ఆ రెండు పార్టీలు చేస్తేనే సంసారమా… ?!

December 18, 2018 | News Of 9

హైదరాబాద్: డబ్బు, కులహంకారం జబ్బులతో కుళ్లిపోయిన రాజకీయాలకు ఉప్పుపాతర వేసి… సరికొత్త రాజకీయాలకు అంటు కట్టాలన్న కృతనిశ్చయంతో జనసేన ఆవిర్భవించింది. అయితే… గత 70 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను శాసిస్తూ… రెండు కుటుంబాలే కోట్లు సంపాదించుకున్నాయి. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ అనేక బహిరంగ సభల్లో చెప్పిన విషయం తెలిసిందే. కుట్రలు, కుతంత్రాలు చేస్తూ.. బడుగు బలహీన వర్గాలకు నేటికీ రాజకీయాధికారాన్ని అందకుండా ఆయా వర్గాలు జాగ్రత్తపడుతున్నాయి. ఎదుటి పార్టీలపై బురద చల్లుతున్నాయి.

ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించిన ప్రజారాజ్యం పార్టీలోనే తెలుగుదేశానికి చెందిన కోవర్టు తోడేళ్లు కూడా చేరిపోయి.. ఆ పార్టీని శిశుప్రాయంలోనే నోట కరిచి ప్రాణాలు తీశాయి. అబ్బే అదేం లేదని బుకాయించినా… వాళ్ల మూతులకు రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. బిడ్డ అదే చచ్చిపోయిందన్నట్లు ప్రచారం చేశారు. ప్రపంచంతో నమ్మబలికారు.

ఇపుడు జనసేనను ఎన్నికల బరిలో లేకుండా ఎలా చేయాలన్న ప్రయత్నాలు తెర వెనుక ముమ్మరంగానే సాగుతున్నాయి. ఇలాంటి కుట్రలను ‘‘న్యూస్ ఆఫ్ 9’’ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంది.

తాజాగా అమెరికాలోని వర్జీనియాలో జరిగిన ఒక సమావేశానికి సంబంధించి ఇలాంటి ప్రయత్నమే జరిగింది. అందులో ఏదో గూడుపుఠాణీ ఉన్నట్లు సగం సగం ఉన్న వీడియోని సంపాదించి వైరల్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ ఆడిటర్ రత్నం ఉన్నట్లుగా కూడా దానికి చిలవలు పలవులుగా అనేసుకుని పైశాచికానందాన్ని పొందారు. నిజానికి జనసేన డల్లాస్ గర్జనకు గానీ, వర్జీనియాలో జరిగిన సమావేశానికిగానీ ఆడిటర్ రత్నం హాజరుకాలేదు. సియాటెల్ లో ఉన్న తన కుమార్తెను కలవడానికి మాత్రమే ఆయన వెళ్లారు. ఇంకా తిరిగి రాలేదు. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదుగానీ.. ఉన్నది ఉన్నట్లు చెబితే మంచిదన్న అభిప్రాయంతోనే ఈ ప్రస్తావనైనా.

ముఖ్యమైన అంశం ఒకటి మాట్లాడుకుందాం..!!

డబ్బులు లేకుండా పార్టీని ఎవరైనా ఎలా నడిపిస్తారు? ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు స్వయంగా జోలె పట్టుకుని విరాళాలను పోగు చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది డబ్బులు తెలుగుదేశం పార్టీలో గుమ్మరించారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీరామారావు కాంగ్రెసు నేత శివశంకర్ దగ్గర ప్రస్తావించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర నిలబడి డబ్బులు తెమ్మంటే గంటలో 200 కోట్లు తేగల వారు మా దగ్గర అనేక మంది ఉన్నారని ఆయన స్వయంగా శివశంకర్ తో అన్నారు. మేం కూడా పార్టీ పెడితే ఎలా ఉంటుంది అన్న శివశంకర్ ప్రశ్నకు ఎన్టీరామారావు స్పందన ఇది.

ప్రతి మహానాడు సమయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ విరాళాలను సేకరిస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనపుడు… డబ్బులిచ్చి ఆదుకున్న నారాయణను మంత్రిని చేసి రుణం తీర్చుకున్నారు చంద్రబాబు అని అందరూ బాహాటంగానే చెప్పుకుంటున్నదే. ఇది బహిరంగ రహస్యమే. అంతకు పదింతలు సంపాదించుకునేందుకు అవకాశమిచ్చారని కూడా పార్టీలో గిట్టనివాళ్లు నోళ్లు నొక్కుకున్నదే. ఇక మరో ఎంపీ సుజనా చౌదరి బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.6 వేల కోట్లు ఎక్కడికి వెళ్లిందన్నది ప్రశ్న ఇంకా ప్రజల ముందు తేలకుండా ఉంది. ఈడీ విచారణ జరుగుతోంది కనుక.. ఆ వివరాలూ త్వరలోనే తెలుస్తాయని ఆశిద్దాం.

జగన్ పరిస్థితి ఇహ చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆయన సీబీఐ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఏ స్థాయిలో కాంగ్రెసుపార్టీ తరఫున వసూళ్లు చేసేవారన్నది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెట్టుబడిదారులందరికీ తెలిసిందే. అనేక మంది ఐఏఎస్ అధికారులు కూడా ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం ఎవరికీ తెలియని విషయమేమీ కాదు. అనేక సూట్ కేసులు ఢిల్లీకి వెళ్లేవని, కొన్ని వైఎస్ ఆత్మబంధువు దగ్గర ఉండేవనీ అనుకోవడం కూడా బహిరంగ రహస్యమే.

రెండు పెద్ద మీడియా గ్రూపులూ, వ్యాపార సంస్థలూ అయిన ఈనాడు, సాక్షి దిన పత్రికలు ఒకదానిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.. తర్వాత రాజీ పడ్డారు. ఇపుడు పెట్టుబడిదారీ పార్టీలు నంగనాచి కబుర్లు చెబుతున్నా… ఇవన్నీ తెలుగు ప్రజలకు తెలిసినవే.
కంట్లో దూలాలు పెట్టుకుని… ఇతరుల కంట్లో సూది ఉందని అనడం ఎంత వరకూ సరైంది?

వైఎస్సార్సీపీ కోసం ఉన్న ఆస్తులు అమ్మేసినా.. 2019కి రాబోతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు అడిగితే.. జగన్ డబ్బులు అడిగాడంటూ ఆ పార్టీ నేత కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో యూట్యూబులోనే ఉంది. రూ.15 కోట్లు అడిగాడంటూ ఆయన భోరున విలపించడం, అన్నదమ్ములు సరే ఇస్తాంలే అంటూ ఆయనకు భరోసా ఇవ్వడం అన్నీ అందులో ఉన్నాయి. ఇదేమన్నట్లు మరి? జనసేనపై బురద చల్లేవారు ఇవన్నీ గుర్తుంచుకుంటే మంచిది.

హైదరాబాదులో కాకతీయ హోటల్లో జనసేన పార్టీ విరాళాలు తీసుకుంటున్న సమయంలో ‘‘మహాటీవీ’’ స్టింగ్ ఆపరేషన్ పేరుతో ఒక జర్నలిస్టును ప్రయోగించారు. ఆ జర్నలిస్టు ఏ పార్టీకి విధేయుడుగా ఉంటారో, అది ఏ రకంగా వికటించిందో అందరికీ తెలిసిందే.
తనతోపాటు 400 మంది వరకూ పని చేస్తారని, డబ్బులు అవసరం అవుతాయని పవన్ కళ్యాణ్ మొన్న డల్లాస్ గర్జన సమావేశంలో చెప్పారు. అందులో దాపరికం ఏముంది?

ఎంత త్వరగా… జనసేనను అపఖ్యాతి పాలు చేస్తే… 70 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న వర్గాలే మళ్లీ అధికారాన్ని ఎగరేసుకుపోవచ్చని, మళ్లీ బడుగు వర్గాల నోట్లో మట్టికొడదామని తలపోస్తున్నారు. ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్లను… రెడ్లు, లేదా కమ్మవారు మాత్రమే ఖర్చు చేయాలన్నది ఆయా పార్టీల వైఖరి. మిగిలిన వారికి తృణమో, ఫణమో పడేస్తే… వారు నొక్కేది నొక్కేయవచ్చు.. చుట్టూ ఉన్న స్కంధావారాలకు పంచవచ్చన్నది వారి దుర్మార్గపు ఆలోచన. ఇప్పటి వరకూ నడుస్తున్న చరిత్ర ఇదే. అధికారం కోసం ఇద్దరు బజారు రౌడీలు నువ్వా, నేనా అంటూ రోడ్డు మీద పడి కొట్టుకుంటే, రెండే రెండు పార్టీలు బల్లి యుద్ధం చేస్తున్నాయి.

ప్రతి ఏటా అధికారికంగా అన్ని పార్టీలకూ… రిలయెన్స్, ఇంకా మరెన్నో పెద్ద కంపెనీలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ నిధులను అందిస్తున్నాయి. 2016-17 సంవత్సరంలో పార్టీలు విరాళాల రూపంలో రూ.1559 కోట్లు సేకరించాయి. అందులో ఒక్క భాజపా వాటానే రూ.532 కోట్లు. 7 రాజకీయా పార్టీలకు రూ.710 కోట్లు రహస్య మార్గాల ద్వారానే డబ్బులు అందాయని ‘ఎన్డీటీవీ’ తెలిపింది. కాంగ్రెసు, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెసు ప్రకటిత డొనేషన్లతో పోల్చితే… భాజాపావి 9 రెట్లుగా ఉన్నాయి. ఒక్క సత్య ఎలక్టొరల్ ట్రస్ట్ రూ.265 కోట్లు భాజాపాకి విరాళంగా అందించింది. అసోసియేషన్ ఆఫ్ డెమాక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ వివరాలను సేకరించి ప్రతిఏటా ప్రచురిస్తోంది. మరి… పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన ఎందుకు విరాళాలను సేకరించకూడదు? వేల కోట్లు కాంట్రాక్టుల ద్వారా సంపాదించుకున్న సొమ్ముతో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టలేదే? ఢిల్లీలో పార్టీ పెట్టిన కేజ్రీవాల్ పార్టీ ‘ఆప్’ కూడా అధికారికంగా విరాళాలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. విరాళాలను సేకరించకుండా జనసేన పార్టీ చతికిలపడితే… లాభ పడేది ఎవరు? మళ్లీ ఆ రెండు పెట్టుబడిదారీ పార్టీలే కదా. అందుకే జనసేనను పీక నులిమి చంపేయాలని కసిగా ఆ రెండు పార్టీలూ చూస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలోకి రాకూడదని, వైఎస్సార్సీపీ చూస్తోంది. వైఎస్సార్సీపీ రాకూడదని తెలుగుదేశం కోరుకుంటున్నది. ఆ పార్టీల కంటే కూడా ఆ పార్టీ వెనుక ఉన్న పెట్టుబడిదారీ వర్గాలు కుట్రలూ, కుయుక్తులకూ తెర తీస్తున్నాయి. ఈ కుట్రలు ఎంతకాలం సాగుతాయో? ఎంతకాలం జనసేనపైనా, తద్వారా బడుగు వర్గాలపైనా విషం చిమ్ముతారో వేచి చూద్దాం!!

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *