మేం నవ్వితే నవ్వాలి ! మేం ఏడిస్తే ఏడ్వాలి !! (పార్ట్ -4)

December 6, 2018 | News Of 9

Decoding tdp part-4 | Newsof9

సామాజిక వర్గం తన సొంత రాజకీయ, ఆర్థిక అవసరాలను లేదా నష్టాలను… తెలుగు వాళ్ల అవసరాలుగా, లేదా తెలుగువాళ్లకు జరుగుతున్న అన్యాయంగా చిత్రించడం అన్నది ‘‘తెలుగుదేశం ప్రైవేటు లిమిటెడ్’’ ఏర్పడిన నాటి నుంచీ కొనసాగుతోంది. ఎన్టీరామారావు అయినా, నాదెండ్ల భాస్కరారవు అయినా పని చేసింది ఒక సామాజిక వర్గం కోసమే. కేంద్రంతో తగాదా వద్దని నాదెండ్ల నాడు చెప్పిందీ, నేడు చంద్రబాబు రచ్చ చేస్తున్నదీ ఒక లక్ష్యం కోసమే..!!

పౌరహక్కుల నేత, గణిత మేథావి, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ బాలగోపాల్ ఈ సామాజిక దోపిడీ గుట్టువిప్పుతూ తెలుగుదేశం పార్టీని డీకోడ్ చేశారు. ఇక చదవండి..!!

పార్టీ సంక్షోభం నుంచి… మళ్లీ సీఎం అయ్యే వరకూ… !!

జాతీయ అభివృద్ధి మండలి నుంచి తనతోపాటు వాకౌటు చేసిన సీఎంల కారణాలు.. ఎన్టీరామారావుకి ముఖ్యమైనవి కానే కాదు. అందుకే కేంద్రాన్ని వ్యతిరేకించడంలో మిగిలిన వారి కంటే… ఎన్టీఆర్ ఈ విషయంలో చాలా ముందుకు వెళ్లిపోయారు. సమాఖ్య సిద్ధాంతాన్ని అన్ని పార్టీలూ తలకెత్తుకున్నాయి. పంజాబులో ఆర్మీ చర్యను ఖండించిన పార్టీ తెలుగు దేశమే అయినందున ఆ క్రెడిట్ ను అతనికి ఇవ్వాలి. సిక్కుల కోపాన్ని గుర్తించిన తర్వాత చేసిన ప్రకటనగా దీనిని చూడరాదు (వాస్తవానికి కమ్యూనిస్టుల నుంచి భాజపా వరకూ ప్రతిపక్ష పార్టీలనన్నింటికీ ఇది రాజకీయంగా పెద్ద సమస్య అయింది).
ఎన్టీఆర్ కు అధికారాన్ని తాము అందించారు. అయినా, ఎన్టీఆర్ ధోరణి ఎందుకో సొంత సామాజిక వర్గం వారి అభిరుచులకు భిన్నంగా అనిపించింది. కేంద్రంపై ఎన్టీఆర్ చేస్తున్న పోరాటానికీ, తమ లక్ష్యాలకు సంబంధమే లేదని, ఇదంతా సమయాన్ని వృధా చేయడమేనని వారు భావించారు. కేవలం మాటలకే పరిమితమైన పోరాటం వల్ల ఉపయోగం లేదన్నది వారి భావన. ఒక వేళ సీరియస్ గానే పోరాటం చేయడం అంటే.. అది మరీ అధ్వాన్నం అవుతుందని భావించారు. కేంద్రంపై పోరాటం అన్నది తమ అజెండా కానే కాదు. పదే పదే ఈ విషయాన్ని తెలుగుదేశం అంతర్గత సమావేశంలో లేవనెత్తిన వ్యక్తి… నాదెండ్ల భాస్కరరావు. అప్పటికే నిజాయితీలేని వ్యక్తిగా, విశ్వసనీయత లేని నేతగా భాస్కరరావును మీడియా అనేక సార్లు వార్తలు రాసింది. దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యేందుకు అనేక సార్లు ప్రయత్నించారు. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు కాంగ్రెసు పార్టీ కోరిక మేరకు తెలుగుదేశం పార్టీని రెండుగా చీల్చాడు. తన క్యాంపులో చేరేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆయన బాహాటంగానే ప్రయత్నించాడు. నాదెండ్ల భాస్కరరావు ఎంత పాషాణ హృదయుడంటే, 1984 సెప్టెంబరు 9న దారుణంగా మత ఘర్షణలను సృష్టించాడు. కేవలం హైదరాబాదు నగరంలో కర్ఫ్యూ విధించేందుకు కోసం అలా చేశాడు. అలా చేసి ఎన్టీఆర్ ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలన్నది ఆయన ఆలోచన. అయితే..ఇన్ని కుట్రలు చేసినా.. ఎన్టీఆర్ ను అధికారంలోకి తెచ్చిన భూస్వామ్య వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ల ఆకాంక్షలకు నాదెండ్ల భాస్కరరావు తెలుగుదేశం పార్టీలో పూర్తిస్థాయి ప్రతినిధిగా ఉన్నారు. తానే ఎన్టీరామారావును రాజకీయాల్లోకి తెచ్చానని, తానే ఆయన్ను అధికారంలోకి తెచ్చానని నాదెండ్ల భాస్కరరావు చెప్పడాన్ని చూస్తే.. అహంభావం ఉన్న నేత ఎవరైనా ఇలాగే మాట్లాడతారని మనకు అర్థం అవుతుంది. నాదెండ్ల ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు. కేంద్రంపై పోరాటం చేయడం మంచిది కాదని, అలా చేస్తే… అది ‘‘మనకు కలిసొచ్చే వ్యాపారం కాదు’’ అని ఘంటాపథంగా చెప్పేవాడు. తెలుగుదేశం నుంచి విడిపోయిన తర్వాత తన చీలిక వర్గంతో కేంద్రంతో సయోధ్యే తప్ప పోరాటం లేదు అని ప్రకటించాడు. ఇలా ఉండటమే తెలుగు ప్రజల నిజమైన ఆశలను ప్రతిబింబిస్తుందని వాదించాడు. ‘‘నిజమైన తెలుగు ప్రజల ఆశలు’’ అన్న పదాన్ని సరైన అర్థంలోనే చెప్పాడు. దాదాపు దీని కోసం రామారావును ఒప్పించేందుకు ఒక సంవత్సరంపాటు శ్రమించాడు కానీ ఫలితం లేకపోయింది. దీంతో అతను చరిత్రను మార్చే కీలకపాత్రనే ఎంపిక చేసుకున్నాడు. ఇలాగైనా సమైక్య వాదపు నిరసన గళాన్ని ఆపాలని భావించాడు. ఇందిరాగాంధీ సహాయం, అతని నమ్మినబంట్ల సాయంతో తాను అనుకున్నది సాధించాలని భావించాడు. అయితే.. చరిత్ర మరో మార్పునకు మార్గం వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రయోగం విఫలం కావడానికి ఎవరు కారణం అన్న దానిపై కాంగ్రెసులో పెద్ద ఎత్తున ఆత్మశోధన జరిగి ఉండాలి. సరే, తీర్పు ఎలాంటిదైనా, ఇది అప్పటి గవర్నర్ రామ్ లాల్ నిర్వాకమేనని చెబుతుంది. ప్రభుత్వాలను మార్చడం అన్నది… ఓ కలప లారీని హిమాలయ పర్వతాల చెక్ పోస్టు దాటించుకుపోవడం అంత తేలికగా అనుకుని ఉంటాడు. కానీ… ఫలితం ఎలా ఉందంటే ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. నిజానికి ఆ సమయానికి చాలా మందికి ఎన్టీఆర్ పై ఉన్న మోజు తగ్గిపోయింది. మరో ఏడాది తర్వాత జరిగినా… ఎన్టీరామారావు తేలికగానే తెరమరుగైపోయేవాడు. ఇందిరాగాంధీ తర్వాత అంత నాయకుడు ఎక్కడ అని వెదుకుతున్న వారికీ… ఆంధ్రప్రదేశ్ బయట ఉన్నవారికి ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ ఇది నిజం. ఎన్టీరామారావు ప్రవర్తన, రాజకీయాలను మరీ ముఖ్యంగా ఆయన ధరించిన దుస్తులు చూస్తే… భిన్నమైన వ్యక్తి అనిపిస్తుంది. నుదుటిన శైవుల మాదిరిగా విభూతి బొట్టు, బౌద్ధ బిక్షువులా పసుపు సిల్కు దుస్తులు ధరించేవాడు. ఒక చెవికి పోగు పెట్టుకోవడం ద్వారా రకరకాల పుకార్లు నడిచేవి. రాత్రి పూట చీర కట్టుకుంటాడన్న ప్రచారం కూడా జరిగింది. (చివరి రెండూ తాంత్రిక్ విద్యల్లో భాగమని చెబుతారు).

ప్రజల తిరుగుబాటు కూడా అక్కడక్కడా కనిపించింది. అది కూడా తెలుగుదేశం కార్యకర్తలు బలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే. చాలా మందికి ఆయనపై గట్టి ప్రేమ లేదు. చాలా మంది భాస్కరరావు వైపునకు వెళ్లిపోయి ఉండొచ్చు. తమను తూలనాడటంపై వారు నొచ్చుకున్నారు. ఎన్టీరామారావు సినిమాల్లో సంపాదించుకున్నంతలో తమను ఒక్క శాతం కూడా సంపాదించుకోవనివ్వడన్నది అన్నదే వారి అనుమానం. పార్టీపై సంస్థాగతంగా ఉన్న ఇద్దరి అల్లుళ్ల పెత్తనాన్ని కూడా వారు నిరసించారు. క్యాంపులో పెట్టిన ఎమ్మెల్యేలను ఎన్టీరామారావు విడుదల చేస్తే.. మొత్తం తన వైపు వచ్చేస్తారని చెప్పిన దాన్లో వీసమెత్తు నిజం లేదు. వాస్తవానికి ఎమ్మెల్యేలను ఆపింది.. ఎన్టీరామారావు కాదు.. వాళ్లను ఆపింది ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు మాత్రమే. ఎమ్మెల్యేలే అని కాదు.. పార్టీ నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకూ అందరూ తిరుగుబాటుకు భయపడ్డారు. అందుకుని వాళ్లు గోడ మీద కూర్చుని… పిల్లి మాదిరిగా వేచి ఉన్నారు. ఎన్టీరామారావును మళ్లీ అధికారంలో కూర్చెబెట్టడానికి కష్టపడింది వీళ్లు కాదు. ఆయన కోసం కృషి చేసింది గట్టి పార్టీ నిర్మాణం ఉన్న విపక్ష పార్టీలయిన కమ్యూనిస్టు పార్టీలు, భాజపా. చాలా కాలానికి పని చేసేందుకు వారికి ఒక అవకాశం లభించింది. వీళ్లతోపాటు కోపోద్రిక్తులయిన సామాన్య ప్రజలు. కోస్తాలో కమ్యూనిస్టులు, తెలంగాణలో భాజపా బందులు, ర్యాలీలు, నిరాహార దీక్షలూ చేశారు. ఎన్టీఆర్ ను డిస్మిస్ చేయడంపై రాయలసీమలో సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. భాస్కరరావు వైపు వెళ్లిన ఎమ్మెల్యేల ఇళ్లను తగులబెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు, కొన్నింటిని దోచుకున్నారు. పోలీసు కాల్పుల్లో 25 మంది చనిపోయారు. అందులో 23 మంది రాయలసీమ వారే ఉన్నారు. హైదరాబాదు నగరం శివారులో ఇద్దరు చనిపోయారు.

ఏసుక్రీస్తులా మూడో రోజున ఎన్టీరామారావు అధికారంలోకి తిరిగి రాలేదు. ఇది జరగడానికి ఒక నెల సమయం పట్టింది. ఈ ఒక్క నెల దినదిన గండంగా గడిచి ఉంటుంది. దీంతో అతను తెలుగు ప్రజలకు మెస్సయ్యా అయిపోయాడు. నెరవేర్చాల్సిన ఎన్నో దైవ కార్యాల కోసం దేవతలు అతన్ని పంపించినట్లుగా అయింది. తన దగ్గరున్న 162 మంది ఎమ్మెల్యేలను అందరి దగ్గరికీ తీసుకెళ్లడం, లెక్క పెట్టించడం వంటివి జరిగాయి. 294 లో సంగం కంటే ఎక్కువగానే ఉన్నారని చెప్పాల్సిందిగా కోరేవాడు. కొంతమంది రాజ్యాంగం గురించీ, గవర్నర్ పాత్ర గురించీ కథనాలు రాయడం ప్రారంభించారు. మ్యాజిక్ ఫిగర్ ఉందా లేదా అన్నదే ఎన్టీరామారావు కోరుకున్నది. అంతే. ఎవరూ ఎమ్మెల్యేలను లెక్కించేవారు కాదు. రామ్ లాల్ మరీ చీకటి ప్రపంచపు డాన్ కంటే ఘోరంగా ప్రవర్తించాడు. ‘‘నేను లెక్కించను.. నువ్వు ఏమైనా చేసుకో’’ అన్నట్లు ప్రవర్తించాడు. పోలీసుల చేత అరెస్టు కూడా చేయించాడు. రాష్ట్రపతిగా ఉన్న జైల్ సింగ్… మరీ సౌమ్యుడు. ఎమ్మెల్యేలను లెక్కించకుండా… ప్రజాస్వామ్యాన్ని రక్షించేదుకు ప్రయత్నిస్తానని మాత్రమే అన్నాడు ఎమ్మెల్యేలను లెక్కిస్తాడో లేదో మాత్రం చెప్పలేదు. (మరి తనను రక్షిస్తానని చెప్పాడా లేదో ఎన్టీఆర్ కు అర్థం కాలేదు). రామ్ లాల్ స్థానంలో వచ్చిన శంకర్ దయాల్ శర్మ మాత్రం కొంత సమయం కావాలని కోరి… వెంటనే పూజలు చేయడానికి తిరుపతికి వెళ్లిపోయాడు. అప్పటికే ఎన్టీరామారావుకు ఓపిక నశించిపోతున్నది. అవసరమైనదానికంటే ఎక్కువే ఉన్నపుడు లెక్కించడానికి ఇబ్బందేమీ లేదు. అయితే, రాజ్యాంగాన్ని రక్షించేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు దేవుడు సాయం కోరాడు. మహా అయితే.. ఆయనకు ఒక అబాకస్ ఉంటే లెక్కపెట్టడానికి సరిపోతుంది. హాస్యాన్ని ఆస్వాదించేవారికి నిజానికి ఈ రాజ్యాంగ సంక్షోభ సమయం.. చాలా ఆసక్తికరం. అభివృద్ది చెందుతున్న దేశాలకు చెందిన అతి పెద్ద ప్రజాస్వామ్య, లౌకిక రాజ్యాంగం. దీనిని దేవుడు మాత్రమే రక్షించగలడు. ఎప్పుడు అమ్ముడుపోతారో తెలియని 162 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం మరో పని. వేసవి విడిది రిసార్టులో ఉన్నారు. నిజానికి రాజ్యాంగమో, దేవుడే కాదు… ఎన్టీఆర్ ను కాపాడింది కేవలం ప్రజల్లో వచ్చిన తిరుగుబాటే. దీంతో ఫిరాయింపులు కూడా చాలా తక్కవ సంఖ్యకే పరిమితం అయింది. ఆపరేషన్ ను సరిగా నిర్వహించలేని ఇందిరాగాంధీ అత్యాశ కూడా ఒక కారణం. బొమ్మ పడితే నాది.. బొరుసు పడితే నీది అన్న ఆట ఆమె చాలాసార్లు ఆడి ఉంటుంది. ఆమె అనుకుంటే ఏదైనా చేయగలనని నిరూపించింది. చివరకు అవమానాన్ని ఎన్టీఆర్ కూడా చవిచూడక తప్పలేదు. ఇందిరాగాంధీ, ఎన్టీరామారావుల మధ్య రహస్య ఒప్పందం జరిగిందని అనేక పుకార్లు వచ్చాయి. సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ తో సహా అనేక మంది మధ్యలో ఉండాలన్న సూచనలూ వచ్చాయి. ఎన్టీరామారావుకు గుణపాఠం చెప్పారన్నది నిజం. ఎన్టీరామారావు అహాన్ని తగ్గించి, మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఇచ్చారు. అది ఇందిరాగాంధీకి నచ్చినది కావడంతోపాటు ఎన్టీరామారావు వెనుక ఉన్న పెద్దలకు కూడా నచ్చేదే. అరవడాలు తగ్గించి… వారికీ, కేంద్రానికీ మధ్య బాధ్యతాయుతమైన బ్రోకర్ గా ఉండేందుకు ఎన్టీరామారావు అంగీకరించారు. భాస్కరరావును తీసివేసి ఆ స్థానంలో ఎన్టీరామారావు రాలేదు. మారిన ఎన్టీరామారావు మాత్రమే భాస్కరరావు స్థానంలో వచ్చాడు.

పార్ట్, 1, 2, 3 స్టోరీల కోసం ఈ కింది లింకులు చూడండి.

https://www.telugu.newsof9.com/decoding-tdp-part-03/

https://www.telugu.newsof9.com/decoding-tdp-part-02/

https://www.telugu.newsof9.com/decoding-tdp-part-01/

 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *