ఎన్నాళ్లీ… విషపు రాతలు?

April 17, 2019 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

‘‘యథా రాజా తథా ప్రజ’’ అన్నది సామెత. పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్ర సభల్లో అనేక సార్లు ఈ సామెతను గుర్తు చేస్తుండేవారు. రాజు వెధవ పనులు చేస్తే… ప్రజలు కూడా వెధవ పనులు చేస్తారు. అందుకే అధికారంలో ఉన్నవారు, ఒక స్థాయిలో ఉన్నవారు ఇతరులకు ఆదర్శంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. సభ్య సమాజంలో ఎవరైనా దీనిని పాటించాలని కోరుకుంటారు. కానీ రాజకీయ నాయకులకు ఇలాంటి సూత్రాలేమీ వర్తించవు. చంద్రబాబు టెలికాన్ఫరెన్సులు పెట్టి ప్రతిరోజూ సొంత పార్టీవాళ్లనో, లేకపోతే ఎదుటి పార్టీవాళ్లనో తిడుతుంటారు. లేదంటే సొంత రామాయణాన్నే మళ్లీ మళ్లీ చెబుతుంటారు.

ప్రచారాలు పూర్తయ్యాయి… పోలింగ్ పూర్తియిపోయింది. ఫలితాలు మే 23న గానీ రావు. ఈ లోగా ప్రజలకు విశ్రాంతి ఇవ్వడం ఎందుకులే అనుకున్నారేమో చంద్రబాబు పోలింగ్ పూర్తికాకుండానే ఈవీఎంల గోలకు తెర తీశారు. మళ్లీ ఈవీఎంల గోల అమరావతికే పరిమితం అయితే ఎలా? ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి, కొంపలు మునిగిపోతున్నాయని చెప్పి… అదేనండి ‘‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’’ అన్న రొటీన్ డైలాగులు చెబుతూ అందరినీ కూడగట్టారు. విషయం ఈవీఎం అయినా.. మోడీ, జగన్ లను తిట్టుకుంటూ.. అక్కడక్కడా నాలుగు జీడిపప్పులు (కేసీఆర్) వేసుకుంటూ కొత్త రాజకీయ పాయసాన్ని తయారు చేసి ఢిల్లీ వీధుల్లో విజయవంతంగా అమ్మేశారు. చంద్రబాబు అంత కాకపోయినా… జగన్ కూడా విజయసాయిరెడ్డిని తీసుకుని గవర్నర్ ను కలిశారు.. ఎన్నికల అధికారిని కలిశారు.

ఇన్ని జరుగుతున్నా… పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. పోలింగ్ అయిన తర్వాత రోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అన్నదానం చేశారు. కోటి 32 లక్షల చెక్కును అన్నదాన కార్యక్రమానికి అందించారు. తర్వాత హైదరాబాదు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి అని మనం అనుకున్నా… తనకు ముఖ్యమైన పనులేమైనా ఉంటే వాటిలో నిమగ్నం అవుతారు. బాబు, జగన్ ఇద్దరూ ఇలా తిట్టుకుటుంటే… పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లబ్బా అని అనేక మీడియా సంస్థలతోపాటు ‘‘గ్రేట్ ఆంధ్ర’’ కు కూడా అనుమానం వచ్చింది. వెంటనే ఒక వార్తను గ్రేట్ ఆంధ్ర పాఠకులకు అందించింది. ‘‘మళ్లీ గూటికి చేరిన పవన్’’ అంటూ మొదలు పెట్టింది. పోలింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్క విలేకరుల సమావేశం కూడా పెట్టలేదని బుగ్గలు నొక్కుకున్నది. ఇపుడు పవన్ కళ్యాణ్ కూడా మందిలో కలిసిపోయి వాడినీ, వీడినీ తిట్టాలని గ్రేట్ ఆంధ్రతోపాటు మిగతా మీడియా కూడా కోరుకుంటుంది. అయిన దానికీ కాని దానికీ తిట్లు లంకించుకునేందుకు చంద్రబాబు రాజకీయాల్లో అందరికీ ఆదర్శమని వారికో పిచ్చి నమ్మకం. పవన్ కళ్యాణ్ ఒక్కడే హుందాగా ఉండిపోవడం వారికి సుతరామూ నచ్చడం లేదు. ఆయన్ను కూడా మన హరికథా పితామహుడులా తయారు చేయాలన్న తాపత్రయం వారిలో కనిపిస్తోంది. చంద్రబాబు తిట్ల దండకం అందుకోగానే… పిల్ల కూనలు చెంగు చెంగున ఎగురుతూ అవి కూడా విలేకరుల సమావేశాలు పెడతాయి. ‘‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో’’ అంటూ అచ్చూ ఆయనలాగానే ప్రసంగిస్తాయి.. పెద్దాయన ప్రసంగాలూ, పిల్ల ప్రసంగాలూ కవలల్లా ఉంటాయి. చంద్రబాబు నుంచీ వాళ్ల ఆఫీసులో బంట్రోతు వరకూ ఒకటే మాట… ఒకటే బాట. అలా ఎలా కుదురుతుందో అర్థంకాదు.

పోలింగ్ అయిపోయిన వెంటనే… అందరూ ఇతరులపై పోయడానికి బళ్ల కొద్దీ బురదతో రడీ అయిపోతే, జనసేన నేతలు మాత్రం ఇంకా నియోజక వర్గాల్లో తిరుగుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. విశాఖపట్నంలో అయితే జేడీ లక్ష్మీనారాయణ… విశాఖ బీచ్ శుభ్రతకు నడుం బిగించారు. నేతలంటే ఇలా కదా ఉండాల్సింది. జగన్ ను జైల్లో కుక్కిందే నేనే అంటూ ఆయన కూడా మాట్లాడవచ్చు. కానీ ప్రచారంలో ఆయన జగన్ ను ఒక్క మాట అనలేదు. అయినా సాక్షి ఆయనపై బురద చల్లేందుకు ప్రయత్నించింది.

ఈ రోజు ‘‘గ్రేట్ ఆంధ్ర’’ ఒక స్టోరీ రాసింది. అదేమంటే… పవన్ కళ్యాణ్ మళ్లీ హైదరాబాదుకు వచ్చేశాడనీ, ఆంధ్రవాళ్లను కొడుతున్నారని చెప్పిన హైదరాబాదుకే వచ్చేశాడనీ ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నట్లుగా పాఠకులకు విషాన్నం వడ్డించింది. ఇంకా అది ఏం చెత్త రాసిందంటే.. అన్ని పార్టీల నేతలూ ప్రెస్సు కాన్ఫరెన్సులు పెడుతుంటే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడని రాసింది. గాంధీ భవన్ లో కుర్చీలు విసురుకోవడం, ఇతర నేతలపై తిట్లదండకాలూ, గంటకోసారి టెలికాన్ఫరెన్సు నిర్వహించే చంద్రబాబును చూసీ… చూసీ ‘‘గ్రేట్ ఆంధ్ర’’ నే కాదు అందరికీ అలా ఉండటమే సరైందని భావిస్తున్నారు. రాజకీయ నాయకుడు అంటే ప్రతిరోజూ విలేకరుల సమావేశం నిర్వహించి ఇతరులను తిట్టేవాడని మీడియా వ్యాకరణంలో రాసేసుకున్నారు.

పార్టీ ఆఫీసులు మూసేశాడని ఇపుడు కొత్తగా పవన్ కళ్యాణ్ పై  యల్లో మీడియా విమర్శలు చేస్తోంది. మనుషులకు చావు ఉంటుందిగానీ… సిద్ధాంతాలకు చావు లేవు. విప్లవ బీజాలు నాటిని మావో లేకపోవచ్చు.. కానీ మావోయిజం ఉంటుంది. సిద్ధాంతానికి ఉన్న బలం అది. పవన్ కళ్యాణ్ అంటే ఏమిటన్నది కాలం చెబుతుంది. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా జండా పీకేస్తున్నారు అని శీర్షికలు పెట్టి మరీ ఈనాడు దినపత్రిక రాసింది. జండా పీకేయించేలా చేసింది కోస్తాంధ్ర పెట్టుబడిదారులే. గొంతులో వడ్లగింజ వేసి పురిట్లోనే చంపేసి.. పైగా ఆ దుర్మార్గాన్ని చిరంజీవిపై నెట్టేసిన పాపపు లోకమిది. మంచి చేయవచ్చిన అందరినీ సమాజం ఇలాగే చూసింది. ఏ మనుషుల కోసమైతే నేడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడో.. అదే మనుషులు డబ్బున్న వారి మోచేతి నీళ్లు తాగుతూ… సమాజ పీడకులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. బానిస బతుకులో కూరుకుపోయిన మనుషులకు స్వేచ్ఛ విలువ అంత తర్వగా తెలిసిరాదు.

యువ శ్రామిక రైతు పార్టీలో యువకులు ఉన్నారేమోగానీ… పార్టీలో పేరుకు మాత్రమే శ్రామికులు పరిమితం. శ్రామిక పార్టీ అంటే టిక్కెట్లు ఇచ్చిన వారిలో శ్రామికులు ఉన్నారా? ఎన్నికలు ముగిసినా… పవన్ కళ్యాణ్ పై విషపు రాతలు రాయడం సాక్షి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టలేదు. ప్రజలకు ఎవరు సమాజ హితులో… ఎవరు సమాజాన్ని దోచుకోవాలని అనుకుంటున్నారో స్పష్టంగా తెలుసు. జనసేన జండా పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఆంధ్రలో లేనపుడు… టీడీపీనీ, వైసీపీనీ ఎదురొడ్డి నిలవడం ఎవరికి సాధ్యం? ఒక్క పవన్ కళ్యాణ్ కు తప్ప.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మార్పు తెస్తుంది. ఇవ్వాళ కాకపోతే రేపైనా… దౌర్జన్యాలూ, దాడులూ ఎల్లకాలం సాధ్యం కావు. ఒకప్పుడు బాంబులు విసిరి రిగ్గింగు చేసేసుకునేవారు… ఇపుడు సాధ్యం కావడం లేదు కదా. మార్పులు వస్తాయి. అలాగే రాజకీయాలు నేడు ఉన్నట్లు రేపు ఖచ్చితంగా ఉండవు. ఆ రోజున జనసేన ఏమిటన్నది అందరి కళ్లకు కడుతుంది. ఏవి తాలు గింజలో… ఏవి నిజమైన గింజలో కాలం తేల్చేస్తుంది. ఆ రోజు వరకూ ఓపిక పట్టేంత సహనం జన సైనికులకు మెండుగా ఉంది. ఏ విషపు రాతలూ జన సైనికుల నమ్మకాన్ని వమ్ము చేయలేవు. ఆఖరికి ఆ దేవుడు కూడా… !!

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *