ఇప్పటికైనా బాబు కళ్లు తెరుస్తారా?

December 11, 2018 | News Of 9

Chandrababu | telugu.newsof9.com

హైదరాబాదు: తెలంగాణ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే… మోడీ ప్రభుత్వంపై మాత్రం ప్రజలు వ్యతిరేకతతోనే ఉన్నారంటూ మళ్లీ పాత పాటే లంకించుకున్నారు చంద్రబాబు. ప్రజల్లో గౌరవాన్నీ, అభిమానాన్నీ కోల్పోయిన నేత, అదీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేత ఏమనాలి? ప్రజల అభిమానాన్ని కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉందని,  మళ్లీ అభిమానాన్ని గెలుచుకునేందుకు ప్రయత్నిస్తానని అనాలి. కొన్ని రోజులు పోయిన తర్వాత… ప్రజలే తప్పు చేశారని, వాళ్లను ఎవరో తప్పుదోవ పట్టించారని చంద్రబాబు చెప్పుకొస్తారు. అందులో సందేహం లేదు. 2009లో ఓడిపోయినపుడు కూడా చంద్రబాబు ప్రజల్నే తప్పుపట్టారు. ప్రజలకు మెదడు ఉందని, వారు ఆలోచిస్తారని, మంచినీ చెడునీ ఎంచుకోగలరనీ, వారు ఇచ్చిన తీర్పు మేరకు పార్టీని సరిదిద్దుతామన్న ముక్క నోటి వెంట రాదు.

కేసీఆర్ అనూహ్యంగా ఎన్నికలను ముందుకు తెచ్చేశారని, అందుకనే వ్యూహ రచన చేసుకోవడానికి ప్రజా కూటమికి సమయం సరిపోలేదని యల్లో మీడియా దిన పత్రిక రాసింది. అలాగే, తెరాసకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ఉన్నారని, ప్రజాకూటమికి అభ్యర్థిలేకపోవడం కూడా ఇబ్బంది అయిందని ఒక వంటకాన్ని వడ్డించింది. తెరాస ఓట్లు మహాకూటమికి బదిలీ కాలేదని కూడా ఈ పత్రిక రాసింది. ఓట్లు బదిలీ ఎందుకు అవుతాయి? ఇదేం విశ్లేషణ? తెలుగుదేశం-కాంగ్రెసు కూటమి ప్రజలు ఆమోదించలేదని, దీనిని ప్రజలు అసహ్యించుకున్నారన్న అసలు వాస్తవాన్ని రాయలేదు. చంద్రబాబు ఆలోచన కూడా ఇదే విధంగా ఉంటుంది.

చంద్రబాబు ఆలోచనగానీ, యల్లో మీడియా ఆలోచనలు కవల పిల్లలు ఒకే తీరులో ఆలోచించినట్లుగా ఉంటాయి. ఒకరిని గిల్లితే రెండో వాడికి కన్నీళ్లు వచ్చేంత ఏకరూప కవలల మాదిరిగా మెదళ్లు కూడా అతుక్కుపోయి ఉంటాయి కావచ్చు. అందుకే చంద్రబాబు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడాన్ని యల్లో మీడియా పల్లెత్తు మాట అనలేదు. పైగా శేభాష్ అంటూ.. బ్రహ్మాండం బద్ధలైపోతున్నట్లు వార్తలు ప్రచురించాయి. ఇలా కూడబలుక్కుని మరీ మాయ చేయడంపైనే ఈ రోజు తెలంగాణ కన్నెర్ర చేసింది. చంద్రబాబుకు ఇక్కడేం పని అంటూ నడిరోడ్డుపైన నిలబెట్టింది.

తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేనట్లేగా చంద్రబాబు గారూ…? మళ్లీ తెలంగాణవైపు చూడరు కదా.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఇపుడు మోడీపైన యుద్ధం చేయాలి. అది కూడా అబద్ధపు యుద్ధం. తెలంగాణ గెలుపు పై మాట్లాడుతూ… మోడీపై వ్యతిరేకత ఉందని మళ్లీ మళ్లీ అదే మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ అనుభవమే జాతీయ స్థాయిలో ఎదురువుతుంది. ఏపీలో కూడా ఎదురవుతుంది. ఎందుకంటే.. తెలుగుదేశం ప్రజలకు ఏనాడో దూరమైంది. ఆ వాస్తవం గ్రహించడం మంచిది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *