టీడీపీకి ఈ రోజు మే 23వ తేదీ అయితే…?

April 14, 2019 | News Of 9

                          (న్యూస్ ఆఫ్ 9)

తేదీ: 23, మే నెల 2019

సాయంత్రం 4 గంటలు… ఏపీ సెక్రటేరియట్…!!

ఎన్నికల్లో చిత్తుచిత్తుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. విలేకరులంతా వినడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు గంభీరమైన ముఖంతో హాల్లోకి ప్రవేశించారు.

‘‘అవును… మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. ప్రజాతీర్పును మేం గౌరవిస్తున్నాం. ప్రజల ఆదరణను చూరగొనేందుకు మళ్లీ ప్రయత్నిస్తాం’’

అని చంద్రబాబు అంటారని అందరూ అనుకున్నారు.

కానీ ఆయన అలా అనలేదు.

‘‘ఈవీఎంల్లో గోల్ మాల్… అందుకే ఓడిపోయాం…!!ఇదంతా నరేంద్రమోడీ, అమిత్ షాలు చేసిన కుట్రే. వారు మమ్మల్ని కాదు… తెలుగు ప్రజల్ని వంచించారు. ఎన్నికల సంఘం కూడా వారితో కుమ్మకైంది. ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందని నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నా… మీరు పెద్దగా పట్టించుకోలేదు. చూడండి ఇప్పుడు ఏమైందో… 130 సీట్లతో గెలవాల్సిన పార్టీ ఓడిపోయింది. దీనిపై సుప్రీంకోర్టుకు ’’….. అంటూ ఇంకా ఏదో చెబుతూ ఊగిపోతున్నారు. కాగితాలు చూపిస్తూ ఏదో చదువుతున్నారు…

చంద్రబాబు అలా అనకుండా ఇలా అన్నారేమిటబ్బా అని ఏపీలోని జర్నలిస్టులు, తెలుగు ప్రజలూ తప్ప దేశ వ్యాప్తంగా అందరూ ఆశ్చపోయారు… ఒక్క చంద్రబాబు తన జీవితకాలంలో ఓడిపోయిన ప్రతిసారీ ఈ మాటలు అంటారేమో అని గతంలో ప్రజలు అనేకసార్లు ఎదురు చూశారు. 2004, 2009లో ఓడిపోయినపుడు కూడా చంద్రబాబు ఇదే చెప్పారు. ‘‘ప్రజలు తప్పు చేశారు. కాంగ్రెసు ప్రజల్ని తప్పు దోవ పట్టించింది. లేదంటే మేమే గెలిచేవాళ్లం’’. ప్రజలు తమను తిరస్కరించారని తెలుగుదేశం నేతలుగానీ, అధినేతగానీ ఎప్పుడూ చెప్పింది లేదు. నియంతృత్వం బాగా తలకెక్కిన ఏ పార్టీ కూడా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లుగా చెప్పదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీలయితే ఓటమిని హుందాగా ఒప్పుకుంటాయి. కాంగ్రెసు ఓడిపోయిన ప్రతిసారీ ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని చెప్పింది.

బ్లాక్ మెయిల్ రాజకీయాలు

ఏపీకి సీఎంగా ఎవరు ఉండాలో ప్రజలు 11వ తేదీనే తీర్పు ఇచ్చేశారు. ఫలితం ఈవీఎంల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంది. మే 23 వరకూ వేచి ఉండాలి. కానీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలింగ్ రోజున.. ఆ తర్వాత చేసిన హడావుడి మామలుగా లేదు. ఈవీఎంలు పని చేయలేదని, ఎన్నికల సంఘం వైసీపీ నిర్ణయాలకు ఔదలదాల్చిందనీ చంద్రబాబు తిట్టిపోస్తున్నారు. ఏపీ ఎన్నికల అధికారి ద్వివేదీని స్వయంగా కలిసి… తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఒక సీఎం స్వయంగా వెళ్లి ద్వివేదికి కలిసి ప్రశ్నించడమే దారుణం. సీఎం హోదాను గౌరవించి ద్వివేదీ మౌనంగా ఉన్నారు. దీనికి కొందరు ‘‘గట్టిగా నిలదీస్తున్న సీఎం- తలదించుకున్న ఎన్నికల సంఘం’’ అని శీర్షికలు పెట్టి సోషల్ మీడియాలో పెట్టారు. ఇలా రాయడం దిగజారుడుతనం తప్ప మరేమీ కాదు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన నిర్ణయాలను ఎందుకు అమలు చేస్తున్నావు అంటూ బాబు అడుగుతున్నారు. ‘‘స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కదా… పై వాళ్లకు నో అని చెప్పేయి…’’ అని ద్వివేదీకి చంద్రబాబు నూరిపోసే ప్రయత్నం చేశారు. మీరు అలా చెప్పడం భావ్యం కాదంటూ ద్వివేదీ ఆయన్ను అడ్డుకోలేకపోయిన మాట నిజం. అడుగుతున్నది సాక్షాత్తూ సీఎం కాబట్టి ఆయన మౌనం వహించారు. సీఎం హోదాకు ఇచ్చిన గౌరవమే తప్ప ద్వివేదీ తప్పు చేశారనీ, అందుకే తలవంచుకున్నారనీ భావిస్తే అంతకంటే ఘోరం మరొకటి ఉండదు.

చంద్రబాబు ఇంతటితో ఆగలేదు. ఢిల్లీ ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారు అని ఆరా తియ్యగా… ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోతున్న విషయం ఆయనకు ఎప్పుడో తెలిసిపోయిందని, అందుకే ఈ రభసను సృష్టిస్తున్నారని తెలిసింది. వైసీపీ పార్టీ ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించి… ఇదే మాట చెప్పారు.

ఎన్నికల సంఘం ఎందుకు విఫలమైందో తెలుసా?

ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను కాకుండా ఏమాత్రం ఎన్నికల నిర్వహణలో అనుభవంలేని అంగన్ వాడీ కార్యకర్తలను ఎన్నికల విధులకు కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వమే. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ‘‘సహాయ నిరాకరణ’’ చేసిందన్నమాట.

ఎటూ గెలవడంలేదు కాబట్టి… ఎన్నికల సంఘంపై నేరాన్ని తోసివేయాలన్నదే తెలుగుదేశం పార్టీ వ్యూహం. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో ఈవీఎంల తీగెల్ని సరిగా కలపలేదని, అందుకునే సమస్యలు తలెత్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత. టీడీపీ ప్రభుత్వం అనుభవంలేని ఉద్యోగుల్ని కేటాయించి ఇలా దొంగాటకం ఆడుతుందని ఎన్నికల సంఘం అధికారులు ఊహించి ఉండకపోవచ్చు. విజయవాడకు చెందిన ఒక సీనియర్ విలేకరి ఈ విషయాన్ని ధ్రువీకరించడం విశేషం. ఏపీ ఎన్నికల సంఘం అధికారి ద్వివేదీ ఓటు వేసిన వీడియో సోషల్ మీడియాలో ఉంది. ద్వివేదీ కూడా ఓటు వేయలేని పరిస్థితి ఉంది అని చంద్రబాబు చెప్పేశారు. సీఎంగా ఉన్న వారు ప్రజలకు అబద్ధాలు చెప్పవచ్చా అన్నది ప్రశ్న.

ఓడిపోతున్నట్లు అర్థమయ్యాక… పోటీలో ఉన్న క్రీడాకారుడు ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రత్యర్థి ఆటగాడిని అవమానించేందుకు ప్రయత్నిస్తాడు. ఆటల్లో ఇలాంటివి అరుదే కానీ అప్పుడప్పుడూ చూస్తాం. కుళ్లుతో చేసే వ్యవహారం తప్ప ఇది మరొకటి కాదు. రేపు ఎన్నికల్లో ఓడిపోతే… రాష్ట్ర ప్రజలు తెలుగుదేశానికే ఓటు వేశారని, అయితే అవి వైసీపీకి పడ్డాయంటూ ‘‘ఓటమి’’ని ఈవీఎంలపై నెట్టివేయాలన్న ఆలోచన చంద్రబాబులో కనిపిస్తున్నది చెప్పవచ్చు.

‘‘అవును… మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. ప్రజాతీర్పును మేం గౌరవిస్తున్నాం. ప్రజల ఆదరణను చూరగొనేందుకు మళ్లీ ప్రయత్నిస్తాం’’ అని ఈవీఎంలు కాకుండా బ్యాలెట్టుతో ఎన్నికలు జరిగినపుడు కూడా చంద్రబాబు చెప్పలేదు. ఓటమిని ఆయన ఒప్పుకోడు. ప్రజాతంత్రంలో ఓటమి అనేది చాలా సహజమైన ప్రక్రియ. కానీ తెలుగుదేశం ఎప్పుడూ దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. ప్రజలే తప్పుడు తీర్పు ఇచ్చారని ప్రజల్ని నిందించడానికి కూడా ఆయన సాహసిస్తారుగానీ ‘‘ప్రజలు కోరుకున్న పాలనను అందించలేకపోయాం…’’ అంటూ చెప్పాలని.. చంద్రబాబు వంటి రాజకీయవేత్త నుంచి ఆశించడం తప్పేనని తెలుసు. కానీ… ఆయన నైజాన్ని పాఠకులకు చెప్పాలన్నదే ఈ ప్రయత్నం.

జగన్ రేపు సీఎం అయినా… చంద్రబాబు ఆయనకు చుక్కలు చూపిస్తారు. ప్రమాణ స్వీకారం జరగక ముందే వైసీపీ అక్రమ మార్గంలో అధికారాన్ని చేజిక్కించుకున్నదనీ, అనైతిక సీఎం, దొడ్డిదారిలో వచ్చిన సీఎం అంటూ వారికి కునుకు లేకుండా చేయడమే ఆయన వ్యూహంగా తెలుస్తోంది. టీడీపీ ఓడిపోయినా… పార్టీ స్కంధారావాలు… యథావిధిగా బాబు మాటనే మోసుకుంటూ తిరుగుతాయి. రెండో శ్రేణి నాయకులు విలేకరుల సమావేశాలు పెట్టి మీడియా నిండా ఊదరగొడతారు. ప్రత్యర్థిని అనుమానపు నీడల్లో ఉంచి… దాని వెనుక దాగే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. 40 ఏళ్ల అనుభవం ఉన్న నేత… హుందాగా ఉండే ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ గెలుస్తుందా లేదో అన్న లెక్కల్లో జనాలు ఉండగా… ఓడిన తర్వాతి దశ వ్యూహాన్ని అమల్లో పెట్టేస్తున్నారు చంద్రబాబు.

బాబును అఘాయిత్యపు మనిషిగా వైసీపీ అభివర్ణించింది. ‘‘ఏం చేస్తాడో ఏంపాడో ఈ మనిషి..’’ అన్న భయం వైసీపీలో గట్టిగానే ఉన్నది.

వైసీపీ అధికారంలోకి వస్తే… రాష్ట్రం రావణకాష్టం అయిపోతుందన్న భయం చాలా మందిలో ఉన్న మాట వాస్తవం. అందుకు కారణం.. వైసీపీ గత చరిత్రే. దానికి ఇతరులను నిందించే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ అన్నట్లు ‘‘పులివెందుల’’ తరహా బెదిరింపు రాజకీయాలు హైదరాబాదు వాసులకు నేటికీ అనుభవమే. పత్రికల్లో రావు గనుక.. అంతగా ఎవరికీ అవగాహన లేకపోవచ్చు.

కొరకరాని కొయ్య- ఈవీఎం!!

రాజకీయ పార్టీలకు ఈవీఎంలు కొరకరాని కొయ్యగా దాపురించాయి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలింగ్ బూతులో ప్రవేశించి తలుపులు వేయడం అంటేనే… చీకటి కార్యక్రమం. అంటే రిగ్గింగ్ చేసుకునే ప్రయత్నం. మరోసారి తెలుగుదేశం పార్టీ గెలిచెయ్యాలి. అంతే. అధికారాన్ని వీడలేని బలహీనత. ప్రజలు ఎదురుతిరగడంతో కోడెల గారు ఇంటిముఖం పట్టారు. ఇలా రిగ్గింగు చేసుకోవడం కష్టంగానే ఉంది. సోషల్ మీడియా వచ్చేసినందున… ప్రజల్ని మాయ చేయడం కుదరడం లేదు. డూడూబసవన్నలుగా ఉన్న ప్రధాన మీడియా చెప్పే కథనాల్ని కూడా ప్రజలు నమ్మడం లేదు. ‘‘ఆ మాకు తెలుసులే’’ ప్రధాన మీడియా కథనాల్నీ ప్రజలు తిరస్కరిస్తున్నారు.

బ్యాలెట్ అసాధ్యం!!

భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడం అంత తేలికైన విషయమేం కాదు. 130 కోట్ల మంది భవితవ్యానికి సంబంధించిన అంశం. అమెరికాలో బ్యాలెట్టు ద్వారా ఎన్నికలు అంటే.. వాళ్ల జనాభా ఎంత? మన జనాభా ఎంత? వీధి లైట్ల నియంత్రణకు కూడా కంప్యూటర్ వాడే చంద్రబాబేనా ఇలా మాట్లాడేది? ప్రజల అభిమానాన్ని కోల్పోతున్నమన్న నగ్నసత్యాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదు. నాలుగు బిస్కెట్లు వేసి.. లాగేసుకుందామన్న యావ తప్ప… రుజుమార్గంలో వెళదామన్న ఆలోచన రావడం లేదు. యువత దెబ్బకు ప్రపంచం మొత్తం నియంతృత్వ ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి. ఈ దశలో నియంతృత్వంవైపు ప్రయాణించాలని భావించడమే టీడీపీ చేస్తున్న మొదటి తప్పు.

చంద్రబాబు వాదనలో పసలేదని అర్థం అవుతూనే ఉంది.ఈవీఎంలను ట్యాంపరు చేసుకోవడానికి సాధ్యం కావడం లేదు. బ్యాలెట్టు అయితే ఎంతో కొంత మసిపూసి మారేడుకాయ చేసుకోవచ్చన్నది బాబు ఆలోచన. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పి… బ్యాలెట్టు దిశగా ఎన్నికల విధానాన్ని మార్చేయాలని ఆయన చూస్తున్నారు. 2024 ఎన్నికలయినా దీనిని తెచ్చుకుంటే మేలని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఏ పార్టీని ఎన్నుకోవాలన్న స్వేచ్ఛను ప్రజలకు ఇవ్వకూడదన్నది చంద్రబాబుకు ఉన్న బలమైన కోరిక. పది శాతం ఓట్లు జనం నామ్ కే వాస్తేగా వేసుకుంటే చాలు అన్నది ఆయన భావన. మీడియాని అడ్డంపెట్టుకుని 50 శాతం వస్తే, మిగిలినవి ఓట్లను తీసేయడం ద్వారా సంపాదించుకోవచ్చునని తలపోస్తున్నారు.

2019 ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా నుంచి ప్రత్యర్ధుల ఓట్లను తొలగించింది నిజానికి చంద్రబాబే. డ్వాక్రా మహిళలకు ఫోన్లు ఇవ్వడం ద్వారా రేపు వారేమి మాట్లాడుకుంటున్నదీ ప్రభుత్వం విన్నవచ్చన్నదే. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ఫోన్లలో రహస్య చిప్ లు ఏమైనా ఉండే ఉంటాయని మేం భావిస్తున్నాం. టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం రహస్యంగా ప్రజల సమాచారాన్ని సేకరించే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనేది మా అనుమానం. ప్రజలపై పూర్తి నియంత్రణ సాధించేదిశగా చంద్రబాబు తెరవెనుక ఒక ‘‘గాడ్ ఫాదర్’’ తరహా శక్తిగా రూపాంతరం చెందారు లేదా… చెందుతున్నారు. దీన్నే ఇంగ్లిషులో ‘‘మెటమార్ఫోసిస్’’ అంటాం. ప్రశ్న వేసే సాహసం ఏ విలేకరీ చేయలేని పరిస్థితిని తెచ్చిపెట్టారు. 2019 జనవరిలోనే ఏదో జరుగుతోంది అని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ తరవాతనే ‘‘డేటాచోరీ’’ విషయాన్ని వైసీపీ బహిర్గతం చేసింది.

ప్రజల ఆలోచనలనూ నియంత్రించి, టెక్నాలజీ సాయంతో భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని గుప్పిట పెట్టుకునే సాహసం చంద్రబాబు చేస్తున్నారు. బయటకు మాత్రం… ప్రజాస్వామ్య రక్షకుడుగా ఆయన తనను తాను చెప్పుకోవడం విషాదం. జాతీయ పార్టీలకు ఇవన్నీ తెలియవు. మోడీపై కత్తికట్టిన వారితో దోస్తీ చేస్తాయి. అంతే!! తెలుగువారి భవిష్యత్తు మన నేతకే లేనపుడు… జాతీయ నేతలకు లేదని మనం ఎలా అనగలం?

ఓట్లను తొలగించే దుర్మార్గానికి కూడా రాజకీయ పార్టీలు తెగిస్తున్నాయి. సాఫ్ట్ వేరును ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించిందన్నది వాస్తవం. ప్రజల కోసం పని చేయడంలో విఫలమైన పార్టీలు ఇలా అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కుంచుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈవీఎంలు రాజకీయ పార్టీలను పరుగులు పెట్టించడానికి కారణం.. వాటిని ట్యాంపరు చేసుకునే వీలు లేకపోవడమే. మనం రోజూ ఉపయోగించే బ్యాటరీ క్యాలిక్యులేటర్ తీసుకోండి… దాన్ని మీరు ఏ రకంగానైనా ట్యాంపరు చేయగలరా? చేయలేరు. మన ఈవీఎంలు కూడా అంతే…!! ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉన్నది ఈవీఎంల నుంచి కాదు… సాక్షాత్తూ మన రాజకీయ పార్టీలే ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా పరిణమించాయి.

తేదీ: ఏప్రిల్ 14, 2019

‘‘నరేంద్ర మోడీ, వైసీపీలు ఎలాంటి మోసం చెయ్యకపోతే తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు వస్తాయని అనుకుంటున్నామండి… మీరేమంటారు?’’

‘‘11వ తేదీ సాయంత్రం ఈవీఎంలు మొరాయించడం వల్ల అనేక మంది ఓటర్లు ఇంటికి వెళ్లిపోతే మళ్లీ వచ్చి ఓటు వేయాల్సిందిగా ఎవరూ అడగలేదు. ఒక్క చంద్రబాబు తప్ప. విలేకరుల సమావేశం పెట్టి మరీ అందరికీ సమాచారం ఇచ్చాడండి.. అంతే ప్రజలు వచ్చేసి రాత్రి 12 గంటల వరకూ ఓట్లు వేశారు. వాళ్లంతా తెలుగుదేశం వాళ్లే. తెలుగుదేశానికి 130 రావడం ఖాయం సార్… ఏమంటారు?’’

‘‘మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సారి ఓట్లు వేశారండి… పసుపు-కుంకుమ వంటి పథకాలకు మహిళలు ఆకర్షితులై… తెల్లవారే 6 గంటలకు వచ్చి క్యూల్లో నిలబడ్డారు. చంద్రబాబుకు ప్రేమతో ఓట్లు వేశారు. ఈ సారి తెలుగుదేశం గెలవడం ఖాయమండి… ఏమంటారు సార్?’’

ఇవీ తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆలోచనలు. క్రిస్మస్ తాతలా ఎన్నో బహుమతులు ఇచ్చాడు చంద్రబాబు. ఎందుకు గెలవడు అన్నది వారి ఆలోచన. బహుమతులు ఇవ్వడమే పరిపాలన అనుకునే వారికి ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి?

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *