దటీజ్ పవన్ కళ్యాణ్…!!

March 15, 2019 | News Of 9

BSP Tie up a big advantage to Pawan Kalyan | Telugu.news of 9

  • బీఎస్సీతో పొత్తు జనసేనకూ లాభం
  • బీజేపీతో దూరమని విస్పష్ట సంకేతాలు
  • పార్టీ దళితులకు మరింత చేరువ అవుతుంది
  • తొలి దళిత ప్రధానిగా మాయావతికి మద్దతు
  • ఇతరుల ముసుగు రాజకీయాలకు చెంపపెట్టు

(న్యూస్ ఆఫ్ 9)

కుయుక్తులతో, దుష్ప్రచారాలతో, లేనిపోని అనుమానాలకు మీడియాలో ప్రచారం కల్పిస్తూ తన విజయావకాశాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారిని పవన్ కళ్యాణ్ లాగి చెంపమీద కొట్టినట్లయింది. టీడీపీతో లోపాయికారీ ఒప్పందం ఉందనీ, భారతీయ జనతా పార్టీతో కూడా ఉండే ఉంటుంది అనీ నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలు బాహాటంగా చేస్తున్న ప్రయత్నాలు, తెరచాటు పన్నాగాలను పవన్ కళ్యాణ్ గట్టిగా తిప్పికొట్టారు.

లక్నోలో గురువారం ఆయన బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా… మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలని జనసేన బలంగా కోరుకుంటున్నట్లు మీడియా సుముఖంగా పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టం చేశారు. అంటే భారతీయ జనతా పార్టీతోగానీ, కాంగ్రెసుతో అంటకాగుతున్న తెలుగుదేశంతోగానీ రాజకీయపరమైన సర్దుబాట్లు ఉండే అవకాశంలేని రక్షణ స్థితిని పవన్ కళ్యాణ్ సృష్టించుకున్నారు. జనసేన విజయావకాశాలను మరింత మెరుగు పరుచుకునే విషయంలో ఆయన ఒక అడుగు ముందుకు వేశారు. తాజా వ్యూహంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరైన రీతిలోనే ఇతరులకు బుద్ధి చెప్పినట్లయింది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ… రాజకీయ వ్యూహ రచనలో తాను ఎవరికంటే కూడా తక్కువ కాదని పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు.

భాజపాతో జగన్ రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నట్లు టైమ్స్ నౌ ఆంగ్ల ఛానెల్ స్టింగ్ ఆపరేషను ద్వారా బట్టబయలు చేసింది. ఇన్నాళ్లూ.. తెలుగుదేశం పార్టీ చేస్తున్నది విమర్శలుగానే ఉన్నా.. ఈ స్టింగ్ వీడియో వైఎస్సార్ కాంగ్రెసును ఇరుకున పడేసింది. మరో వైపు తెరాసతో బహిరంగంగానే వైఎస్సాఆర్ కాంగ్రెస్ స్నేహాన్ని కొనసాగిస్తోంది. నిన్న రాజమండ్రి శంఖారావంలో కూడా జగన్ వైఖరిని తూర్పారబట్టారు. బీజేపీతో స్నేహం చేస్తూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడతావు అంటూ ప్రశ్నించారు.

ఎవరితోనూ… తెరచాటు ఒప్పందాలు, స్నేహాలు లేకుండా… ఒంటరిగా 175 సీట్లకూ నిజాయితీగా పోటీ చేస్తున్న పార్టీగా జనసేన ఒక్కటే ప్రజల మన్ననలను అందుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు.

బీఎస్సీ అధినేత్రి మాయావతి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెసు పార్టీతో కలిసే అవకాశమే లేదని, దేశ వ్యాప్తంగా ఆ పార్టీతో కలిసేదిలేదని మాయావతి ఎప్పుడో కుండబద్ధలు కొట్టేశారు. దీంతో పరోక్షంగా కూడా జనసేన ఎక్కడా కాంగ్రెసుతో కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఎదురు కాదు. రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా కాంగ్రెసుతోనూ, స్సెషల్ స్టేటస్ ఇవ్వని కారణంగా బీజేపీతోనూ జనసేన దూరంగా ఉంది. అయితే… జనసేన విజయావకాశాలను దెబ్బ తీసేందుకు తెలుగుదేశం, వైఎస్సార్సీపీలు జనసేనపై బురద చల్లడానికి ప్రయత్నించాయి. మాయావతిని ప్రధానిగా చూడాలని తాము బలంగా కోరుకుంటున్నామని చెప్పడం ద్వారా మోడీ లేదా ఎన్డీయే నేతృత్వంలో వచ్చే ప్రధానికి తమ మద్దతు ఉండే అవకాశం లేదని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసేశారు. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎస్పీ-బీఎస్సీలు ఈ సారి కలిసి పని చేస్తున్నాయి.  

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి రాష్ట్రాన్ని విడదీసిన పార్టీతో ప్రస్తుతం అంట కాగుతున్నది తెలుగుదేశం పార్టీనే. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారన్న కారణంతో కాంగ్రెసు పార్టీకి పుట్టగతులు లేకుండా చేశారు ఏపీ ప్రజలు. ఈ నేపథ్యంలో… బీజేపీ, కాంగ్రెసు పార్టీలు ఆంధ్ర ప్రజల దృష్టిలో దుష్మన్ పార్టీలుగా మిగిలిపోయాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెసుతో కలిసి ఉండటాన్ని ఆంధ్ర ప్రజలు ఏ విధంగా చూస్తారన్నది ఈ ఎన్నికల్లో తేలుతుంది. తెలంగాణలో అయితే కాంగ్రెసు-తెలుగుదేశం ప్రయోగం… బెడిసికొట్టినట్లు ఎన్నికల ఫలితాలు చెప్పేశాయి. అందుచేత ఆంధ్రలో కాంగ్రెసుతో కలవకుండా ఈ సారి ఒంటరిగానే పోటీ చేస్తున్నా…చంద్రబాబు కాంగ్రెసుతో సన్నిహితంగానే మెలగడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

జనసేన పార్టీ పెట్టిందే… బహుజనుల ఉద్దరణ కోసం అన్నది ఆ పార్టీ సిద్ధాంతాలను బట్టి తెలుస్తోంది. బీఎస్సీ సిద్ధాంతకర్త, దళిత మేథావి కాన్షీరాం స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నానని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. ఒంటరిగా పెట్టుబడిదారీ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతూ ముందుకు వెళ్లడం అంత తేలికైన విషయమేమీ కాదు. అందునా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర పెట్టుబడిదారుల వ్యూహాలు మామూలుగా ఉండవు. అధికారం కోసం వారు ఏమైనా చేయగల సమర్ధులు. ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం జనసేన మరింత ఎక్కువగా దళిత బహుజనులకు దగ్గర అవుతుందని చెప్పవచ్చు.

మాటలు వేరు.. చేతలు వేరు. దళిత సిద్ధాంతాలను తాను గౌరవిస్తున్నానని, నిజంగా ఇప్పటి వరకూ అవకాశాలు రాని వారి కోసమే తాను పని చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చేతల్లో నిరూపించారు. యూపీలాంటి పెద్ద రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి కూడా పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని అనుకుంటున్నట్లు చెప్పడం జనసేనకు ఆశీర్వచనం. 2019లో తొలి దళిత ప్రధాని మాయవతి కావచ్చన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ దిశగా అనేక మంది ఆమెకు మద్దతు పలుకుతున్నారు. జనసేనకు మద్దతుగా మాయావతి జనసేన ఎన్నికల ప్రచారంలో కనిపించవచ్చు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *