డీకోడింగ్ టీడీపీ- పార్ట్ 1

December 1, 2018 | News Of 9

తెలుగుదేశం ప్రైవేటు లిమిటెడ్

తెలుగుదేశం పార్టీ ఎవరిది?

ఎవరి కోసం పని చేసింది?

తెర వెనుక వాస్తవాలు ఏమిటి?

తెలుగుదేశం పార్టీ ఎవరిది? ఎలా పని చేసింది? ఎవరి కోసం పని చేసిందీ? దీనిని అందరూ తెలుసుకోవాలి. కేంద్రంపై ఎన్టీఆర్ యుద్ధం ప్రకటించినా…నాదెండ్ల భాస్కరరావు పదే పదే వద్దని ఎందుకు చెప్పారు?

తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం కాక.. దాని వెనక ఉన్న ‘కులం’ కోసమే ఎందుకు పని చేసిందో తెలుసా? కమ్మ సామాజిక వర్గంలోని ధనిక వ్యాపారుల సంపదను పెంచేందుకు తెలుగుదేశం పార్టీ.. ఒక కార్పొరేట్ సంస్థగా, ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా పని చేసిందని మీకు తెలుసా? ఎన్టీఆర్ చెప్పిన ఆత్మగౌరవం ఉత్తుత్తి నినాదమేనని మీకు తెలుసా?

భారతదేశంలో తెలుగుదేశం పార్టీ వెనుక ఉన్న కోటీశ్వరులు ఇపుడు అంబానీలు, అదానీలతో ఎందుకు పోటీ పడగలుగుతున్నారు? నేడు దేశ ప్రధాని నరేంద్ర మోడీని సవాలు చేయడానికి మూలాలు 1983లోనే ఉన్నాయని తెలుసా?

బడుగు బలహీన వర్గాలకు బిస్కెట్లు పారేసి… కమ్మ సామాజిక వర్గం కోట్లకు పడగలెత్తడం వెనుక ఉన్న రాజకీయ ఫార్ములా ఏమిటి? ఇవన్నీ తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఈ తరం యువత తెలుసుకోవాలి. సొంత కులాభివృద్ది వ్యామోహం… అక్షర రూపంలో కనిపించక పోయినా ఆ ‘‘అర్థ’’ పరమార్థం ‘అద్దం’లా చదువరి కళ్ల ముందు సాక్షాత్కారం అవుతుంది.  

పౌరహక్కుల నేత, గణిత మేథావి, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ బాలగోపాల్ ఈ సామాజిక దోపిడీ గుట్టువిప్పుతూ తెలుగుదేశం పార్టీని డీకోడ్ చేశారు. ఇక చదవండి..!!

(న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేకం)

ద్రాసు నుంచి కోల్ కతా వరకూ ఉన్న ట్రంకు రూటు ఆంధ్రప్రదేశ్ (అప్పటికి విడిపోలేదు)లోని నాలుగు ధనిక కోస్తా జిల్లాల నుంచి వెళుతుంది. అవి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణాజిల్లా.  ఈ రూటులో ప్రయాణిస్తుంటే రైలు మార్గానికి అటూఇటూ ఎక్కడ చూసినా అంతం లేదేమో అన్నట్లుగా పరుచుకున్న పచ్చదనం కంటికి ఆహ్లాదాన్ని అందిస్తుంది. క్రమశిక్షణతో ఒకే రకమైన పచ్చదనం ఉంటుంది. ఒరిస్సా, బెంగాలు వైపు సాధారణంగా కనిపించే ముదురాకుపచ్చ పచ్చదనం మాత్రం కాదు. అంత పచ్చగా ఉన్నందుకు ప్రకృతి కూడా అదనపు విలువను అడుగుతుందేమో. అది వ్యాపారపరమైన పచ్చదనం!

రైలు మార్గానికి అటూ ఇటూ పల్లెలు ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా కనిపిస్తున్నాయి. నిజానికి అవన్నీ చాలా చిన్న పట్టణాలు. చక్కటి పైకప్పులు…పెంకులతో ఉన్నాయి. కొన్ని భవనాలు కూడా ఉన్నాయి. కష్టాలూ కన్నీళ్లు నిత్యకృత్యం అయిన ఈ కర్మభూమికి చెందినవి కాదని అనిపించింది. సినిమాహాళ్లు రైసు మిల్లులుగా రైసు మిల్లులు సినిమా హాళ్లుగా కనిపిస్తాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్ కి ఇవి రెండూ గొప్ప ప్రతీకలు. ఈ ప్రాంతానికి గొప్ప అదే మరి. ఇచ్చినా, తీసుకున్నా.. పొగ గొట్టాలే. నిర్మాణ రూప శిల్పులు చూస్తే.. రెండూ ఒకేలా ఉండటంపై కొద్దిగా బాధపడతారు. కానీ వాస్తవమిదే. డెల్టా వ్యవసాయంలో వచ్చిన లాభాలు ఖచ్చితంగా రెండు మార్గాల్లోనే వెళతాయి. ఒకటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ వాణిజ్యం. రెండోది సినిమా నిర్మాణ రంగం, డిస్ట్రిబ్యూషన్, ప్రదర్శన రంగం. ఈ డబ్బు ఒక్క వర్గం (ఇది ఒక్కటే అన్న అర్థం కాదు), అంటే కులపరంగా కమ్మవాళ్ల దగ్గరే పోగుపడింది. దీని మూలాలు వ్యవసాయంలోనే ఉన్నాయి. జమిందార్లు, బ్రిటీష్ పాలన సమయాల్లో వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల సమయంలోనే ఇది పైకొచ్చింది. ఈ ఉద్యమాల అనుభవం.. విప్లవ ఉద్యమాల్లో పాల్గొనేందుకు ఉపయోగపడింది. సామ్యవాదం, హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిజం, విప్లవ మానవాతావాదం (రాడికల్ హ్యూమనిజం)…. మీరు ఏ పేరైనా చెప్పండి అన్ని రకాల ఉద్యమాల్లోనూ కమ్మవాళ్లు ఉన్నారు. అనతికాలంలోనే వాళ్లు ధనవంతులు అయ్యారు. హరిత విప్లవం వచ్చిన దగ్గర నుంచీ ఆస్తులు రెట్టింపు అవుతూ వచ్చాయి. ధన కనక రాసులు వాళ్ల ఇంటి దారి  పట్టిన సమయంలో హైదరాబాదులోని అధికార కేంద్రాలు వారిని జాగ్రత్తగా దూరం పెట్టాయి. విశాలాంధ్ర (హిందీ వాసన ఉన్న ఆంధ్రప్రదేశ్ వద్దని) అనే పేరు రాష్ట్రానికి పెట్టాలని వారు మన్నూమిన్నూ ఏకమయ్యేంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రతీకాత్మకంగా ఇది తొలి ఓటమి. విజయవాడను రాజధానిగా చేయాలన్న కోరిక కూడా నెరవేరలేదు. ఆర్థికంగా బలంగా ఉన్న వారిని రాష్ట్రాల్లో రాజకీయ పదవులకు దూరంగా ఉంచాలన్న కాంగ్రెసు సంస్కృతి కారణంగా గణనీయంగా వాళ్లు నష్టపోయారు.

ఎన్టీరామారావు రాజకీయ ప్రవేశం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం- ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నది ఇన్నాళ్లకు అందివచ్చిందన్న భావన ఈ కులం వాళ్లకు కలిగింది (దీన్నే కమ్మోళ్ల కులం ఎదుగుదలగా చెప్పడం సామాన్యుల్లో స్థిరపడింది). కోస్తా జిల్లాల్లో ఉన్న కీలక వ్యవస్థ కావచ్చు.. లేదా తెలంగాణ, రాయలసీమలకు వలస వచ్చి, అక్కడున్న కాల్వల దగ్గర, సాగునీటి చెరువుల దగ్గర స్థిరపడిన వారు కావచ్చు.. ఎన్టీరామారావు, అతని వెనుక ఉన్న అనేక మంది అభిమానులు ఈ కులం వాళ్లేనన్నది నిజం. కులపరంగా అతనికి ఓటు వేసిన వాళ్లంతా ఈ నాలుగు జిల్లాల్లోనే ఉన్నారు. మరో నిజం ఏమంటే… ఎన్టీ రామారావు రాజకీయ ప్రచారాన్ని ఒంటి చేత్తో నిర్వహించిన వ్యక్తి- రామోజీరావు. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ‘ఈనాడు’ దినపత్రిక అధినేత. అందుకే ఈనాడు దిన పత్రిక ఎన్టీఆర్ కు కరపత్రంగా పని చేసింది.

ముఖ్యంగా ఎన్టీఆర్ ఎన్నికల సమయంలోనూ, 1984 ఆగస్టు సంక్షోభ సమయంలోనూ  ఈనాడు దన్నుగా నిలిచింది. వ్యాపారంలో కమ్మ కులస్థులు ఎలా ఎదిగిపోతారో చెప్పడానికి రామోజీరావును ఉదాహరణగా చూపిస్తారు. భారతదేశంలో 30 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి సమాజంలో కింద ఉన్న వర్గాల్లో ఊహించని ఒత్తిళ్లను పెంచింది. నిజానికి పైన ఉన్న వర్గాల్లో కూడా అనూహ్యమైన ఒత్తిళ్లు లేకపోలేదు. ఏకచ్ఛత్రాధిపత్యం కలిగిన పెట్టుబడిదారీ వర్గం సంఖ్యపరంగా చాలా చిన్నది. అయితే ఇది స్థిరాస్తులున్న ధనవంతులతో కాకుండా పెద్ద ధనవంతులతో పోటీ పడాల్సిన పరిస్థితి ఎదురైంది. అందువల్ల వారు ఎన్నో తగ్గింపులు ఇవ్వాలనీ, తాము చెప్పినట్లు చేయాలనీ డిమాండు చేశారు. తగ్గేందుకు వారికి ఇష్టం కూడా లేదు. 1947 ప్రాంతంలో ఏర్పడిన వ్యవస్థ తమ కోరికలను నెరవేర్చుకోవడానికి అనువుగా లేదు. మరింత వెసులుబాటు ఉండాలని భావించారు. రాజకీయాలు, ప్రణాళికలు, పెట్టుబడులు ఏ విషయంలోనైనా 1950ల్లో ‘జాతీయ స్థాయి అంగీకారం’ అన్న మాటలను చెప్పడానికి లేదు. అవే మాటల్ని ఇపుడు వినడానికి సిద్ధంగా లేరు. అమాయకత్వం, దేశభక్తి, సోషలిస్టు భావాలు… ఇపుడు పనికి రావడం లేదు. ఒత్తిళ్లకు ఇదే భూమిక. ఇదే అప్పుడప్పుడే పెట్టిన తెలుగుదేశం పార్టీతోపాటు అధికారంలో ఉన్న అన్ని పార్టీలనూ ఇదే ఒత్తిడికి గురి చేసింది. ఇలాంటి ఒత్తిళ్లకు ప్రత్యేకమైన కారణాలు, లక్షణాలూ ఉన్నా…సామాజికంగా చూస్తే వాటి అర్థం, ప్రాముఖ్యత ఏమీ మారలేదు. ఒరిపిడి పెరిగేకొద్దీ ఒక సమయం వచ్చినపుడు కొత్త విధానం పుట్టుక జరిగిపోతుంది. దిశానిర్దేశం లేని, నిర్ణయించుకోలేని, మార్పులేకుండా ఉండిపోయిన వారిని ఇది ఆకర్షిస్తుంది. స్థిరాస్తులున్న డెల్టా ఆంధ్ర ఎన్టీఆర్ వెనుక నిలబడ్డారు. ఆయన నిలదొక్కుకున్న తర్వాత తమతో కలిసి వచ్చే వారందరితోనూ ఎన్టీఆర్ ను పంచుకున్నారు. అప్పటి ఆర్థిక వ్యవస్థతో, అప్పటి రాజకీయాలతో విసిగిపోయిన వారు కూడా వీళ్లతో కలిశారు. విసిగిపోయిన సామాన్య జనం కూడా వీరికి అండగా నిలబడ్డారు. అందరి ఆకాంక్షలకూ ఎన్టీఆర్ ప్రతీకగా మారాడు.

పార్ట్  2, 3, 4 స్టోరీల కోసం ఈ కింది లింకులు చూడండి.

https://www.telugu.newsof9.com/decoding-tdp-part-02/

https://www.telugu.newsof9.com/decoding-tdp-part-03/

https://www.telugu.newsof9.com/decoding-tdp-part-4/

 

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *