అధికారమే లక్ష్యంగా టీడీపీ పెట్టుబడిదారుల పావులు…?

May 15, 2019 | News Of 9

Chandrababu | telugu.newsof9.com

  • రాష్ట్రంలో ఓడినా… అక్కడ జాక్ పాట్ కొట్టాలి
  • బాబు పీఎం అయితే… ఇక్కడ జగన్ ఉన్నా ఫర్వాలేదు
  • సీబీఐ, ఈడీ అన్నీ తమ చేతికి వస్తే ఏమైనా చేసుకోవచ్చు
  • కోస్తా పెట్టుబడిదారుల ఆకాంక్షలు, ఆలోచనలు ఇవే
  • ఏపీ రాజధాని సొమ్ముల నియంత్రణే పరమావధి
  • భాజపా వచ్చినా మోడీ రాకపోతే చాలన్న ధోరణి
  • ఆధిపత్యపోరులో… బాబు గెలిచేనా?
  • అక్కడా, ఇక్కడా రాకపోతే… శంకరగిరిమాన్యాలే  

(న్యూస్ ఆఫ్ 9)

రేపు తెలుగుదేశం పార్టీకి ఏపీ ప్రజలు అధికారాన్ని తిరస్కరిస్తే… తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం మొదటి నుంచీ చెబుతున్నట్లుగానే… అధికారానికి దూరంగా ఉండటానికి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితిల్లో మానసికంగా సిద్ధంగా ఉండదు. దీనికి కారణం… పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న పెట్టుబడిదారులు చాలా నష్టపోయారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి చంద్రబాబు సుజనా చౌదరి, నారాయణ వంటి పెట్టుబడిదారులపై పూర్తిగా ఆధారపడి పార్టీని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. 2014లో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ బాగానే (ఆర్ధికంగా) తెరిపిన పడింది. రాజధాని నిర్మాణం పేరుతో ఆర్ధికంగా నిలదొక్కుకున్నా… కేంద్రంలో నరేంద్ర మోడీ ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారవడం తెలుగుదేశం పార్టీని నిద్రపట్టనివ్వలేదు. ఫలితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెసుతో చేతులు కలపడం ద్వారా చాలా వరకూ ఆ పార్టీ ఊపిరిపీల్చుకుంది. తెలుగుదేశం పార్టీకీ, ఆ పార్టీకి చెందిన పెట్టుబడిదారులపై ఉక్కుపాదం మోపుతూ… వారికి చెక్ చెప్పేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలు బాగానే ఫలించాయి. పోలింగ్ ప్రక్రియను సాగదీయడంతోపాటు ఎన్నికల కమిషన్ రూపంలో రాష్ట్ర పరిపాలనను పరోక్షంగా నియంత్రణలోకి తెచ్చుకోవడం ద్వారా మోడీ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా టీడీపీ పదవీకాలం ముగుస్తున్న దశలో భారీ చెల్లింపులకు కేంద్రం బాగానే చెక్ పెట్టింది. సీఎస్ ను మార్చడం ద్వారా చంద్రబాబుకు కేంద్రం ఏ విధంగా చెక్ పెట్టిందీ మనం రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకీ, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులకు మింగుడుపడనివే. మరి టీడీపీ, అనుబంధ పచ్చ పెట్టుబడిదారులు ఈ పరిణామాలను చూస్తూ అయితే ఊరుకోరుగా? రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు పదే పదే చెప్పడానికి కారణం… తాను ఓడిపోతున్నట్లు స్పష్టంగా తనకు తెలుసునని, పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం రాకుండా పదే పదే ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. లోలోన తెలుగుదేశం పార్టీ ఎక్కడ నుంచీ ధైర్యాన్ని తెచ్చుకుంటున్నది? ఒకే ఒక ఆశ దానికి ఉంది. రాష్ట్రంలో పార్టీ పనితీరు పేలవంగా ఉన్నా, అధికారంలోకి రాకపోయినా కేంద్రంలో మాత్రం చక్రం తిప్పడం ద్వారా ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రధాని పదవిని చేపట్టాలన్నదే చంద్రబాబు ఆలోచన. కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ రాని పక్షంలో… మిత్ర పక్షాలు తనకు సహకరించవచ్చన్నది ఆయన ఆలోచనగా తప్పక ఉండి ఉంటుంది. అయితే కేంద్రంలోగానీ, లేదా రాష్ట్రంలోగానీ తెలుగుదేశం అధికారంలో లేకపోతే 2004, 2009 నాటి పరిస్థితులు తెలుగుదేశం విషయంలో పునరావృతం అవుతాయి. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినా, కేంద్రంలో అధికారంలో ఉంటే, తెలుగుదేశం పార్టీకిగానీ, ఆ పార్టీతో ఉన్న ఆధిపత్య వర్గాల ఆకాంక్షలకు వచ్చిన ఇబ్బంది ఉండదు. మళ్లీ… కాంట్రాక్టుల్ని చేజిక్కించుకోవచ్చు. ఎలాగూ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల సీబీఐ, ఐటీ, ఈడీ వంటి శాఖలన్నీ తమ చేతిలోనే ఉంటాయి. ప్రజాస్వామ్యం మూడు పువ్వులూ, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది (ఆయన కళ్లతో చూడండి).

కేంద్రంలో మొన్నటి వరకూ.. వెంకయ్య నాయుడు ఆశీస్సులు ఉండేవి. ఇపుడు ఈ పరిస్థితి లేదు. కేంద్రంలో తమకు ఇపుడు పెద్ద దిక్కు లేకపోవడం, రాష్ట్రంలో బలహీనపడటం వంటివన్నీ కోస్తా పెట్టుబడిదారులకు నిద్రలేని కాళరాత్రులను మిగిల్చేవే. అందుకే ముందు నుంచీ కేంద్ర సంస్థలపై చంద్రబాబు నిప్పులు కక్కుతున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ గొంతెత్తి అరుస్తున్నారు. కేంద్రంలో ఒక వేళ భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే… అప్పుడు చంద్రబాబు వ్యూహం ఎలా ఉంటుంది? నరేంద్ర మోడీ కాకుండా ప్రధానిగా ఏ నితిన్ గడ్కరీనో తెరపైకి తేవడానికి పావులు కదుపుతారు. నరేంద్రమోడీ మళ్లీ ప్రధాని కాకుండా మాత్రం చంద్రబాబు పూర్తిస్థాయిలో అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకరిపైన ఆధారపడటం ఇష్టంలేకనే స్వయంగా ఆయన ప్రధాని కావాలని భావిస్తుండవచ్చు. రాష్ట్రంలో బలహీనపడిపోవడం కూడా ప్రధాని పదవిపై చంద్రబాబు దృష్టిసారించి ఉంటారన్నది నిజం. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సహకరించవచ్చు. ఉప ప్రధాని పదవి ఇచ్చే పక్షంలో ఆయన చంద్రబాబుకు సహకరిస్తారని చెప్పవచ్చు. వారిద్దరి మధ్యా ప్రజలు అనుకుంటున్నట్లు శాశ్వతమైన శత్రుత్వమేమీ లేదు. కేంద్రంలో నరేంద్రమోడీ మళ్లీ ప్రధాని అయి, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారానికి దూరమైతే మాత్రం… తెలుగుదేశం పార్టీ ప్రాభవం మరోసారి తగ్గిపోతుంది. ఇందువల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏమీ ఉండదుగానీ… ఎక్కువ నష్టపోయేది మాత్రం కోస్తా పెట్టుబడిదారీ వర్గాలు. ఎండాకాలం రాకముందే నీళ్లున్న చోటుకు తరలిపోయే సుమతి అనే చేపలా… కోస్తా పెట్టుబడిదారులు ఇప్పటికే ఒక కాలు తీసి… వైసీపీలో పెట్టారు. కర్మకాలిపోయి (వారి ఆలోచనల ప్రకారం) జగన్ సీఎం అయితే… తమ డబ్బు సంపాదనకు ఇబ్బందిలేకుండా ఉంటుందన్నది వారి ఆలోచన.

ఎవరు అధికారంలోకి వస్తారన్నది నూరుశాతం ఎవరూ చెప్పలేని పరిస్థితి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉంది. జనసేన అధికారంలోకి వస్తే… పేదోళ్ల రాజ్యం వచ్చినట్లే అవుతుంది. అప్పుడు ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఉన్న మార్గాలన్నీ మూసుకుపోతాయి. కేంద్రంలో కాలం కలిసివచ్చి కుమారి మాయావతి ప్రధాని అయితే జనసేనకు మంచి ఊపు వస్తుంది. రాష్ట్రానికీ మంచి జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కలిసిపోతుంది. మేమే అధికారంలోకి వస్తామంటూ చంద్రబాబు చెబుతున్నది మేకపోతు గాంభీర్యం కాదనుకుంటే.. ఒకటి మాత్రం నిజం. సేవామిత్ర వంటి సాంకేతికతను ఉపయోగించి ఆయన చాలా మంది ఓట్లను జాబితాల నుంచి తొలగించారు. కొంతమంది అష్టకష్టాలూ పడి మళ్లీ ఓటర్లుగా నమోదు చేసుకున్నా… కొంతమంది చేసుకుని ఉండకపోవచ్చు. చాలా ప్రాంతాల్లో వైసీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లను జాబితాల నుంచి టెక్నోసావీ బాబు తీసివేయించారు. ఈ నెపాన్ని ఆయన వైసీపీపై నెట్టేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా ఆయనకు కలిసివచ్చే అంశం ఇది. రెండోది పసుపు-కుంకుమ లాభించి ఉంటుదన్నది మరో అంశం. రాష్ట్రంలో టీడీపీ ఓడిపోతే… మోడీ ఎన్నికలను రిగ్గింగ్ చేశారని, ఈవీఎంలపై తాను అందుకే మొదటి నుంచీ యుద్ధం చేస్తున్నానని చెప్పి, నైతికంగా గెలుపు తనదే అని ప్రకటించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రజల తీర్పును తాము శిరసావహిస్తున్నామని చంద్రబాబు తన జీవితంలో ఒక్కసారి కూడా చెప్పిన పాపాన పోలేదు. నియంతల ఆలోచనలు ఇలాగే ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. ఈ దేశాన్నీ, అవసరమైతే ఈ భూమండలాన్ని పాలించే అర్హత తమకు మాత్రమే ఉందనిదేవుడు తమను పుట్టించింది ప్రజల్ని పాలించడానికే అని భావించడం తెలుగుదేశం పార్టీకీ, ఆ పార్టీ నేతలకూ, ఆ పార్టీ వెనుక ఉన్న తాబేదార్లకు గట్టి నమ్మకం. చూద్దాం ఏమవుతుందో…!!

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *