జీవికకు భరోసా ఇవ్వలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే!!

April 25, 2019 | News Of 9

Dead Governments can’t Guarantee th e Basic Life | Telugu.newsof9

(న్యూస్ ఆఫ్ 9)

ఈ భూమి మీదకు మనం వచ్చిన దగ్గర నుంచీ మనిషి ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణం పరిపూర్ణత్వం దిశగా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో చదువు ఒక భాగం తప్ప, చదువే అంతిమ లక్ష్యం కాదన్న విషయం అతి తక్కువ మంది మాత్రమే గుర్తించగలరు. పుట్టిన ప్రతి మనిషికీ ఒక ప్రయోజనం ఉంటుందని ఆ ప్రయోజనం దిశగానే ప్రయాణం కొనసాగుతూ ఉంటుందని అనాదిగా ఆలోచనాపరులు చెబుతుంటారు. అంటే ఎలాంటి ప్రయోజనం లేని జన్మ ఉండదని భావం.

తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత బలహీనులైన యువతీ యువకులను ఆత్మహత్యలకు పురికొల్పడంలో తల్లిదండ్రుల, ఈ సమాజం చూపించిన నిర్లక్ష్యానికి దర్పణం పడుతున్నది. కొంతమంది బాగా చదువుతారు. కొంతమందికి చదువు అబ్బకపోవచ్చు. దానికి కారణం… 90 శాతం చదువు చెప్పే టీచర్లు కారణం అవుతారు, లేదా విద్యార్థి ఆర్ధిక పరిస్థితులు కారణం అవుతాయి. ఒక విద్యార్ధి చదువులో బాగా రాణించడానికి కారణం ఆ విద్యార్ధి చుట్టూ ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషీ మూడు అంచెల్లో పరిపూర్ణత వైపు ప్రయాణిస్తాడు. పుట్టిన వెంటనే తల్లిందండ్రులే గురువులు అవుతారు. వారి నుంచే బిడ్డ తెలివితేటల్ని ప్రోది చేసుకుంటాడు. ఇది మొదటి అంచె. రెండో అంచెలో పాఠశాల గురువుగా మారుతుంది. పాఠశాల నుంచి బిడ్డ జ్ఞానాన్ని సంగ్రహిస్తాడు. ఇక మూడో అంచె సమాజం. తాను పెరుగుతున్న సమాజంలోని మనుషులు, స్నేహితులు, బంధువుల నుంచి జ్ఞానాన్ని సంగ్రహిస్తాడు. ఈ మూడు అంచెలూ బాగుంటే బిడ్డ పెరిగి పెద్దయి సక్రమంగా విద్యలోనే కాకుండా జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కొంటూ విజయవంతంగా ముందుకు సాగుతాడు. ఈ మూడు అంచెల్లో ఎక్కడ తప్పులు జరిగినా ప్రయాణంలో ఒడిదుడుకులు సహజంగా చోటుచేసుకుంటాయి. తప్పులు మరీ పెద్దవి అయితే… నేరాలు చేసి జైలు పాలు కూడా కావచ్చు. నడక దారితప్పుతున్నపుడు బంధువులు, తల్లిదండ్రులు లేక గురువుల నుంచి హెచ్చరికలు వస్తుంటాయి. లేదా సమాజం నుంచే సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది సరిదిద్దుకుంటారు. కొంతమంది అందులోనూ విఫలం అవుతారు. ఇవన్నీ కూడా బిడ్డను పెంచడంలోనే ఉంటుంది. అంటే.. తల్లిదండ్రుల వద్ద నైతిక పునాది ఇందుకు భూమికగా ఉంటుంది.

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు… ఎలాంటి ప్రయోజనం ఉండని జన్మ ఉండదు అని చెప్పుకున్నాం. కాబట్టి, చదువులో వెనుకబడినపుడు లేదా విఫలం అయినంత మాత్రాన జీవితం అయిపోయిందని, భవిష్యత్తు బుగ్గి అయిపోయిందని భావించేలా తల్లిదండ్రులు తమ పిల్లలకు నూరిపోయకుండా ఉంటే మంచిది. బాగా చదువుకుంటే మంచిది అని చెప్పడం వరకూ తప్పులేదు. ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులు పిల్లలందరికీ తప్పనిసరి తద్దినం అయిపోయాయి. ఇంతకు మించిన గొప్ప చదువులు ఎన్నో ఉన్నాయి. పెయింటింగ్ లో ఆసక్తి ఉంటే… ఆ రంగంలో గొప్పగా రాణించవచ్చు. తగినంత గుర్తింపు, జీవించడానికి అవసరమైన డబ్బు ఏ వృత్తిలోనైనా లభిస్తాయి. ఇంతకు మించి జీవితానికి అవసరమైనవి ఏమి ఉంటాయి? మనం జ్ఞానాన్ని సంపాదించడం, సంపాదించిన జ్ఞానాన్ని

తర్వాత తరాలకు అందించడం… ఆనందమయమైన జీవనం.

మీకు వంద మార్కులు వస్తాయన్న నమ్మకం ఉందని అనుకుందాం. ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల సున్నా మార్కులు వచ్చినపుడు… ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ప్రభుత్వాన్ని కోర్టుకు కూడా ఈడ్చే అవకాశం ఉందని, భయపడాల్సింది లేదని తల్లిదండ్రులు పిల్లలకు ఉద్బోధించాలి. ప్రభుత్వమే కాదు… తల్లిదండ్రులు, సమాజంలో ఎవరు ఎదురుగా వచ్చినా… పిల్లలు ధైర్యంగా పోరాడే విధంగా వారిని తీర్చిదిద్దాలి. తప్పు చేయనపుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని వారికి చెప్పాలి.

చదువుకోని వారు కూడా చక్కగా జీవించవచ్చు… అందుకు సంబంధించి బోలెడు అవకాశాలు ఉన్నాయన్న భరోసాను ప్రభుత్వాలు ఇవ్వగలగాలి. అలాంటి వాతావరణాన్ని కల్పించాలి. ఎక్కడ ఒక గంట పని చేసినా కనీసం ఆ రోజు మొత్తానికి అవసరమైన డబ్బు వస్తుందన్న భరోసా ఈ సమాజంలో ఉండాలి. కనీస వేతనాలు కాకుండా, గరిష్ఠ వేతనాలను నిర్ణయించాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దిశగా ఆలోచన చేయకపోవడం పెద్ద విషాదం. ‘‘మేం ఈ సమాజంలో జీవించలేం’’ అని ఒక వ్యక్తి, లేదా కుటుంబం భావించే దుస్థితి రాకూడదు. అమరావతిలో స్వర్గాన్ని నిర్మిస్తున్నామని, ప్రపంచం మొత్తం తమ వైపు చూస్తోందని సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబు ప్రసంగం దంచికొడుతుంటారు. కూతవేటు దూరంలో పేదరికంతో ఒకరు ఆత్మహత్య చేసుకుంటారు. ఇలాంటివి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఇది దుర్మార్గం. సొంత బొక్కసాలను నింపుకునే యావతో ఉన్న రాజకీయ నాయకులు తక్షణం… అంతరించిపోయినపుడే ప్రజల జీవితాలకు సంబంధించిన భరోసా అన్ని రకాలుగా లభిస్తుంది. ఈ భరోసా ఇవ్వలేని ఈనాటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే… లేకున్నా ఒకటే!!

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *