కుల నిర్మూలనపై అంబేద్కర్ ఆలోచన ఏమిటి?

December 3, 2018 | News Of 9

Ambedkar | telugu.newsof9.com

“కులం పునాదులపై ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేము”
-డా . బి . ఆర్ . అంబేద్కర్

కులం, ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టి విధంగా కేవలం భారతదేశంలోనే సాటి మనుషులను అనాగరికంగా, పుట్టుక ఆధారంగా విభజిస్తూ, వివక్షతతో రాజ్యమేలిన చరిత్రకు, ఓటు రాజకీయాలను అప్రతిహతంగా కొనసాగించుకుంటూ అభ్యర్థుల అర్హతల కంటే కుల నేపథ్యాలతో గెలిపించుకుంటూ పోతున్న వర్తమానానికి సాక్షి. కళ్ళున్నా గుడ్డివారిగా తమ దైనందిన జీవితంలో ప్రతి చోటా ఎదురవుతున్న కులాన్ని చూస్తూ కూడా ఇంకెక్కడుంది కులం, ఇప్పుడందరూ సమానమే అనే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తూ సమాజంలోని కుల పోకడలను గౌరవిస్తూ, నేటికీ దేశంలో కుల వ్యవస్థను సమర్ధించే విద్యావంతులుండటమే దేశాబివృద్ధికి నిజమైన అడ్డంకి. కులాలు స్వతంత్ర శాఖలుగా కనిపిస్తున్నా వాటి నిర్మాణంలో, ఆచార వ్యవహార నిర్వహణలలో సాంస్కృతికంగా, రాజకీయంగా పోలికలు చాలానే కనిపిస్తాయి. సామాజిక అణచివేతకు గురైన కులాలు ఆర్ధిక పురోగతి సాధించిన తరువాత సామాజిక హోదాను పెంచుకునే క్రమంలో పై కులాలను అనుకరిస్తాయి. ఇందులో అణచివేయబడిన కులాలకు మినహాయింపేమీ లేదు. ఈ అనుకరణలో వారి కులం లోని మహిళల, పసి పిల్లల అలవాట్లు, హక్కులను కాలరాసేందుకు కూడా వెనుకాడవు. ఈ దశలో అణచివేత ఒక కులం నుంచి ఇంకో కులానికి బదిలీ అవుతుంది. ఎప్పటికీ అణచివేసేందుకు ఒక కులం అనివార్యమవుతుంది.

చదువుకున్న ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ కలిగి మనుషులందరూ సమానమనే భావన ఏర్పడనంత వరకు సమాజంలో కులాన్ని నిర్మూలించడం అసాధ్యం. ఇందుకు సమానత్వ సిద్ధాంతాలను ప్రబోధించే పాఠ్య పుస్తకాల తయారీ అవసరం. అయితే మనువాదాన్ని నరనరాన నింపుకున్న పాలకకులాలు/వర్ణాలు ఇందుకు ఎంతమాత్రం అంగీకరించవు. రాజ్యంలో సమూలమైన మార్పులు చేసే అవకాశం పాలక వర్గానికే ఉంటుంది. ఉత్పత్తి కులాలకు చెందిన పాలకవర్గం రానంత వరకు వ్యవస్థలో కుల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వరు. రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయంటూ సమానత్వం, సౌభ్రాతృత్వాల మీద నిర్మితమైనదే ఉన్నతమైన సమాజమని చెబుతూ, కుల వ్యవస్థ కేవలం శ్రమ విభజన మాత్రమే కాదని శ్రామికుల విభజన కూడా అని అంటూ కులం పుట్టు పూర్వోత్తరాల మీద వివిధ ఆధారాలతో అనేకమైన శాస్త్రీయ పరిశోధనల తరువాత తన “అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్” పుస్తకంలో అంబేద్కర్ కుల నిర్మూలనకు కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. ఇందులో మొదటగా ఉపకులాలను అభివృద్ధి పథంలో నడిపి తమలో కలిపేసుకోవాలి అని ప్రతిపాదించినా, ఈ ఉపకులాలను కలుపుకు పోవడం వల్ల కుల నిర్మూలన పూర్తిగా జరుగుతుందన్న నమ్మకం లేదనీ , పైపెచ్చు ఇది బలమైన కుల వ్యవస్థకు దారి తీయవచ్చని చెప్పారు. సమాజంలోని ప్రజల ప్రవర్తన, వారి మెదళ్లలో మొలిచిన నమ్మకాలను నిర్మించిన శాస్త్రాల మీద ఆధారపడి ఉంటుంది. కులం ఒక మానసిక స్థితి. కులాంతర వివాహాలు , కులాంతర భోజనాలు భౌతికమైన గీతలను మాత్రమే చెరపగలవు. అందువల్లన కుల నిర్మూలన అంటే కేవలం భౌతికమైన గీతలను చెరపడం కాదు. కులాన్ని భోధించే శాస్త్రాలను నిర్మూలించాలి. ఆర్థిక సమానత్వం రావాలి. కుల వివక్షత ఇప్పుడు రూపం మార్చుకున్నది. అందుకే అంబేద్కర్ భారత దేశపు మనుషుల మెదళ్ళలో పాతుకుపోయి, చాలా సార్లు వారికి తెలియకుండానే ఆచరిస్తున్న మనుస్మృతిని 1927 డిసెంబర్ 25 వ తేదీన దహనం చేశారు. అయితే కేవలం శాస్త్రాలను బహిష్కరించడం, దహించడం మాత్రమే సరిపోదు వాటి వల్ల అవకాశాలను కోల్పోతున్న దిగువ కులాల సమాజం వాటి అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ కూడా తిరస్కరించాలి .

రిజర్వేషన్ల వల్ల కులం ఇంకా బలపడుతుంది కానీ, కులం ఎలా నిర్మూలింపబడుతుంది అనే ఒక వింత వాదనను రిజర్వేషన్ల వ్యతిరేక వర్గాలు లేవనెత్తుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కులం నిర్మూలించబడకపోవచ్చు కానీ అణచివేయబడ్డ వర్గాలు విద్యను అందుకోవడం వల్ల కుల వివక్షతకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా తప్పకుండా పోరాటం చేస్తారు. రిజర్వేషన్లు కల్పించడం వల్ల అంబేద్కర్ జాతుల మధ్య పోరాటాలు ప్రసాస్వామ్య పద్ధతిలో జరిగేలా కృషి చేశారని చెప్పవచ్చు. లేకపోతే అణచివేయబడుతున్న కులాలు ఇతర పోరాట రూపాలు తీసుకుని ఉంటే దేశ అంతర్గత భద్రత ఎప్పుడో చిన్నాభిన్నం అయ్యేది. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వర్గాలు సమాజం లోని 80 శాతానికి పైగా ఉన్న ఉత్పత్తి వర్గాల ప్రజలను ఆర్థిక స్వావలంబనలో భాగస్వాములుగా చేయకుండా ఏ సమాజమూ అభివృద్ధి చెందలేదు అనే వాస్తవాన్ని గ్రహించాలి. ఒకవేళ చెందింది అని చెప్పుకున్నా అది మేడిపండు చందమే అవుతుంది. సమసమాజం నిర్మించబడాలంటే అవకాశాలు అందరికీ కల్పించబడాలి. సమానత్వానికి , సమానానికి గల వ్యత్యాసం పౌరులకు బోధపడాలి. నాలుగు వేల ఏళ్ళకు పైగా అవకాశాలను అనుభవిస్తూ ఎన్నో తరాలు ముందున్న కొన్ని వర్గాలతో అసలు మనుషులుగా గుర్తింపునకు సమూహాలు పోటీ పడాలంటే ఏ స్థాయిలో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలో పౌర సమాజం గమనించాలి. అందుకే సమాజంలో ఆర్ధిక సమానత్వం సిద్ధించేవరకు రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండవలసిందే. ఆ రిజర్వేషన్లను జనాభా దామాషా పద్ధతిన ఆయా వర్గాలు పంచుకోవలసిందే. రిజర్వేషన్ల ద్వారా లభించిన ఆర్ధిక సమానత్వం వెనుకకు నెట్టబడిన వర్గాలను రాజకీయంగా బలోపేతం చేస్తుంది. అణచివేయబడిన కులాల రాజ్యాధికారం సామాజిక అంతరాలను , అణచివేతను నిర్మూలించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది.
– కురెల్లస్వామి

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *