జీసస్ పేదల పార్టీయా….? డబ్బున్న వాళ్ల పార్టీయా…?

January 18, 2019 | News Of 9

Is Jesus belongs to Rich parties? Or Poor parties?

                    (న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేకం)

మారే కాలాన్ని బట్టి.. అన్నీ మారిపోతాయంటారు. ఒకప్పుడు గ్రామాల్లో ఓట్లు వేయమని జమిందారు హుకుం జారీ చేసేవాడు. అంతే గ్రామం ఓట్లన్నీ దొర చెప్పిన వారికే పడేవి. తర్వాత ఇది మారిపోయింది. దొరల మాట వినే పరిస్థితి తగ్గిపోతూ వచ్చింది. తర్వాతికాలంలో.. పోలింగ్ బూత్ లపై బాంబులు వేసి ఓటర్లను భీతావహం చేసి, పార్టీలకు చెందిన గూండాలే ఓట్లను వేసేసుకునేవారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. ప్రజల్ని ఏమార్చాలి. తామే మంచివాళ్లం అని నమ్మించాలి. చంద్రబాబు అబద్ధాలు చెబుతాడని, ఆయన నాలుకపై మచ్చలు ఉంటాయని కూడా వైసీపీ అధినేత జగన్ నమ్మబలుకుతున్నారు. అయితే… సీఎం పగ్గాలు చేపట్టడానికి వైసీపీ కూడా చాపకింద నీరులా అన్ని రకాల వ్యూహాలనూ సిద్దం చేసుకుంటున్నది.

2019కి తప్పక తామే గెలుస్తామన్న ధీమా వైసీపీకి ఎక్కడ నుంచి వస్తోంది. సరే, పాదయాత్ర ద్వారా 3 వేల కిలోమీటర్లు నడిచారు కాబట్టి… జాలిపడి ఓట్లు వేస్తారన్న అంచనా కావచ్చు. కాకపోతే చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు కాబట్టి జగన్ బెటర్ అని ప్రజలు భావిస్తారన్న భరోసా కావచ్చు.  మరో ధైర్యం జగన్ క్రిస్టియన్ మతం పుచ్చుకున్న వ్యక్తికావడం వల్ల తెర వెనుక… జగన్ బావ, ప్రముఖ పాస్టరు బ్రదర్ అనిల్ కుమార్ అటు నుంచి నరుక్కువస్తున్నారు. అసలు మతాన్ని రాజకీయాల్లో తేకూడదని, మతాన్ని ఉపయోగించుకుని ప్రచారం చేయకూడదని చట్టం ఆక్రోశిస్తుంది. సరే, ఇవన్నీ మనవాళ్లు తుంగలో తొక్కేస్తారనుకోండి. మచిలీపట్నంలో ఏం జరిగిందో చూద్దాం. క్రైస్తవుల్లో బాగా ప్రాచుర్యం ఉన్న వ్యక్తి జనసేన పార్టీ తరఫున మచిలీపట్నం నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నారు. విషయం తెలుసుకున్న బ్రదర్ అనిల్ కుమార్ రంగంలోకి దిగారు. వెంటనే హైదరాబాదు రావాల్సిందిగా కబురు పెట్టారు. ఆయన వెళ్లారు. వచ్చిన తర్వాత తాను జనసేన తరఫున పోటీ చేయలేకపోతున్నానని అందరికీ చెప్పారు. ఒక వ్యక్తి పోటీ నుంచి ఎందుకు విరమించుకుంటారనేది తేలికగానే ఊహించవచ్చు.  

వైసీపీ పార్టీ వెనుక క్రైస్తవ మిషనరీలు అనేకం పని చేస్తున్నాయి. క్రైస్తవ మిషనరీలకు వచ్చే నిధుల కోసం అనేక మంది  అగ్ర కులాల వారు ఏసు క్రీస్తును ప్రార్థన చేయడం ప్రారంభించారు. కొందరు పాస్టర్లుగా మారిపోయారు. అసలు కుల వ్యవస్థే దారుణం. మనుధర్మంలో చాతుర్వర్ణ నిచ్చెన మెట్లలో మాల, మాదిగలకు చోటు లేకుండా చేశారు. వారిని అవర్ణులు అన్నారు. అంటే కులం లేనివారు అని.

 హిందూ మతం వారిని తిరస్కరిస్తే… పాశ్చాత్యదేశాల నుంచి వచ్చిన ఏసుక్రీస్తు.. క్రైస్తవం వారికి అండగా నిలిచింది. మాల మాదిగల పిల్లలకు అన్నం పెట్టింది. జబ్బు చేస్తే ఉచితంగా మందులు ఇచ్చింది. హిందువుల్లో దేవుడు దగ్గరకే మనం వెళతాం. కానీ మాల మాదిగలను వెదుక్కుంటూ ఏసుక్రీస్తు వెళ్లాడు. మాల, మాదిగ గూడేలు ఉన్న దగ్గరే చర్చిలు వెలిశాయి. అదో సామాజిక విప్లవం. వ్యక్తికి సామాజిక గుర్తింపు ఏమిటన్నది చాలా ముఖ్యం. అందుకే అంబేద్కర్ 10 లక్షల మందితో బౌద్ధం తీసుకున్నాడు. ఆనాడు అంబేద్కర్ సామాజికంగా తన స్థానం ఏమిటి అన్నది ఆయన ఆలోచించుకున్నారు. ఈ రోజున ఏ రాజకీయ నాయకుడికైనా ఈ తరహా ఆలోచన రాదు. ఎందుకంటే అనేక మంది అగ్రకులాలకు కులం పెద్ద చైనా గోడ. పెద్ద బ్యాంకు. అంబేద్కర్ కు దండలు వేసి… ఓట్లు కొట్టేద్దామని వారు ఆలోచిస్తున్నారు. ఆచరణలో అంబేద్కర్ ఆశయాలు ఎక్కడ? డబ్బున్న వాడు… వచ్చి అంబేద్కర్ కు దండ వేస్తే… ఆహా ఇది చాలు.. దండ వేశాడుగా… చాలు అన్న సంతృప్తి వస్తోంది నిమ్న వర్గాల్లో. కానీ వారికి ఏం కావాలో తెలుసా? డబ్బు. సామాన్యులకు ఏసుక్రీస్తు… ఒక దేవుడు. స్వార్థపరులకు ఏసుక్రీస్తు అంటే డబ్బు. విదేశీ నిధులు. 

 అంబేద్కర్ నీ.. హైజాక్ చేస్తున్నారు… !

 వారు క్రైస్తవాన్నీ, ఏసుక్రీస్తునూ హైజాక్ చేశారు. నాలుగు డబ్బులున్న వ్యవస్థ ఏది ఉన్నా… కమ్మ, రెడ్డి కులాలు వాటిని హైజాక్ చేసుకుంటాయి. ఫిలిప్స్ రెడ్డి అనోజార్జిరెడ్డి, జోసఫ్ తుమ్మా.. అనో పెట్టుకుంటారు. వాళ్ల  పేర్లను క్రైస్తవం వాసన ఉండేలా మార్చుకున్నారు.  పేర్ల చివరను ఉండే రెడ్డి, చౌదరి తోకలు అలానే ఉండేవి. అంటే మాల, మాదిగలకు లభించిన క్రైస్తవాన్ని లాగేసుకోవాలన్నదే అగ్రవర్ణాల దుష్ట  పన్నాగం. (294లో ఆనాడు 100 సీట్లు బీసీలకు ఇచ్చిన పేదల పార్టీని లాగేసుకునే ప్రయత్నం అగ్రవర్ణాలు పెద్ద ఎత్తున చేశాయి. సాధ్యం కాక దాన్ని పురిట్లోనే చంపేశారు).

క్రైస్తవంలో డబ్బులున్నాయి కనుకనే ఇది జరిగింది. డబ్బులు లేని మతాలనూ, డబ్బుల్లేని పార్టీలనూ, డబ్బుల్లేని మనుషులనూ ఈ సమాజం కౌగిలించుకోదు. అసహ్యించుకుంటుంది. డబ్బుంటే గుణగణాలతో సంబంధం లేదు. కేఏ పాల్ దగ్గరకు చాలా మంది వెళుతుంటారు. ఎందుకు? పాల్ ముఖం బాగుంటుందో లేక ఆయన చెప్పే కబుర్లు బాగుంటాయనో కాదు. ఆయన దగ్గర డబ్బు ఉంది. నాలుగు కట్టలు మన ముఖాన విసరకపోతాడా అని. బ్రదర్ అనిల్ కుమార్ పిలిస్తే పరుగులు తీస్తారు జనం. ఎందుకు? లక్షల కోట్లున్న జగన్ కు ఆయన స్వయంగా బావ. ఖరీదైన పాస్టరు గారు.

 ఇందులో వారికి ఏసుక్రీస్తు మీద ఉండే భక్తికన్నా.. డబ్బుమీదున్న ప్రేమ ఎక్కువ.

 అగ్రకులాలకు చెందిన పాస్టర్లు… క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న దన్నును ఆసరాగా చేసుకుని… పెంతుకోస్తు శాఖను పూర్తిగా వ్యాపారంగా మార్చేశారు. ఒక ముస్లిం.. క్రైస్తవాన్ని తీసుకున్నాడు. మీరు క్రైస్తవం ఎందుకు తీసుకున్నారు అని అడిగాను. ఆయన బ్యాంకు అక్కౌంటులో నెలకు లక్ష రూపాయలు పడుతున్నాయని చెప్పాడు. ఎవరు వేస్తున్నారు అని అడిగాను. ఏమోనండి. జీసస్ ను నమ్ముకున్నా. అంతే. అంతకు ముందు నా దగ్గర రూపాయి లేదు అని చెప్పాడు. అనంతపురం నుంచి అతను ప్రతి వారం ప్రేయర్ కోసం హైదరాబాద్ వస్తాడు. నన్ను కూడా మతం తీసుకోమన్నాడు. కలిసి వస్తుందని అన్నాడు. ఏసుక్రీస్తు నాకు చిన్నతనంలోనే పరిచయం. నా దళిత స్నేహితులతో కలిసి చర్చికి వెళ్లేవాడిని. దేవుడిని డబ్బుతోనో, వ్యాపారంగానో చూడటం అంటే సమాజాన్ని మోసం చేయడమే. ఎక్కడో దోపిడీ జరుగుతూ ఉంటుంది. మతం మార్చడం కంటే ఇది పెద్ద ఘోరమైన నేరం.

 పూర్వం పెంతుకోస్తు ప్రార్థనలకు వెళ్లడం తెలుసు. కన్నీటి ప్రార్థన చేయడం తెలుసు. ఇపుడు పెంతుకోస్తు ప్రార్థన భక్తి అనే పరిధిని దాటిపోయింది. పాటలూ… టెలివిజన్ స్క్రీన్లు… అదో పెద్ద అట్టహాసం. సరే, ఎవరికీ హానికారం కాకుండా ఉంటే… ఎవరో డబ్బులు ఇస్తుంటారు. ఎక్కడ నుంచో నిధులు వస్తుంటాయి. కానీ ఈ డబ్బుల్ని రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తేనే అభ్యంతరం.

మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయినా… ఆయన్ను క్రైస్తవుడిగా ప్రపంచం ఎలా చూస్తుంది? బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణుడని చెప్పారు. ఏసుక్రీస్తు దేవ దేవుడు. ఆయన్ని ఎవరైనా కొలుచుకోవచ్చు కదా. తప్పేం ఉంది అంటే తప్పులేదనే చెప్పవచ్చు. కేవలం సీఎం కావడం కోసం 3 వేల కిలోమీటర్లు నడవడం, ఇందుకోసం తన వెనుక ఉన్న పాస్టర్లను ఉపయోగించడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించడం అనవసరం. ప్రేమ మయుడైన ఏసుక్రీస్తు ప్రవక్తగా ఉన్నవారు ‘‘చంపుతాం?’’ అని బెదిరించారు. మాకు తెలిసిన ఏసు ప్రభువు అయితే ఇలాంటి వాటిని అంగీకరిస్తారా? మనుషులు చేసిన పాపాలకు ఏసుక్రీస్తు తన ప్రాణాలను త్యాగం చేశారు. అదే క్రీస్తు ప్రవక్తగా ఉండి తప్పులు చేయడం, డబ్బులు చేసుకోవడం, రౌడీయిజం చేయడం… మరి రేపు ఏం కానున్నది?

యేసయ్య కూడా బెంజి కార్లలో తిరిగే వారితోనే ఉంటాను.. మీ దగ్గరేం ఉంది. వాళ్లకు కార్లు, బంగళాలు అన్నీ ఉన్నాయి. వారినెలా కాదంటాను. నేను పేదల పక్షం కాదని ఏసుక్రీస్తు నాతో అంటున్నాడు. మరి ఏసుక్రీస్తు ఎవరి పక్షం అనుకోవాలి.  సీఎం కుర్చీ కోసం.. ఏసుక్రీస్తును కూడా ఓట్లుగా మార్చుకున్నపుడు యేసయ్య సహకరిస్తున్నాడని బయటకు చెబితే.. ఏసు క్రీస్తుపై అలుగుతాను. ఆయన కూడా డబ్బున్న వాళ్ల పక్షాన్ని చేరాడని అంటాను. అంతా డబ్బు, ఓట్లు అన్నింటినీ నిర్ణయిస్తున్నాయి. ఏసుక్రీస్తునే హైజాక్ చేసినపుడు మనమెంత?

 

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *