హే బుల్ బుల్‌! బాబు “ఐస్‌ బండి వ‌స్తోంది…!!

January 29, 2019 | News Of 9

  • బడ్జెట్లు వస్తున్నాయి.. పోతున్నాయి.
  • పార్టీలు వస్తున్నాయి…పోతున్నాయి.
  • ఇంట్లో అమ్మకు కూడు బెట్టని అభివృద్ధీ అభివృద్ధేనా?  
  •  చివరికి…లెక్కల యంత్రాల్లో పడి ‘మనిషి’ మిస్సయిపోయాడు!!
  • ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అక్కౌంటు వస్తోంది.

(న్యూస్ ఆఫ్ 9)

ఈ భూమ్మీద ప్రతి ఒక్కరి జీవితం గౌరవంతో జీవించేందుకు విలువైనదే. కానీ ఎక్కడో తేడా ఉంది. ప్రభుత్వాలు ఒకవైపు స్థూల జాతీయోత్పత్తి లెక్కలు చూపిస్తూ… చూశారా… దేశం ఎంతగా ఎదిగిపోయిందో అంటారు. మా ప్రభుత్వంలో రెండు అంకెల్లో అభివృద్ధి చెందింది అని లెక్కలు తీస్తారు. పత్రికలు ప్రచురిస్తాయి. టీవీల్లో ఊదరగొడతారు. కానీ ఈ అభివృద్ధి గత 40 సంవత్సరాల్లో మనకు ఎక్కడా కంటికి కనిపించదు. మనం అభివృద్ధి చెందిన ఫీలింగ్ మనకు రాదు. ప్రభుత్వాలు మారుతున్నాయి. అదే ఉదయం… అదే సాయంత్రం.. మార్పులేని జీవితం. రాజకీయ నాయకులది తప్ప… మన జీవితం మారదు.. మనపక్క వారి జీవితం కూడా మారదు.

 రాజకీయ నాయకుల ప్రకటనలు చదివీ చదివీ కొన్నేళ్లు వేచి చూస్తాం. ఈ సీఎం వస్తే మారుతుంది అని ఎవరో ఒకరిపై ఆశపెట్టుకుంటాం. కానీ మళ్లీ అదే పరిస్థితి పునారవృతం అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదానికి మనం రోజూ చదివే పత్రికల్లోగానీ, టీవీల్లోగానీ చెప్పరు. వాళ్లకు సినిమా పాటలు ప్రసారం చేసే దానిమీదున్న ఆసక్తి, రాజకీయ నాయకులు తిట్టుకునే తిట్లను పోటీలు పడిమీర చూపించేదాని మీదున్న ఆసక్తి ప్రజలపై లేకపోవడమే. దేశం మీదగానీ, మన దేశ ప్రజలపైనగానీ ప్రేమ లేకపోవడమే.

 ప్రజలే ఏ దేశానికైనా తరగని సంపద. ఈ వాస్తవాన్ని నేటి రాజకీయ నాయకులు పూర్తిగా మరచిపోవడమే దీనికి కారణం. అభివృద్ధిలో సామాన్య ప్రజలు ఎక్కడా భాగస్వాములుగా ఉండరు. కాదు.. వారిని భాగస్వాములుగా చెయ్యరు. లెక్కలు చెబుతూ పోతారుగానీ ఎవరి జీవితాలు మారిందీ చెప్పరు. ముఖ్యంగా సంకీర్ణ రాజకీయాలు వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు శ్రీకారం చుట్టాయి. ఒకటి రెండు సీట్లున్న వాడు కూడా బెదిరింపులకు దిగి తన పబ్పం గడుపుకుంటున్నాడు. మనుషుల్నినేటితరం రాజకీయ నాయకులు మరిచిపోయారు. పెరుగుతున్న స్థూల జాతీయోత్పత్తి అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఎన్నటికీ సూచిక కానే కాదు. ఎక్కడ చూసినా అసంతృప్తి జ్వాలలు.. అవకాశాల లేమి ఒకవైపు ప్రజల్ని కుళ్లబొడుస్తుంటే… నాయకులు మాత్రం లెక్కల పుస్తకాలు తెచ్చి లెక్కలు చెప్పేస్తుంటారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న మాయాజాలం ఇదే. ఆయన చెబుతున్న అభివృద్ధి కాగితాల్లోనే కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోందని ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే… ఆంద్రప్రదేశ్ లో ఎక్కడో ఒక చోట ఆకలితోనో, బతుకు లేకనో ప్రాణాలు తీసుకుంటూ ఉంటాడు. ఎవడిచావు వాడిది అని ఊరుకుంటున్నామే తప్ప… దానిపై స్పందించే ఓపిక కూడా మనకు లేకపోతున్నది. ఎందుకంటే ఇక్కడ మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అభివృద్ధికి అర్థం నేతలకు తెలియదు కాబట్టి ఇపుడు మనమే చెప్పుకుందాం. అభివృద్ధి అంటే.. ప్రజలు జీవనకాలం పెరగాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలు తమ జీవితాలను సృజనాత్మకంగా మార్చుకునే వీలు ఉండాలి. ప్రజల శక్తిసామర్ధ్యాలు పెరగాలి. జీవితాన్ని మరింత మెరుగ్గా చేసుకోవాలి అనుకున్నపుడు అవకాశాలు కళ్ల ముందు కనిపించాలి. ఉదాహరణకు ఒక యువకుడికి ఉద్యోగం రాలేదని అనుకుందాం. స్వయం ఉపాధితో బతకాలని అనుకున్నపుడు అందుకు తగిన అవకాశం ఉండాలి. బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ఎంఎస్ఎంఈ అని లోన్లు ఉంటాయిగానీ… లంచాలు ఇవ్వాలి. అదీ అందరికీ ఇవ్వరు. బ్యాంకు దగ్గరకు వెళితే ‘‘నీకేంటిరా ఇక్కడ పని?’’ ఫో ఫో అన్నట్లుగానే మేనేజరు చూపులు ఉంటాయి. ఒక సారి లోను కోసం వెళ్లిననపుడు.. ఒక బ్యాంకు మేనేజరుతో జరిగిన సంభాషణ చెబుతాను. యువకులకు పది పది లక్షల చొప్పున లోన్లు ఇవ్వడం కంటే… ఒకరికే 200 కోట్లు ఇవ్వడం తేలిక… ఒక పెద్దాయన రూ.200 కోట్లు అడిగాను. నేను అక్కడికి వెళ్లాలి. మీరు వెళ్లవచ్చు’’ అన్నాడు. ఇదీ జీవితాన్ని సరిదిద్దుకునేందకు ఒక యువకుడు చేసిన ప్రయత్నం. విఫలం. ఆ యువకుడు ఏం చేస్తాడు? వీలైతే నక్సలైటు అవుతాడు. పిరికివాడైతే చనిపోతాడు. ప్రతి మనిషీ దేవును దృష్టిలో సమానమే. మరి ఆ యువకుడు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత బతకడానికి అవకాశం ఉండదు. కులం అంటారు.. మరొకటి అంటారు. చదువుకోలేదంటారు.. అమెరికా దేశం యువకులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ వంటి వారికి కాలేజీ విద్య కూడా లేదు. కానీ డబ్బు సంపాదించడానికీ, మన తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి, ఒకరిని దేహీ అని అడుక్కోకుండా ప్రతి వ్యక్తీ జీవించే అవకాశం వ్యవస్థ కల్పించాలి. పిల్లిని గదిలో బంధించినట్లు నేటి తరం యువకులకు అవకాశాలను అందకుండా చేస్తున్నారు. రాచరికం లేదుగానీ… ఈ సమాజంలోని కొన్న వర్గాలే రాచరికాన్ని అనుభవిస్తున్నాయి. ప్రజాస్వామ్యం ముసుగు ఉన్నందున రాచరికంలో ఉన్న దాష్టీకం అంత తర్వగా కనిపించదు కానీ… రాజకీయాలను అడ్డంపెట్టుకుని అయిన వారికే అన్నీ వడ్డించేస్తున్నారు. మిగిలిన రిక్తహస్తాలతో కూర్చుంటున్నారు. పేదరికాన్ని మించిన జబ్బు లేదు. అది మనిషిని నిలువెల్లా దహించివేస్తుంది. మన ఉఛ్వాస నిశ్వాసల వేడితోనే మనం చచ్చిపోతామేమో అనిపిస్తుంది. మన కళ్ల ముందే దోపిడీదారులు… చిటికెలో అన్నింటినీ అందిపుచ్చుకుంటారు. పార్టీలు ప్రారంభిస్తారు. జనానికి డబ్బులిచ్చి తెచ్చుకుంటారు. బిస్కెట్లు పడేస్తే… అలాగా జనం పడి ఉంటారన్న పొగరే. డబ్బులు ఎక్కువై ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్న వారి మాయాజాలమే ఇది. డబ్బున్న వాళ్ల కొడుకులు టన్నుల కొద్దీ పుణ్యం చేసుకున్నందునే… వాళ్లకు ఖరీదైన భవంతులు, ఫ్యాక్టరీలు, బెంజికార్లూ వచ్చేస్తున్నాయా? పేదవాళ్లంతా పాపం చేశారు కాబట్టి… వాళ్లను దేవుడు శపించాడు అని సర్దుకుపోవాలా? ఎన్నాళ్లు ఇలా? ఎన్ని దశాబ్దాలు ఇలా సర్దుకుపోవాలి? పేదవాళ్ల జీవితంలో వెలుగులు రావా? ఈ రోజు గణ తంత్ర దినోత్సవం. అమరావతిలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం… అక్కడున్న భవంతులకు దగద్ధాయమానంగా వెలుగుజిలుగులు పెట్టి ప్రజలకు చూపిస్తోంది. ఆ వెలుగు జిలుగులు ఇంటి దగ్గరున్న మా అమ్మకు కూడు పెడుతుందా? ఎవరికీ కోసం ఈ వెలుగు జిలుగులు… పేదవాడికి అన్నం పెట్టలేని ప్రభుత్వం ఉండీ ఉపయోగం ఉందా? ప్రజలకు అర్జంటుగా కావాల్సిన అవసరలేమిటి? గత 70 ఏళ్లుగా రాజకీయ పార్టీలన్నీ ఇదే పోకడ. మార్పు రావాలి. ఇది మారాలి. ప్రజల కళ్లల్లో ఆనందం ఉందా లేదా చూడాలి. మన యువత కళ్లలో మెరుపు ఉందా లేదో చూడాలి. వారి అభివృద్ధికి బిచ్చం వేయడం, బిస్కెట్లు వేయడం కాకుండా… వారికై వారు మెట్లు ఎక్కే వాతావారణాన్ని సృష్టించాలి. అంటే అంకెలు, జీడీపీలూ మీరు పుస్తకాల్లో దాచుకోండి. అవి ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది రోటీ, కపడా, మకాన్. గరీబీ హఠావో అని చెప్పి దశాబ్దాలు అయింది. పేదరికం పోయిందా? అభివృద్ధిలో మనిషి భాగం కాకకపోవడమే దీనికి కారణం.  

మహిళల పరిస్థితి మరీ ఘోరం. మధ్యలో భర్త చనిపోతే…ఆమె పని అయిపోనట్లే. పుట్టింటివారూ పట్టించుకోరు.. అత్తింటివారూ పట్టించుకోరు. చేసేది లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆమెకు పిల్లలు లేకపోతే మరీ ఘోరం. ఇలాంటి పరిస్థితిలో కూడా ప్రతి వ్యక్తినీ మన వ్యవస్థ అదుకుంటుందన్న భరోసా ఉండాలి. పింఛను సాలీనా 24 వేలు చేశానని చంద్రబాబు చెబుతున్నారు. నెలకు 65 వేల రూపాయలు కంటే తక్కువ జీతం వస్తే, వాళ్లు ఆర్థికంగా బలహీనులని ఇటీవల కేంద్రం చెప్పింది. నెలకు రూ.65 వేల జీతం ఇపుడు హైదరాబాదులో ఉంటున్న జర్నలిస్టులకు కూడా లేదు. సామాన్యుల పరిస్థితిని ఊహించండి. అలాంటిది ఏడాదికి రూ.24 వేలు ఇస్తే చంద్రబాబు మెరుగైన జీవితాన్ని జీవించగలరా? లేదు. కారణం డబ్బులు లేవని చెప్పవచ్చు. ప్రజల ఉత్పాదక శక్తిని పెంచకుండా, ఉన్నశక్తిని చంపేసినపుడు ఏం జరుగుతుంది? ఖజానాలోకి డబ్బులు రావు.

యువత సాధికారితను పెంచడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? ఒక్క సుజనా చౌదరికే రూ.6 వేల కోట్లు రుణం ఇస్తే ఇంక యువతకు ఇవ్వడానికి బ్యాంకుల దగ్గర లిక్విడ్ క్యాష్ ఎక్కడ ఉంటుంది? అదే 10 వేల మందికి దానిని బ్యాంకు ఇచ్చి ఉంటే ఆ 10 వేల మంది యువకులు… వాళ్ల మరో 10 వేల మందికి గౌరవంగా బతికే అవకాశాన్ని కల్పిస్తారు. అంటే 20 వేల మంది యువకులు వారి కుటుంబంలో ఉన్న అవ్వల్నీ, అయ్యల్నీ కూడా పోషిస్తారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 వేలు ఏపాటి? ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడటం తగ్గుతుంది. సంక్షేమానికి సంబంధించిన వ్యయం ఖజానాపై తగ్గుతుంది. దానితో మౌలిక సదుపాయాలను ఏర్పరవచ్చు. బిస్కెట్లు పారేసి… అధికారాన్ని లాగివేసుకుని… సొంత మనుషులకు ప్రజా ధానాన్ని పప్పుబెల్లాల్లా ఇచ్చేసి కొంత సొంతానికి మింగేసి… సీఎం పదవిలో వెలిగిపోతామంటే ఇదే మనుషులు మీరు? ఇవేమి పార్టీలు మీవి?

పశువులకు వేలం పాటలు పెట్టినట్లు… ఒకడు 2 వేలు ఇస్తానంటే మరొక సీఎం అభ్యర్థి 10 వేలు అంటాడు. తమాషాలు చేస్తున్నారా? ప్రజలు మిమ్మల్ని గమనించడం లేదని అనుకుంటున్నారా? ఇపుడున్నది 70 శాతం యువతే. వాళ్లు చదువుకుంటున్నారు. ఈ గుడ్డి ప్రేమలేమిటి? సీఎం చంద్రబాబు అయితే… ఈ రోజు ఒక సమావేశంలో… మహిళలకు వరాలు ప్రకటించి.. నన్ను ఎన్నుకోండి ప్లీజ్ అని అడుక్కుంటున్నారు. ఏం ఖర్మ ఆంధ్ర ప్రజలకు? రాష్ట్రం అనాధ అయిపోయింది. ప్రజలను బాగు చేద్దాం… నాకు 5 పైసలు వద్దు అని ఎవరు అంటున్నారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అభివృద్ధికి జీడీపీ కాకుండా ప్రజల ఆనందాన్ని కొలుస్తాం అన్నారు పవన్. అవును. ఇదే కొలమానం. ప్రజలు ఆనందంగా లేని లెక్కలు మనకెందుకు? ఇలా ఆలోచించాలంటే కన్నీటి విలువ తెలియాలి. ఆకలి విలువ తెలియాలి.

లక్షల కోట్లను కొట్టేద్దాం అన్న యావ తప్ప… కూడూ, గుడ్డ, గూడూ కల్పిద్దామన్నఆర్తి మీ ప్రసంగాల్లో ఎక్కడ మాస్టారూ? డబ్బులున్నాయని ఒకరు, సామాజిక వర్గం దన్ను, అధికారం ఉందని మరొకరు దున్నేసుకుందామని అనుకుంటున్నారు. దగా కాకపోతే మరేమిటిది?

వామపక్షాలతో విశాఖలో జరిగిన సమావేశంలో… జనసేన-వామపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఇచ్చిన తీర్మానాలు కాపీ ఒకసారి చదవండి. అక్కడికైనా బుద్ధి వస్తుందేమో. 2013 భూసేకరణ చట్టాన్నిసవరణలు చేసిన చంద్రబాబు ప్రజాహిత నేత ఎలా అవుతారు అన్నది ప్రశ్న. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలు తూట్లు పొడిచింది. పేదల్ని కొట్టి గద్దలకు వేయడమే ప్రజా ప్రభుత్వం అవుతుందా? ప్రజాస్వామ్యం అవుతుందా? మత దురంహకారులు.. గౌరీ లంకేష్ ను చంపేస్తే మీరు ఎనాడైనా ఒక్క మాట మాట్లాడారా? జనసేన-వామపక్ష తీర్మానం దీని గురించి మాట్లాడింది. మత సామరస్యం ఉండాలని కోరింది. చంద్రబాబు ఏనాడైనా మానవ హక్కుల గురించి మాట్లాడారా? హక్కుల్ని హరించిందే ఎక్కువ. అన్నీ తెలిసి… చదువుకుని విద్యాధికులైన యువకులు కూడా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారు. ఇక ఉండరు. వాళ్లు ఉద్యమిస్తారు. పేదల కడుపు నింపే ఉద్యమ సూరీడును అధికారంలోకి తెచ్చుకుంటారు. సీఎం పదవి ఉన్నది మీ అహంకారాల కోసమే, మీ ఆభిజాత్యాల కోసమో, లేక మీ సొంత మనుషులకు మేళ్లు చేసుకునేందుకో కాదని గుర్తించండి. 70 ఏళ్లుగా ఇదే నడిచింది. ఇక నడవదు. నడవదు కాక నడవదు. వచ్చే నెల 5న కొత్త బడ్జెట్టు వస్తుంది. అభివృద్ధికి మనిషి కేంద్రంగా లేనపుడు ఈ ప్రభుత్వాలు ప్రజల్ని బిచ్చగాళ్లుగా చేసి వదిలేస్తాయి. జరుగుతున్నది ఇదే. బాబు మళ్లీ రావాలి అంటున్నది కాంట్రాక్టర్ల, పారిశ్రామికవేత్తల నోళ్లే. మీరు వేసే భిక్ష కోసం ప్రజలు నేడు ఎదురు చూడటం లేదని గ్రహించండి.

 –       న్యూస్ ఆఫ్ 9

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *