ప్రజల కోసమే పని చేసే పత్రిక వచ్చేనా?

April 19, 2019 | News Of 9

Do Telugu people get a people’s daily? | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

తెలుగు రాష్ట్రాల్లో నిజాలు తెలుసుకునే అవకాశం ప్రజలకు పూర్తిగా లేకుండా పోయింది. ప్రజల కోసమే పని చేసే స్వతంత్ర మీడియా సంస్థలేకపోవడంతో ప్రజలకు స్పష్టత కంటే అయోమయమే ఎక్కువగా ఉంటున్నది. నిజాలను బయటకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న కొంత మంది అధికారులకు కూడా ప్రస్తుత మీడియా వ్యవస్థ దన్నుగా లేని దుస్థితి నెలకున్నది. మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఒక స్టోరీ రాసి దానిని సాక్షి దినపత్రికకు పంపించారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీకి చెందిన పత్రిక కావడంతో ఐవైఆర్ రాసే స్టోరీలను సాక్షి ప్రచురిస్తూ వస్తోంది. అయితే ఆయన రాసిన ఒక కథనంపై ప్రజలు స్పందిస్తూ ఆ కథనం వేరే పత్రికలో వస్తే బాగుండేది అని స్పందించారు. దీనిపై ఐవైఆర్ మాట్లాడుతూ… రాసిన ఆ కథనం ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికల్లో వచ్చే అవకాశం లేదని, అందుకే సాక్షికి పంపించానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకిగానీ, చంద్రబాబుకు గానీ వ్యతిరేకంగా ఉంటే… ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు ఒక్క ముక్క కూడా ప్రచురించవన్నది సత్యమే. అంటే… చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న వార్తల్ని సాక్షికి ఇవ్వాలి. వైసీపీ వ్యతిరేక వార్త అయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలకు ఇవ్వాలన్నమాట.

నిజానికి పత్రికలు… ప్రజల కోసం పని చేయాలి. ప్రజా సంక్షేమమే పరమావధి అని పత్రికలు చెప్పుకున్నా ప్రజలకు తెలియాల్సిన ముఖ్యమైన వాస్తవాలను కూడా పత్రికలు అందించడం లేదన్నది స్పష్టంగానే తెలుస్తోంది. ఈ పరిస్థితిలో తెలుగు పాఠకులకు నిజాలు ఎవరు చెబుతారు అన్నది ప్రశ్న. 99 శాతం పత్రికలు, టీవీలూ రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఆయా నేతల ప్రసంగాల రూపంలో వాటిని ప్రచురిస్తున్నాయి. ఎవరిది సరైన వాదన, ఎవరిది సరైన వాదన కాదు అన్న విషయాన్ని తేల్చకుండా అలానే వదిలివేస్తున్నాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు జగన్ వార్తల్ని తక్కువ నిడివిలో ప్రచురిస్తే.. అదే వార్త సాక్షి దినపత్రికలో భారీ నిడివితో వస్తాయి. వైసీపీకి చెందిన సాక్షి దినపత్రిక కూడా తెలుగుదేశం వార్తల్ని తక్కువ నిడివిలో ఎక్కడో ఒక మూల తప్పనిసరి తద్దినం అన్నట్లుగా భావించి ఒక మూలన పడేస్తున్నది.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వార్తల్ని సాక్షి పూర్తిగా నిషేధించింది. ప్రజల కోసమే పత్రికలు అన్న సిద్ధాంతాన్ని పత్రికలు పాటిస్తున్నాయని అనుకుంటే.. పవన్ కళ్యాణ్ వార్తల్ని సాక్షి దినపత్రిక తొక్కిపెట్టడం అప్రజాస్వామికం. పవన్ కళ్యాణ్ పై బురద చల్లుతున్న వార్తలకు మాత్రమే సాక్షి దినపత్రిక ప్రచురిస్తూ… పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు కూడా పవన్ కళ్యాణ్ వార్తల్ని ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా తక్కువ నిడివిలో ఎక్కడో ఒక మూలన అన్నట్లుగా ప్రచురిస్తున్నాయి. జనసేన పార్టీకి ఉన్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని అయినా… ఆయన పార్టీ గురించి, ఆయన సిద్ధాంతాల గురించి ప్రజలకు చెప్పాలన్న బాధ్యతను తెలుగు మీడియా పూర్తిగా విస్మరించింది. ఏ పార్టీ సిద్ధాంతాలు మంచివి అనుకుంటే… దానిని ప్రజలు ఆదరిస్తారు. ఈ అవకాశన్ని తెలుగు మీడియా ప్రజలకు ఇవ్వదలచుకోలేదు.

నిజాలను ప్రచురించకపోవడం ఒక సమస్య అనుకుంటే… లేనిపోని అసత్యాలను ప్రచురించి వారు కొమ్ముకాస్తున్న పార్టీలకు మేలు చేయాలన్న ప్రయత్నాలు కూడా తెలుగు మీడియా గౌరవాన్ని తగ్గించివేశాయి. తెలుగు మీడియా సంస్థల మాదిరిగానే ప్రజలు లేదా పాఠకులు కూడా పార్టీల వారీగా విడిపోయారు. ఉదాహరణకు తెలుగుదేశం అభిమానులు ఈనాడును చదవడానికే ఇష్టపడుతున్నారు. ఈనాడు మాత్రమే సత్యాన్ని ప్రతిఫలిస్తోందన్న వాదన వారిలో ఉంది. కానీ నాణేనికి అన్ని కోణాలనూ ఇవ్వాలన్న బాధ్యతను ఈనాడు దినపత్రిక ఎలా విస్మరించిందో దాని పాఠకులు కూడా అలాగే ఉన్నారు. జగన్ రెడ్డిని ఇష్టపడుతున్న పాఠకులు సాక్షి దినపత్రిక మాత్రమే చదవడానికి ఇష్టపడుతున్నారు. జాతీయ స్థాయిలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. బీజేపీ తనకు అనుకూలంగా అనేక వెబ్ సైట్లను నిర్వహిస్తోంది. రిపబ్లిక్ వంటి పెద్ద టీవీ సంస్థను స్థాపించడం ద్వారా బీజేపీ తన భావజాలాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తోంది. హిందూమత వాదానికి బేజీపీ ప్రతినిధిగా ఉండగా, లౌకిక వాదానికి కాంగ్రెసు ప్రతినిధిగా ఉన్నది. దేశ సమస్యల గురించిన చర్చ 10 శాతం ఉంటే, మత విశ్వాసాలు 90 శాతం జాతీయ స్థాయి రాజకీయాల్ని శాసిస్తున్నాయి.

తటస్థంగా ఉండి… సత్యం తెలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్న వారికి సత్యాన్ని అందించే పత్రిక తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటీ లేకపోవడం దురదృష్టమనే చెప్పాలి. వామపక్షాలకు చెందిన పత్రకలు ఉన్నా… వాటికి ఉన్న ఆర్ధిక స్తోమత తక్కువ కాబట్టి అవి పూర్తిస్థాయిలో పాఠకులకు సేవలు అందించలేకపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తప్ప… మరొక దినపత్రిక పాఠకులకు అందుబాటులో లేకపోవడం పెద్ద లోటు. తెలంగాణలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. నమస్తే తెలంగాణ దినపత్రిక మాత్రం తెలంగాణ కేంద్రంగా కొంత వరకూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలకు భిన్నంగా తెలంగాణ వాణిని ప్రజలకు అందిస్తున్నా తెలంగాణలో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలే మార్కెట్టును శాసిస్తున్నాయి. ఆయా సంస్థలకు ఉన్న ఆర్ధిక వనరుల దన్ను కారణంగా నేటికీ ఈ మూడు పత్రికలే క్రమం తప్పకుండా వస్తున్నాయి. అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికగా నేటికీ ఈనాడు మార్కెట్టు లీడర్ గా కొనసాగుతున్నది. ఈనాడును మట్టికరిపిస్తుందని అప్పట్లో అందరూ భావించినా సాక్షి… ఈనాడు పత్రిక కాపీల స్థాయిని అధిగమించలేకపోయింది. సాక్షి దినపత్రిక ఈనాడు దినపత్రికకు పోటీ పత్రికగా మాత్రమే నిలబడి ఉన్నది. నేటికీ మీడియా వ్యాపారంలో ఈ రెండు దినపత్రికల గుత్తాధిపత్యమే కొనసాగుతున్నది. ఆంధ్రజ్యోతి కాకుండా… తెలుగు మీడియా వ్యాపారంలో వాటా సంపాదించే ఉద్దేశంతో తెలంగాణలో మాత్రమే ప్రయత్నాలు సాగుతున్నాయి కానీ… అవి కూడా బాలారిష్ఠాలను దాటి వెళ్లలేకపోతున్నాయి. వీ6 టీవీ సంస్థ నుంచి వచ్చిన ‘‘వెలుగు’’ దినపత్రికను ప్రచురిస్తోందికానీ… ఇది కూడా ఈనాడు, సాక్షిలతో పోల్చితే వెనుకబడి ఉన్నది.

ఈనాడు, సాక్షి దినపత్రికలు పోటాపోటీగా నడుస్తున్నా… పాలసీల పరంగా రెండింటికీ పరిమితులు ఉండటంతో అవి కూడా ఒక దగ్గర నిలబడి ఉన్నాయి. వార్తా పత్రికలే అయినా… వీటిలో విద్యా సంబంధమైన పోటీ సమాచారాన్ని ఇవ్వడం పెద్ద చిక్కు సమస్య. వార్తా పత్రికలు ప్రధానమైన విధి వార్తలను అందించడమే అయినా పోటీని తట్టుకునే క్రమంలో ఈనాడు, సాక్షి పత్రికలు అకడమిక్ సమాచారాన్ని ప్రచురిస్తున్నాయి. ఇది వృథా ప్రయాసే. ఇప్పుడు ఈనాడు ఒక అడుగు ముందుకేసి… ఒక పూర్తి పేజీలో వంటల్ని ప్రచురిస్తోంది. బీబీసీ లేదా యూకేలో ఉన్న మీడియాను చూస్తే పాఠక శ్రేయస్సే పరమావధిగా పని చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల వార్తల్ని సేకరించేందుకు మన తెలుగు దినపత్రికలకు విలేకరులు ఆయా రాష్ట్రాల్లో లేరు. ఇతర రాష్ట్రాల్లో పెద్ద రాజకీయ సంక్షోభం వస్తే తప్ప అక్కడి వార్తలు మన పత్రికల్లో రావు. అలాగే విదేశీ వార్తలు కూడా. ఇంటర్నెట్ వచ్చిన నేపథ్యంలో సమాచార విప్లవం వచ్చి ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ గా మార్చేసింది. ఈ కారణం వల్ల కూడా స్థానిక ప్రాధాన్యం మరింతగా పెరిగింది. ఇందువల్ల ఏ ఒక్క పత్రక… కూడా పూర్తిస్థాయిలో పాఠకుల అవసరాలను తీర్చలేకపోతున్నది. మారిన సాంకేతిక పరిణామాల నేపథ్యంలో పత్రకలు మారాల్సి ఉన్నా… అవసరమైన స్థాయిలో మారలేదనే చెప్పాలి. తెలుగు పత్రికలను చంపేస్తున్నది మారుతున్న సాంకేతిక పరిణామాలని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. రాజకీయ పార్టీలే వాటి అవసరాలకు పత్రికల్ని వాడుకుంటూ… ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పేర్కొనే దినపత్రిల ఊపిరి తీసేస్తున్నాయి. ఇందుకు వంత పాడక తప్పనిసరి ఆర్ధిక, రాజకీయ అవసరాలు వాటికీ ఉన్నాయి. ఇదొక విష వలయం. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఒక పత్రిక, ఒక టీవీ రావాల్సిన అసవరం అయితే తెలుగునాట ఉందన్నది నూరు పైసలు నిజం. ఇందుకోసం ఎవరైనా ప్రయత్నం చేస్తారేమో వేచి చూడాలి.

Other Articles

One Comment

  1. మంచి నాయకుడు చేసే మంచి పనిని కూడా చెప్ప కుండా నచ్చిన నాయకులకు భజన చేసే పత్రిక ల వల్ల ప్రజలకు మేలు జరగదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *