొనసాగుతంది. ప్రతి ఓటరు దగ్గర ఇప్పుడు చేతిలో కొంచెం డబ్బులు ఆడుతున్నాయి. పించన్లు, రుణాలు ఇస్తున్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఇపుడు లబ్దిదారులకు భోజనాలు కూడా పెడుతున్నారు. ప్రతి దానినీ పండగలా చేస్తున్నారు. వాటికి మహిళలను, వృద్ధులనూ ఆహ్వానిస్తున్నారు. పూర్వం రాజుగారు.. పుట్టిన రోజు వస్తే.. ప్రజలందరికీ దానధర్మాలు చేసేవారు. రాజును కీర్తిస్తూ.. కవులు పాటలూ, పద్యాలూ పాడేవారు. ఇపుడు చంద్రబాబుపై పాటలు కట్టిస్తున్నారు. ఆయన కాళ్లకు వెనుబడిన తరగతుల వారిచే మొక్కిస్తున్నారు.

డబ్బులు పంచుతున్న సమయంలోనే..చంద్రబాబు కులం కార్డును కూడా ప్రయోగిస్తున్నారు. సొంత కులం అధికారులనూ, ఉద్యోగులనూ చంద్రబాబుకు ఆంతరంగిక బృందం గుర్తించింది. వారికి పదోన్నతులు ఇచ్చి వారితో ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయించుకుంటున్నారు. ఇలా లబ్ది పొందిన అధికారులంతా… సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ అనుకూలతను ప్రజల్లో కలిగించేందుకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో.. ప్రతిపక్ష, విపక్ష పార్టీలకు చెందిన నాయకులను గుర్తించి.. వారి గొంతు నొక్కేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులను కూడా ప్రయోగిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకతను సమాధి చేయడం ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. పించన్లు ఇవ్వడంలో కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా తయారయిందో అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు… ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక వైపున పోలీసులూ, రెవిన్యూ యంత్రాంగం, సొంత సమాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబును గెలిపించే పనుల్లో నిమగ్నమయ్యారు. మరి ఇంత చేసి.. ప్రజల్ని ఏమార్చి చంద్రబాబు మళ్లీ అధికారాన్ని కైవశం చేసుకుంటారా లేక 2004లో మాదిరిగా చతికిలపడతారా?

2004లో చంద్రబాబు  ‘‘నేను మారిన మనిషి’’ని అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. అయినా ఆయన్ను ఎవరూ నమ్మలేదు. మారిన మనిషిని అని చెప్పడంలేదుగానీ… అధికార యంత్రాంగం మొత్తాన్నీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చేశారు. ఏటా రూ.2 లక్షల కోట్లు. ఎవరు సంతకం చెయ్యాలన్నదే… ఈసారి కేంద్రం నుంచి లక్ష కోట్లు వస్తుంది. ఎవరు పంచుకుతినాలి అన్నదే దీనికంతా కారణం.

నాగార్జున సినిమా ‘శివ’లో విలన్ ఒక మాట అంటాడు.. శివ… శివ.. శివ. ఎవడు వాడు.. నానాజీ… రెండు లారీల జనాన్ని తీస్కెళ్లి నరికేయ్.. అంటాడు తీవ్ర అసహనంతో. ఇపుడు చంద్రబాబు పరిస్థితీ.. ఈ విలన్ పరిస్థితే. తీవ్ర అసహనం. ఏమైనా చెయ్యండి. గెలవాలి. డబ్బులు విసరండి. స్కీములు పెట్టండి. ఓటర్లతో మాట్లాడండి. అధికారులను పరుగులు తీయించండి. గెలవాలి. అంతే.!!

మరో సారి గుర్తు చేసుకుందాం:

ఏటా రూ.2 లక్షల కోట్లు. ఎవరు సంతకం చెయ్యాలన్నదే… ఈసారి కేంద్రం నుంచి లక్ష కోట్లు వస్తుంది. ఎవరు పంచుకుతినాలి అన్నదే దీనికంతా కారణం.

ప్రజల చేతిలో చంద్రబాబు ఓడిపోతారో..లేక చంద్రబాబు చేతిలో ప్రజలు మోసపోతారో… చూద్దాం. 

ఈ కింది వీడియోలో చంద్రన్న పాటలు… నియంతృత్వానికి ప్రతీక. చంద్రబాబు పోకడలు, తెలుగుదేశం పార్టీ పోకడలూ నాజీ పార్టీనీ, అధినేత హిట్లర్ ను గుర్తుకుతెస్తున్నాయి.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *