బడి మెట్లపై బీరు బాటిల్స్..

June 26, 2019 | News Of 9

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 11 గంటల వరకు వైన్ షాప్ లో మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చినా.. పర్మిట్ రూములకు పర్మిషనిచ్చినా సరిపోలేదో.. లేక స్కూలు గుమ్మం, గుడిమెట్లు, ఆస్పత్రి అరుగులు కాదేవీ మందు తాగడానికి అనర్హం అనుకున్నారో తెలియదు గానీ చదువుల తల్లికి అలయమైన పాఠశాల ప్రాంగణంలొనే మందు పార్టీకి తెగబడ్డారు మన పౌరులు. పుప్పాలగూడా ప్రాధమిక పాఠశాల అరుగులపై బీర్లు తాగి సీసాలు అక్కడే వదిలేసిపోయారు. పొద్దున్నే బడికి వచ్చిన పిల్లలకు బ్లాక్ బోర్డ్ కంటే ముందు ఆ బీరు సీసాలు దర్శనమిచ్చాయి.

ఉదయాన్నే చదువుకోవడానికి పాఠశాలకు వచ్చే విద్యార్థులకి ఏం సంకేతాలు ఇస్తున్నారో.. ఆ పసి హృదయాలపై ఎలాంటి చెరగని ముద్రలు వేస్తున్నారో తెలియని స్థితిలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. బడులకు, గుడులకు కనీసం కిలోమీటరు దూరంలోనే మద్యం దుకాణాలు ఉండాలన్న నిబంధన.. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వెయ్యడానికే అని ఆలోచించకుండా దుకాణం బడికి దూరంగా ఉంటే ఏమిటి మేము అక్కడికే సరుకు తెచ్చుకుంటాం అన్నట్టుగా.. కొందరు ప్రబుద్ధులు ఇలాంటి పనులు చేస్తున్నారు.

ఇలాంటి విషయాల్లో ప్రభుత్వమో, పోలీసులో, విద్యాశాఖో ఏం చర్యలు తీసుకుంటుంది. సామాజిక బాధ్యత, నైతిక విలువలు వ్యక్తులకు ఉండాలి తప్ప అధికార యంత్రాంగం ఏం చేయగలదు. ఏ సంఘ విద్రోహ శక్తులో మనకు అపాయం తలపెడితే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు మనకు అండగా ఉంటారు. మరి మనమే మన సమాజానికి, బావితరాలకి చేతులరా అన్యాయం చేస్తుంటే ఎవరు రక్షిస్తారు. ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇకనైనా మంచి సమాజాన్ని నిర్మించుకునేందుకు ప్రయత్నిద్దాం. మన బాధ్యత మనం తెలుసుకుందాం తక్కిన వారికి ఆదర్శంగా నిలుద్దాం.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *