గద్దలకొండ గణేష్.. గత్తరలేపిండు

September 20, 2019 | News Of 9

వాల్మీకి అనే టైటిల్ తో ఆసక్తి రేకెత్తించి, అదే విషయంలో వివాదాలతో వార్తలకెక్కిన వరుణ్ తేజ్ మూవీ ‘‘గద్దలకొండ గణేష్’’ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తోంది. ఏ స్థాయిలో విజయం సాధిస్తుంది. ఇలాంటి విషయాలన్నీ చర్చిద్దాం..

నటీనటులు : వరుణ్ తేజ్, పూజా హెగ్డే, మృణాళిని ర‌వి, అధర్వా మురళి, తనికెళ్ల భరణి, రఘుబాబు, బ్రహ్మాజి, సత్య, సుబ్బరాజు, అన్నపూర్ణ తదితరులు

దర్శకుడు : హరీష్ శంకర్

జోనర్ : యాక్షన్ ఎంటర్టైనర్

సినిమా నిడివి : 2గం 52 నిమిషాలు

గద్దలకొండ గణేష్ 2014లో వచ్చిన ‘‘జిగర్తాండ’’కు రీమేక్. ఇలా ఒక భాషలో వచ్చిన సినిమాను మరో భాషలో నేటివిటీకి తగ్గట్లు రీమేక్ చేసి మెప్పించడం అంత సులభం కాదు. కథలోని విషయాన్ని దారి తప్పకుండా తీయాలి. అలా చేయడం అందరికీ సాధ్యం కాదు. హిందీ బ్లాక్ బస్టర్ దబాంగ్ ను పవన్ కళ్యాణ్ తో తీసి రికార్డులు సాధించినా, తమిళ సూపర్ హిట్ జిగర్తాండను వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ గా మలచినా రీమేక్ తీయడంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు హరీష్ శంకర్.

కథ:

ఒక కరుడుగట్టిన రౌడీ మంచివాడిగా ఎలా మారాడనేదే ఈ సినిమా కథాంశం. ఈ కథను ఎక్కడా వినోదం మిస్ కాకుండా వైవిథ్యంగా మలిచాడు హరీష్ శంకర్. అభిరామ్ (అధర్వ మురళి) సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఒక సినిమా సెట్‌లో దర్శకుడితో గొడవపడి సంవత్సరంలోపు అందరూ మెచ్చుకునే సినిమా తీస్తానంటూ ఛాలెంజ్ విసురుతాడు. అతనికి అవకాశం ఇస్తానంటూ ఓ నిర్మాత(రఘుబాబు) ముందుకొస్తాడు. ఒక క్రిమినిల్ రియల్ స్టోరీతో సినిమా తియ్యాలని అభిరామ్ నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్)ను ఎంచుకుంటాడు. అతని ఊరికి వెళ్లి రహస్యంగా గణేష్ గురించి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అనంతరం కథ ఎలాంటి మలుపులు తిరిగింది. చివరికి ఏం జరిగింది అనేదే ఈ సినిమా.
నటీనటుల పెర్ఫార్మెన్స్..

గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ తన పెర్ఫార్మెన్స్ మేజిక్ చేశాడని చెప్పాలి. తమిళ మాతృకలో లేని లవ్ ట్రాక్‌ను హరీష్ శంకర్ ఇందులో చొప్పించారు. ఆ ఎపిసోడ్ లో వరుణ్ లుక్ కొత్తగా ఉంది. పూజా హెగ్డే‌తో వరుణ్ కెమిస్ట్రీ మరోసారి పండింది. గద్దలకొండ గణేష్, అతడి తల్లి మధ్య క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్ ప్రక్షకులతో కంటతడిపెట్టిస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం వరుణ్ తేజ్‌ నటనే. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ పరకాయ ప్రవేశం చేశాడు. తన ముఖంలో క్రూరత్వం, ప్రవర్తనలో మొరటితనాన్ని బాగా ప్రదర్శించాడు.
మరో కీలక పాత్రలో నటించిన తమిళ నటుడు అధర్వ మురళి కూడా పరవాలేదనిపించాడు. కమెడియన్ సత్య మాత్రం తన హావభావలు, మేనరిజంతో చాలా హాస్యం పండించాడు. ‘చింతపండు’ కొండమల్లిగా చించేశాడని చెప్పాలి. ఇక కొత్తమ్మాయి మృణాళిని తన అభినయంతో ఆకట్టుకుంది. పెళ్లిచూపులు సీన్‌లో ఆమె నటన చాలా బాగుంది. తనికెళ్ల భరణి కనిపించింది కాసేపే అయినా ఆ పాత్రలో తన అనుభవాన్ని చూపించారు. అన్నపూర్ణ, శత్రు, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రఘుబాబు, రచ్చ రవి, ఫిష్ వెంకట్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక వర్గం..

టెక్నీషియన్స్ గురించి చెప్పాలంగే.. ముందుగా హరీష్ శంకర్ డైలాగ్స్‌ను మెచ్చుకోవాలి. చాలా సాధారణంగా, ప్రేక్షకుడికి వెంటనే రీచ్ అయ్యేలా సింపుల్ పదాలతో డైలాగ్స్ అద్భుతంగా రాశారు. ‘సినిమా ఇన్‌ఫ్లూయెన్స్ చేయదు.. ఎంటర్‌టైన్ చేస్తుంది’, ‘మనం చేసే పనిని వదిలిపెట్టి వేరే పని చేయడం కాంప్రమైజ్ కావడం.. మనం చేసే పనిలోనే మార్పులు చేసుకోవడం అడ్జస్ట్ అవ్వడం’ లాంటి డైలాగ్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశారు. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. నాలుగు చక్కని పాటలతో పాటు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అందించారు. అలాగే, ఫ్లాష్‌బ్యాక్‌లో గణేష్, శ్రీదేవిల లవ్ ట్రాక్‌కు కూడా చాలా మంచి నేపథ్య సంగీతం అందించారు.

ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మా పాటను పాతపాటను చెడగొట్టకుండా చేశారు. చివర్లో వచ్చే ఐటెం సాంగ్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ అయనాంకా బోస్ పనితనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ముఖ్యంగా వరుణ్ తేజ్‌ను అద్భుతంగా కెమెరాలో బంధించారు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా చూస్తే ‘గద్దలకొండ గణేష్’ మంచి మాస్ హిట్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

న్యూసాఫ్ 9 రేటింగ్ : 3.5 / 5

Other Articles

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *