జగన్… మహాత్మా ఫూలేనా…?

June 8, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

ఏపీ మంత్రివర్గ ఎంపికను చూస్తుంటే కలా… నిజమా అనిపిస్తోంది. అవును… చంద్రబాబు సామాజిక వర్గ ప్రభుత్వం పోయి జగన్ సామాజిక వర్గ ప్రభుత్వం వచ్చింది… హమ్మయ్య అని అందరూ ఊపిరిపీల్చకుంటున్న సమయంలో సొంత సామాజిక వర్గానికి 25 మంత్రి పదవుల్లో కేవలం నాలుగంటే నాలుగు పదవులు ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం చరిత్రాత్మకమే. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేసి ఉండకపోవడంతో జగన్ ఆలోచనలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. వైసీపీ నేతలయితే ఏకంగా… ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మించిపోవడం ఖాయమని, అంతకంటే ఎక్కువగానే పేరు తెచ్చుకుంటారనీ, జగన్- మహాత్మా ఫూలే స్థాయికి ఎదిగిపోయారని ఇలా రకరకాల కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి.

సమాజంలోని అన్ని వర్గాలనూ కలుపుకునిపోయేలా మంత్రి వర్గాన్ని కూర్చారని, 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కాపులకు కూడా ఏకంగా నాలుగు మంత్రి పదవులు అదీ రెడ్డి సామాజిక వర్గంతో సమానంగా కేటాయించారని అంటున్నారు. రాజకీయంగా కాపులను ఆకర్షించేందుకు చేసిన ఒక ఎత్తుగడ అయి ఉండొచ్చన్నది కొందరి భావన. చంద్రబాబు ప్రభుత్వంలో సీట్లు అయినా, మంత్రి పదవులైనా, కాంట్రాక్టులైనా సొంత సామాజిక వర్గానిదే అగ్రతాంబూలం. మరి వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రతీకగా ఉన్నా… సొంత వాళ్లను కాదని సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ముఖ్యమంత్రి జగన్ చేసిన మంత్రివర్గ విన్యాసం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన మాట వాస్తవం. అన్నం లేకపోయినా ఉంటారుగానీ… అధికారంలేకపోతే ఉక్కిరిబిక్కిరి అయ్యే రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు ఏం చెప్పి జగన్ నచ్చచెప్పి ఉంటారన్నది ఊహకందడం లేదు.

జగన్ మంత్రివర్గాన్ని రూపొందించిన విధానం… అధికారానికి దూరంగా ఉన్న 90 శాతం కులాలకు ఆర్ధికంగాగానీ, సామాజికంగాగానీ ఉపకరిస్తుందా అన్నది ప్రస్తుత ప్రశ్న. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం 90 శాతం సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడం వారికి ఎంత వరకూ ఉపయోగపడుతుంది? ఆయా వర్గాలు సామాజికంగా ఇక ముందుకు పోతాయని జగన్ చర్యతో భావించవచ్చా? లేక ఇందుకు మరో కారణం ఏదైనా ఉందా?

తెలంగాణలోని తెరాస నేతృత్వంలో వచ్చిన ప్రభుత్వాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. 2014లో కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం కేవలం నామమాత్రంగానే పని చేసింది. కేవలం ప్రజలకు చూపించేందుకూ, లేదా రాజ్యాంగపరమైన తంతు కోసం మాత్రమే కేసీఆర్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని అనేక విమర్శలు ప్రజల్లో ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ‘‘ఆ నలుగురు’’ హవా మాత్రమే నడిచిందన్నది అందరికీ తెలిసిందే. ఆర్ధిక మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కనీసం సొంతగా ఒక విలేకరుల సమావేశం నిర్వహించే సాహసం చేయలేదు. ‘‘కనీసం నాకు ఒక కానిస్టేబులును నియమించుకునే స్వేచ్ఛ కూడా లేదు… ఎందుకు ఆ మంత్రి పదవి?’’ అంటూ హోంమంత్రిగా పని చేసిన నాయని నరసింహారెడ్డి వ్యాఖ్యానించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.

తెలంగాణలో కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఒకవైపు అసంతృప్తి రగులుతున్నా… ఆయన మాటకు నేటికీ తిరుగులేదనే చెప్పాలి. పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ కేసీఆర్ మాటే వేదం. ఆయన ఆడింది ఆట.. పాడింది పాట. ఎన్ని విమర్శలు ఎదురైనా తాజాగా ఆయన ప్రతిపక్షం ఊపిరి తీసేశారు. ‘‘కాంగ్రెసు ముక్త భారత్’’ అన్న భాజపా రాజకీయ ఆకాంక్షను కేసీఆర్ నెరవేర్చారా అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అంటే.. నయానో, భయానో లేక మరో మార్గంలోనో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఏక ముఖ పాలనకు కేసీఆర్ తెరతీశారు. కేసీఆర్ తన పార్టీనీ, ప్రభుత్వాన్నీ అడ్డులేని విధంగా నడిపిస్తున్న తీరు… ఇతర రాజకీయ పార్టీలకు ఆదర్శంగా మారుతోందా అన్న అనుమానం వస్తోంది. ఒకవైపు నుంచి కాంగ్రెసును వేళ్లతో సహా పెకలించడం, మరో వైపు పరోక్షంగా మీడియా సంస్థలపై గుత్తాధిపత్యాన్ని సాధించడం తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నదే. వైసీపీ అధినేత జగన్ కు సాక్షి మీడియా సంస్థ ఉన్నా… ఇతర మీడియా సంస్థల కొనుగోలుపై జగన్ కూడా దృష్టి సారించినట్లు సమాచారం. ఇక్కడ తెలంగాణలో కూడా తెరాస దన్ను ఉన్న పారిశ్రామికవేత్తలు ఇప్పటికే టీవీ9, టెన్ టీవీలను కొనుగోలు చేశారు.

ఒక్క మీడియా సంస్థలు ఉంటే గేమ్ మొత్తం నడిచే పరిస్థితి కూడా లేదు. సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నట్లు బయటకు కనిపించడం కూడా ముఖ్యమే. ప్రధాన మీడియా సంస్థలు గుప్పిటలో ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచిపోతామన్న గ్యారంటీ లేదన్నది మొన్నటి చంద్రబాబు పాలన నిరూపించింది. యల్లో మీడియా జనంలోకి ఎంత ఎక్కించినా జనం మాత్రం తెలుగుదేశాన్ని ఛీకొట్టారు. చంద్రబాబు ఓటమి నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకున్న గుణపాఠం ఏమంటే… మంచి చేసినా చేయకపోయినా మంచిగా కనిపించడం మాత్రం ముఖ్యం. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం.

జగన్ పరిపాలన తొలి రోజు నుంచే… కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని అర్థమవుతూనే ఉంది. 2018లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినా కేసీఆర్ చాలా రోజులపాటు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. అందరూ లోలోన గొణుక్కున్నారుగానీ.. ఒక్కరూ వేలెత్తి ‘‘కేసీఆర్ గారూ.. మంత్రి వర్గాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు?’’ అని అడిగే సాహసం చేయలేదు. రాజకీయాల ఒరవడి చాలా వేగంగా మారిపోతున్నది. పొలిటికల్ మేకింగ్ లో ఈ వేగాన్ని ప్రవేశపెట్టిన ఘనత మాత్రం ప్రధాని నరేంద్ర మోడీదేనని చెప్పాలి. తెలంగాణకు వస్తే.. కేసీఆర్. ఈ పోకడల్ని గుర్తించలేక  ‘‘ఇంకా నేను మారను.. నా పాత పాటే నేను పాడుకుంటాను అనుకుంటూ బోర్లాపడింది చంద్రబాబు మాత్రమే.

ఇవన్నీ.. గుర్తించే ఏపీలో జగన్ సరికొత్త రాజకీయానికి తెరతీస్తున్నారు. అందులో భాగంగానే సొంత సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేశారు. అసలు అంతా తానే అయినపుడు మంత్రి వర్గం ఎందుకు? అలాంటప్పుడు ఎవరు ఉంటే ఏమవుతుంది? బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తే… ‘‘బలహీన వర్గాల బంధు’’ అన్న పేరును సంపాదించుకోవచ్చు. మీడియాకి కూడా విమర్శించడానికి నోరు పెగలదు. 2024కి ఇప్పుడే విత్తనం నాటినట్లు అవుతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. రాజకీయాల్లో ‘‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’’ అన్నది చాలా ప్రమాదకరమైన టెక్నిక్. లోలోన అంతా జరిగిపోతుంది.. బయటకు విమర్శించడానికి ఏమీ ఉండదు.

ఈ తరహా రాజకీయాలు వైఎస్ రాజశేఖరరెడ్డి సమయానికి లేవు. మనకు పరిచయం లేనివి. మోడీ తరహా పాలన మొదలైన తర్వాతే… రాష్ట్రాల్లో కూడా ‘‘నేనే రాజు-నేనే మంత్రి’’ తరహా విధానం తెరపైకి వచ్చింది. మీడియా విమర్శించినా ‘‘మంచి చేస్తుంటే విమర్శిస్తారేమిటి?’’ అంటూ విరుచుకుపడే వంధిమాగధులు దండిగానే ఉంటారు. అందువల్ల ఇపుడు మోడీని విమర్శించడం వల్ల విమర్శించిన వాళ్లే నష్టం జరగడాన్ని మొన్నటి ఎన్నికల్లో చూడవచ్చు.

పదవులు ఇచ్చేది బలహీన వర్గాలకే అయినపుడు ఎవరికి ఇస్తే మాత్రం ఏం చేస్తారు? సరే,  పేరు పక్కన మంత్రివర్యులు అన్న హోదా వస్తుంది. ఆ తర్వాత జీవితాంతం మాజీ మంత్రి అన్న శాశ్వత హోదా కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే.… 90 శాతం కులాలు ఈ మాత్రం హోదాకు కూడా నోచుకోలేదన్నది వాస్తవమే కదా. మంత్రులయినా, మాజీ మంత్రులయినా ఈ హోదాలన్నీ కూడా గత 70 ఏళ్లలో రెండే సామాజిక వర్గాలకు సంబంధించిన సొత్తు. కొంతలో కొంత నయం.. ఏమంటే ఈ హోదాలు కింది కులాలకు కూడా అందివస్తున్నాయి. అయితే హోదాకు సరిస్థాయిలో అధికారాలను కూడా చలాయించవచ్చా? చలాయిస్తే ఊరుకుంటారా? ఇవన్నీ రానున్న కాలంలో తెలుస్తుంది. రావెల కిషోర్ బాబు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి బయటకు వస్తూ… ‘‘నాకు పదవి మాత్రమే ఇచ్చారు. అధికారాలు ఏమీ ఇవ్వలేదు’’ అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.

ఒకటి మాత్రం నిజం. కనీసం ఇపుడు హోదాలయినా వస్తాయి… మరో 20-30 ఏళ్ల కాలంలో అధికారాలు కూడా దిగువ వర్గాలకు అందవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి జగన్… కేవలం హోదాలే ఇచ్చారా? లేక మంత్రులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారాలను కూడా బదలాయిస్తారా అన్నది వేచి చూడాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనే ఆదర్శం అయితే మంత్రులకు అధికారాలనేది కలలో మాట. ‘‘చూశారా.. మేం కూడా మంత్రులమే..’’ అని మంత్రులు చెప్పుకోవడానికి ఇబ్బంది మాత్రం ఉండకపోవచ్చు. డబ్బు, అధికారంతోనే ప్రజల మనసుల్ని గెలవలేమన్నది ఆధిపత్య వర్గాలకు మాత్రం  అర్థం అయిందని ఢంకా బజాయించి చెప్పవచ్చు. అందుకే నేడు హోదాలు అందిస్తున్నాయి. తర్వాత.. అధికారాలు అందవచ్చు.. మరో నాలుగైదే దశాబ్దాలకయినా సీఎం పదవి కూడా రావచ్చు…!! మార్పు ముందు ఆలోచనల్లో మొదలవుతుంది. తర్వాత ఆచరణలోకి రావచ్చు…!! ఏమైనా జగన్ నిర్ణయాలు రేపన్న రోజున బలహీన వర్గాల రాజకీయ అధికారానికి బాటలు వేస్తాయని భావించవచ్చు..!! తెలుగుదేశం పార్టీ ప్రేక్షకపాత్రకే పరిమితం, తప్పదు. కాలమహిమ!!

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *