బిందాజ్…!! గులాబీకే కిరీటం అంటున్న ఎగ్జిట్ పోల్స్

December 7, 2018 | News Of 9

Exit polls predicting clear win for TRS | Newsof9

  •  తప్పితే… హంగ్ రావచ్చంటున్న కొన్ని పోల్స్
  •  ఒకవేళ హంగ్ వచ్చినా తెరాసాకే అనుకూలం
  •  తప్పు తప్పు.. మహాకూటమి అంటున్న లగడపాటి సారు
హైదరాబాదు: తెలంగాణ రాష్ట్ర సమితిదే రేపటి విజయం… ఎగ్జిట్ పోల్స్ తెరాస విజయం సాధిస్తుందని స్పష్టంగా చెప్పేశాయి. రెండు ఎగ్జిట్ పోల్స్ తెరాస స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్పగా, మరో మూడు ఎగ్జిట్ పోల్స్ విజయానికి చేరువలో తెరాస ఉందని చెప్పాయి. అంటే హంగ్ లాంటి పరిస్థితి ఉండొచ్చని చెప్పాయి. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నిక ఇదే. కొన్ని సీట్లు అటూ ఇటూ అయినా కూడా ఎంఐఎం మద్దతుతో తెరాసనే తేలికగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
ఇండియా టుడే…మై యాక్సిక్ ఎగ్జిట్ పోల్.. తెరాస భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్పింది. 119 అసెంబ్లీ సీట్లకు గాను 79 నుంచి 91 సీట్లు సాధించవచ్చని చెబుతున్నది. ఇది కేసీఆర్ అంచనాకు దగ్గరగా ఉండటం విశేషం. 60 మ్యాజిక్ నెంబరన్నది తెలిసిందే. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమికి 21 నుంచ 33 సీట్లు వస్తాయని తెలిపింది. లేదా 27కి ప్లస్ లేదా మైనస్ ఉండొచ్చని చెప్పింది. భాజపా 1 నుంచి 3 సీట్లు వస్తాయని చెప్పింది. తెరాసకు 46 శాతం, ప్రజాకూటమికి 37 శాతం, భాజపాకి 7 శాతం, ఎంఐఎంకు 7 శాతం చొప్పున ఓట్లను పంచుకుంటాయని ఇండియా టుడే ప్రకటించింది.
రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ మాత్రం హంగ్ అసెంబ్లీ వస్తుందని చెబుతున్నది. తెరాస, ప్రజాకూటమి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉందని చెప్పింది. దీని ప్రకారం 48 నుంచి 60 మధ్య తెరాసకీ, 47 నుంచి 59 సీట్లు ప్రజాకూటమికి రావచ్చు. భాజపా ఒకటి నుంచి 11 సీట్లు వస్తాయి. రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ సర్వే కూడా హంగ్ అసెంబ్లీనే వస్తుందని చెప్పింది. దీని ప్రకారం భాజపా, లేదా ఎంఐఎంల సహకారంతో తెరాసానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తెరాసనే అత్యధిక సీట్లున్న పార్టీగా అవతరిస్తుంది. రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ … 50 నుంచి 65 వరకూ తెరాసకు, 38 నుంచి 52 వరకూ కూటమికి వస్తాయి. భాజపా 4 నుంచి 7 సీట్లు రావచ్చు. ఇతరులకు 3 నుంచి 7 సీట్ల వరకూ రావచ్చు.
ఐటీవీ-నేతా సర్వే ప్రకారం హంగ్ రావచ్చు. తెరాసకు 57 సీట్లు, ప్రజా కూటమికి 46 సీట్లు రావచ్చు. భాజపాకు 6 సీట్లు, ఇతరులకు 10 సీట్లు వస్తాయి.
టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. తెరాసనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తెరాసకు 66 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. ప్రజాకూటమికి 37 సీట్లు వస్తాయి. భాజపాకు ఈసారి 7 సీట్లు, ఎంఐంఎంతో కలిపి ఇతరులకు 10 సీట్లు వస్తాయి.
2014లో తెరాస 63 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెసుకు 21, తెదేపాకు 15, భాజపా 5, బీఎస్పీ 2 సీట్లు గెలుచుకున్నాయి. చాలా మంది పార్టీలు మారిపోవడంతో తెరాసకు అసెంబ్లీ రద్దయ్యే నాటికి తెరాసకు 90 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెసుకు 14 మంది ఎమ్మెల్యేలు, తెదేపాకు ఇద్దరు మాత్రమే ఉన్నారు.
లగడపాటి లెక్కే వేరబ్బా…!! 
జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉండగా, మన బెజవాడ ఆక్టోపస్ లగడపాటి మాత్రం.. మహాకూటమి గెలుస్తోందని సాయంత్రం ఏడు గంటలకు ప్రకటించేశారు. లగడపాటి ప్రకారం.. ప్రజాకూటమి 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తెరాసకు కేవలం 35 సీట్లు వస్తాయి. తెదేపా పోటీ చేసిన 13 స్థానాల్లో ఏడింటిని గెలుచుకుంటుంది. ఎంఐఎంకు 6 నుంచి 7 స్థానాలు వస్తాయి. బీఎల్ఎఫ్ 1 స్థానంలో గెలుస్తుంది.
లగడపాటి లెక్కల్ని పూర్తిగా తీసెయ్యడానికి లేకనే… 5వ తేదీన ఆయన లెక్కలు విని.. చాలా మంది కంగారు పడ్డారు. తెరాస నాయకుల్నీ కంగారు పెట్టారు. మరి జాతీయ స్థాయి ఛానెళ్లు చేసిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం తప్పవడానికి అవకాశం ఉంటుందా అన్నది వేయి డాలర్ల ప్రశ్న.
ఒక క్రతువు ముగిసింది. ఫలితాలు స్ట్రాంగ్ రూంలో భద్రంగా ఉన్నాయి. 11వ తేదీ వరకూ ఓపిగ్గా వేచి చూద్దాం.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *