జనసేనాని జన్మదిన శుభాకాంక్షలు

September 2, 2019 | News Of 9

జనసేన విజయంప్రజల విజయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరే ఓ ప్రభంజనం ఆయనేంచేసినా సంచలనమే. పాతికేళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ రెండు మూడు సినిమాలకే స్టార్ అయిపోయారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీరంగ ప్రవేశం చేసినా తక్కువ కాలంలోనే ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యువతకు ఆయనంటే అంతులేని అభిమానం . ఇప్పటికీ అది పెరుగుతూనే ఉంది. సినిమాల్లో నటించకపోయినా క్రేజ్ తగ్గకపోవడానికి కారణం జనం ఆయన్ను కేవలం నటుడిగా చూడరు.

పవన్ కళ్యాణ్ నిజాయితీ. ప్రజాసేవ చేయడంలో అంకిత భావం ఇవి ఆయన్ని కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచేలా చేశాయి. సినిమాల్లో కూడా సమాజం పట్ల పవన్ కనబరిచే బాధ్యత ఆయన్ను అందరికీ దగ్గర చేసింది. పవన్ కళ్యాణ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అస్సలు మొహమాటపడరు. ఆయనలా నా సినిమా మీకు నచ్చితేనే చూడండి అని చెప్పిన స్టార్ హీరో మరొకరు లేరేమో. ఒకసారి మన సినిమా ఆడుతుంది మరోసారి మరో హీరో సినిమా ఆడుతుంది. ఎవరూ ఎవరికన్నా తక్కువ కాదు. అని చెప్పడంలో జయాపజయాలకు ఆయన స్పందించే తీరు అర్ధమవుతుంది.

ఎంతో కాలం శ్రమించి సాధన ద్వారా నిస్వార్దాన్ని అలవర్చుకున్నారు పవన్ కళ్యాణ్. అదంత సులభం కాదు. రాజకీయ నాయకులు పైపైన చెప్పే మాట అంతకన్నా కాదు. పవన్ ఇది అంతఃకరణ శుద్దితో పాటిస్తారు. తన స్వార్థం తాను చూసుకుని ఉంటే ఇప్పటికి వేల కోట్లకు అధిపతి అయ్యేవారు. ఎవ్వరూ కన్నెత్తి చూడలేని స్థితిలో ఉండగలిగే వారు. తను సుఖంగా ఉన్నా, సర్వసౌఖ్యలు అనుభవించగలిగి ఉన్నా కూడా ప్రజల కష్టాల గురించి ఆలోచించ గలిగేంత నిస్వార్దాన్ని అలవర్చుకున్నారు. ఇది ఒక్కరోజులో రాలేదు.. తానూ మామూలు మనిషినేననీ ఈ స్థితికి చేరడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందనీ ఆయనే చెప్పారు. పుట్టుకతో మహానుబావుడ్ని కాదని చెప్పడంలోనే ఆయన వ్యక్తిత్వం శిఖర స్థాయికి చేరింది.

ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే అతను డబ్బు సంపాదించడానికి అవలంబించే విధానాన్ని పరిశీలించాలి. తన సినిమాలు ఫెయిలైన సందర్భాల్లో పవన్ తన పారితోషికాన్ని కూడా తిరిగిచ్చారని ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలే చెబుతారు. పవన్ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరని చెప్పడానికి దీనికి మించిన ఉదాహరణ ఏం కావాలి. ఆయన బ్రాండ్ ఎండార్స్మెంట్లకు దూరంగా ఉండడం మరో అరుదైన విషయం. ఇరవై ఏళ్ళ క్రితం నుంచే అనేక అంతర్జాతీయ సంస్థలు ఆయనను తమ ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని అభ్యర్ధించేవి. మొదట్లో ఒకటి అరా అంగీకరించినా అనంతరం వాటికి దూరంగా ఉన్నారు. తనవల్ల ఏరూపంలోనూ ప్రజలకు తప్పు సంకేతాలు వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. వాణిజ్య ప్రకటనల ద్వారా వందల కోట్లు సంపాదించే అవకాశం ఉండికూడా రూపాయి తీసుకోకుండా చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అంతేకాదు తాను తరచుగా చేనేత దుస్తులనే ధరిస్తారు కూడా. మనసా వాచా కర్మణా అంటే ఇదే.

అదే సామాజిక స్పృహ పవన్ ను సేవా కార్యక్రమాల వైపు నడిపించింది. అదిప్పుడు మొదలైంది కాదు. చిన్నతనం నుంచీ సమాజంలోని అసమానతలు, వ్యవస్థలోని లోపాలను చూస్తూ తనలోతను మదనపడేవారు. సామాజిక న్యాయం కోసం తన సోదరుడు పెట్టిన రాజకీయ పార్టీని స్వార్ధ రాజకీయ నాయకులు కుట్రలతో భూస్థాపితం చేసినా పవన్ వెరవలేదు. మళ్ళీ తనలో అంతర్మధనం మొదలైంది. మంచి చెయ్యాలనే సంకల్పం మాత్రమే సరిపోదనీ.. ఆ ప్రయత్నాలకు అడ్డుపడేవారి కుట్రలనూ సమర్థవంతంగా తిప్పికొట్టాలనీ అర్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వారించినా వినలేదు. సరిగ్గా ఐదేళ్లకు మళ్ళీ తానే స్వయంగా జనసేన పార్టీని స్థాపించారు. తన సొంత ఖర్చుతోనే ఒక్కొక్క దశ దాటుకుంటూ పార్టీ నిర్మాణం చేపట్టాడు. ఇంతలో ఎన్నికలు. ప్రజల్లోకి పూర్తిగా చేరుకోవడలో వెనుకపడడంతో మళ్ళీ ఓటమి చవిచూశారు. అయితే ఈసారి పవన్ కంగారు పడలేదు. మళ్లీ కర్తవ్యం వైపు అడుగులేసాడు.

నీతి, నిజాయితీ, నిబద్ధత అనేవి రాజకీయ నాయకుల వాడుక పదాలు. కానీ వారిలో 90 శాతం ఎవ్వరూ అవేవీ పాటించరు. డబ్బు, మద్యం పంచి ఎన్నికల్లో గెలిచే వారు నీతికి నిలబడతామంటే ఎవరు నమ్ముతారు. కానీ 75 ఏళ్లుగా ఇలాగే మాటలు చెప్పి తీరా అధికారానికి వచ్చాకా తమ స్వార్థం చూసుకునే నాయకుల్ని చూసీ, చూసీ ప్రజలకు అలవాటైపోయింది. సరిగ్గా ఇక్కడే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిలుస్తారు. ఇటీవలి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా 6 శాతం ఓట్లు సాధించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడం చూసి పక్క పార్టీల నేతలు, ప్రజలు కూడా ముక్కున వెలేసుకున్నారు. కానీ ఇదో మంచి అనుభవం. రాజకీయాల్లో రానున్న పెనుమార్పులకు సంకేతం. అప్పటి అధికార పార్టీకి కొమ్ము కాస్తాడంటూ ప్రత్యేర్డులు చేసిన ప్రచారాన్ని కొందరు నమ్మారు. ఆ అనుమానమే పవన్ ఓటమికి కారణం కావచ్చు. మరేదైనా కావచ్చు కానీ దానికి ఆయన కుంగిపోలేదు. నేను ఇవన్నీ ఆలోచించే వచ్చానన్నారు. అదీ పవన్ అవగాహనా స్థాయి.

కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే సినిమాలను వదులుకొని ప్రజా జీవితంలోకి రావడం ఓ సాహసం. అలాంటి ఓ వ్యక్తి మనకు ఎక్కడా కనిపించడు. అయితే ఆయన మాత్రం ఎందరో మహనీయుల త్యాగం మనదేశం అని తెలిసినవాడు. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతాడు. విజయమూ అందుకుంటారు. పవన్ కళ్యాణ్ కి కావాల్సింది. ఎన్నికల్లో గెలవడమో పదవులు అందుకోవడమో కాదు . అదే లక్ష్యమయితే అది ఆయనకు పెద్ద కష్టమేం కాదు. ప్రజలు గెలవాలి. వారి కష్టాలు దూరం కావాలి. చట్టాలు అందరికీ సమానంగా పనిచెయ్యాలి. రాజకీయాల్లో జవాబుదారీతనం రావాలి. ప్రజలందరూ విద్య, వైద్యం, ఉపాధి వంటి అన్ని సౌకర్యాలు, సమృద్ధగా అందుకోగలగాలి.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో వారికి అండగా నిలబడగలగాలి. యువత రాజకీయాల్లోకి రావాలి, తమ బాధ్యతను గుర్తించాలి, వారిలో మానవత్వం, సేవాగుణం పెంపొందాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ విజయం సాధించినట్టు. అధికారం అంటే హోదా కాదు బాధ్యత అని ఆయన పదే పదే చెప్పే మాటలకు అర్థం అదే.

ఆయన సంకల్పం గొప్పది. అందులో స్వార్థం లేదు. ఆయనకు కులమత, ప్రాంతీయ బేదాల్లేవు, సొంత మనుషులను మాత్రమే బాగుచేసుకుందామనే తత్వం కాదు. పవన్ ప్రయత్నానికి ప్రకృతి సహకరిస్తుంది. ప్రజల నమ్మకాన్ని సాధించే ఓర్పు, సహనం ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. అభిమానులు జనసైనికులలోనూ అవగాహన పెరుగుతుంది. ఒక్కొక్క జనసైనికుడు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లా మారతారు. కోట్లాది మంది సమర్థులైన యువకులతో దేశవ్యాప్తంగా మార్పు వస్తుంది. ఎన్నో అడ్డంకులు, సవాళ్లు అధిగమిస్తూ ముందుకు సాగుతున్న జనసేనాని విజయంతో ప్రజలు విజయం సాధిస్తారు. ఆరోజు ఎంతో దూరంలో లేదు. అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.
అలాంటి అద్భుతం పవన్ కళ్యాణ్.. ఈరోజు ఆయన పుట్టిన రోజు. జనం మెచ్చిన నాయకుడికి న్యూసాఫ్9 ప్రేక్షకుల తరపున జన్మదిన శుభకాక్షలు.

Other Articles

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *