కనిపించని ఆ మూడో సింహానిదే గెలుపు!!

April 15, 2019 | News Of 9

 • తెలంగాణలో మాదిరే ‘‘షాకింగ్ ఫలితాలు’’
 • పవన్ కారణంగానే మహిళల్లో రాజకీయ చైతన్యం
 • వాళ్లు డబ్బులిచ్చినా ఓటు గ్లాసుకే అంటున్న మహిళలు
 • జనసేన ఊపిరి- ఈనాటి యువత
 • 50 సీట్ల పార్టీకి 2014లో 102 ఎలా? 
 • ఆ 2 శాతమే పవన్ అనడం హ్రస్వదృష్టి
 • వైసీపీ-టీడీపీ తేడా మాత్రమే పవన్ అనడం తప్పు
 • స్వయంగా దిగినందున వంద ఖాయం
 • నిశ్శబ్ద విప్లవం ఉందన్న ‘‘చేగొండి’’
 • మాయావతి మ్యాజిక్ పని చేస్తుంది
 • టీడీపీ, వైసీపీలవి దింపుడు కళ్లెం ఆశలు
 • అందరి అంచనాలూ తల్లకిందులే…!!
 • ‘‘న్యూస్ ఆఫ్ 9’’ వాస్తవిక అంచనాలు

 (న్యూస్ ఆఫ్ 9)

130 సీట్లతో తెలుగుదేశం విజయం సాధిస్తుందని ఆ పార్టీ చెబుతున్నది. భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని వైసీపీ గట్టి నమ్మకంతో ఉన్నది. మరి జనసేన పార్టీ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న అందరినీ ముఖ్యంగా జన సైనికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. సామాన్య ప్రజల కంటే సామాన్యుల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగిన  గ్రూపులు కొన్ని సమాజంలో ఉంటాయి. ఈ గ్రూపులు సహజంగా డబ్బున్న వారినే విజేతలుగా టీవీల్లోనూ, పత్రికల్లోనూ ప్రచారంలో పెడుతుంటాయి. ప్రత్యామ్నాయ రాజకీయమే అజండాగా వచ్చిన జనసేన వంటి పార్టీలు సాధించిన  విజయాలు ఉంటే తప్ప.. (ట్రాక్ రికార్డు) జనసేన గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేయవు. అప్పటి వరకూ వర్గాలు టీడీపీ, వైసీపీలను మాత్రమే భుజాన మోసుకు తిరుగుతుంటాయి. ట్రాక్ రికార్డు లేకుండా చెబితే వారిని ఇతరులు తక్కువగా చూస్తారన్న భయం వారిలో ఉంటుంది. అందుకే జనసేనకు ఇన్ని సీట్లు వస్తాయని ఎవరూ చెప్పే సాహసం చేయడం లేదు. సినిమా నటులపై ఉండే చిన్నచూపు వల్ల ఈ వర్గాలు పవన్ కళ్యాణ్ ను ఇంకా సినిమా నటుడుగానే చూస్తున్నాయి. ‘‘రెండు కుటుంబాలకే ఇంకా ఎంతకాలం ఊడిగం చేస్తాం?’’ అన్న భావన చదువుకున్న ఈ ప్రభావిత వర్గాల కంటే… దిగువ స్థాయిలో ఉన్న ప్రజలకు బాగా అర్థమైంది. ఈ కారణంగానే ప్రధాన పార్టీల గురించిన చర్చ మాత్రమే మీడియాలో ప్రతిఫలిస్తున్నది. మీడియాతో సహా ప్రభావితం చేయగలిగిన వర్గాలు అయితే టీడీపీ లేదా వైసీపీ అధికారాన్ని చేపడతాయని భావిస్తున్నారు. ఇది పూర్తిగా అసంబద్ధం, వాస్తవ విరుద్ధం!!

జనసేనపై చిన్నచూపు

మే 23 నాటి ఫలితాలు ప్రధాన పార్టీలకే అనుకూలంగా ఉంటాయని, జనసేనకు ఒకటి రెండుకు మించి సీట్లు రావన్నది కొందరి అభిప్రాయంగా ఉంది. కొందరు 10 సీట్లు అనీ అంటే, మరికొందరు 20 వరకూ రావచ్చు అని చెబుతున్నారు.  30 నుంచి 40 సీట్లు రావచ్చని కొందరు గొంతు తగ్గించి చెబుతున్నారు. అది కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. తాము గెలుపు ఓటములతో సంబంధంలేకుండానే ఎన్నికల్లో పాల్గొన్నామని, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సుదీర్ఘ రాజకీయ పోరాటమే ధ్యేయం అని జన సైనికులు గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ అభిమానుల మధ్య వాదోపవాదాలు సాగుతున్నాయి. ‘‘సారీ… వచ్చేసారికి చూద్దాం’’ అంటూ వైసీపీ అభిమానులు జనసేన అభిమానులకు చెబుతున్నారు. అధినేతల మాట మాదిరిగానే వారి మాటల్లోనూ ఒక ధీమా కనిపిస్తున్నది. అలాగే టీడీపీ కూడా 130 సీట్లు సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి అందరూ అనుకుంటున్నట్లు వైసీపీగానీ లేదా టీడీపీగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలు ఉన్నదా అన్నది ప్రశ్న.  

మరి ఫలితాల్లో ఏముంది?

మునుపు ఎన్నడూలేనంత హోరాహోరీగా 2019 ఎన్నికలు సాగాయి. 2019లో ఏ పార్టీ సత్తా ఏమిటో చర్చించే ముందు.. ఒక్కసారి వెనక్కివెళ్లి పాత బలాబలాలను ఒకసారి చూద్దాం. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ  (ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ -294 సీట్లు) 2004 నుంచీ ప్రజాభిప్రాయాన్ని కోల్పోయిందన్నది వాస్తవం. ఆ ఎన్నికల్లో టీడీపీకి దఖలు పడిన ఓట్లు 28 శాతం మాత్రమే. వచ్చిన సీట్లు కేవలం 46 సీట్లు. అలాగే 2009 వచ్చే సరికి టీడీపీకి వచ్చిన సీట్లు కేవలం 93 మాత్రమే. విడిపోయిన తర్వాత 175 అసెంబ్లీ సీట్లకుగాను 46.3 శాతం ఓట్ల శాతంతో

2014లో ఏకంగా 104 సీట్లను సాధించుకునే స్థాయికి టీడీపీ చేరుకుంది. వైసీపీకి 44.47 శాతంతో 67 సీట్లు వచ్చాయి. జనసేన పార్టీ మద్దతు కారణంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, లేదంటే గల్లంతయిపోయేదన్న విషయాన్ని అందరూ అంగీకరించారు. 2014 నాటికి జనసేనకు ఉన్న సామర్ధ్యాన్ని లెక్కించేటప్పుడు అందరూ చేస్తున్న తప్పు ఒక్కటే. డీటీపీకీ, వైసీపీకీ వచ్చిన ఓట్ల శాతంలో తేడా 2.06 శాతం (6.01 లక్షల ఓట్లు) పవన్ కళ్యాణ్ ప్రభావమని అంచనాలు వేస్తూ… పవన్ కళ్యాణ్ లేదా జనసేను పరిగణనలోకి తీసుకోలేని సంఖ్య (2.06 శాతం)కు కుదించారు రాజకీయ విశ్లేషకులు. 2009లో ఇపుడున్న 175 సీట్లలో టీడీపీకి వచ్చినవి 50 సీట్లే. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన దగ్గర నుంచీ తెలుగుదేశం ప్రాభవం తగ్గిపోతూ వచ్చింది. అది 2009 ఫలితాల్లోనూ కనిపించింది. 2014 వచ్చేసరికి ఒకేసారి ‘‘కింగ్’’ ఎలా అయిపోతుంది? పవన్ కళ్యాణ్ మద్దతును టీడీపీ చాలా తక్కువగా అంచనా వేసిందన్నది దీనిని బట్టి అర్థం అవుతుంది. మొన్న వచ్చిన 102 సీట్లనూ అది తన సొంత బలంగా భావిస్తోంది. ఇది శుద్ధ తప్పు. కనీసం 50 సీట్లు కేవలం జనసేన ప్రభావంతో టీడీపీ సాధించి ఉండొచ్చన్నది ఒక వాదన. భాజపాతో పొత్తు ఉన్నా… దానిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన పని లేదు. 2014 ఎన్నికల సమయం… చిత్రమైన పరిస్థితి. టీడీపీ కాకుండా బరిలో ఉన్నది వైసీపీ ఒక్కటే. అందువల్ల ప్రజలు ఉన్న రెండు పార్టీల మధ్యనే చీలిపోయారు. అందుకే వైసీపీ ఆ 67 సీట్లనైనా సాధించగలిగింది.

2019 ఎన్నికల పరిస్థితి 2014 నాటి పరిస్థితికి సంబంధంలేకుండా పోయింది. జనసేన సొంతంగా 175 సీట్లలో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసింది. సరైన సమయంలో టీడీపీతో విభేదించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీని ఉతికి ఆరేయడంలో విజయం సాధించి… అధికార పార్టీకి నిజమైన ప్రతిపక్షంగా అవతరించారు. టీడీపీని పూర్తిగా జీరో చేయగలిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే. అందువల్ల ఈ సారి వైసీపీకి ఉన్న 67 సీట్లయినా వస్తాయా అన్నదే ప్రశ్న. జనసేన అధికార పార్టీనీ, విపక్ష పార్టీనీ ఒకేసారి జీరో చేయగలిగిందన్నది మనం ఎవరూ గుర్తించని వాస్తవం. అవినీతిని చూపిస్తూ అధికార పార్టీనీ, అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని ప్రశ్నిస్తూ వైసీపీనీ జనసేన గుక్కతిప్పుకోకుండా చేసింది. ప్రజల దృష్లిలో ఈ రెండు పార్టీలనూ దోషిగా నిలబెట్టడంలో జనసేన గొప్ప విజయాన్ని సాధించింది. సాధారణ ప్రజలు పవన్ కళ్యాణ్ వాదనతో ఏకీభవించారు. ఎవరెన్ని అపోహల్ని ప్రచారంలో పెట్టినా ఆయన మాటల్లో స్వచ్ఛతను గుర్తించారు.

ఆడపడుచుల ప్రేమ ఎక్కడికి పోతుంది?

జనసేన ఏమైనా సరే.. ఎన్నికల్లో గెలవాలని అనేక మంది భావించారు. విదేశాల్లో ఉద్యోగాలు వదులుకుని సైతం అనేక మంది 2019లో పాల్గొన్నారు. ఎన్నారైలు అక్కడి నుంచి ఇక్కడకు వచ్చి పనిచేశారు. అందరి హృదయాలూ జనసేనతో నిండిపోయి ఉన్నాయి. టీడీపీ అవినీతిలో కూరుకుపోవడం, వైసీపీ అధినేత జగన్ పై ఉన్న కేసుల కారణంగా ప్రజలు ఈ రెండు పార్టీలకూ దూరమయ్యారు. ఒక నిశ్శబ్ద విప్లవం జనసేనకు ఉందని, తప్పక విజయం సాధిస్తుందని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ అయిదారు నెలల కిందటే చెప్పింది. మహిళలు ఈ సారి పెద్ద ఎత్తున జనసేన వైపున నిలబడ్డారు. మొన్నటి పోలింగ్ లో మహిళలు పెద్ద ఎత్తున రావడాన్ని టీడీపీ, వైసీపీలు తమ కోసమే అన్నట్లు చెప్పుకుంటున్నాయి. నేర చరిత్ర ఉన్నవారిని సొంత భార్య కూడా ఆమోదించలేదు. అలాంటిది ఈ విషయంలో మహిళలు జనసేనవైపే ఉన్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. పసుపు-కుంకుమ పథకాన్ని చూసి మహిళలు తమ వలలో పడిపోయారనీ చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత… నిజమైన అర్థంలో మహిళలకు కూడా రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. ‘‘ఏం రాజకీయాలో ఏమిటో అంటూ మా ఆయన్ని నేనే తిట్టేదాన్ని. ఇపుడు నేను కూడా రాజకీయ ప్రసంగాలు వింటున్నా. సభలకు వెళుతున్నా. పవన్ కళ్యాణ్ వల్లనే నాలో ఈ మార్పు వచ్చింది’’ అని కృష్ణాజిల్లాకు నాగాయలంక గ్రామానికి చెందిన ఒక మహిళ వ్యాఖ్యానించింది. అలాగే.. వర్షంలో సైతం చంటి బిడ్డల్ని చంకలో వేసుకుని మరీ మహిళలు జనసేన పోరాట యాత్రలకు హాజరైన విషయం జన సైనికులకు గుర్తు ఉండే ఉంటుంది. వాస్తవాలు ఇలా ఉన్నపుడు… ‘‘పసుపు-కుంకుమ’’ పథకానికి మహిళలు హారతి పట్టేశారని, వీళ్లంతా తనను ముఖ్యమంత్రిగా చూడదలచుకున్నారనీ చంద్రబాబు ఎలా చెబుతారు? ఉదయం 6 గంటలకే పోలింగ్ బూతులకు మహిళలు వచ్చేశారని, వీళ్లంతా తన కోసమే వచ్చి ఉంటారని కూడా చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి ఇలా వచ్చిన వారంతా జనసేన కోసమేనని మనం తేలికగా ఊహించవచ్చు. ‘‘మేం పసుపు-కుంకుమ కింది పది వేలు తీసుకున్నాను. డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే. అయినా గాజు గ్లాసుకే మా ఓటు’’ అని మరో మహిళ చెప్పింది. దీనిని బట్టి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు.

ఓటింగ్ శాతం పెరుగుదల ఉన్న ప్రతిసారీ దానిని ప్రభుత్వ వ్యతిరేకతకు సూచనగా చూస్తారు. అయితే.. ఇపుడు ఈ భావనకు కాలం చెల్లిందని, 2018 తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగినా తెరాస గెలిచిందని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కొత్త వాదన వినిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ గెలిచింది తెలంగాణ సెంటిమెంటు కారణంగానేనన్నది నిర్వివాదాంశం. పెరిగిన ఓట్ల శాతం తమ కోసమేనని వైసీపీ భావిస్తోంది. జనసేన కూడా రంగంలో ఉన్నందున కేవలం వైసీపీ కోసమే అని ఢంకా బజాయించి చెప్పడానికి అవకాశం లేదు. సభలో ప్రాతినిధ్యంలేకపోయినా, ప్రజాక్షేత్రంలో జనసేన అసలు సిసలు ప్రతిపక్షంగా మారిపోయింది. అందువల్ల పెరిగిన ఓట్ల శాతం కూడా జనసేనకే లాభించవచ్చన్నది ‘‘న్యూస్ ఆఫ్ 9’’ అభిప్రాయపడుతున్నది.

తిరుగులేని నేతగా పవన్ కళ్యాణ్

తిరుగులేని మ్యానిఫెస్టో, పవన్ కళ్యాణ్ సచ్ఛీలత, చక్కటి వాగ్దాటి, యువత ప్రేమ, మహిళల ఆదరణ అన్నీ కూడా జనసేనకు ప్లస్ పాయింట్స్. డబ్బుతో సంబంధంలేకుండా ఎన్నికలు ఉండాలంటూ ఉపన్యాసాలు దంచిన వారేగానీ… దానిని కార్యక్షేత్రం వరకూ తీసుకొచ్చి అమలు చేసింది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇలా జనసేనను ఆదరణ ఉండదు అని చెప్పడానికి ఏ ఒక్క కారణమూ కనిపించదు. టీడీపీ, వైసీపీలు డబ్బులు ఇచ్చినా.. అవి తీసుకుంటాంగానీ… ఓటు మాత్రం గ్లాసు గుర్తుకే అని అనేక మంది బాహాటంగానే చెప్పారు.

టీడీపీ, వైసీపీలు డబ్బు సంచులు పెట్టుకుని వ్యాపారం చేశాయి గనుక… అందరూ వాటి గురించే మాట్లాడుకోవడం సహజం. జనసేన నిశ్శబ్దంగా తన పని తాను చేయగా, తెగ బలిసిన టీడీపీ, వైసీపీలే బాహాబాహీకి దిగాయి. ప్రజలు కూడా నిశ్శబ్దంగానే జనసేనకు మద్దతు పలికారు. కానీ బరిలో ఎవరూ ఊహించని స్థాయిలో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థాయిలో అవతరిస్తుందని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ భావిస్తున్నది.

నిశ్శబ్ద విప్లవం ఉంది!

జనసేన ప్రభావం గురించి సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామ జోగయ్యను సంప్రదించగా ‘‘న్యూస్ ఆఫ్ 9’’తో ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జనసేన పార్టీకి నిశ్శబ్ద విప్లవం ఉందని దీనిని తాను గమనించినట్లు చెప్పారు. ఇంకా ఏమన్నారంటే…

‘‘ప్రజారాజ్యం సమయంలో కాపుల్లో కంటే మిగిలిన ఎస్పీ, ఎస్టీ కులాల్లో చైతన్యం కనిపించింది. కానీ ఇపుడు కాపుల్లో పెద్ద ఎత్తున చైతన్యం కనిపిస్తోంది. ఒక వేవ్ ఉన్నది. 85 శాతం కాపుల ఓట్లు జనసేనకే పడతాయి. అందులో సందేహం లేదు. హీనంగా అనుకున్నా గతంలో వచ్చిన 18 కంటే తగ్గవు. గరిష్ఠంగా 30 వరకూ అసెంబ్లీ స్థానాలు జనసేనకు వస్తాయి. మరో నాలుగు పెరగవచ్చు కూడా. నాకు తెలిసి మూడు నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలు రావచ్చు. నర్సాపురం,  విశాఖపట్నం, అమలాపురం లోక్ సభ సీట్లు ఖాయంగా జనసేన ఖాతాలో పడతాయి. అందులో సందేహం లేదు. అనకాపల్లి కూడా రావచ్చు. ‘‘భీమవరం, గాజువాకల నుంచి పవన్ కళ్యాణ్ గెలుస్తారా?’’ అని ప్రశ్నించగా,

‘‘జనసేన గెలిచే 30 స్థానాల్లో ఈ రెండూ ఖచ్చితంగా ఉంటాయి’’ అని చెప్పారు. ఈ మాటలు చెబుతూ ఆయన మరో మాట అన్నారు… ‘’30 సీట్లు గెలుచుకోవడం చిన్న విషయమేమీ కాదు. అది గొప్ప విషయమే కాగలదు’’ అని వ్యాఖ్యానించారు.

బీఎస్పీకి 21 సీట్లు కేటాయించిన ప్రభావం తప్పకుండా జనసేన  ఫలితాలపై ఉంటుంది. మొదటి నుంచీ పీఆర్పీగానీ, జనసేన గానీ ‘‘సామాజిక న్యాయం’’ అన్న సిద్ధాంతంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అప్పట్లో మాదిగలు పెద్దగా సహకరించకపోయినా, మాలలు మాత్రం పీఆర్పీకి సహకరించారు. పవన్ కళ్యాణ్ రెల్లి కులాన్ని తీసుకోవడం ఖచ్చితంగా జనసేనపై నమ్మకాన్ని పెంచుతుంది. సమాజానికి అట్టడుగున ఉన్న వర్గాలు జనసేనతోనే ఉంటాయి. మత్స్యకారులు పూర్తిగా జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. అట్టడగు వర్గాల్లో ఉన్న ఈ నిశ్శబ్ద విప్లవం.. సముద్రగర్భంలో పుట్టిన భూకంపంలాంటిదే. పూర్తిగా ఫలితాలు వచ్చే వరకూ దాని ప్రభావం బయటకు కనిపించదు. సముద్ర అలల్లో ఈ తేడా ఇప్పటికే కనిపిస్తోంది.

జిల్లాల వారీ అన్నది కాలం చెల్లిన లెక్క

ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అన్నది గతంలో చాలా తేలికగా లెక్కించేవారు. ముందుగా ఊహించడానికి లేదా చెప్పగలగడానికీ కారణం… అభ్యర్థి ఆర్థిక స్థాయి, సామాజికంగా ఉన్న హోదా, అభ్యర్థి నియోజక వర్గంలో అతను లేదా ఆమె కులానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారు, అభ్యర్థి ఎంత పెద్ద మొత్తంలో డబ్బును వెదజల్లాడు వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషకులు ఒక అంచనాకు రావడం ఇప్పటి వరకూ అందరూ అనుసరిస్తున్న విధానం. ఇపుడు కూడా టీడీపీ, వైసీపీలు కోట్లు ఖర్చు చేశాయి కనుక వాళ్లే వస్తారన్నది కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయం. ప్రజలు ఎప్పుడూ ఒకేలా స్పందిస్తారనుకుంటే పొరపాటు. 2018 తెలంగాణ ఎన్నికల్లో ఇలా లెక్కలు వేసుకునే కాంగ్రెసుతో సహా అందరూ బొక్కాబోర్లా పడ్డారు. ప్రభుత్వం వస్తోందని కాంగ్రెసు నేతలు మంత్రిపదవులు ఎవరికి ఇవ్వాన్న చర్చ కూడా చేశారు. ఇలాంటిదే రేపు ఆంధ్రాలో పునరావృతం అవుతుంది. గెలిచేవారికి భారీ మెజారిటీ రావడం ఖాయం. టీడీపీ వచ్చే అవకాశం లేదు. పోతే అది వైసీపీనా? లేక జనసేనా అన్నదే పాయింట్. ఏ రకంగా చూసినా… జనసేన పార్టీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ఇది తప్పితే… హంగ్ రావచ్చు). జనసేన మాత్రమే  తెలుగు నాట గెలుపు గుర్రం!!

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *