జనసేన తప్ప మాకు మరో మార్గం లేదు: రావెల

December 1, 2018 | News Of 9

You are the only hope for us: Ex minister Ravela Kishore babu | Newsof9

  • మీలో మాకు అంబేద్కర్, పెరియార్ కనిపిస్తున్నారు
  • దళిత యువకులు మీవైపు చూస్తున్నారు…
  • జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి
  • రావెలను మనస్ఫూర్తిగా ఆహ్వానించిన పవన్
  • ఆయనకు మంత్రి పదవీ ఇస్తాం… అధికారం కూడా ఇస్తాం
  • పెద్ద ఎత్తున హాజరైన రావెల కిషోర్ బాబు అనుచరులు

(అమరావతి, న్యూస్ ఆఫ్ 9)

‘‘గుండెల్లో ఎక్కడో ఆ బాధ గుచ్చుకుంటున్నది. పదవి అయితే ఇచ్చారు, కానీ అధికారాన్ని వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు. చెప్పుకోలేని బాధ.. సంఘర్షణ. అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలని నిరంతరం తపన పడుతున్నా… కానీ సాధ్యం కావడం లేదు. నా నియోజక వర్గంలో కూడా వాళ్లే పెత్తనం చేస్తున్నారు. మరి నేనున్నది ఎందుకు…?’’

                                       -మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పిన మాటలు నూరుపాళ్లూ నిజం. ఇలా కక్కలేక మింగలేక తెలుగుదేశంలోనే కాలం గడుపున్నవారు అనేక మంది ఉంటారు. మొన్న ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నిండు సభలో అవమానకరంగా మాట్లాడారు. ‘‘ఏం మా వాళ్లు (సొంత సామాజిక వర్గం) వస్తే గౌరవించడం లేదంట.. వాళ్లు చెబితే పనులు చేయడం లేదంట. గర్వం పనికిరాదు. మోడీ కూడా ఇలాంటి గర్వంతోనే పోయాడు’’- ఇదీ చంద్రబాబు మాట్లాడిన తీరు. బయటకు అంతా బాగుంది అని మీడియాలో బాబు ఎప్పుడూ చెబుతారు. అంతరాంతరాల్లో ఈ సమాజంలో ఇంకా కుల వ్యతిరేకత వేళ్లూనుకునే ఉంది. ‘‘పదవులు ఇస్తారు… కానీ అధికారం ఇవ్వరు’’ ఇదే నేడు పాలకవర్గాలు చేస్తున్నది. ఈ పరిస్థితి మారాలి. అందుకే రావెల కిషోర్ బాబు జనసేన పార్టీని ఎంచుకున్నారు. ఎందుకు మీరు జనసేనలో చేరుతున్నారు అని అడిగిన విలేకరికి చక్కగా సమాధానం చెప్పారు. దళిత బహుజనులకు పదవులు ఇస్తున్నారు.. అధికారం ఇవ్వడం లేదు అన్నారు. ఈ ముక్క చాలు తెలుగుదేశం పార్టీ ఎలాంటి అహంకారంతో ఉందో చెప్పడానికి.

జనసేన పార్టీలో చేరుతూ రావెల ఇలా అన్నారు: ‘‘నిట్టనిలువునా చీలిపోయిన ఈ సమాజాన్ని మార్చడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారు. ఆయన లక్ష్యాలను చూస్తే ఒక అంబేద్కర్, ఒక కాన్షీరాం, ఒక పెరియార్ గుర్తుకొస్తున్నారు. మాకు జనసేన తప్ప మరో మార్గంలేదు. అందుకే జనసేన ద్వారా సమసమాజ స్థాపనకు నా వంతు కృషి చేస్తాను’’ అని చెప్పారు. రావెల చాలా చక్కగా చెప్పారు. ఆత్మాభిమానాన్ని కోల్పోయిన మనిషీ, జాతీ అంతరించిపోతాయన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మాటల్ని గుర్తు చేశారు.

రావెల కిషోర్ బాబునీ, ఆయన అనుచరులనూ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే… పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి పార్టీలోకి వస్తున్నందుకు ఆయన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు పవన్.
ఆయన మంత్రి అవుతారు…

జనసేన ప్రభుత్వం రాగానే రావెల కిషోర్ ను మంత్రి అవుతారని, వారికి పదవితోపాటు అధికారాన్ని కూడా ఇస్తామని పవన్ స్పష్టం చేశారు. సమసమాజ స్థాపన దిశగా అందరూ కలిసి నడుద్దామని అన్నారు. చంద్రబాబుగానీ, లోకేష్ గానీ, తెలుగుదేశం ప్రభుత్వంగానీ ఇలాంటి లక్ష్యాలను సాధించలేదని అన్నారు. కులాల్ని ఎగదోసి, రెండు కుటుంబాల చేతిలోనే రాజ్యాధికారం ఉండిపోయిందని, ఇదే కొనసాగితే ఉద్యమాలు వస్తాయని, అభివృద్ధి కుంటుపడుతుందని, అందరికీ సమాన అవకాశాలు అందాలని, అందుకోసం అందరం కలిసి పని చేయాలని, అందరం కలిసి ప్రయాణం చేద్దామని అన్నారు. గిరిజన నేత బాలరాజు, నాదెండ్ల మనోహర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *