జనసేన ఆఫీసులో దరఖాస్తుల సందడి..

February 13, 2019 | News Of 9

Festive mood at Janasena Office with high number of applicants....

విజయవాడ: జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం కార్యకర్తలు, నాయకులతో సందడిగా మారింది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు ఉదయం నుంచీ అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నాలుగు పేజీలతో కూడిన ఈ దరఖాస్తులలో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలతో పాటు సామాజిక అంశాలపై వారికున్న అవగాహన గురించి తెలిపే విధంగా రూపొందించారు. మొదటి పేజీలో వ్యక్తిగత సమాచారం, రెండవపేజీలో వారి సామాజిక అంశాలపై అవగాహన, మూడవ పేజీలో అభ్యర్థి ఇంతకు ముందు పనిచేసిన రాజకీయ పార్టీ వివరాలు, హోదా వివరించాల్సి ఉంటుంది. ఇక నాలుగో పేజీలో వారు ఏ నియోజక వర్గం నుంచి పోటీచేయనున్నారో తెలియజేయడంతో పాటు నియోజకవర్గ ప్రస్తుత రాజకీయ పరిస్థితిని విరిచాల్సి ఉంటుంది.

అభ్యర్థుల నుంచి సేకరించిన దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తారు. కమిటీ సభ్యులు వాటిని పరిశీలించి సరియైన అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఈ ఎంపికకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఇప్పటికే పీఏసీ సమావేశంలో చర్చించి రూపొందించారు. వాటిని అనుసరిస్తూనే ఈ ఎంపిక ఉండబోతోందని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు దరఖాస్తు స్వీకరణ ప్రారంభంలో తెలిపారు. కాగా జనసేన అభ్యర్థిత్వం కోసం పార్టీ అధ్యక్షుడే స్వయంగా మొట్ట మొదటి దరఖాస్తును స్క్రీనింగ్ కమిటీకి అందజేసిన సంగతి తెలిసిందే. ఈ చర్య ద్వారా జనసేనాని తన పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఎంత పారదర్శకంగా ఉంటుందో చెప్పకనే చెప్పారు.

బుధవారం దరఖాస్తుల స్వీకరణ మొదలు కావడంతో రాష్ట్ర ప్రధాన కార్యలయం సందడిగా మారింది. దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలనుంచీ అభ్యర్థులు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకూ ఏపార్టీ ఇలా చేయలేదని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి విధానాలే జనసేనకూ ఇతర పార్టీలకూ ఉన్న వ్యత్యాసాన్ని బయటపెడతాయని నాయకులు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం దగ్గర్నుంచీ ప్రతి చిన్న అంశంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నా జనసేన మరెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *