15న ప్రతిష్ఠాత్మకంగా జనసేన కవాతు, ప్రవాస గర్జన

December 9, 2018 | News Of 9
  •  మధ్యాహ్నం కవాతు, సాయంత్రం సభ
  •  1000 కార్లతో భారీ ర్యాలీ
  •  10 వేల మంది హాజరుకానున్నట్లు అంచనా
  •  వేదికగా టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ
  •  సర్వత్రా నెలకొన్న ఆసక్తి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… అమెరికా దేశంలోనూ జనసేన ప్రభంజనం సృష్టిస్తోంది. ఓ సరికొత్త మార్పు కోసం జన సేనాని చేస్తున్న ప్రయత్నాలకు ‘మేము సైతం’ అంటూ ఎన్నారైలు ముందుకొస్తున్నారు. ఇటీవల సియాటెల్ లో నిర్వహించిన జన సైనికుల సమావేశం విజయవంతం అయింది. ఏపీలో జనసేనకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా వారు అనుక్షణం తెలుసుకుంటున్నారు. జనసేన కార్యక్రమాలను లైవ్ లో చూసి తెలుసుకుంటున్నారు. తిత్లీ తుపాను సందర్భంలో జనసేన తరఫున ఎన్నారైలు బాధితులకు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పిలుపును అందుకున్న ఎన్నారైలు వంట సరుకులను లారీల్లో పంపించి బాధితులను ఆదుకున్నారు. ఈ నెల 15న డల్లాస్ లో జనసేన కవాతు, జనసేన ప్రవాస గర్జన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
భారీస్థాయిలో ప్రవాస గర్జన
డల్లాస్ లోని టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ లో ఈ నెల 15న జనసేన ప్రవాస గర్జనను నిర్వహించడానికి జనసేన ఎన్నారైలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  హాజరుకానున్న ఈ ప్రవాస గర్జనపై సర్వత్రా ఆసక్తి నెలకుని ఉంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రవాస గర్జనకు 3 వేల మంది విద్యార్ధులతో సహా మొత్తం 10,000 మంది జన సైనికులు హాజరు కానున్నట్లు సమాచారం. జనసేన ప్రవాస గర్జన, జనసేన కవాతు కార్యక్రమాలపైనే ఎన్నారైలు దృష్టి కేంద్రీకరించారు. జన సేనాని అమెరికా రాక కోసం వారంతా ఎదురు చూస్తున్నారు.
1000 కార్లతో ర్యాలీ
15న థామస్ జెఫర్సన్ పార్కు వద్ద  భారీ కవాతు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ వరకూ 1000 కార్లతో ర్యాలీ నిర్వహిస్తారు. దీనికి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సాయంత్రం జనసేన ప్రవాస గర్జన జరుగుతుంది. జనసేన ఎన్నారై విభాగం కవాతు, గర్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. డల్లాస్ లోని ఇర్వింగ్ అనే ప్రాంతంలో ఉన్న ఈ టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ కి చాలా మంచి పేరుంది. పెద్ద పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్స్ ఇక్కడ జరుగుతుంటాయి.
జనశ్రేణుల్లో ఆనందోత్సాహాలు
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద జరిగిన కవాతు, అలాగే కరువు సీమ అనంతపురంలో జరిగిన కవాతు సూపర్ సక్సెస్ కావడంతో అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు సంతోషంతో ఉన్నారు. జనసేన పార్టీ ఇటీవల ప్రారంభించిన జనసేన తరంగం కూడా విజయవంతంగా ప్రజల్లోకి వెళ్లిపోవడం, ఈ తరంగం కార్యక్రమాల్లో స్వయంగా జనసేనాని పాల్గొనడం, అన్ని చోట్ల నుంచీ సానుకూల ఫలితాలు రావడం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది. డల్లాస్ లో జరిగే జనసేన కార్యక్రమాలకు నాదెండ్ల మనోహర్, రావెల్ కిషోర్ బాబు, పసుపులేటి హరిప్రసాద్, ముత్తంశెట్టి కృష్ణారావు తదితరులు హాజరుకావచ్చని తెలుస్తోంది.
Janasena Pravaasa Garjana ready to create waves in Dallas
గర్జనలో సౌత్ ఇండియా ఆలోచనలు
పార్టీ సిద్ధాంతాలూ, ఆలోచనలను ఎన్నారై జన సైనికులతో జనసేనాని పంచుకునే అవకాశం ఉంది. అలాగే ఇటీవల చెన్నైలో నిర్వహించిన పత్రికా సమావేశం గురించి కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశ స్థాయిలో జనసేన ఎలాంటి పాత్రను పోషించబోతున్నదీ ఆయన వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *