మార్పు రాకపోతే గూండాలే సీఎంలు అవుతారు!

April 9, 2019 | News Of 9

pawan kalyan | telugu.newsof9.com

  • ఆశయాల భూమికగా కొత్త రాజకీయాన్ని చూపిస్తా
  • చంద్రబాబు, జగన్ విఫలమయ్యారు..
  • మూడో ప్రత్యామ్నాయాన్ని కోరుకున్నారు  
  • అందుకే జనసేనకు ఇంత ఆదరణ
  • ఏపీ అవతరణ దినోత్సవంగా పొట్టి శ్రీరాములు జయంతి
  • భీమవరం నుంచే మార్పునకు శ్రీకారం చుట్టండి
  • మంచి కోసం… మార్పు కోసం 2019 అన్న పవన్ కళ్యాణ్

 

(న్యూస్ ఆఫ్ 9)

ఆశయాలతో రాజకీయాల్లోకి రావడం.

ఆశతో రాజకీయాల్లోకి రావడం…

అత్యాశతో రాజకీయాల్లోకి రావడం…

ఈ మూడు తరహా వ్యక్తులు ఇపుడు మనకు రాజకీయాల్లో కనిపిస్తున్నారు.

మొదటి లక్ష్యంతో అంటే ఆశయాలతో వచ్చిన నేత- పవన్ కళ్యాణ్.

ఎన్నికల ప్రచారం చివరి రోజున భీమవరంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఒక గొప్ప మాట చెప్పారు. ఆశయాలతో వచ్చినవాడు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటాయో చేసి చూపిస్తా. ఇలా ఆశయాలతో వచ్చే వారు చాలా అరుదు. ఎన్ని కష్టాలు వచ్చినా దొడ్డిదారిలో తాను రానని, ధర్మమార్గంలోనే ప్రయాణిస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రచారం చివరి రోజు కావడంతో ఒకింత హడావిడిలేకుండా జనసైనికులతో ముచ్చటించిన తరహాలో మాట్లాడారు. దేశంలో ఇంకా మంచి జీవించే ఉందని, మంచివాళ్లు ఉన్నారని చెప్పడానికే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు చెప్పారు. భారతదేశం ఇంకా మనగలుగుతున్నదంటే.. ఎంతోకొంత మంచి ఉండబట్టేనని చెప్పారు. కర్ణుడు మంచివాడే.. కానీ కౌరవుల తరఫున ఉండటం వల్ల చివరికి ఆయన చనిపోవాల్సి వచ్చిందని, ధర్మం తరఫున ఉంటున్నామా లేదా అన్నది ముఖ్యమని చెప్పారు.

 స్వేచ్ఛకే పెద్దపీట

వ్యక్తి స్వేచ్ఛకు పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తారు. ఒకరికి బానిసగా ఉండటానికీ, దాస్యం చేయడానికీ, మరొకరికి భయపడటానికీ ఆయన పూర్తిగా విరుద్ధం. డబ్బు కోసం వంగి వంగి సలాము కొట్టడానికీ, పల్లకీలు మోయడానికీ విరుద్ధం. పవన్ ప్రతి ప్రసంగంలోనూ ఈ ధోరణి కనిపిస్తుంది. కానీ సమాజంలో ఒక మనిషి మరొక మనిషిని లొంగదీసుకోవడానికే ప్రయత్నిస్తాడు. ప్రభుత్వం అయితే ప్రజల్ని కాలికింద తొక్కి పెట్టాలని చూస్తుంది. రాజకీయ నాయకులు చేసే దాష్టీకాలకు అంతే లేదు. వీటన్నింటికీ సగటు మనిషి వ్యతిరేకమే. కానీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని మరొకరిని తొక్కాలని చూసే వారే ఎక్కువ.

రౌడీయిజానికి బద్ధ వ్యతిరేకి

రౌడీయిజానికి వ్యతిరేకంగా అన్నవరం సినిమా తీస్తున్నపుడు.. కడప మేయరు రవీంధ్రనాధ్ వచ్చి.. ‘‘మీరు సినిమా చేయాలి’’ అంటూ అడిగిన విధానం, అనుమతిలేకుండా లోనికి రావడం పవన్ కు నచ్చలేదు. అనేక సభల్లో ఈయన ఈ విషయాన్ని చెప్పారు. నీ పెద్దరికం, నీ గొప్పతనం మడిచి ఇంట్లో పెట్టుకో అంటూ ముతకగా చెప్పినా… అందులో ధిక్కారం ఉంది. సంప్రదాయాన్నీ, మర్యాదనీ పాటించకపోవడాన్ని తప్పు పడుతున్నారాయన. ఒక రకంగా జులుం చేయడాన్ని పవన్ కళ్యాణ్ ధిక్కరిస్తున్నారు. కడప మేయర్ అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి బంధువు. అదే రవీంధ్రనాద్ హైదరాబాదులో ఎవరిదో స్థలం ఆక్రమించుకుంటే ఒక మహిళ దీనిపై పోరాటం చేయడం అప్పట్లో మీడియాలో వచ్చింది. అంటే రాజకీయంగా బలవంతుడైన ఒక నేత… ఏమైనా చేసేయవచ్చా? సామాన్యులకు చెందిన భూముల్ని కబ్జాపెట్టేయవచ్చా? వాళ్లను నియంత్రించేవారు లేరా? దెందులూరు ఎమ్మెల్యే ఒక అధికారిని కొట్టారు. వైసీపీ ఎంపీ ఎయిర్ ఇండియా మేనేజరును కొట్టారు. బలం ఉంది కదా అని వీళ్లు ఇలా రెచ్చిపోతే సామాన్యులు ఎక్కడకి వెళ్లాలి. పోలీసులు రాజకీయ నాయకులకే వత్తాసుగా ఉంటారు.

జనసేన ప్రభుత్వం వస్తే… ఖచ్చితంగా రాజకీయ నేతల జులం పోతుంది. సామాన్యులు స్వేచ్చగా ఊపిరిపీల్చుకుంటారు. ఇది కదా ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అందించాల్సింది. తెలుగుదేశంకానీ, వైసీపీ కానీ రాజకీయంగా ప్రజలపై జులుంను ప్రదర్శించేవే అన్నది నూరుపైసల నిజం.

 సమాజంపై లోతైన అవగాహన

సామాజిక అవగాహనకు సంబంధించి పవన్ కళ్యాణ్ లో ఉన్న ఎరుక అపారం. మిగిలిన రెండు పార్టీలకు ఉన్న అవగాహన సున్నా. ఒక సంస్థ ఒక కులం వారు ప్రారంభిస్తే… కొన్ని కులాల వారు పని చేస్తుంటారు. కొన్ని కులాలు నష్టపోతుంటాయి. ప్రభుత్వం అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఎంత చక్కటి అవగాహన. చదువుకున్నవారికి ఈ మాత్రం కూడా అర్థంకాకపోతే అలాంటి వారి చదువులు వృధా.

 ధైర్యమే ఊపిరిగా… ముందుకు

జన సైనికులు ధైర్యంగా ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. స్వేచ్ఛ విలువను బోధిస్తున్నారు. భయపడితే పవన్ కళ్యాణ్ జనసేను ప్రారంభించేవాడా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అంటే గౌరవమే భయపెట్టి పాలిస్తానంటే భారతదేశంలో అలాంటివి సాధ్యంకాదని చెప్పేశారు. భారతదేశం లౌకికదేశం. అన్ని మతాలూ, కులాలూ ఉండాల్సిన దేశం. ప్రేమకు భారతదేశం స్పందిస్తుందనీ, బెదిరించి ప్రజల్ని పాలిస్తానంటే కుదరదని, ప్రతి ఒక్కరూ ఝాన్సీలక్ష్మీబాయిలా అయిపోతారు. తిరుగుబాటు చేస్తారు. భారతదేశంలో భయపెట్టి పాలిస్తాననడం అసాధ్యమని గుర్తించాలని చెప్పారు.

 మార్పు రాకపోతే గూండాలు సీఎంలు అవుతారు

ప్రజల్లో మార్పు రాకపోతే… గూండాలు ముఖ్యమంత్రులు అవుతారని హెచ్చరించారు. మార్పు అన్నది భీమవరంలో కూడా రావాలని, అందుకు చారిత్రక నేపథ్యం కూడా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.  భీమవరం రెండో బర్దోలీ అని బర్దోలీ నేపథ్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఓపికగా జన సైనికులకు వివరంగా చెప్పారు. ఉప్పు సత్యాగ్రహానికి కూడా బర్దోలీ ఉద్యమమే స్ఫూర్తి అనీ, వల్లభాయ్ పటేల్ సర్దార్ అయింది కూడా బర్దోలి ఉద్యమానికి నాయకత్వం వహించినందునే అని చక్కగా చెప్పారు.

 జగన్ ఫెయిల్ అయినందునే…

జగన్… ప్రతిపక్ష పాత్రను చక్కగా పోషించి, ప్రజల కోసమే పని చేసే నాయకుడుగా ఉండి ఉంటే.. జనసేన అవసరమే ఉండేది కాదన్నారు. చంద్రబాబుగానీ, జగన్ కానీ.. ఇద్దరూ విఫలమయ్యారని, అందుకే మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూశారని, మీరంతా అందుకే జనసేనను ఆదరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి సీఈవో అనుకుంటారని, ప్రజల్ని కంపెనీలా చూస్తారని, పెట్టుబడి పెట్టాం… ఇంత రాబడి తియ్యాలన్నది ఆయన ఆలోచనగా ఉంటుందని అంటూ చంద్రబాబు గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు పవన్ కళ్యాణ్.

ఈ ఇద్దరి నాయకుల తీరు ఎలా ఉంటుందంటే… వాళ్లు పరిపాలించేవారనీ, మనమంతా (ప్రజలు) పరిపాలించబడే వాళ్లనీ వారి ఉద్దేశం, నమ్మకం అని చెప్పారు. వీళ్లని అయ్యగారూ.. సారుగారూ అని పిలవాలంట… అని ఎద్దేవా చేశారు

గొప్ప వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్న సత్యం రామలింగ రాజును ఇబ్బందులపాలు చేసింది ఈ జగన్మోహనరెడ్డి కదా అని ప్రశ్నించారు. కానిస్టేబుల్ కొడుకు సీఎం అయితే ఎలా ఉంటుందో జగన్ కు చూపిస్తానని అన్నారు.

ఆశయాలతో ఉండే రాజకీయాన్ని మీరు చూస్తారు

తాను ఆశయాలతో వచ్చానని, ఆశయాలతో వచ్చిన వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. మీకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవుగా అంటూ మొన్న ఎన్డీటీవీ వాళ్లు అడిగారని చెప్పారు.  భావజాలపరమైన పోరాటమే ఉంటుందని, వెన్నుపోట్లు పొడవాల్సిన అవసరం కూడా లేదని ఆయన అన్నారు. ఏనుగును కుంభ స్థలంపై కొడితే… అంత పెద్ద ఏనుగూ మోకాళ్లపై కూర్చునిపోతుంది అని చెప్పారు.

 ఏపీ అవతరణ దినోత్సవంగా పొట్టి శ్రీరాములు జయంతి

మొన్న మొన్న వచ్చిన రాజకీయ నాయకులు తమ సొంత పేర్లపై పథకాలను పెడుతున్నారని, ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములును కూడా మర్చిపోయారని, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు జన్మదినాన్ని ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తామని అన్నారు. పొట్టిశ్రీరాములు లేకపోతే రాష్ట్రమే వచ్చేది కాదనీ, అల్లూరి వంటి వారిని మర్చిపోవడం పెద్ద విషాదమనీ, చంద్రన్న పథకమనీ మరొకటి అనీ పేర్లు పెట్టడం సరికాదన్నారు. అల్లూరి విగ్రహాన్ని వంద అడుగుల్లో పెడతామని అన్నారు. 

అమరావతిలో జండా ఎగరేద్దాం

2019 మార్పునుకు చిహ్నమని, మార్పునకు సంకేతంగా అమరావతిలో జనసేన జండా ఎగరేద్దామని పవన్ కళ్యాణ్ అందరికీ చెప్పి… ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థికి ప్రజలు ఓట్లు వేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతూ.. ఎన్నికల ప్రచారాన్ని భీమవరంలో ముగించారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *