నేనే రాజు… నేనే మంత్రీ!!

December 6, 2018 | News Of 9

Babu, the supreme commander of AP | Newsof9

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే.. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా, ఒక దేశాధినేతలా వ్యవరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రత్యేక దేశమేమీ కాదుగానీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మాత్రం అంతే. విదేశీ ప్రయాణాలు… దేశాధినేతలతో కరచాలనాలు.. ఆయనేం చేసినా తన పాలనకు సూటయ్యే చట్టాలను తెచ్చుకుంటారు.

సీబీఐని ఇప్పటికే తన ‘‘ఇలాకా’’లోకి రాకుండా నిషేధం విధించారు. తాజా సమాచారం ఏమంటే… జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్ఐఏ)ని కూడా ఆయన రానివ్వడం లేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిపై హైకోర్టులో విచారణలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగానే… చంద్రబాబు ప్రభుత్వం ఎన్ఐఏ పట్ల విముఖతను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనపై జరిగిన దాడిలో కుట్ర ఉందని, రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకంలేదని జగన్ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. పైగా విమానాశ్రయం కేంద్రం పరిధిలోనిది కాబట్టి, ఎన్ఐఏ ఈ కేసును చేపట్టాలని వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయంలోనే దాడి జరిగినందున ఎన్ఐఏ విచారణ చేయవచ్చునని కోర్టు కూడా భావించింది. విమానాశ్రయ ప్రాంతం కేంద్రం పరిధిలోకి వస్తుందనీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) దాని భద్రతను పర్యవేక్షిస్తుందున ఎన్ఐఏ ఈ కేసును ఎందుకు స్వీకరించరాదని కోర్టు ప్రశ్నించింది. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేసును అప్పగించేందుకు సిద్ధంగా లేదు. విమానాశ్రయంలో జరిగింది కాబట్టి.. ఈ కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ వాదించింది. కానీ… కేసును మాత్రం తన వద్దనే అట్టి పెట్టుకుంటున్నది. కేసులో నేర విచారణ ప్రారంభం కాకముందే… ఇందులో కుట్ర ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసు షీటులో.. ఎక్కడా విమానాశ్రయ భద్రతకు సంబంధించిన చట్టాలను పేర్కొనక పోవడాన్ని కోర్టు ప్రశ్నించింది.

కోడికత్తి కేసు విషయంలో… రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వొకేట్ జనరల్ కు  కూడా ఇది తలనొప్పిగా పరిణమించింది. కేసును కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలివేస్తున్నామని ఆయన చెప్పక తప్పింది కాదు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాల్సిందిగా ఇప్పటికే కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసును రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేస్తారా లేక కేసును స్వీకరిస్తారా అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇపుడు చెప్పాల్సి ఉంది.   

కేంద్రం ఏమి చెబుతుందోనని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదురుచూస్తున్నది. కేసు రాష్ట్ర ప్రభుత్వ సారధ్యంలోనే జరిగితే.. ఎలా తేల్చివేయాలన్నది దాని తెలుగుదేశం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఒకవేళ కేసు విచారణను కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటే… తెలుగుదేశం పార్టీ కొత్త సినిమా కథను తయారు చేసుకుంటుంది. కేంద్రం కేసును స్వీకరిస్తే… అదిగో చూశారా… భాజపాకీ, వైఎస్సార్సీపీకీ మధ్య రహస్య ఒప్పందం ఉందని మేం ముందు నుంచే చెబుతున్నాంగా అంటూ మీడియా వేదికగా తెలుగుదేశం నానా యాగీ చేస్తుంది. ఏం జరిగినా… కోడికత్తి నుంచి లబ్ది పొందేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. చంద్రబాబా మజాకా…? ఇదీ అసలు కథ!!

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *