అవకాశాల కల్పన దిశగా పవన్ కళ్యాణ్ తొలి అడుగు

December 14, 2018 | News Of 9

Pawan Kalyan
ఫోటో: ఎన్ఎంఎస్డీసీ అధ్యక్షురాలు అడ్రియాన్ ట్రింబుల్, నాదెండ్ల మనోహర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. యుఎల్ బిజినెస్ పార్టనర్ ఎల్రాయ్ పి.సైలర్, అమెరికా మైనారిటీ బిజినెస్ డవలప్ మెంట్ ఏజన్సీ డైరెక్టర్ హెన్నీ ఛైల్డ్స్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశ్వ ప్రసాద్.

అవకాశాల కల్పన దిశగా పవన్ కళ్యాణ్ తొలి అడుగు

  • మైనారిటీ వ్యాపార సంస్థల సమాఖ్యతో ఒప్పందం
  • సంతకాలు చేసిన నాదెండ్ల, ట్రింబుల్
  • ఆయన ఆకాంక్ష గొప్పదంటూ వ్యాఖ్య

వాషింగ్టన్: ఎలాంటి అవకాశాలు లేకుండా పేదరికంలో మగ్గిపోతున్నవారికి అవకాశాలను కల్పించాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. తన అమెరికా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ కారణంగా ఈ దిశగా ఒక ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం (ఎల్ఓఐ) జరిగింది. అమెరికాలోని మైనారిటీ వ్యాపార సంస్థల సమాఖ్య (నేషనల్ మైనారిటీ సప్లయిర్ డెవలప్ మెంట్ కౌన్సిల్ –NMSDC), వీనస్ కాపిటల్ మేనేజ్ మెంట్, మిషన్ స్మార్ట్ రైడ్ ఫౌండేషన్లు ఈ మేరకు వాషింగ్టన్ నగరంలో సంతకాలు చేశాయి. అమెరికాలో అనేక దేశాల నుంచి వచ్చి వ్యాపారాలు చేస్తున్న వారిని మైనారిటీ వ్యాపార రంగంగా పిలుస్తారు. ఉదాహరణకు అమెరికాలో స్థిరపడిన భారతీయులు చేసే వ్యాపారాలు మైనారిటీ వ్యాపార సంస్థలుగా గుర్తిస్తారు. ఈ రంగంలో దాదాపు 12 వేల కంపెనీలు 400 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎన్ఎంఎస్డీసీలో సభ్యులుగా ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఎన్ఎంఎస్డీసీ తెలిపింది. 2014లో జనసేన పార్టీని ప్రారంభించారని, భారతదేశంలో ఆయన పేరు చెబితే తెలియని వారు లేరని, భారతదేశంలో ఉన్న పేదలకు అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఆయన ఉన్నారని పేర్కొన్నది. ఆయన ఆకాంక్షను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని చెప్పింది.

‘‘భారత ప్రజలకూ, ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి ఉపయోగపడే ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకునేందుకు అమెరికాలో పర్యటిస్తున్నాం. అమెరికా పర్యటన లక్ష్యమిదే. ఎన్ఎంఎస్డీసీతో ఒప్పందం ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

వాణిజ్య పరమైన కార్యకలాపాల ద్వారా సంస్థల మధ్య వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం (ఎల్ఓఐ) ఉపకరిస్తుంది. అమెరికాలోని మైనారిటీ బిజినెస్ డెవలప్ మెంట్ ఏజన్సీ అందిస్తున్న వివిధ కార్యక్రమాలను అందిపుచ్చుకునేందుకు దీని ద్వారా వీలవుతుంది.

‘‘అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యానికి ఈ ఒప్పందం తొలి చర్య అవుతుంది’’ అని ఎన్ఎంఎస్డీసీ అధ్యక్షుడు అడ్రియాన్ ట్రింబుల్ వ్యాఖ్యానించారు. భారతదేశం గొప్ప ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందనీ, సాంకేతిక రంగంలో భారతదేశం గొప్ప ప్రగతిని సాధిస్తోందని ఆమె అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని చాలా విలువైనదిగా భావిస్తున్నామని ట్రింబుల్ తెలిపారు.

‘‘గొప్ప పనులు చేసేందుకు మమ్మల్ని ఆ దేవుడు సృష్టించాడు. ‘‘ఎన్ఎంఎస్డీసీ, కళ్యాణ్ నేతృత్వంలోని ఇండియా ప్రతినిధుల బృందం ద్వారా వాణిజ్యావకాశాలను మరింత ముందుకు తీసుకెళతాం. అమెరికన్లకూ, భారతీయులకూ మరిన్ని అవకాశాలను ఇది అందిస్తుంది’’ అని అమెరికా వ్యాపార భాగస్వామి ఎల్రాయ్ పి.సైలర్ వ్యాఖ్యానించారు.

అమెరికా పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయనతోపాటు ఉన్న భారత ప్రతినిధి బృందం అమెరికా గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ బెన్ కార్సన్, అమెరికా ఆర్థిక శాఖా మంత్రి జోవితా కరాంజా,  సెనేటర్లు టిమ్ స్కాట్, రాండ్ పాల్, స్టీవ్ డైన్స్, ఎంపీ ఆడం స్మిత్, రాజా కృష్ణమూర్తి, మైనారిటీ బిజినెస్ డెవలప్ మెంటు ఏజన్సీ డైరెక్టర్ హెన్సీ చైల్డ్స్, ఫార్చ్యూన్ 500 కంపెనీల అధికారులనూ కలిసింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *