పాతికేళ్ల భవిష్యత్తును ఇవ్వడానికే వస్తున్నా…: పవన్

November 25, 2018 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

రంపచోడవరం: ‘‘చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ అవినీతిలో కూరుకుపోయారు… మరోవైపు ప్రతిపక్ష నేత అనేక అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మీతో కలిసి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇపుడు చెప్పండి. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పటి నుంచే కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ కావాలా? లేక చంద్రబాబు, లోకేష్ కావాలా, లేక జగనా? మీరే తేల్చుకోండి’’ పవన్ చేతితో మూడు వేళ్లూ చూపిస్తూ రంపచోడవరం ప్రజలను ప్రశ్నించారు. పోరాట యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సీఎం సీఎం సీఎం అంటూ కుర్రకారు కేరింతల నేపథ్యంలోనే పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అప్పుడప్పుడూ వారిని చూసి చిరునవ్వులు నవ్వుతూ ప్రసంగించారు. అరకు వెళ్లినపుడు కూడా తనను చూసి గిరిజనులు తమలో ఒకడు వచ్చాడని భావిస్తున్నారని అన్నారు.

‘‘ఇవ్వాళ బస్సులో ఎందుకు ప్రయాణించానంటే.. చాలా గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు. అందుకే బస్సులో ప్రయాణించాను. నిజంగా త్రికరణశుద్ధిగా ఇపుడున్న పార్టీలు పని చేసి ఉంటే జనసేన పెట్టాల్సిన అవసరమే లేదు’’ అని అన్నారు. రాజకీయ పార్టీలు సరిగా పని చేస్తే అడవిలోకి వెళ్లి పోరాటాలు చేయాల్సిన పరిస్థితులే రావనీ, అడవితల్లినీ, పుడమితల్లినీ దోచేస్తున్నారనీ, అందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలూ ఇక్కడ ధైర్యంగా తిరగలేకపోతున్నారని, అవినీతిలో వాటాలు ఉన్నందునే వారు తిరగడంలేదని అన్నారు. జనసేన అడవినీ, ప్రకృతిని గౌరవిస్తోందని, పర్యావరణ నాశనం లేకుండా పథకాలను అమలు చేద్దామని చెప్పారు. లోకేష్ కు ఒక గిరిజన ఉపాధ్యాయుడికి ఉన్న తెలివితేటలు కూడా ఉన్నాయా అన్నది అనుమానామేనన్నారు.

‘‘ఒక్క ఎమ్మెల్సీని కొనకపోతే ఏం పోయేది? అవినీతి చేసి..  కేసులకు భయపడి తెలంగాణ నుంచి పారిపోయి వచ్చారు ముఖ్యమంత్రి. ఏం జరుగుతున్నా… ప్రజల తరఫున ప్రశ్నించే ధైర్యం ఇటు ముఖ్యమంత్రికిగానీ, అటు ప్రతిపక్ష నేతకుగానీ లేదు. మీరు మనవడికి కూడా డబ్బు సంపాదించి పెట్టారు. మరి నా దగ్గరకు చిన్న బిడ్డల్ని తెచ్చి చూపిస్తున్నారు ప్రజలు. మరి వారికి కనీసం పాతికేళ్ల భవిష్యత్తును అయినా జనసేన ఇవ్వవద్దా?’’ అని ప్రశ్నించారు. వేల ఎకరాలు తీసేసుకుంటారు కానీ, పట్టుమని పది ఉద్యోగాలు కూడా ఇవ్వరని పవన్ దుయ్యబట్టారు. ఇపుడు మాట మీద నిలబడే జనసేన వచ్చిందన్నారు. గిరిజనుల నుంచి క్రీడాకారులను తయారుచేయాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, రోడ్ల సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా, గంజాయి సాగు చేస్తున్నారని అరెస్టులు చేస్తున్నారని, ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయన్నారు. తాను ప్రజా సంక్షేమం కోరుకునే వ్యక్తినని, తాను సినిమాల నుంచి రాజకీయాల్లోకి రాలేదని, ముందు నుంచీ ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన ఉన్నవాడినని, అక్కడ నుంచే సినిమాల్లోకి వచ్చి అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. అవినీతికి చోటులేదని, తమ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే… వారిని బర్తరఫ్ చేసేస్తామని అన్నారు. తాము సంకల్పబలంతో వచ్చామని, తాను ఒకసారి మాట అంటే అది రామబాణమేనని అన్నారు. జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని, అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *