జనసేనుడి… మేనిఫెస్టోకి హ్యూమన్ టచ్….!!

March 14, 2019 | News Of 9

 • రైతులు భూములిస్తే… పరిశ్రమల్లో వారికి వాటా
 • అందరికీ అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ పేరతో ఉచిత క్యాంటీన్లు
 • రైతుకు ఏటా రూ.8 వేల సాయం, వీలైతే రూ.10 వేలు
 • లక్షల ఉద్యోగాలను సృష్టించడం ద్వారా అసమానతల తొలగింపు
 • మాలమాదిగలను కూర్చోబెట్టి విభేదాల పరిష్కారం
 • పేద విద్యార్ధుల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేద్దాం
 • పాక్ పై కాదు.. నిరుద్యోగంపై యుద్ధం ప్రకటిద్దాం

                        (న్యూస్ ఆఫ్ 9)

గోదావరి తీరం…జన సైనికులతో పులకించింది. రాజమహేంద్రవరం ఇసుక వేస్తే రాలనంతగా జన సైనికుల ప్రవాహంతో కళకళలాడింది. 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రజలతో జనసేన 5వ ఆవిర్భావ సభకు ‘‘మేమున్నాం.. మీతో’’… అన్నట్లుగా సరికొత్త రాజకీయ మార్పునకు నాందీవాచకం పలికింది. సరిగ్గా 26 రోజుల్లో పెట్టుబడిదారీ పార్టీల మాయ మాటలకు స్వస్తి పలుకుదాం అన్నట్లు జన శ్రేణులు సభాస్థలిని ముంచెత్తారు. ఈ సందర్భంగా… జనసేన అధ్యక్షుడు పవన్  కళ్యాణ్ పార్టీ మ్యానిఫెస్టోని ప్రజల ముందు ఉంచారు.

రకరకాల తరగతులుగా ప్రజలు విడిపోయి, వైషమ్యాలు పెరిగిపోతున్న దశలో… రిజర్వేషన్లు కావాలని ఒకరు, వద్దు అని మరిఒకరు విడిపోతున్న దశలో.. అందరికీ సమానావకాశాలను కల్పిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. లక్ష ఉద్యోగాలు అవసరమైన చోట, పది లక్షల ఉద్యోగాలను సృష్టించడం ద్వారా సమానత్వాన్ని సాధించవచ్చన్న సరికొత్త సామాజిక సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అవకాశాలు అందక బడుగు బలహీన వర్గాలు బాధపడుతుంటే, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నలిగిపోతున్నారని జనసేన గుర్తించింది. యువత ఏ ఉద్యోగంలో చేరాలోనని మధనపడాలికానీ, ఉద్యోగంలేదని బాధపడరాదని చెప్పింది. జనసేన ప్రభుత్వం రాగానే ప్రభుత్వంలోని భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని అన్నారు.

రాజకీయ పార్టీలు బీసీలకు సదస్సులు పెడతాయని, తాము అలాంటివాటికి వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ అన్నారు. మొన్న జనసేన టిక్కెట్లు ఇచ్చినపుడు.. బీసీలకు న్యాయం చేశామని అన్నారు. వైసీపీ కడప, లేదా పులివెందుల టిక్కెట్లను బీసీలకు ఇవ్వగలదా అని ప్రశ్నించారు. కులాల ఐక్యత అంటే ఇదేనని చెప్పారు. ప్రజలందరూ ఒక భావజాలంతో ఉండాలని అన్నారు. అంబేద్కర్, గాంధీలకు దండలు వేసి… దోపిడీలు చేస్తున్నారని, నిజానికి వారంతా యాంటీ గాంధీ, యాంటీ అంబేద్కర్లు అని ప్రస్తుత పాలకుల ద్వంద్వనీతిని పవన్ కళ్యాణ్ ఎత్తి చూపించారు. ప్రజల ఆస్తికి ధర్మకర్తగా ఉండటం అంటే ఇదా అని ప్రశ్నించారు. ఈ ఆవేదన మీ అందరిలో ఉందని, అందుకే అదే తన సిద్ధాంతం అయిందని వెల్లడించారు.

రైతుల భూములు తీసుకుని అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే… రైతులకు అందులో భాగస్వామ్యం కల్పిస్తామని ఇది జనసేన రైతన్నలకు చేయబోతున్న న్యాయమని పవన్ కళ్యాణ్ అన్నారు. రైతు ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేసుకునేందుకు వీలుగా గ్లోబల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉత్పత్తుల నిల్వకు గోదాములు, కోల్డ్ స్టోరేజీలు అన్నీ ఉంటాయన్నారు. రైతులకు సోలార్ విద్యుత్తుతో నడిచే మోటార్లను ఉచితంగా జనసేన ప్రభుత్వం అందిస్తుందన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఒకటవ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకూ… ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. అలాగే విద్యార్ధులందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. పార్టీలకు సంబంధించిన వారిపేర్లతో కాకుండా డొక్కా సీతమ్మ పేరుతో విద్యార్ధులకు ఉచిత క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విద్యార్ధులకు కామన్ స్కూల్ వ్యవస్థను తెస్తామన్నారు.

విద్యార్ధుల నుంచే యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు ఇంక్యుబేషన్ సెంటర్లను పెడతామన్నారు. యువత కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామన్నారు. యువత కోసం ప్రతి జిల్లాలో 3 ఆపర్చునిటీ జోన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ప్రజలందరికీ 10 లక్షల చొప్పున ఉచిత వైద్యం కోసం బీమాను అందిస్తామన్నారు. ఆరోగ్య బడ్జెట్టును రెట్టింపు చేస్తామన్నారు. అన్నిచోట్లా ఆస్పత్రులను కట్టిస్తామని అన్నారు.

ఫుట్ పాత్ లపైన వ్యాపారాలు చేసుకునే వారికి చట్టపరమైన అనుమతులు ఇవ్వడంతోపాటు వారికి రూ.5 వేల చొప్పున రుణాలను అందిస్తామన్నారు. బీసీలకు 5 శాతం రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు రిజర్వేషన్ల అంశాలను ముందుకు తీసుకెళతామన్నారు. ఎస్సీల్లో ఉన్నవారికి ఒక చోటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ముస్లింల కోసం సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామన్నారు. మత్స్యకారుల గ్రామాలకు ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో మంచినీటి సౌకర్యం, అలాగే వారికి జెట్టీలు, మరపడవల్ని అందించడం వంటివి చేస్తామని మ్యానిఫెస్టోలో ఉంచామని చెప్పారు.

మహిళలకు సంక్రాంతి పండగకు చీరలు, బహుమతులు ఇచ్చి ఆడపడుచులుగా గౌరవించుకుంటామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తామన్నారు. రెల్లి కులస్థులకు వడ్డీ లేకుండా రూ.50 వేల రుణాలు ఇస్తామని అన్నారు. 50 శాతం సబ్సిడీపైన ఆటోరిక్షాలు, రెల్లి ఆడపడుచులకు ఉచితంగా స్కూటర్లు ఇస్తామని అన్నారు.

డబ్బుతో సంబంధంలేని రాజకీయాల కోసమే జనసేన ఉందని, డబ్బుతో ఓట్లను కొనకూడదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘‘మనం కూడా యుద్ధం చేద్దాం.. కానీ మనం నిరుద్యోగంపై యుద్ధం చేద్దాం. పాకిస్థానుపై కాదు’’ అంటూ ఒకవైపు యువతను ఆకర్షిస్తూనే మరోవైపు భాజపాకు కూడా చురక అంటించారు.

ముఖ్యమైన అంశాలు:

 • రైతులకు ఎకరానికి రూ.8వేలు సాగు సాయం
 • రైతు రక్షణ భరోసా కింద 60ఏళ్లు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.5వేలు పెన్షన్
 • ప్రభుత్వ నిర్ణయాలతో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం
 • పరిశ్రమలకు భూములు ఇచ్చేవారికి అందులో భాగస్వామ్యం
 • ప్రతి మండలంలో శీతల కేంద్రాలు
 • ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్లు
 • ప్రతి జిల్లాలో నదుల అనుసంధానం
 • కొత్త రిజర్వాయర్ల నిర్మాణం
 • 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య
 • డొక్కా సీతమ్మ క్యాంటీన్లు (విద్యార్థులకు ఉచితంగా తిండి)
 • కులాలకు అతీతంగా అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఫీజు చెల్లింపు
 • చిరు వ్యాపారులకు రూ.5వేల రుణ సాయం(పావలా వడ్డీతో)
 • ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు
 • బీసీలకు 5శాతం రాజకీయ రిజర్వేషన్లు
 • కాపులకు రిజర్వేషన్లు
 • సామరస్యపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ
 • అన్ని కులాలకు కలిపి హాస్టల్స్
 • ఆరోగ్య రంగానికి బడ్జెట్ రెండింతలు
 • సచార్ కమిటీ సిఫార్సులు అమలు
 • విద్యార్థులకు ఉచిత భోజనం, రవాణ సౌకర్యం
 • ఏడాదికి 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం
 • ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్య బీమా
 • ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రులు

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *