మీడియా బురదలో ప్రజాస్వామ్యం!!

March 1, 2019 | News Of 9

Democracy in Telugu States in A Media Quagmire

  • ‘‘రామా’’ అన్నా బూతు అంటున్న మీడియా
  • విశ్వసనీయతను కోల్పోతున్నా మారని తీరు
  • టీవీ ఛానెళ్లలో వ్యక్తిత్వ హననమే ప్రధాన వ్యాపారం
  • ప్రజల ముఖాలకు కొత్తగా వచ్చిన రాజకీయ ముసుగులు
  • ఇదో విష వలయం.. మారకపోతే మనకే నష్టం

(న్యూస్ ఆఫ్ 9)

చిత్తశుద్ధిలేని మీడియా సంస్థల కారణంగా… తెలుగు రాష్ట్రాల్లో, ఒక రకంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. తెలుగుదేశం ప్రభుత్వం, ‘‘ఈనాడు’’ సంస్థలు ముందు ఈ దుష్ట సంస్కృతి పుట్టడానికి కారణమని చెప్పక తప్పదు. ఈనాడు దిన పత్రిక పుట్టిన దగ్గర నుంచీ దాదాపు 2004 వరకూ దానికి ప్రజల్లో ఒక నమ్మకం ఉండేది. ఈనాడులో వార్త వచ్చింది అంటే అది 100 శాతం నిజమేనని భావించే పరిస్థితులు ఒకప్పుడు ఉన్నాయి.

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఈనాడు గ్రూపునకూ, రాజశేఖర రెడ్డికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో శత్రుత్వం ఏర్పడింది. ‘‘పెద్దలా గద్దలా’’ అంటూ ఈనాడు వార్త ప్రచురించిన.. తర్వాత వైఎస్ ఈనాడుపై కత్తి కట్టడం, సాక్షి పత్రిక, సాక్షి టీవీ పురుడు పోసుకోవడం జరిగిపోయాయి. సాక్షి పత్రిక… చంద్రబాబు సాయంతో ఈనాడు అధిపతి రామోజీరావు అక్రమ ఆస్తులకు సంబంధించి  పుంఖాను పుంఖాలుగా ఆధారాలతో సహా అనేక వార్తలు ప్రచురించింది. రామోజీకి ఈనాడు దిన పత్రిక కాపీలను చుట్టి అర్థనగ్నంగా ఉన్నట్లు కార్టూను ప్రచురించింది సాక్షి. రామోజీ గుట్టుమట్లను బహిర్గతం చేయడంతో ఈనాడు ప్రజల దృష్టిలో పలచన అయింది. తర్వాత తెలుగుదేశం పార్టీ దన్నుతో మూసివేసిన ‘‘ఆంధ్రజ్యోతి’’ దినపత్రిక మళ్లీ జీవం పోసుకుంది. అది కూడా తెలుగుదేశం పత్రికగానే నేటికీ సేవలు అందిస్తోంది. అనేక టీవీ ఛానెళ్లను కూడా తెలుగుదేశం పార్టీ తన సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో… తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే మీడియా జర్నలిస్టు ప్రస్తుతం లేడని చెప్పడం అతిశయోక్తి కాదు.

దీంతో మీడియాపై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయింది. మీడియా సంస్థలు పాఠకుల ఆదరణతో సంబంధం లేకుండా ప్రభుత్వం, ఇతర మార్గాల్లో ఆదాయం తెచ్చుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాయి. కానీ ప్రజలకు హాని జరుగుతున్నపుడు.. ఇదిగో ‘‘నిజం’’ అని చెప్పేవాడు లేకుండా పోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మీడియా పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయింది. దీంతో… ఒకరికి అన్యాయం జరిగినా… పోరాటం చేసేందుకు ఒక్క మీడియా కూడా లేదు. ఇతరులపై బురద చల్లుకుంటూ, వ్యక్తిత్వ హననం చేస్తున్నాయే తప్ప, ప్రజలకుగానీ, సమాజానికి ఉపయోగపడే వార్తల కోసం పని చేయడం లేదు.

దీని తర్వాత మరో ముఖ్యమైన పరిణామం జరిగింది.

విశ్వసనీయమైన మీడియా సంస్థ లేకపోవడంతో… పార్టీలకు సంబంధించిన అభిమానులూ, కార్యకర్తలు ఆయా పార్టీలకు అనుబంధంగా పని చేస్తున్న పత్రికలూ, ఛానెళ్లూ చూసుకుంటూ… వారి అభిమాన నేతల్ని చూసుకుంటూ తరిస్తున్నారు. జగన్ గురించిగానీ, వైసీపీ గురించిగానీ కీర్తిస్తూనే చెబుతుంది. వైసీపీ వాళ్లు సాక్షి చూసుకుంటూ మురిసిపోతారు. మిగతావి చూసే అవకాశం తక్కువ. అలాగే తెలుగుదేశం వారు ఈటీవీ, ఏబీఎన్ చూసి తరిస్తారు. అంటే పాఠకులు తమకు ఇష్టమైన వార్తలు ఎక్కడ దొరుకుతాయో చూసుకుని అక్కడికి వెళ్లిపోతున్నారు. దీని వల్ల ఒక పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడైనా వార్త వస్తే… రాసిన వాళ్లు ఖచ్చితంగా దురుద్దేశంతోనే రాసి ఉంటారన్నది ఒక బండ గుర్తుగా పెట్టేసుకున్నారు. ఇపుడు నిజం చెప్పినా ఎవరికీ పట్టడం లేదన్నట్లుగా అయిపోయింది. ఇక ఎదుటి వారిపై బురద చల్లేందుకు ఒక పార్టీపై మరో పార్టీ బురద చల్లుకోవడం, వార్తలు రాయించడం వంటివి సాధారణం అయిపోయాయి. పవన్ కళ్యాణ్ పై బురద చల్లేందుకు శ్రీరెడ్డి అనే అమ్మాయిని ప్రేరేపించినట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. సెలబ్రిటీలను కించ పరిచేందుకు ఛానెళ్లు స్వయంగా డబ్బులిచ్చి ఇలాంటి పనులు చేయిస్తున్నట్లు కూడా కొందరు మాతో చెప్పారు. ఒకరిని బలి ఇస్తున్న దృశ్యాలను ప్రేక్షకులు బాగానే చూస్తారుగానీ…  సభ్య సమాజంలో ఈ పరిస్థితి ఎవరికైనా ఎదురుకావచ్చు. ప్రత్యామ్నాయం ఏమిటి మరి?

ఏపీ సీఎం చంద్రబాబును ఇపుడు సీబీఐ ఏదైనా ఒక కేసులో అరెస్టు చేసినా… కేంద్రం కుట్ర అనీ, భాజపా కుట్ర అనీ నాయకులూ అంటారు. కార్యకర్తలూ అంటారు. ప్రజలతో కూడా అనిపిస్తారు. ఆయన కూడా అంటారు. చేసేదేమీ లేదు. ఇంత కృత్రిమ వాతావరణంలో, మాయా మశ్చీంద్ర వాతావరణంలో నిజం బతికి బట్ట కట్టేది ఎలా? జనసేనపై అనేక అపోహల్ని ప్రచారం చేసేందుకు అనుమానాలను సృష్టించడం, పత్రికల్లో దొంగ వార్తలు రాయించడం ప్రత్యర్ధి పార్టీలు చేయని పన్నాగాలు లేవు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా…?

జనసేన అధ్యక్షుడిపై నిందలేల…?

2019 ఎన్నికల్లో గెలవడానికి భాజపా యుద్ధానికి వెళ్లినా వెళుతుంది అన్న అనుమానం జర్నలిస్టుల్లోనే ఎప్పటి నుంచో ఒక అనుమానం ఉంది. రెండేళ్ల కిందటి నుంచే ఈ చర్చ ఉంది. దీనినే జనసేన అధినేత పవన్ కళ్యణ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. భాజపా ఈ విషయాన్ని ముందే పవన్ కి చెప్పిందని ప్రచారం చేశారు. ఢిల్లీ  కేంద్రంగా నడిచే.. నేషనల్ హెరాల్డ్ వార పత్రిక  దీనిని వక్రీకరించి రాసింది. యుద్ధం వస్తుందని 2 ఏళ్ల కిందటే భాజపా చెప్పిందని పవన్ కళ్యాణ్ అన్నారని ఈ ఆంగ్ల దినపత్రిక రాసింది. భాజపా ఎప్పుడైనా యుద్ధానికి ఆసక్తి చూపిస్తుందన్న అనుమానం వామపక్ష వాదుల్లో ఎప్పటి నుంచో ఉంది. అతివాద హిందుత్వ పార్టీగా హిందువుల మనసులను గెలుచుకోవడానికి భాజపా అలా చేస్తుందని చాలా మంది అంటుంటారు. పవన్ కళ్యాణ్ అనకపోయినా… సోషల్ మీడియాలో తెలుగుదేశం, వైసీపీల కోసం…. పని చేస్తున్న ‘‘పెయిడ్ వారియర్లు’’ కొందరు… ‘‘పవన్ దేశద్రోహి’’ అని కూడా పోస్టులు పెట్టారు. ప్రతి బహిరంగ సభలోనూ… జాతీయ జండాకు వందనం చేస్తున్న వ్యక్తిపై రాయాల్సిన రాతలేనా ఇవి? దేశం ఎటుపోతున్నది? మనం ఎటుపోతున్నాం? డబ్బులు ఇస్తున్నారని అడ్డంగా సోషల్ మీడియాలో రాసేయడమేనా? వాళ్లు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా అన్నది వారే నిర్ణయించుకోవాలి.

ప్రజలకు మంచి చేద్దామని వచ్చిన వ్యక్తిపై బురద చల్లడానికి ప్రయత్నించేవారు ఆలోచించుకోవాల్సిన అంశం. తెలిసి తెలిసి ఎదుటి వారిని కించ పరిచే వాళ్లు ఈ దేశ జతీయ జండాను తాకే అర్హతను కనీసం కలిగి ఉంటారా అన్నది వారి అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. సంస్కారం పుట్టుకతోనే వస్తుందని అంటారు.

నిజం చచ్చిపోయిన ఈ కాలంలో (పోస్ట్ ట్రూత్)… ప్రజలకు రకరకాల పొలిటికల్ మాస్కులు వచ్చేశాయి. పార్టీలను బట్టి పాఠకుల అభిప్రాయాలు కూడా ఇలా ఉండే అవకాశం ఉంది. తటస్థులుగా ఉన్న పాఠకులు మాత్రం మంచినీ, చెడునీ వేరు చేసుకుంటూ కష్టపడి నిజాలను రాసే వారిని గుర్తించి.. అలాంటి మీడియానీ, పాత్రికేయుల్నీ ఆదరిస్తున్నారు. కానీ ఒత్తి కొడిగడుతున్నది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాజకీయ మాస్కులున్న పాఠకుల సంగతి చూద్దాం.

1. భాజపా: మోడీ, అమిత్ షాలు ఏం చేసినా రైటే అని వాదిస్తారు. గోవును పూజించడం జాతికి అవమానం అంటూ వీర సావర్కర్ చెప్పిన మాటల్ని పట్టించుకోరు. గడ్డం ఉన్న ప్రతి ముస్లిం కూడా పాకిస్తానీయే అని వీరి నమ్మకం. లేదంటే- ముస్లింలు దేశభక్తికి సంబంధించిన గుర్తును చొక్కాపై ఎప్పుడూ ధరించి తిరగాలని కోరుకుంటారు. పైన పేర్కొన్న నిబంధనలకు లోబడి వార్తలు ఉంటే చదువుతారు. లైక్ చేస్తారు. షేర్ చేస్తారు. ఈ భావాలకు వ్యతిరేకంగా ఎలాంటి అభిప్రాయాలు చెప్పినా తిట్టిపోస్తారు. భావ తీవ్రతను బట్టి దోశద్రోహులని కూడా నిందిస్తారు. వామపక్ష భావజాలం శృతి మించితే… దాడులు జరుగుతాయి. హేతువాదుల్ని కాల్చివేసిన సందర్భాలూ ఉన్నాయి. నెహ్రూ, ఇందిర కుటుంబంలో అందరూ ముస్లింలేనని ఇంటర్నెట్ నిండా… బోలెడు పోస్టులు, వెబ్ సైట్లూ ఉన్నాయి. హిందూమత రక్షణ ప్రథమ కర్తవ్యం అని భావిస్తారు.

2. తెలుగుదేశం: వీరికి చంద్రబాబు దేవుడు. అమెరికా దేశాధ్యక్షులు సైతం సలహాల కోసం చంద్రబాబుకు రోజూ ఫోన్లు చేస్తుంటారని ఈ పార్టీ వారి నమ్మకం. చంద్రబాబు ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదనీ, ఆయన దేశోద్ధారకుడనీ, కారణ జన్ముడనీ, అవినీతి అంటే తెలియదనీ, కేవలం తెలుగు ప్రజల కోసం పుట్టిన మహానుభావుడని నమ్ముతారు. చంద్రబాబుకు మించిన తెలివి తేటలున్న వారు ఇంత వరకూ ఎవరూ పుట్టలేదని వారి విశ్వాసం. సూర్యచంద్రుల గమనం కూడా చంద్రబాబుకు తెలియకుండా జరగవని ఈ పార్టీ వారు విశ్వసిస్తారు. మోడీ చేసిందేమో తెలియదుగానీ… భారతదేశంలో అత్యంత మోసకారి ఎవరు అంటే డీటీపీ వాళ్లు కలలో కూడా మోడీ అని ఠక్కున చెబుతారు. తెలుగుదేశం వ్యతిరేకంగా మాట్లాడినా, వార్తలు రాసినా… సదరు నేతలు, లేదా జర్నలిస్టులు భాజపాతో (ఇపుడు) కలిసి కాపురం చేస్తున్నావా అని అవమానిస్తారు. చంద్రబాబును తలచుకుంటూ.. మోడీనీ, భాజపానీ తిడుతూ పాత్రికేయులందరూ వార్తలు రాయాలని కోరుకుంటారు.

తెలుగుదేశం వారు వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్నారు. వారు నంది అంటే నంది, పంది అంటే పంది అని అందరూ అనాలని కోరుకుంటారు. జర్నలిస్టులు వ్యతిరేక వార్తలు రాయరాదనీ, చంద్రబాబును కీర్తిస్తూ భక్తి గీతాలు రాసుకోవాలని, గొంతున్న వారు పాడుకున్నా ఫర్వాలేదని ఈ పార్టీ వారు కోరుకుంటారు. E = mc2, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి అన్నింటికీ నిర్వచనాలు వారే చెబుతామంటారు. ఇతరులు చెప్పేవి నిర్వచనాలే కావంటారు. లేదా చెప్పనివ్వరు. పత్రికలు తెలుగుదేశం వారు చెప్పిన వాటినే ప్రచురిస్తాయి.

3. సగం భాజపా సగం టీడీపీ: భాజపాకీ, టీడీపీకీ రాజకీయంగా చెడటంతో.. ఈ తరహా వర్గం కాస్త తగ్గింది. హార్డ్ వేర్ కమ్మ అయతే, సాఫ్ట్ వేర్ ఆరెస్సెస్. అక్కడ మోడీ, ఇక్కడ బాబూ. అంటే ఢిల్లీలో మోడీ రావాలనీ, ఆంధ్రలో చంద్రబాబు రావాలనీ, వీళ్లిద్దరూ సూర్యచంద్రులుగా దేశ పరిపాలన, తెలుగు రాష్ట్ర పరిపాలన సాగిపోవాలని తాము చనిపోయే వరకూ ఈ కాంబినేషన్ ఉండాలని కోరుకున్నారు. కానీ చరిత్ర వక్రీకరించింది. టీ, కాఫీ, మంచినీళ్లు… ఏవైనా కాస్త పసుపు, కాస్త కాషాయం కలిపి ఉంటే సంతోషిస్తారు. ఇందుకు విరుద్ధమైన రంగులూ, రాతలూ వీరికి నచ్చవు. ఈనాడు పసుపు కాషాయంగా వీరికి గొప్ప సేవలు అందించింది. ఈనాడు పత్రికను ఆనందంగా చదువేసుకుంటారు. ఒక పక్క మోడీ, ఒక పక్క బాబు. పాఠక సేవ అంటే ఇదే కాబోలు. ఇప్పటికీ ఈనాడు ఇదే కాంబినేషనుతో నడుస్తోంది.

4. వైఎస్సార్ కాంగ్రెస్: కాంగ్రెసు అధిష్ఠానం సీఎం పదవి ఇవ్వని కారణంగా ఈ పార్టీ పుట్టింది. తెలుగుదేశానికి ఉన్న వన్నీ మనకూ ఉన్నాయి. డబ్బులూ, భవనాలూ, భుములూ… అన్నీ అన్నీ… లోటు ఈనాడు వంటి పత్రిక లేకపోవడమే. అలాంటి పే….ద్ధ మీడియా సంస్థ పెట్టేశారు కాబట్టి వారి గురించి వారే రాసేసుకుంటున్నారు. తెలుగుదేశంలా… జర్నలిస్టులను లోబరుచుకోవాల్సిన పని లేదు. సొంత జర్నలిస్టులే ఉన్నందున కొత్తగా వచ్చిన భయం లేదు. తెలుగుదేశంతో పోటా పోటీగా సొంత మీడియా ద్వారా వారు అనుకున్నట్లుగా వార్తలు రాసుకునే అవకాశం దొరికింది. తటస్థ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. జనసేన గురించి సాక్షి ఒక్క ముక్క కూడా రాయడం లేదు. పైగా ఇటీవల పవన్ కళ్యాణ్ పై ముసుగు తొలగింది అని పెద్ద అబద్ధాన్ని రాయడంతో.. దీనిని జన సైనికులు ట్విటర్ వేదికగా గట్టిగా అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ పై మీడియాలో వస్తున్న అబద్ధాలను అడ్డుకునేందుకు జన సైనికులు 24 గంటలూ అప్రమత్తంగా ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా పని చేసే నేషనల్ హెరాల్డ్ ఫేక్ వార్తను ప్రచురించినందుకు జన సైనికులు ట్విటర్లో దానిపై విరుచుకుపడ్డారు. జనసేన అధినేతను వారు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

ఇంత ఉన్నా… ఇతరులు కూడా పార్టీ అధ్యక్షుడు జగన్ సత్యసంధుడనీ, నీతికీ, నిజాయితీగా మచ్చు తునక అనీ, అలా అనుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెమటోడ్చి కోట్లు సంపాదిస్తే… అన్యాయంగా అందరూ ఆడిపోసుకుంటున్నారని వారి నమ్మకం. ఈ ప్రపంచం మొత్తం ఆయనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని విశ్వసిస్తారు. ఈనాడు, సాక్షి ఒకప్పుడు కొట్టుకున్నా.. ఇపుడు ఈనాడు, సాక్షి గ్రూపుల మధ్య చక్కటి స్నేహం నడుస్తోంది. ఒకరి జోలికి మరొకరు రారు. అయితే… తెలుగుదేశానికి అనుబంధంగా ఉన్న పత్రికల్లో అప్పుడప్పుడూ జగన్ కు వ్యతిరేకంగా వార్తలు వస్తుంటాయి. వైసీపీ గురించి నిజాలు రాసినా.. చదవడానికి వారు ఏ మాత్రం సిద్ధంగా లేరు. వ్యతిరేకంగా రాస్తే.. జర్నలిస్టులను టీడీపీ అనో,  జనసేన అనో తిట్టిపోస్తారు.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ వచ్చిన తర్వాత… పాశ్చాత్య దేశాల్లో జర్నలిజం… అక్కడి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూనే ఉన్నది. ట్రంప్ ఇప్పటి వరకూ ఎన్ని అబద్ధాలు చెప్పిందీ అక్కడి పత్రికలు లెక్క పెట్టి మరీ చెప్పాయి. ఆ లెక్కన సీఎం హోదాలో ఉండి.. .చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పి ఉంటారో… లెక్క పెట్టే వారు లేరు. ఏ ప్రజలకు సేవ చేస్తామంటూ రాజకీయ పార్టీలు చెబుతున్నాయో… అదే ప్రజల్ని మోసగించి… బహుమతులను ఎర వేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో…!! ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటం అంటే ఇది!!

చంద్రబాబు కూడా ఈ మాటే అంటారు. అది పెద్ద అబద్ధం!!

Other Articles

One Comment

  1. That is very attention-grabbing, You’re an overly professional blogger. I’ve joined your rss feed and stay up for searching for extra of your fantastic post. Also, I have shared your web site in my social networks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *