ఓటు సినిమాలు… చేటు తెచ్చేనోయీ…!!

February 14, 2019 | News Of 9

Equality is their slogan- Earth is their food | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

లక్షల కోట్ల రూపాయల సహజ వనరులూ..

ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్టు..

లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం..

ఏపీ సీఎం పోస్టు విలువ ఇది. 

ఏ ఒక్క తరానికో వచ్చే అవకాశమిది.

ఆంధ్రా ఓటర్లు చాలా తెలివైన వారని పేరు. మరి ఇంత తెలివైన వారిని పడగొట్టాలంటే పార్టీలు బాహుబలికి వంద రెట్ల స్థాయిలో ప్లాన్లు వేసుకోవాలి. తెలివైన వారిని వలలో వేసుకునేందుకు తెలివైన ప్లాన్లు ఎన్నో కావాలి. వాళ్లను ఊరికే అల్లాటప్పాగా పడేయడం సాధ్యంకాదని తెలుగుదేశం వారికీ, వైఎస్సార్సీపీ వారికి బాగా తెలుసు. అందుకే తెలుగుదేశం వారు కథానాయకుడి పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు పార్టులుగా తీశారు. వైఎస్సార్సీపీ వారు యాత్ర పేరుతో వారు కూడా ఒక సినిమా తీసి ప్రజలపైకి వదిలారు.

‘‘అతని కంటే గొప్ప ఆచంట మల్లన్న’’ అన్న సామెత తెలిసిందే కదా. తెలుగు ప్రజలు ఈ కుట్రలూ, కూహకాల గురించి బాగానే తెలుసుకునేందుకు అవకాశాలు మునుపటి కంటే మెరుగ్గా ఉన్నాయి. కథానాయకుడు సినిమా బాగా హిట్టయిపోయి ఎన్టీఆర్ ను బాగా అమ్మేసుకోవచ్చు… పైగా డబ్బుకు డబ్బూ, ఓట్లకు ఓట్లూ వచ్చేస్తాయన్న తెలుగుదేశం ఆశని మొదటి సినిమా అడియాశలు చేసి వదిలింది. ఇక రెండో భాగం రానున్నది. మొదటి భాగం బయ్యర్లను ముంచేయడంతో రెండో సినిమా- మహానాయకుడిని డిస్ట్రిబ్యూటర్లకు ఫ్రీగా ఇచ్చేయక తప్పలేదు.

ప్రతిసారీ కుట్రలు విజయం సాధించాలన్న రూలేమీ లేదు. రామూయిజానిది కుట్రలో కుట్ర… రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా. బాలకృష్ణ తీసే సినిమాల్లో ఎలాగూ ఎన్టీఆర్ వెన్నుపోటు నేపథ్యాన్ని చూపించలేరు. మరోవైపు నుంచి రాంగోపాల్ వర్మను దింపితే… ప్రజలందరూ ఎన్టీఆర్ నామస్మరణ చేసుకుంటారనీ, యల్లో మీడియా అంతా దీనిపై డప్పు కొడుతుందని ‘‘యల్లో గాడ్ ఫాదర్లు’’ భావించారు. తెర వెనక పావులు కదిపారు. అనుకున్నట్లుగా బాలకృష్ణ ప్రొడక్షన్స్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడింది. యాత్ర కూడా కాశీయాత్ర తంతులా ముగిసింది. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలపై సానుభూతిని సంపాదించడంలో ఘోరంగా విఫలం అయ్యాయి.

రామ్ గోపాల్ వర్మ కావాల్సినంత మసాలా తన సినిమాలో దట్టిస్తున్నారు. ఇది కుటుంబ కథా చిత్రం కాదు.. కుటుంబ కుట్రల చిత్రం అంటూ పత్రికల్లో పెద్ద ప్రకటనలు కూడా జారీ చేశారు. ఇది కూడా కాశీ యాత్రకు వెళ్లడం ఖాయం.

డబ్బున్న మేథావులంతా ఒక పాయింట్ మిస్సయ్యారు. ఈతరం యువతకు ఎన్టీఆర్ తెలియనే తెలియదన్నది వాస్తవం. వాళ్లు ఎన్టీఆర్ గురించి తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు. పెద్దతరం వాళ్లకు ఎన్టీఆర్ గురించి పూర్తిగా తెలుసు. చంద్రబాబు ఏం చేశారో కూడా తెలుసు. అందరూ అనుకుంటున్నట్లు చంద్రబాబు స్వయంగా అధికారం కోసమో, డబ్బు కోసమో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవలేదన్నది వాస్తవం. చంద్రబాబును ప్రజలందరూ ఒక వ్యక్తిగా చూడటంలోనే పెద్ద తప్పు చేస్తున్నారు.  చంద్రబాబు సొంత సామాజిక వర్గం తమ ఆకాంక్షలను నెరవేర్చడానికి చంద్రబాబును ఎంచుకున్నారు. ఎన్టీఆర్ చేతి నుంచి పార్టీ లక్ష్మీపార్వతి వైపు పార్టీ వెళ్లిపోకుండా చంద్రబాబును దింపి… పార్టీని హస్తగతం చేసుకున్నారు. తెలుగు దేశం పార్టీ… ఆ సామాజిక వర్గం అవసరాల కోసం ప్రారంభించారన్నది కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం. కేవలం చంద్రబాబును నడిపించేదీ…శాసించేదీ ఆయన వెనుక ఉన్న కోస్తా పెట్టుబడుదారులన్నది కఠోరమైన నిజం.

వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా… చంద్రబాబుకు హాని చేస్తుందని, వెన్నుపోటుదారుడుగా ముద్ర వేస్తుందని అందరూ అనుకుంటున్న భావన తప్పు. అనేక రాజుల సినిమాల్లో చూడండి. కొడుకో, అల్లుడో, బావమరిదో రాజు గారిని వెన్నుపోటు పొడిచి రాజుగా ప్రకటించుకున్నపుడు ప్రజల్లో వ్యతిరేకత ఉండదు. సొంత కుటుంబంలోని కుట్రగానే భావిస్తారు. వాళ్లు వాళ్లూ తెల్చుకుంటారని భావిస్తారు. నాదెండ్ల వెన్నుపోటు పొడిచినపుడు వచ్చిన వ్యతిరేకత చంద్రబాబు వెన్నుపోటుకు రాకపోవడానికి కారణమిదే. మరో విషయం.. తిరుపతిలో చంద్రబాబు గురించి స్వయంగా ఎన్టీఆర్ ‘‘మా అల్లుడు బంగారం’’ అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత.. చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడంటూ… అదే రామారావు నల్ల చొక్కా వేసుకుని తెలుగు రాష్ట్రం మొత్తం తిరిగినా ఎవరూ ఆయనపై సానుభూతి చూపించ లేదన్నది వాస్తవం.

స్వయంగా వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ దీనవదనంతో ప్రజలను ప్రార్ధించినా వారు కరుణించలేదు. ఇపుడు కదిలే బొమ్మల రూపంలో ఎన్టీఆర్ పాటలు పాడినా, కన్నీళ్లు పెట్టినా ప్రజల్లో కదలిక రాదు. పో పోవయ్యా అంటూ వాళ్లు పనులు వాళ్లు చూసుకుంటారు.

హ్యూమన్ సైకాలజీ తెలియకుండా, పొలిటికల్ సైకాలజీ తెలియకుండా సినిమాలు తీస్తే… బ్రహ్మాండంగా ఆడేస్తాయని అనుకుంటే ఇంతే  అవుతుంది. రేపు మహానాయకుడు సినిమా కూడా ఇంతే. లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా అంతే కాక మరేమిటి అవుతుంది? సినిమా నిర్మాణ పరంగా వర్మ ఎలా తీశాడని తెలుసుకోవడానికి వెళితే కొందరు వెళ్లవచ్చు. కానీ హిట్టవుతుందనీ, దివంగత ఎన్టీరామారావు కోసం ప్రజలు కన్నీళ్లు కారుస్తారనీ, తద్వారా చంద్రబాబుకు అది రేపు రాబోయే ఎన్నికల్లో ప్లస్ అవుతుందనీ అనుకోవడం యల్లో గాడ్ ఫాదర్ల భ్రమ. చంద్రబాబుకు ఇపుడు సింపతీ కార్డు కావాలి. సినిమాల ద్వారా లభించే- ఎన్టీఆర్ సానుభూతి, మోడీ మోసం చేశాడంటూ చంద్రబాబు పెట్టే ముసలి కన్నీళ్లతో వచ్చే సానుభూతి, వెరసి… భారీగా ఓట్లను కురిపిస్తుందనీ, మళ్లీ 175 సీట్లూ తెచ్చుకోవడానికి ఉపకరిస్తుందని ‘‘యల్లో గాడ్ ఫాదర్లు’’ అంచనా వేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా కొంతమంది మారతారనీ, పించన్ల వల్ల కొందరు మారతారనీ, రైతులకు 4 వేలు పారవేయడం ద్వారా కొందరు… ఇలా అన్నీ కలిసి చంద్రబాబు కన్నీళ్లు తుడుస్తాయనీ, తద్వారా ‘‘గాడ్ ఫాదర్లు’’ మరో 5 ఏళ్లపాటు ఆంధ్రా బంగారు గనులు రాజదండంతో పాటు దక్కుతాయని కలగంటున్నారు. చివరి నిమిషం వరకూ వారు రాజదండం కోసం ప్రయత్నిస్తారు. డబ్బు వస్తుందని తెలిస్తే… 24 గంటలూ ప్రణాళికలు రచిస్తారు. చంద్రబాబుని ఆయుధంగా వాడతారు. తెలుగుదేశం సామాజిక వర్గం వారి నినాదం- సమానత్వం. కానీ, వారి ఆహారం- భూమి. దొంగ తనకు సేవలందించే కుక్కకు రెండు ఎముకలు విసురుతాడు. దొంగకి హృదయం ఉందని భావిస్తే ఏం చేయలేం!! ఇదీ ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయం!!

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *