మంగళగిరిలో వామపక్షాలపై చినబాబు కన్ను?

March 16, 2019 | News Of 9

                (న్యూస్ ఆఫ్ 9)

చినబాబు మొత్తానికీ మంగళగిరి నుంచి పోటీ చేయడానికి రెడీ అయిపోయారు. రెండు రోజుల కిందట మంగళగిరిలో పర్యటించి ఆత్మీయ సమావేశాన్ని కూడా నిర్వహించి… ముద్దుగా ప్రసంగించి స్థానిక తెలుగుదేశం నేతల్ని మురిపించారు కూడా. మంగళగిరి కమ్యూనిస్టుల ఖిల్లా. ఇక్కడ నుంచి గెలవగలనని చినబాబు ధైర్యం ఏమిటో..? చైయెత్తి జైకొట్టు తెలుగోడా పాట రాసిన సీపీఐ నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణ అంతటి నేత ఇక్కడ నుంచి రెండు సార్లు గెలిచారు. తెలుగుదేశం హయాంలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు కూడా ఇక్కడ నుంచి రెండుసార్లు గెలుపొందారు. కాంగ్రెసు కూడా ఆరు పర్యాయాలు గెలిచింది. 3 సార్లు సీపీఐ, ఒకసారి సీపీఎం విజయం సాధించింది. 2014లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. తెలుగుదేశం పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్న వైఎస్సాఆర్ కాంగ్రెసు నేతల్లో ఆళ్ల ముందున్నారు. అనేక కోర్టు కేసుల్ని దిగ్విజయంగా వాళ్లపై నడిపిస్తున్నారు.

చినబాబు వచ్చీరావడంతోనే మంగళగిరిని ‘‘గచ్చీబౌలీ’’ చేసేస్తానంటూ ఒక పెద్ద అస్త్రాన్ని ప్రయోగించారు.

మంగళగిరి నేత వస్త్రాలకు ప్రసిద్ధి అన్న విషయం చినబాబు లోకేష్ కు తెలిసినట్లు లేదు. దాన్ని గచ్చిబౌలిగా మార్చేస్తే… నేతన్నలకు ముప్పు తప్పదు. గచ్చిబౌలి చేయడం అంటే ఏం లేదు… విదేశీ కార్పొరేట్లకు ప్రభుత్వ స్థలాల్ని విక్రయించడమే. అంటే రియల్ ఎస్టేట్ అన్నమాట.

కమ్యూనిస్టుల సాయం లేనిదే… చినబాబు గట్టెక్కడం కష్టం. మరి ఈ సారి ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ జనసేనతో కలిసి పని చేస్తున్నందున తెలుగుదేశం పార్టీకి అవి ఓటేసే అవకాశం లేదు. దీంతో కమ్యూనిస్టుల ఓట్ల కోసం తెరచాటు ప్రయత్నాలు చేసుకునేందుకు చినబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇది కూడా ఒక ధైర్యం కావచ్చు. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని 2014లో ఎలాగో గట్టెక్కారుగానీ.. 2019 మాత్రం తెలుగుదేశం పార్టీకి గెలుపు నల్లేరుపై నడక ఎంత మాత్రం కాదు. కమ్యూనిస్టుల మద్దతు ఉంటేగానీ.. ఇక్కడ గెలవడం కష్టం. అందుకే.. కమ్యూనిస్టులకు ఎలా గేలం వేయాలా ఆయన ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *