స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చట్టాన్ని తెస్తాం: పవన్ కళ్యాణ్

December 4, 2018 | News Of 9

Industries made mandatory on jobs to locals: Pawan | Newsof9

అనంతపురం: జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చే పెట్టే పరిశ్రమల్లో స్థానికులకు తప్పని సరిగా ఇంత శాతం ఉద్యోగాలు ఇచ్చేలా ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తెస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. స్థానికంగా నైపుణ్యం దొరక్కపోతే అన్న సమస్య రావచ్చని, అయితే, ముందుగానే నైపుణ్యాలను పెంచుకునే పని చేసి, తర్వాత ఫ్యాక్టరీ పెట్టుకునేలా చూస్తామని ఆయన అన్నారు. అనంతపురంలో పవన్ కళ్యాణ్ విద్యార్థులతో సమావేశమై.. వారి అభిప్రాయాలనూ, వారిలో గూడుకట్టుకున్న సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. రామమందిరం కట్టడానికి గొడవలు చేస్తారుగానీ, ఒక పరిశ్రమ కోసం ఉద్యమాలు ఎవరూ చేయరని, పరిస్థితులు మారాలని అన్నారు. సూట్ కేసు కంపెనీలు పెట్టి అరాచకాలు చేయడానికి తెలివితేటలు ఉపయోగిస్తారని, పట్టుమని పది ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. మా ఉద్యోగాల సంగతేమిటి అంటే, కొత్త రాష్ట్రం కదా ఆలస్యం అవుతుందని చెబుతారని, వాళ్లు డబ్బు సంపాదించుకోవడానికి మాత్రం ఏదీ అడ్డంరాదని విమర్శించారు. కియా కంపెనీ వచ్చినా, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదని ఒక విద్యార్థి చెప్పగా, కియా డీలరుషిప్పుల కోసం చూసేవాళ్లు అనంతపురం బిడ్డల ఉద్యోగాల కోసం ఎక్కడ సమయం ఉంటుందని ఎద్దేవా చేశారు.

‘‘నాతోపాటు ఒక దశాబ్దం నడవండి. మీకు మంచి భవిష్యత్తును అందిస్తాను. సమాజం పట్ల ఇది నాకున్న బాధ్యతతో చెబుతున్నా’’ అని అన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు రాకపోతే, వారిని నిస్తేజం ఆవహిస్తుందని అన్నారు. అందుకనే అవినీతికి ఆస్కారంలేని బాధ్యతగల ప్రభుత్వాన్ని స్థాపిద్దామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన నిరుద్యోగ భృతి వంటి స్కీముల గురించి విద్యార్ధులు ప్రస్తావించగా, ఇవన్నీ ఆచరణాత్మకమైనవి కాదని, ఎన్నికల్లో ఆకర్షించడానికి పెట్టిన బూటకపు స్కీములని అన్నారు.

ఒక రైతు తన బిడ్డలు రైతులు కావాలని అనుకోవడంలేదని ఒక విద్యార్థి అడిగినపుడు … ఇతర ప్రభుత్వాలు ఎస్ఈజెడ్ లు తెచ్చి రైతుల పొలాల్ని లాగేసుకున్నారని, అయితే తాము ప్రత్యేక వ్యవసాయ మండళ్లు తెచ్చి, తక్కువ తక్కువ ప్రాంతాల్లో ఎక్కువ దిగుబడి వచ్చేలా ఒక కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నామని అన్నారు. ఎవరూ ఇక్కడ నుంచి వలస వెళ్లిపోవాల్సిన అవసరం లేకుండా… సరికొత్త రాయలసీమను ఆవిష్కరిద్దామని, అందులో అనంతపురానికి ప్రధమ ప్రాధాన్యం ఇద్దామని, దీనిని ఒక ప్రత్యేకమైన జోన్ గా గుర్తించి ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే అనంతపురం సమస్య పరిష్కారానికి అవసరమైతే దీక్ష చేద్దామని అన్నారు.

ఆడపిల్లల సంరక్షణకు కూడా ప్రత్యేకమైన బలమైన చట్టాలను తెస్తామని, ఆడపిల్లల్ని ఏమైనా అంటే భవిష్యత్తులో ఉద్యోగాలు రానంత వరకూ కూడా కొత్త తరహా శిక్షలు ఉంటాయని, ఇలాంటి ఆలోచనలను చేస్తున్నామని, రేప్ చేసిన వారికి అంగాలు కత్తిరించాలని ఒక న్యాయమూర్తి అన్నారని, అసలు అక్కడ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదని, సింగపూర్ లో ఉన్నట్లు ఒక కర్రతో కొట్టడం వంటి శిక్షలు సరిపోతాయని అన్నారు. ఆడపిల్లల సంరక్షణ కోసం యాడ్స్ చేయడం, ప్రకటనలు ఇవ్వడం కాదని, చేయాల్సింది కఠినమైన చట్టాలని అన్నారు. అవన్నీ తెద్దామని జనసేన పార్టీకి అది ప్రథమ ప్రాధాన్యం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. బాధ్యతగల రాజకీయ నాయకులే.. ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నపుడు కడుపులు చేయాలి అంటూ మాట్లాడుతున్నపుడు… ప్రభుత్వాలు ఇలాగే ఉంటాయని పరోక్షంగా బాలకృష్ణ మహిళలను కించపరిచిన విషయాన్ని గుర్తుచేశారు. రోడ్డు మీద ఏదైనా జరుగుతున్నపుడు సభ్యసమాజం స్పందించదని, మనకెందుకులే అని ఊరుకుంటారని అలా చేయరాదని చెప్పారు.

మీ దగ్గరకు అభిమానులు వచ్చినా.. మీ సెక్యురిటీ వాళ్లను కూడా మీరు వారిస్తుంటారు? మీకు అంత సహనం ఎలా వచ్చింది అని అడగ్గా… ‘‘అందరూ అభిమానంతో నా దగ్గరకు వస్తారు. ప్రేమతో వచ్చిన వారిని ఎలా కొడతాం.. అది సహనం కాదు.. నా సంస్కారం’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. సహనం అందరికంటే రాయలసీమ వాసులకే ఎక్కువ ఉందని, లేకుంటే ఇక్కడున్న అరాచకాలను ఇంతకాలం మీరెలా భరిస్తున్నారని ప్రశ్నించారు. కాబట్టి, రాయలసీమకు సహనం గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

కార్యక్రమం చివరిలో… ఒక అబ్బాయి అల్లరి చేస్తున్నపుడు… పవన్ కళ్యాణ్ ఒక టీచర్ లా ఆగ్రహం వ్యక్తం చేశారు. గుద్దులాడుకుంటే… గుప్పెడు మెతుకులు దొరకవు అన్న రాయలసీమ సామెతను మర్చిపోకూడదని, ఇంకా మిగిలిన ప్రశ్నలను తనకు పంపాలని కోరారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *