రివ్యూ: బిలాల్‌పూర్ పోలీస్‌స్టేష‌న్

March 15, 2019 | News Of 9
bilalpur police station review | Telugu.news of 9.com
వెండితెర‌పై అందమైన పల్లెటూరు వాతావ‌ర‌ణం క‌నిపిస్తే ఆ అనుభూతియే వేరు. అప్పుడ‌ప్పుడు తెర‌పై ప‌ల్లెటూరు నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల‌న్నీ ఆహ్లాదాన్ని క‌లిగించాయి. గ‌త ఏడాది రంగస్థలం గ్రామీణ నేపథ్య చిత్రంగా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించింది. తాజాగా విడుద‌లైన‌ ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’ సినిమా అలాంటి అనుభూతినే అందిస్తూ అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. దర్శకుడు నాగసాయి మాకం తెరకెక్కించిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ఎలా ఉందో రివ్యూ రిపోర్ట్‌లోకి వెళ‌దాం.
స్టోరీ:
ఈ సినిమాలో యంగ్ పోలీసు ఆఫీస‌రు సూర్య పాత్ర‌లో మాగంటి శ్రీనాథ్ న‌టించాడు. హెడ్ కానిస్టేబుల్ సురేంద‌ర్ పాత్ర‌లో గోర‌టి వెంక‌న్న న‌టించాడు. బిలాల్‌పూర్ గ్రామానికి కొత్తగా యంగ్ పోలీసు ఆఫీస‌ర్ సూర్య‌ వస్తాడు. సంఘ విద్రోహుల ఆనవాళ్లు లేకుండా చేయాలని అనుకుంటాడు. ఆ గ్రామంలో టీచ‌ర్‌గా చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేందర్ కూతురుని చూడగానే ప్రేమలో పడతాడు సూర్య. బిలాల్ పూర్ లో జ‌రిగే చిల్ల‌ర గొడవలు, చిన్న‌చిన్న దొంగ‌త‌నాలతో క‌థ సాగుతుండ‌గా, ఓ ఘోర ఘటన పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఆ సంఘటన ఏంటి? దాన్ని పోలీసు అధికారి సూర్య ఎలా మార్చాడన్నది ఆసక్తికరంగా సాగే ముగింపు.
యాక్టింగ్ ఫ‌ర్మార్మెన్స్:
యంగ్ పోలీసు ఆఫీస‌ర్‌ సూర్య పాత్ర‌లో మాగంటి శ్రీనాథ్ స‌రిగ్గా స‌రిపోయాడు. యంగ్ ఆఫీస‌ర్‌కు ఉండాల్సిన లక్షణాలు ఆయన యాక్టింగ్‌లో కనిపించాయి. ఇక హీరోయిన్ శాన్వీ మేఘన అందమే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు మూల స్తంభంలా నిలిచారు గాయకుడు గోరటి వెంకన్న. హెడ్ కానిస్టేబుల్ సురేందర్ పాత్రలో ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది.
టెక్నిక‌ల్ వాల్యూస్:
ఈ సినిమాను ఆద్యంతం నాచుర‌ల్‌గా, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా మలచడంలో యంగ్ డైరెక్ట‌ర్ నాగసాయి మాకం స‌క్సెస‌య్యాడ‌నే చెప్పాలి. కొత్త దర్శకుడైనా ఎక్కడా తడబడకుండా క‌మ‌ర్షియ‌ల్ అంశాలతో మేళవించి సినిమాను రూపొందించాడు. మన చుట్టూ జరుగుతున్న కథలాగే బిలాల్ పూర్ సాగేలా చేశాడు. తోట వి రమణ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. పల్లె అందాలను తెరకెక్కించడంలో ఆయన కెమెరా కొత్త పుంతలు తొక్కిందనే చెప్పాలి.
ఇక పోలీస్ గొప్పదనం చెబుతూ సుద్దాల అశోక్ తేజ రాసిన నిద్దుర లేని కళ్లకు అడ్రస్, అలసట లేని కాళ్లకు సిలబస్ అనే పాట ఆయన సాహిత్య స్థాయిని చూపించింది. గోరటి వెంకన్న, మౌనశ్రీ మల్లిక్ పాటలు సాహిత్య విలువలతో సాగాయి. సాబూ వర్గీస్ సంగీతం కథకు మరింత బలాన్నిచ్చింది. ఎంఎస్ క్రియేషన్స్ సంస్థ ఉన్నత నిర్మాణ విలువలు ఉన్నాయి. నిర్మాత మహంకాళీ శ్రీనివాస్‌కు ఇది ఫ‌స్ట్ మూవీ. మంచి సినిమా చేయాలనుకునే తన అభిరుచి చూపించాడు.
చివ‌ర‌గా..
అర్థవంతమైన సినిమా కావాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి ఎంపిక బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ఒక విధంగా చెప్పాలంటే ఇది మన జీవనానికి అద్దం పట్టే సినిమా అని చెప్ప‌వ‌చ్చు.
రేటింగ్ 3 / 5

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *