జనసైనికులారా తస్మాత్ జాగ్రత్త.. !!

May 22, 2019 | News Of 9

  • ఫేక్ సర్వేలతో ప్రజల్లో అపోహలు సృష్టించే యత్నం
  • జన సైనికులను నైరాశ్యం దిశగా మళ్ళించడమే లక్ష్యం
  • కౌంటింగ్ లోనూ గిమ్మిక్కులు చేసేందుకూ పథక రచన
  • ఏమరుపాటుగా ఉంటే నిజం కానున్న ఎగ్జిట్ పోల్స్

రేపే లెక్కింపు.. ఏపీని పాలించేదెవరో తెలిసిపోతుంది. ఎన్నికల లెక్కింపును సజావుగా సాగనివ్వరనీ.. ఒకవేళ సాగినా, ప్రకటించనివ్వరనీ.. ఇలా రకరకాల పుకార్లు వస్తున్నప్పటికీ షెడ్యూలు ప్రకారం రేపు సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడతాయి. ఈ సమయంలో లెక్కింపులోనూ కొన్ని అడ్డదారులు తొక్కేందుకు ప్రధాన పార్టీలు గూడుపుఠాణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ కావచ్చు, అధికార పార్టీ ఆరోపిస్తున్నట్లు కేంద్రం సహకారంతో ప్రతిపక్ష పార్టీ కావచ్చు.. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంటూ అన్నింట్లో జనసేన ప్రభావం శూన్యం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఆ పార్టీకి ఓట్లూ సీట్లూ రావనే సంకేతాలు పంపి… జన సైనికులను నైరాశ్యంలో ఉంచి లెక్కింపుపై శ్రద్ధ పెట్టనీయకుండా చెయ్యాలనేది వారి ప్లాన్… అంటూ జనసేన పార్టీ శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంలో ఏది సాధ్యం.. ఏది అసాధ్యం అనే అంశంపై చర్చిద్దాం..

తెలుగు రాజకీయాల్లో సంచలనం జనసేన

రాజకీయాల్లో జవాబుదారీతనం తెచ్చేందుకు వచ్చిన పార్టీ జనసేన. చెప్పినట్లుగానే పార్టీ నిర్మాణం దగ్గరినుంచి అభ్యర్ధుల ఎంపిక దాకా అన్ని అంశాల్లో తనదైన ముద్రవేస్తూ ముందుకెళ్తున్న పార్టీ. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా కొత్త ఒరవడి సృష్టించిన ఘనతను సాధించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అత్యంత ప్రజాదరణ ఉన్న ఆయన పిలుపునందుకుని అసంఖ్యాకమైన యువత ఆయన వెంట నడవడానికి ముందుకొచ్చారు. పవన్ సినిమా అభిమానులు, ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానించేవారే కాదు సమాజంలోనూ రాజకీయాల్లో మార్పు కోరే ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి సాదర స్వాగతం పలికారు. ఆయన సభలను జయప్రదం చేశారు. కవాతుల్లో కదం తొక్కారు. రోడ్ షోలతో ఒక ఉప్పెనను సృష్టించారు. విద్యార్థులు, మహిళలు, సామాజిక వేత్తలే కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్న అనేక మంది ప్రముఖులు సైతం జనసేనకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రవాంసాంధ్రులు సైతం జనసేనకు బాసటగా ఉన్నారు.  రాజకీయాలను ప్రక్షాళణ చేయడానికి అవతరించిన జనసేన పార్టీ… ఓ సంచలనం. అది వేసే ప్రతి అడుగునూ ప్రజలంతా సంబరంగా తిలకించారు.

భిన్న అంచనాల మధ్య ఓట్లు ఎవరికి పడ్డాయి..

అది తేలాల్సింది మే 23- అంటే కౌంటింగ్ రోజున, కానీ లెక్కింపునకు మూడు రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్ అంటూ ప్రసార మాధ్యమాలు నానా హడావుడీ చేశాయి. కొన్నింటిలో టీడీపీ గెలుస్తుందంటే.. మరి కొన్నింటిలో వైసీపీ గెలుస్తుందంటూ తమ అనుకూల చానెళ్లలో డిబేట్లు పెట్టి మరీ డబ్బా కొట్టుకున్నారు. ఇలా విరుద్ధమైన అంచనాలు వెలువడడంలోనే సదరు సర్వే సంస్థలు ప్రజల నాడి పట్టుకోవడంలో విఫలమయ్యాయని తేటతెల్లమవుతోంది. ఎన్నికల సమయంలో డబ్బుకోసం కుప్పలు తెప్పలుగా సర్వే సంస్థలు పుట్టుకు రావడం సహజం. కానీ హోరాహోరీగా జరిగిన ఈ త్రిముఖ పోటీ ఓ అరుదైన సందర్భం. అందుకే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఊహించడం ఎవరితరం కాదు. సరిగ్గా ఇక్కడే సర్వే కంపెనీల డొల్లతనం బయటపడింది. దానికి తోడు అవి ప్రకటించిన పొంతన లేని ఫలితాలు విన్న వారిని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఏదో 5, 10 తేడాలతో అన్ని సర్వేలలోనూ ఒకే పార్టీకి పట్టం కట్టారని చెప్తే అది నిజమైన సర్వేగా భావించవచ్చు. అంతేగానీ ఒక్కొక్కరూ ఒక్కో పార్టీ గెలుస్తుందని చెబితే దానికి ఏ పేరు పెట్టాలో ఈ పెయిడ్ ప్రోగ్రాములను చూసిన ప్రేక్షకులు.. అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.

అసలిలా ఎందుకు జరుగుతోంది?

త్రిముఖ పోటీ ఉన్నప్పుడు అనేక సంచలనాలు జరిగే అవకాశముంటుంది. ఎందుకంటే అప్పటి వరకూ బలంగా ఉన్నారనుకున్న అభ్యర్థులు సైతం ఓడిపోయే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఎలాగంటే- ఓ నియోజక వర్గంలో పోటీపడుతున్న టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య జనసేన అభ్యర్థి సాధించే ఓట్లు సంఖ్య… ఫలితాలను తారుమారు చెయ్యవచ్చు. అన్ని స్థానాల్లో ఇలాంటి పరిస్థితి ఒకే పార్టీకి అనుకూలించకపోవచ్చు. అలాగే జనసేన గెలిచే స్థానాలు అసలుండవని చెప్పడాన్ని చూస్తే, ఇది వారు ఆడుతున్న మైండ్ గేమ్ మాత్రమే అని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. దీనికి కూడా ఓ ఉదాహరణ చూద్దాం.. ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రకటించిన పసుపు, కుంకుమ వంటి పథకాలు ఓటర్లను ఆకర్షించి ఉంటే, ఆ పార్టీకి పెరిగే ఓట్లు జనసేన నుంచి కాక వైసీపీ నుంచే అన్నది నిర్వివాదాంశం.. ఎందుకంటే జనసేన ప్రభావితం చేసే ఓటర్లు ఉచిత పథకాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. ఇది జనసేనకు కలిసివచ్చే అంశం. ఎందుకంటే మిగిలిన  రెండు పార్టీలూ ఇచ్చిన వాగ్ధానాలు రూ.500, రూ.1000 తేడాతో ఒకే రకంగా ఉన్నాయి. అయినా ప్రజలు తమకే పట్టం కడతారని ప్రచారం మాత్రం చేసుకున్నాయి. కానీ ఎవరు ఎలా పోరాడినా జనసేన మాత్రం ప్రజాస్వామ్య బద్దంగా పోటీ చేసి ప్రజల మన్ననలు పొందిందన్నది కాదనలేని సత్యం. ఈ నైతిక బలమే జనసేనను విజేతను చేస్తుంది.

ఆ పార్టీలకు మెజారిటీ ఎలా వస్తుంది..?

ఉచిత హామీలు.. ప్రకటించినందుకా? డబ్బు పంచినందుకా? పాలించడానికి తమకున్న అర్హతలు కాకుండా సెంటిమెంటు కారణాలు చెప్పుకుంటున్నందుకా? లేక తమ అనుకూల మీడియాలో పెయిడ్ వార్తలు రాయించి ప్రజలను మభ్యపెట్టినందుకా? ఈ అన్ని కారణాలతోనూ వారికి ఓట్లు పడివుండొచ్చు, సీట్లూ రావచ్చు కానీ వాళ్ళు చెబుతున్నట్లు మేజిక్ ఫిగర్ (88) క్రాస్ చేసేంత సంఖ్యలో సీట్లు వస్తాయా.. అంటే అవన్నీ ఊహాగానాలు మాత్రమే.. టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా, వైసీపీకి కేంద్రం ఈసీ ద్వారా సహకరించి ఉన్నా, ఈవీఎంల ద్వారా అవకతవకలకు పాల్పడినా వైసీపీకి ఎక్కువ సీట్లు రావచ్చు.. లేదా వైసీపీ చెబుతున్నట్లు టీడీపీ తమ అధికారాన్ని ఉపయోగించి ముందు నుంచే ఎన్నికల ప్రణాళికలను అమలు చేసి ఉంటే టీడీపీకి అనుకూల ఫలితాలు రావచ్చు. కానీ ఇవేమీ నిజం కాకుండా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ప్రక్రియ జరిగి ఉంటే జనసేన సునామీని ఎవరూ ఆపలేరు.

జనసేనకు జీరో రిజల్ట్ ప్రచారం ఎందుకు?

ఎందుకంటే ఇలా ప్రచారం జరిగితేనే.. ఎన్నికల ముందూ, ఎన్నికల అనంతరం రెండు ప్రధాన పార్టీలూ చేసిన అనేక అక్రమాలను సమర్ధించుకునే అవకాశం ఉంటుంది. పార్టీ పెట్టినప్పటి నుంచీ జనసేనపై, పార్టీ అధ్యక్షుడిపై ప్రసార మాధ్యమాల్లో అసత్య కథనాలతో విష ప్రచారాలు చేయడం, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు కొందరు వ్యక్తులను ప్రేరేపించడం ఇలా అనేక ప్రయత్నాలు చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పవన్ 4 పెళ్లిళ్లు చేసుకున్నాడనీ.. మరొకరైతే బహుభార్యత్వం కేసు వేస్తారనీ వ్యాఖ్యానించడమే కాక ‘‘చివరికి ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు కూడా మనం వివరణ ఇచ్చుకోవలసి వస్తోందని’’ అనడం గమనార్హం. అంటే- ఓ పార్టీ అధినేత గురించి మాట్లాడడం మరో పార్టీ అధ్యక్షుడికి అంత చిన్నతనంగా ఎందుకు అనిపించిందో! ఆ మాటలు విన్న ఆలోచనాపరులకు ఇది అర్థం కాలేదు. ఆ నాయకుడి ప్రజాస్వామ్య స్పూర్తి ఏ పాటిదో చేప్పే ఇలాంటి ఉదంతాలు అనేకం. నిజానికి తానెవరో రాష్ట్రంలోనే ఎవరికీ తెలియని సమయానికి… దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న కథానాయకులలో ఒకడైన పవన్ గురించి అంత దిగజారుడు వ్యాఖ్యలు చెయ్యడం కుటిల రాజకీయం కాక మరొకటి కాదు.

ఎందుకంటే ఒక నాయకుడికి పౌరులంతా సమానమే.. వారి హక్కుల్ని పరిరక్షించేందుకే ఏ నాయకుడికైనా ప్రజా ప్రతినిథ్యం ఇచ్చేది… కానీ ఏ వర్గాన్నో, వ్యక్తినో, వృత్తినో కించపరిచేందుకు కాదు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా జనసేన బలాన్ని తగ్గించడంలో రెండు పార్టీలూ విఫలమయ్యాయి. జనసేనకు ఓట్లు పడకుండా ఆపలేకపోయాయి. జనసేన ప్రభావాన్ని తగ్గించాలని ప్రత్యర్థులు చేసిన ప్రతి ప్రయత్నం బూమరాంగ్ లా వారిపైనే వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. జనసేన పార్టీ మాత్రం రోజు రోజుకూ బలం పుంజుకుని ఒక మహా శక్తిలా అవతరించింది. ‘‘డబ్బు ప్రమేయం లేని రాజకీయాలు చేయడంతోనే జనసేన పార్టీ విజయం సాధించిందనీ, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే’’ ప్రత్యర్ధి పార్టీల నేతలు సైతం కితాబులు ఇస్తున్నారంటేనే జనసేన తెచ్చిన మార్పేమిటన్నది స్పష్టమవుతుంది. అయినప్పటికీ ఈ సర్వేలూ, ఎగ్జిట్ పోల్సు ద్వారా జన సైనికులను నిరాశా, నిస్పృహలకు గురిచేసి కౌంటింగ్ లోనూ చేతివాటం ప్రదర్శించాలని కొందరు చూస్తున్నారు. కానీ జన సైనికులు నిరాశ పడవద్దు.. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కేవలం 10 శాతం మాత్రమే ప్రజాభిప్రాయానికి అద్దం పట్టగలిగాయి. తక్కిన 90 శాతం తప్పుడు ఫలితాలనిచ్చిన వాళ్లంతా అభాసుపాలయ్యారు. ఇందుకు తెలంగాణ శాసనసభా ఫలితాలకు మించిన ఉదాహరణ లేదు. జన సైనికులారా సంయమనం కోల్పోవద్దు. ఎవరి ప్రలోభాలకూ లోను కావద్దు కౌంటింగ్ ఏజెంట్లు మీ విధులు చివరి నిమిషం వరకూ నిబద్ధతతో నిర్వహించండి. ఫలితాలు కచ్ఛితంగా ఊహించిన దానికంటే మెరుగ్గా వస్తాయి. జనసేనది రాజకీయ ఆరాటం కాదు. మార్పుకోసం పోరాటం.. చివరిదాకా అదే స్పూర్తితో పోరాడండి. ఏ పరిస్థితుల్లోనూ ఆశను వదలొద్దు.. ఆశయాన్ని మరవద్దు.. పోరాడితే పోయేదేమీలేదు.. వెధవ బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదాన్ని తోడుగా ఉంచుకోండి..

తస్మాత్ జాగ్రత్త జన సైనికులలారా ఈ పోరు అధికారం కోసం కాదు… పాతికేళ్ల భవిష్యత్తు కోసం!!

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *